పి.సత్యవతి
వెయ్యి కాళ్ళున్న జెర్రిలా వెయ్యి చానెళ్ల హింస. ఎన్ని రకాలుగా హింసించ వచ్చో అన్ని రకాల హింస. అద్భుతాల పేరుతో జుగుస్సాకరమైన దృశ్య హింస. కడుపులో మెలిపెట్టి వాంతి బయటికి రాని హింస… ఉదయం. బయట ఉండచుట్టి పైకి విసిరిన పేపర్ ముట్టుకుంటె చేతినిండా రక్తం. రక్తంలో మునిగితేల్తున్న పేపర్లు వార్తలన్నీ విన్నవీ కన్నవే. ఉన్న వూళ్ళో హత్యలూ ఆత్మహత్యలూ తప్ప. సిటీ ఎడిషన్లు లేకపోతే ఊరి హత్యలు ఆత్మహత్యలు తెలీవు. ఊళ్ళో ఎంతమంది అమెరికానుంచొచ్చి వాళ్లపిల్లలకి ఓణీలపండగలు, ధోవతుల పండగలు వినూత్న రీతిలో ఎడ్లబండి మీద ఊరేగిస్తూ చేశారో తెలియదు. ఎక్కడ రెండు ముఖాలతో దూడ పుట్టిందో తెలియదు. ఎంత మంది అమృతమూర్తులకి అశ్రునివాళులు అర్పించాలో తెలియదు. వీటి మధ్యలో ఒక భూతద్దం పెట్టుకుని ఎక్కవడైనా శ్రీశ్రీ శతజయంతిలాంటి రెండులైన్ల వార్తలున్నాయేమో వెతుక్కోవాలి.
స్త్రీల పేజీలనిండా తళుకు బెళుకు చీరెలు. కుర్తాలు కుర్తిలు. టాప్‌లు.. ఎన్ని రకాల కూరగాయల్ని ఎలా మొహానికి పట్టించుకోవచ్చో నేర్చుకోవచ్చు. కొత్త కొత్త సౌందర్య సాధనాల గురించి తెలుసుకోవచ్చు.
ఎన్ని రకాల ఫేస్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చో తెలుసుకోచ్చు… తేనె, పళ్ళు పాలు మజ్జిగ ఇంట్లొ వుండే సమస్త ఆహార పదార్థాలన్నీ మొహానికి పూసేసుకుని అందంగా తయారవచ్చు.
ఆగాగు… నీసొదంతా నాకర్థమైంది కానీ అంత అందమైన మొహమ్మీద ఎవడొ ఒకడొచ్చి, వాడి ప్రేమామ్లవర్షం కురిపిస్తాడు. వాణ్ణి పట్టుకుంటారో వదిలేస్తారో చంపేస్తారో ఏమైనా నీదిమాత్రం నరకం… ఈ తళుకు బెలుకు చీరెలు చుట్టుకుని కుర్తాలు కుర్తీలు ధరించి, కూరలు తినేవాళ్ళకు లేకుండా చేసి మొహానికి పూసుకుని, ఆమ్ల వర్షంలో మునిగి మరణించడానికా? ఎమ్మెన్సీ అన్నయ్య అందంగా ఉండమంటాడు. కాషాయి అన్నయ్య ఆకర్షణీయంగా ఉంటేనే తిప్పలంటాడు. ఏ అన్నయ్యా యాసిడ్ ప్రూఫ్ మాస్క్‌ల గురించి మాట్లాడ్డు. సబితక్కయ్యని చూసి ఇక అమృత వర్షమేకాని ఆమ్ల వర్షం ఉండదని కొందరు సత్తెకాలపు సత్తెమ్మలు ఆశపడ్డారని విన్నాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూశాం.
అసలు ఎట్లా కనపడుతున్నాం మనం? అద్దాలు పూజలు కుట్టిన రాజస్థాన్ కట్పు త్లీల్లాగానా? కనపడ్డం ఏమిటి?
అలాగే వుండాలి మీరు ఎంత కాలమైనా… నున్నటి ముఖంతో నిడుపాటి పట్టులాంటి శిరోజాలతొ ”జీరో”ల్లా వుండాలి మీరు… మీ చుట్టూ తిరిగేవాడు మాత్రం సినిమా హీరో అయిపోతాడు. సినిమా హీరో వందమందిని తన్ని పొడిచి ప్రేమేవజయతే అని జెండా ఎగరేస్తాడు. ఈ నక్కవాత ప్రేమికుడికి కుళ్లుబోతుతనంతప్ప ఇంకోటి తెలీదు… ఇంటి బయట ఇంత ప్రమాదం ఉన్మాదం పొంచివున్నాసరే నీకు ఆత్మ రక్షణ మార్గాలు చెప్పం. కిలో యాభై పెట్టి కారెట్లు కొని రసం తీసి మొహానికి పూసుకో మంటాం. బొడ్డూడని బొడ్డల్ని కూడా బొడ్డుకిందకి పరికిణీలు కట్టుకోమంటాం. అవెక్కడదొరికేది చెబుతాం నోరూరేలా చూపిస్తాం… వందరుచుల వంటలు చేసుకు తినమంటాం.. అంటాం సరే అది మా వ్యాపారం మా జీవనం. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా?
అందుకే స్వావలంబన అంటూ కారప్పూసలూ చేగోడీలు తయారుచేసి అమ్మడం, ఎంబ్రాయిడరీలు కుట్టి అమ్మడం, అన్నీ మంచివే కానీ ఇప్పుడు మనం కొత్త పరికరాలు తయారు చెయ్యాలి… ఆకాశంలో సగం నిండు చందమామల్లా నవ్వు ముఖాలతో వుండాలంటే సొరకాయ బొప్పాయకాయ రసం పూసుకోడం కాదు. మనకున్న ముఖాలతో నిర్భయంగా బజార్లో నడిచే అవకాశం మనకెవరూ కల్పించలేరని తెలిసిపోయింది కనక ఇప్పుడు మనకి యాసిడ్ ప్రూఫ్ ఫేస్ మాస్క్‌లు కావాలి. అంతెత్తునించి తోస్తే కిందపడికూడా దులుపుకుని పైకి లేచే శిరస్త్రాణాలూ ఇనపకవచాలూ కావాలి. పెట్రోల్‌కి కిరోసిన్‌కి అంటుకు మండని దుస్తులు కావాలి. అవి తయారుచేసే మార్గాలు కనిపెట్టాలి మనం… అంచేతను మనం కూరగాయల రసాలు పూసుకుని తళుకు బెళుకుల సింగారాలకు కామా పెట్టి పై చెప్పిన వాటిని సమకూర్చుకునే ప్రయత్నంలో పడదాం. ఇవి లేకుండా మనం ఎన్ని ఊరేగింపులు, ధర్నాలు చేసినా ఖాతరుచేసే తీరిక ఎవరికీ లేదు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చేతిలో బిడ్డతో మౌన పోరాటాలు చేసే కాలం చెల్లిపోయింది. మోసం వాడి స్వభావం. మన వివేకాన్ని ప్రదర్శించుకునే తెలివి ఎవరు నేర్పాలి? ఎప్పుడూ మోసపోవడమే మన భవితవ్యం కాకుండా చేసుకునే ఆత్మగౌరవం కావాలిప్పుడు. అదెలా తెచ్చుకోవాలో నేర్చుకోవాలిప్పుడు. ఇకనైనా… నెత్తురోడని వార్తాపత్రికలు, జుగుప్స కలిగించని దృశ్యమాధ్యమాలు మనకి కావాలి. మనం ”జీరోలం” కాము… శక్తి సంపన్నులం అని ఎప్పుడు చెప్పుకోగలం? వద్దుపొమ్మన్నవాడి వెంటపడే స్థితినించి ఎప్పుడు బయట పడతాం? కళ్ళు తెరవడానికి ఎంతకాలం తీసుకుంటాం? సమయం మించిపోవడం లేదూ??
సంపాదకీయం
చేనేతకి చేయూత నిద్దాం
నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రంలాగా వుండేది. మా కుటుంబానికి కావలసిన బట్టల్లో అధిక భాగం సూర్యనారాయణ కుటుంబం చేతుల్లోంచే వచ్చేవి. చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు చేతి రుమాళ్ళులాంటి రోజువారీ దుస్తుల్ని నేసి సూర్యనారాయణ తీసుకొచ్చేవాడు. మా నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు ఆ రోజుల్లో పాంట్‌లు వేసుకోవడం నేను చూళ్ళేదు. సూర్యనారాయణ నేసుకొచ్చిన పంచెలు, లుంగీలు మాత్రమే కట్టుకునేవాళ్ళు. చొక్కాలు వేసుకోవడం చాలా తక్కువ. మానాన్న రైతు కాబట్టి పొలానికెళ్ళేపుడు ఏ రోజు చొక్కా వేసుకునేవాడు కాదు. మా అమ్మకి చేనేత చీరలంటే చాలా ఇష్టం. ఆవిడ రకరకాల ఊళ్ళ నుంచి చీరలు తెప్పించేది. బొబ్బిలి, మాధవరం, ఉప్పాడ, వెంకటగిరి – ఈ ఊళ్ళ పేర్లన్ని నేను చేనేత ద్వారానే చిన్నప్పుడే విన్నాను.
బహుశ మా అమ్మ నుంచే నాకు చేనేత చీరల వారసత్వం వచ్చి వుంటుంది. నేను చేనేత తప్ప వేరేదీ కట్టను. నాకు మంగళగిరి, పేటేరు, గుంటూరు, కొయ్యలగూడెం, నారాయణపేట, వెంకటగిరి చీరలంటే చాలా ఇష్టం. ఈ చీరలు కట్టుకుంటే వుంటే హాయిని వర్ణించాలంటే ఇక్కడ సాధ్యం కాదు సరే! మళ్ళీ సూర్యనారాయణ గురించి మాట్లాడాలి. ఆయన ముఖం ఎంతో అమాయకంగా, కోమలంగా వుండేది. బట్టల మూట సైకిల్‌కి కట్టుకుని తెచ్చి మా వీధి అరుగు మీద రంగు రంగుల చీరల్ని, తెల్లటి పంచెల్ని వెదజల్లేవాడు. మేము పిల్లల మూకంతా వాటి చుట్టూ చేరేవాళ్ళం. ఆడపిల్లల కోసం దళసరి, తక్కువ కౌంట్‌లో రంగు రంగుల బట్టముక్కల్ని తెచ్చేవాడు. మాకు వాటితో గౌన్లు కుట్టించేవాళ్ళు. మా కుటుంబానికి కావలసిన బట్టలన్నీ తీసుకుని అతనికివ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవాడు మా తాత. కొన్ని సార్లు అంతా ఇచ్చేవాడు కాదు. సూర్యనారాయణ మళ్ళీ వచ్చినపుడు మిగతాది ఇచ్చేసేవాడు. అలా సూర్యనారాయణతో మాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అతని దగ్గర చాలా మంది బట్టలు కొనేవాళ్ళు, నేసినవన్నీ అమ్ముడుపోవడంతో, మళ్ళీ నేయడం, అమ్మడం, ఇలా ఆ కుటుంబానికి కావలసిన పని పుష్కలంగా వుండేది. ఆదాయం కూడా అదే స్థాయిలో వుండేది.
ఈ చేనేత సంబంధం తెగిపోవడం మొదలై చాలా కాలమే అయ్యింది. సిల్క్ బట్టలు వెల్లువెత్తి చేనేతను పక్కకు తోసేసాయి. సిల్క్ బట్ట మెయింటెనెన్స్ తేలిక కాబట్టి జనం వాటి వేపు మొగ్గడం మొదలైంది. స్వయం పోషకులుగా, తమ హస్తాల్లోంచి వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులు, కార్మికులు క్రమంగా పని కోల్పోవడం, నేసిన వాటిని అమ్ముకోలేక పోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆఖరికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవ్వడం ఈనాటి నగ్నసత్యం. పరమ విషాదం. ప్రభుత్వం ఏదో చేస్తున్నానంటోంది. చేనేత సహకార సంఘాలకి రాజకీయ చీడపట్టి మొదలంటా కుళ్ళిపోయాయి. చేనేత పనివారు పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయారు. వారికి ఆ పని తప్ప వేరేది రాదు. పని కల్పిస్తే కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసుకుంటారు. అద్భుతమైన వస్త్రాలని అందిస్తారు. వారికి కావలసింది పని. వారు నేసింది అమ్ముడై ఆదాయం రావడం. అంతేకాని పని చెయ్యకుండా పింఛన్‌లిమ్మని, విరాళాలు ఇమ్మని వారు కోరడం లేదు. మేం కష్టించి సృష్టిించే బట్టల్ని కొనండి. మాకు ఆదాయం వస్తుంది. మేం గౌరవ ప్రదంగా బతుకుతాం అనేదే వారి కోరిక.
సూర్యనారాయణ మరణవార్త నాలో రేసిన ఆలోచనలు ఇవి. ఆయనెంత ధైర్యంగా, నిబ్బరంగా వుండేవాడో గుర్తొచ్చి ఆ ధైర్యం వెనుక వున్న బలం ఏమిటో అర్ధమై నేను ఒక విషయం చెప్పదలిచాను. మనం కూడా చేనేతని ప్రేమిద్దాం. చేనేత వస్త్రాలని కొందాం అనే నిర్ణయం చేసుకోవడంతో పాటు నాది మరో కోరిక వుంది.
మన రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి. ప్రతి రోజు లక్షలాది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తుంటారు. ఒక్క తిరుపతికి వచ్చే భక్తులే లక్షలలో వుంటారు. హుండీలో కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ వుంటారు. భక్తజనకోటికి నాదో విన్నపం. గుళ్ళకొచ్చే వాళ్ళంతా చేనేత వస్త్రాలను ధరించి వస్తే… ఊహించుకోవడానికే నాకు పరమానందంగా వుంది.మీ భక్తి రసానికి మానవీయ కోణాన్ని అద్ది చూడండి. కోట్లాది చేనేత పనివారలకి చేతినిండా పని. పనికి తగిన ఆదాయం, కేవలం తిరుపతికి వచ్చే భక్తులు ఒక్క రోజు చేనేత వస్త్రం కట్టి గుళ్ళో కెళ్ళండి. మీకు మానసిక తృప్తితో పాటు, మానవత్వం కూడా పరిమళిస్తుంది. చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. మా సూర్యనారాయణకి నేనిచ్చే నివాళి ఇదే. చేనేత జిందాబాద్.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags