చిలుక జోస్యం

– ఎల్‌. మల్లిక్‌

(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)

పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?

పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!

పెంటి చిలుక: నిజమే మామా! అందరికీ జోస్యం చెప్పే మనకి మాత్రం ఈ బందిఖానా, చెర ఎన్నాళ్ళో తెలియడం లేదు. మనిద్దరం మళ్ళీ స్వేచ్ఛగా ఎగిరే రోజు వస్తుందంటావా?

పోతు చిలుక: తన జాతకం ఏమిటో తెలియనివాడు, ఇతరుల జాతకాలను నిర్ణయిస్తూ వుండడం విచిత్రమే. ఇంతకీ ఇటు ఎందుకు వచ్చానంటే, ఈ మధ్యన మా గురువుకి ఊళ్ళో అంతగా గిరాకీ లేకుండా పోయింది. దాంతో గురువు ఈ ఆఫీసుల వెంట, చివరికి ఈ చట్ట సభల వెంటపడ్డాడు.

పెంటి చిలుక: అదేంటి మామా, ప్రజలు ఒక్కసారే తెలివి మీరిపోయారా? లేక అదేదో యంత్రం ద్వారా జాతకాలు చెబుతున్నారంటగా, దానికి పోతున్నారా? అంతకీ కాదంటే ఈ మాయదారి పాలనలో మన బతుకులు ఇక మారవని ఒక నిర్ణయానికి వచ్చేసారా?

పోతు చిలుక: అదేమీ కాదులే! ఈ ప్రజలు అంత తేలిగ్గా దిగాలు పడరు. అసలు కారణం ఏమంటే “ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి” అంటారే, అలాగే ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యింది. ఇందాక అడిగావే మన చెర ఎన్నాళ్ళోఅని. మనకి కూడా ఈ చెర తొలగిపోయే రోజులు త్వరలోనే రాబోతున్నట్లు ఎన్నో మంచి శకునాలు కన్పిస్తున్నాయి.

పెంటి చిలుక: మీ గురువు ప్రజలకు చెప్పే జోస్యాలు నువ్వు నాకు చెబుతున్నావా?

పోతు చిలుక: లేదు, లేదు. నిజమే చెబుతున్నా ఈ మధ్యన మన కేంద్ర సర్కారోళ్ళు ఏదో సమాచార హక్కు చట్టం అని తెచ్చారంట. దాంతో ప్రజలకు నేరుగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించే హక్కు ఫైళ్ళను తనిఖీ చేసే హక్కు, డాక్యుమెంట్ల నకళ్ళను తీసుకొనే హక్కు, చివరకు ప్రభుత్వ పనులను తనిఖీ చేసే హక్కుఇలా అబ్బో… ప్రజలకు చానా అధికారాలు వచ్చాసాయంటలే.

పెంటి చిలుక: అదేంటి మామా, నేనేదో అడిగితే నువ్వేదో చెబుతావు! నక్కకి నాగలోకానికి ముడిపెడతావేంటి?

పోతు చిలుక: అదిగో ఆ కంగారే వద్దు! ‘చెవిటప్పా, చేట ఎక్కడ అంటే, మా చెల్లెలు అత్తోరు బెజవాడ’ అందట, నీకు తగ్గది. చెప్పేది పూర్తిగా విను.

పెంటి చిలుక: అలాగేలే చెప్పు.

పోతు చిలుక: ఇంతకు ముందంటే ప్రజలు ఏ ఆఫీసుకు వెళ్ళి ఏ ఆర్జీ పెట్టినా, ఏ సమాచారం అడిగినా, ఎవరికి ఏ న్యాయం జరగాలన్నా, ఎవరికీ ఏ పథకం అమలు కావాలన్నా, ఆ పంచాయితీలు ఎం.ఆర్‌.ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం, లేదంటే ఏదో కోర్టుల వద్ద చెట్ల కింద, కాళ్ళు ఆరజాపుకొని, మొఖాలు వేలాడేసుకొని కూర్చోవడం! వారి గతి ఏమిటో తెలుసు కోవాలంటే వారికి ఉన్నదల్లా ఒక్కటే మార్గం, మన చిలుక జోస్యం చెప్పించుకోవడం! లేదంటే తూర్పుదిక్కుకు తిరిగి దేవుడా నువ్వే దిక్కంటూ మొరపెట్టుకోవడం.

పెంటి చిలుక: ఔనౌను! అప్పుడు మన గురువులు సమయం కనిపెట్టి “నీ కష్టాలు గట్టెక్కిపోతాయి. నీ బాధలు పటాపంచలవు తాయి, చిలక ప్రశ్న చెప్పించుకో బాబా” అంటూ రెండు తీపిమాటలు చెప్పి వాళ్ళు టీ నీళ్ళకోసం వుంచుకొన్న ఆ రూపాయి డబ్బులు తన జోలెలో వేసుకోవడం!

పోతు చిలుక: మా బాగా చెప్పావు

పెంటి చిలుక: మరి ఇప్పుడో?

పోతు చిలుకః ఇప్పుడా ప్రజలు ఎవరైనా ఒక పదోన్నతి, ఒక నియామకం, ఒక నిర్వాసిత సమస్య లేదా రేషను కార్డులు దేని గురించి అయినా సమాచారం కోరితే, ఇక ఆ సంబంధిత అధికారి 30 రోజుల్లో ఆ అర్జీకి సమాధానం ఇవ్వవలసిందే. ఏవో రక్షణ వ్యవహారాలు తప్ప, దేన్నీ “ఇది రహస్య సమాచారం ఇవ్వం” అనరాదు. ఆ.. అన్నట్టు మరిచాను ఈ మధ్య ఒక అధికారి మా గురువు దగ్గరికి వచ్చాడు. “ఇదేదో దిక్కుమాలిన చట్టం వచ్చింది. మాకు నిద్ర లేకుండా చేసింది. నాకు ఈ బాధ ఎప్పుడు పోతుందో చెప్ప”మంటూ జోస్యం అడిగాడు.

పెంటి చిలుక: అయితే మీ గురువు ఏమి చెప్పాడు?

పోతు చిలుక:ఏమి చెబుతాడు! మామూలే, అందులో ఇతనికి ఆ చట్టం గొడవ అవీ ఏమీ తెలియదేమో, “నీకెందుకు నేనొక శాంతి చేస్తాను. పదిరోజుల్లో నీ మొత్తం బాధలు అన్నీ పోతాయి. అప్పటి నుండి నీకసలు ఇక పనే వుండదు. నీకెందుకు దొరా! నీవు నిచ్చితంగా వుండు” అన్నాడు. దాంతో అతను చింత లేనమ్మ సంతలో నిద్రపోయినట్లు హాయిగా పడుకొన్నాడనుకొంటా. ఇంతలో ఆ పది రోజులు గడువు ముగిసింది. దరఖాస్తుదారు అడిగిన సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పై అధికారి నుండి సస్పెన్షన్‌ ఆర్డరు అందింది. అది చూసి వెర్రెక్కిపోయి, మా గురువు వెంటపడ్డాడు. మా గురువు చల్లగా ఇటు జారుకున్నాడు. ఇలా మా మధ్య చాలా జరిగాయి.

పెంటి చిలుక: ఆహా… ఇదేనా ఓడలు, బళ్ళు అయ్యాయి అంటున్నావు. ఈ జోస్యాల వెంటపడడం ఒకప్పుడు ప్రజల వంతు అయితే అది ఇప్పుడు ఈ అధికారులు నాయకుల వంతు అయ్యిందన్నమాట. ఔను మామా, ‘ఏమీ తెలియని వాడు ఏకాదశినాడు చస్తే, అన్నీ తెలిసిన వాడు అమావాస్యనాడు చచ్చాడన్నట్లు’ చూస్తూ, చూస్తూ ఈ నాయకులు, అధికారుల్లు ఈ కుంపటిని తమ నెత్తిన పెట్టుకొన్నారేంటి? బహుశా ఇంతకాడికి వస్తుందని అనుకోలే దంటావా?

పోతు చిలక: ఏమంటే గ్రహచారం! పూర్తిగా గ్రహచారం అని కూడా చెప్పలేము. గత్యంతరం లేని స్థితి. ఎప్పటినుండో ఎంతోమంది మేధావులు, పెద్దలు, సంఘాలు, ప్రజలు జరిపిన పోరాటాల ఫలితంగా ఈ చట్టాన్ని చేయక తప్పలేదు అనాలి.

పెంటి చిలుక: అయినా మామా, వాళ్ళు ఇన్ని పాట్లు పడడమెందుకు? ఆ సమాచారం ఏదో ఇచ్చేస్తే పోలా? అది కూడా ఈ ప్రజలు వాస్తవాన్నేగా చెప్పమంటున్నారు, అది చెప్పడం వారి పని కూడా కదా!

పోతు చిలుక: మా బాగా చెప్పావులే! తనది ముడ్డి కాకపోతే కాశి దాకా దేకమన్నట్లు వుంది నీవు చెప్పేది. మాయల ఫకీరు ప్రాణాలు మన చిలుకరాజులో ఉన్నట్లు వీళ్ళ బతుకు బండారమంతా ఈ సమాచారంలోనే దాగి వుంది. ఒకసారి ఈ గుట్టు రట్టు అయ్యిందీ అంటే, వారి బతుకు బజారున పడ్డట్టే!

పెంటి చిలుక: మరైతే వీళ్ళని మార్చడం సాధ్యం కాదంటావా?

పోతు చిలుక: సాధ్యం కాదు అనలేము కానీ, అంత తేలిక కాదు. ఈ దేశంలో అధికార యంత్రాంగం అంటే, అది కుంభకర్ణుడికే నిద్రపోవడంలో శిక్షణ నివ్వగల ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూటు. ఇక రాజకీయ రంగమంటే స్వప్రయోజనం, స్వార్ధపరత్వం తప్ప, ప్రజా సంక్షేమం గూర్చి కలలోనైనా తలవని సేవాసదనం. ఒకవేళ ఏ ప్రమాదమూ లేని సమాచారాన్ని ఇవ్వాలన్నా, అది ఎక్కడా రికార్డు చేసి వుందన్న నమ్మకం లేదు. అయితే ఈ చట్టం గూర్చి ప్రజల్లో ఇంకా అంతగా అవగాహన రాలేదు. ఎక్కడో కొన్ని ప్రజా సంఘాలు మాత్రం చురుగ్గా పని చేస్తున్నాయి. ఒక మహారాష్ట్రలోనే పౌరులు వివిధ రకాల సమాచారం కోరుతూ ఇరవై వేల దరఖాస్తులు పెట్టారని అంచనా.

పెంటి చిలుక: అయితే మన రాజకీయ నాయకులు, అధికారులు సామాన్యులు కాదు కదా! ఈ చట్టాన్ని చూసి నిమ్మకు నీరెత్తినట్లు వుంటున్నారా?

పోతు చిలుక: అన్నన్నా! ఎంతమాట. వారు అంత చేతకాని దద్దమ్మలా! చేతులు చచ్చి కూర్చొన్నారా? “గుడ్డు పెట్టే పెట్టకు తెలుస్తుంది, కూతకూసే పుంజుకేమి తెలుస్తుంది నొప్పి?” అంటూ ఈ చట్టం చేసిన వారిపై ఒక పక్క చిందులేస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రజలకే కాదు, ఇంకా పెద్ద పెద్ద అధికారులకే ఈ చట్టం గూర్చి అంతగా తెలియదు,ఇప్పుడే ఇంత కష్టంగా వుంటే ఇక ముందు ముందు ఈ బాధ తట్టుకోవడం సాధ్యమేనా? కావున ఉపేక్షించ రాదు, పురిట్లోనే దీని పీక పిసికి చంపాలని పడరాని పాట్లు పడుతున్నారు.

పెంటి చిలుక: ఏమి చెయ్యబోతున్నారు?

పోతు చిలుక: ఏముందీ, మన నాయకు లంటే ఎవరనుకున్నావు, నిజం చెప్పని, అబద్ధమాడని అపర ధర్మరాజులు. ఉండనే వుందిగా “ అశ్వత్ధామ హతః (కుంజరః)” అన్న సూత్రం. దేనికైనా చివర ఒక కొసమెరుపు తగిలించడం. ఏనుగు వెలగ పండును మింగి, లోపల గుజ్జునంతా అరగదీసి డొల్లను యథాతథంగా విసర్జించినట్లు అమాంతం ఈ చట్టాన్ని చప్పరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

పెంటి చిలుక: కాస్త వివరంగా చెప్పావు కావు! ఈ మాయ మనుషులతో చేరి నీవు కూడా మర్మంగా మాట్లాడ్డం నేర్చావు మావా?

పోతు చిలుక: ఏం చెయ్యమంటావు? ఆరు నెలలు సహవాసం చేస్తే, వారు వీరైనట్లుంది. పైకి మాత్రం చట్టాన్ని మరింత పదును పెడుతున్నామని చెప్పుకుంటూ, చట్టానికి సవరణ చేయాలని కేంద్రంలో కసరత్తులు మొదలు పెట్టారు. దాని పంచప్రాణాలు లాగెయ్యాలని చూస్తున్నారు.

పెంటి చిలుక: అది ఎలాగూ?

పోతు చిలుక: మచ్చుకు ఒకటి రెండు చెబుతా విను. ఏదో అభివృద్ధి, సామాజిక పథకాలు, ప్రణాళికలు తప్పా, మిగిలిన వాటి విషయంలో అధికారులు రాసి వుంచే అభిప్రాయాలు ఏవీ చెప్పకుండా వుండడానికి గానూ, వీటిని చట్టం నుంచి తప్పించాలనేది ఒకటి. దీన్నే అందంగా “సంతృప్తికరమైన” (ఫైల్‌ నోటింగ్స్‌) ఇస్తామంటున్నారు. ఇంతకీ “సంతృప్తికరం” అంటే ఏమిటో ఎక్కడా చెప్పలేదు సుమా!

పెంటి చిలుక: అంటే ఏది వారికి అనుకూలంగా లేకపోతే అది అసంతృప్తికరమే కదా!

పోతు చిలుక: ఆహా.. ఎంత తేలిగ్గా కనిపెట్టేసావు వారి తెలివిని! అందుకే మీ గురువుకింత ఆదాయం తెచ్చిపెడుతున్నావు.

పెంటి చిలుక: ఇందులో తెలివి ఏముంది మామా! ఇన్నాళ్ళుగా ఈ రాజకీయాల మధ్య వుంటున్నాగా!

పోతు చిలుక: అలాగే మంత్రిమండలి ఏదైనా నిర్ణయాలు తీసుకొంటే, ఆ నిర్ణయాలకు ఆధారమైన పత్రాలు ఏమిటో చెప్పలేమని, ఉద్యోగాలు, పదోన్నతుల విషయంలో మూల్యాంకన వివరాలను సమాచార హక్కునుండి మినహాయించాలనీ..

పెంటి చిలుక: అంటే మంత్రివర్యులకు, అదికారులకు తృణమో, పణమో గిట్టుబాటు అయ్యే మార్గానికి ఈ చట్టం కొట్టిన గండికి ఈ రకంగా అడ్డుకట్ట కట్టాలనుకొంటున్నా రన్నమాట!

పోతు చిలుక: ఆహా! అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పావే కోడలా! అంతేకాదు చివరకు ఈ కమీషన్‌కు గల స్వతంత్ర ప్రతిపత్తిని తీసివేయడం కూడా. అంటే దీనికి సంబంధించిన తగాదాలలో ఇంతకు ముందు హైకోర్టు/ సుప్రీంకోర్టులకు పోవాల్సి వుండగా ఇప్పుడు సవరణ అంటూ జరిగితే వాటికి సంబంధించి తుది నిర్ణయం ప్రభుత్వాలదేనన్నమాట. ఇక చట్టం ఉన్నా ఫలితం మాత్రం సున్నా.

పెంటి చిలుక: మనిషిని మనిషిగా వుంచి, కిడ్నీలను దొంగిలించే శస్త్ర చికిత్సా నిపుణులకు మన ఈ నాయకులే గురువులన్నమాట. ఇంతకీ ప్రతిపక్షం మాట ఏమిటో?

పోతు చిలుక: ఓసి పిచ్చి దద్దమ్మా! ఈ విషయంలో వీరిదంతా ఒకే పక్షం. నిజం చెప్పాలంటే అధికార పక్షం కన్నా, ప్రతిపక్షానికే దీని విషయంలో దడ ఎక్కువ. ఎవరు ఏ పాత చట్టాలను తిరగగొడతారో, ఎప్పుడు ఏ చిక్కు వచ్చి పడుతుందోనని బిక్కుబిక్కు మంటుంటారు. కనీసం అధికారమన్నా చేతిలో వుంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చు, అదీ లేదే అని వారి భయం!

పెంటి చిలుక: ఆ… అన్నట్లు ఇంతకు ముందు మా గురువు జాతకం చెప్పేటప్పుడు అధికార పక్షం వాళ్ళకి ఒక కార్డు తీయించాడంటే, ప్రతిపక్షం వాళ్ళు వచ్చినప్పుడు, అతను సైగ చేసినా చెయ్యకపోయినా, దానికి వ్యతిరేకంగా వుండే మరో కార్డును తియ్యడం అలవాటు చేసాడు కానీ ఈ మధ్య మా గురువు అందరికీ ఒకే కార్డు తీయిస్తుంటే, వీడికేదో పిచ్చి పట్టిందో, లేక తాగిన మైకం దిగలేదో అనుకొన్నా.

పోతు చిలుక: మీ గురువు బతక నేర్చినోడు. ఇప్పుడు ప్రతీ ఒక్కళ్ళకీ (నాయకులు, అధికార్లు) పట్టింది ఒకే భయం, ఒకే గ్రహం, అదే సమాచార గ్రహం అని తెలుసుకున్నాడు. ఎంతైనా ఈ రాజకీయ భవనం (అసెంబ్లీ) మధ్య తిరుగుతున్నవాడు కదా! దాంతో అందరికీ ఒకే పాట పాడుతున్నాడు.

పెంటి చిలుక: ఇంతకీ ఈ సమాచార భాగోతానికి, మన స్వేచ్ఛకీ లింకు ఏందో చెప్పావు కాదు.

పోతు చిలుక: ఈ మాత్రం గ్రహించలేవా! ఈ చట్టమే కనుక సక్రమంగా అమలు జరిగితే, ప్రజలు ఎలాగూ మన చిలుక జోస్యాల జోలికి అంతగా రానక్కరలేదు. ఆ స్థానంలో కొద్దిరోజులు అధికార్లలాంటి వాళ్ళు వెంటపడ్డా, మన గురువులు చెప్పేది వారికి ఏమాత్రం సహకరించకపోగా, చివరకు మొన్న ఆ అధికారికి జరిగిన శాస్తే జరుగుతుంది. అంతిమంగా వారికి పనిచేయడం ఒక్కటే మార్గం అవుతుంది. ఎప్పుడైతే మన జోస్యానికి డిమాండు పోయిందో, అప్పుడు మన గురువులు దీన్ని వదిలిపెట్టి మరో బ్రతుకు తెరువు చూసుకోక తప్పదు. ఇది అసలైన జోస్యం.

పెంటి చిలుక: మా బాగా చెప్పావు మామా! ఇన్నాళ్ళకు మన బతుకుల గురించి జోస్యం చెప్పగలిగావు. మరి ఈ సవరణల సంగతో…

పోతు చిలుక: రాబోతున్న అపాయాన్ని గమనించి ఈ ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు తమ పట్టు వీడక పోరాడి, చట్టసవరణ జరగకుండా, ఇంతకుముందు పడిన శ్రమ వృథా కాకుండా కాపాడు కొంటారని, మన బ్రతుకులకు స్వేచ్ఛను ప్రసాదిస్తారని ఆశిద్దాం. ఆరోజు ఎంతో దూరంలో లేదని కూడా అనిపిస్తోంది.

(ఇంతలో ఆ చిలక జోస్యగాళ్ళ పని పూర్తి అయినట్లు వుంది. ఎవరి చిలుక పెట్టి వాళ్ళు చంకకు తగిలించుకొని, చెరోవైపు అక్కడి కార్యాలయాల ముఖం పట్టారు. ఆ చిలుకలు రెండూ ఒకదాని వైపు చూచుకొంటూ మౌనంగా వుండిపోయాయి.)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.