మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండి ఆమె నిర్బంధంలోనే వుంది. బలవంతంగా ముక్కుకు గొట్టాలు అమర్చి ఆహారం పంపిస్తున్నారు. ఆమెకు కొన్నిసార్లు బెయిల్ దొరికినా, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడంతో మళ్ళీ మళ్ళీ అరెస్టు చేయడం జైలుకి పంపడంజరుగుతూ వచ్చింది.

ఈ ఏడేళ్ళ కాలంలో షర్మిల వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నిరక్షరాస్యురాలైన , గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. “మీరు ఎందుకు మీ బిడ్డను చూడడానికి వెళ్ళలేదు” అని అడిగిన ఒక విలేఖరికి ఆమె తల్లి ఇరామ్ సఖీదేవి ఇచ్చిన సమాధానం “నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన ధృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలుచుకోలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు ఆమెను చూడదలుచుకోలేదు.”

షర్మిల నిరాహారదీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004 లో మణిపూర్ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమ అనే మహిళ అత్యాచారానికి, హత్యకి బలైనపుడు మణిపూర్ స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకి వారిని ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ ముందు మణిపురి తల్లుల నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేసిందీ నగ్న ప్రదర్శన.

ఇంఫాల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని జుడీషియల్ కస్టడీ నుంచి బెయిల్ దొరికిన వెంటనే ఆమె మిత్రులు షర్మిలాను ఢిల్లీకి తరలించారు. చాలా నాటకీయ పరిస్థితుల్లో ఆమె హఠాత్తుగా అక్టోబరు 2 న ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ముందు ప్రత్యక్షమై మహాత్మాగాంధి సమాధి మీద పుష్పగుచ్ఛం వుంచుతూ “మహాత్మా గాంధీ కనుక ఈరోజు బతికి వుండి వుంటే, ఆయన తప్పకుండా సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి వుండేవాడని నేను యావత్ భారత ప్రజలకు చెప్పదలిచాను. భారతీయులందరికీ నా విన్నపం ఒక్కటే. సాయుధ దళాల చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పండి. మా ప్రచారంలో భాగం పంచుకోండి” (టెలిగ్రాఫ్ అక్టోబరు 5, 2006)

ప్రస్తుతం షర్మిలను అరెస్టు చేసి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వుంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఇంఫాల్ హాస్పిటల్ ఇరుకు గదిలోంచి, ఎయిమ్స్‌లోని స్పెషల్ వార్డులో వుంటూ షర్మిల తన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే వుంది. అయితే ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ముక్కుకి బలవంతంగా అమర్చిన గొట్టం వల్ల షర్మిల తీవ్రమైన బాధని భరిస్తోంది.. ఇటీవలే ఆమె బి.బి.సిలో మాట్లాడుతూ “మణిపూర్ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతికోసం” అంటూ ప్రకటించింది.

ముప్పై ఐదేళ్ళ బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత పద్ధతిలో, మడమతిప్పనిపోరు సల్పుతోంది. తన ప్రాణాలను తన ప్రజలకోసం తృణ ప్రాయంగా ఫణంగా పెట్టి పోరాడుతున్న షర్మిలా ఇరామ్‌తో గొంతు కలపడం అభ్యుదయాన్ని కాంక్షించే వారందరి కర్తవ్యం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.