మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల
మూగిళ్ళాడుకుంటూ ఒకర్ని పట్టక ఒకరు ఉర్కుతున్నరిగ. మాకన్న సిన్నగున్న మొగపిల్లలు మాతో ఆడుతున్నారు. సిత్తుబోత్తేస్తే ఆకర్కి బైండ్ల రాములు ఔటయిండు. మేమంతా చుట్టుపక్కల పొదల సాటున పెద్ద పెద్ద బండరాల్ల దాస్కుంటున్నాం. మా ఆటసోయిలో పడి చుట్టు పక్కల ఏమైందో సోయి లేకుండ ఆడుతూనే ఉన్నాం. మేం ఇట్లా ఆడుకోక శానాదినాలైంది. ఆకలిగున్నట్టు ఆడుతూనే ఉన్నాం. మా సంబరానికి ఊతమేస్తూ ఆకాశంలో రంగు రంగుల సింగిడి పూసింది. అటుకెల్లి ఇటు ఇటుకెల్లి అటు దానిలో ఏడు రంగులున్నయా లేదా లెక్కగట్టినం, డిబ్బి కడుపు నర్సికి ఎన్ని మార్లు లెక్కగట్టిన గాని ఒక రంగు తక్కువనే వస్తుంది. నాకు ఏడు రంగులు దొరికినయి. నేను దూకుకుంటూ గెంతుతున్న, గంతులేస్తున్న. నాకు దూరం నుండి పండుగల సాయన్న పాట వినపడ్డది. ఎంటకు మల్ల జూసిన దూరంకెల్లి ఊరజెర్వు కట్టెంబడి తలరి అంతన్న పొడుంగున్న ఆయిలి బరుగు పట్టుకుని బర్రె మీద గూసుని కిన్నెర పాట పాడుకుంటొస్తున్నడు.
నాకు ఎంతో పానమున్న ఆ పాట సెవెట్టిన్న. పాటను పట్టుకున్న. అది పండుగల సాయన్నపాట, ఎంబడే పాడుడు మొదలెట్టిన
ఓరోరి సాయన్న ఓ పండుగ సాయన్న
పాలామూరి ఈడిగొల్లయి
బియ్యం బండ్లు వోతున్నయి
పన్నెండు పుట్లు బియ్యం బండ్లు
తాండూరుకు వోతున్నయ్
పానం బోతె పాయెగని
పట్టిడువకు సాయన్న కిన్ కిన్ కిన్ కిన్
కొంతమంది పిల్లలు ఎవరికి వాల్లు మడికట్లల్ల దీమనగొయ్యలోలె ఉరుకుతున్నరు. కాల్లకింద, పచ్చగడ్డి అణిగినట్లే అణగి పైకి లేస్తున్నది. నీటి బొట్లు కరిగి పోతున్నయ్. దూరం నుండి వస్తున్న వాల్లను తేరిపార జూసుకుంట మడికట్లనే నిలవడ్డం. పువ్వెండ కొంచెం కొంచెం కరిగి మొగులుకు కాకిని గట్టినట్లైంది. మాలమాదిగోళ్ళ మంచినీల్ల బాయికాడ రెండుగా చీలిన దారుల్లో ఆడోల్లు మాదిగోల్లు మాదిగి కేరిలోకి, మాలోళ్ళు వాల్లకేరిలోకి వోతున్నరు. మైయమ్మ ఆలదాంట్ల లేదు. ఇంకా చూస్తున్న పెద్ద పెద్ద సినుకులతో ఆన మొదలైంది. ఆడోల్లంతా ముందే తడిసినందుకేమో నడకలో మార్పు లేదు. నాకు మాత్రం పెయి తడిసి చలి పెట్టి పానం నీరెంటిక వట్టింది. కాని ఆడికెల్లి కదలబుద్ధిగాలే. వాన జాడిచ్చి కొట్టుకుంటూనే చీకటి కమ్మింది. ఇవేవి గమించుకోకనే చూస్తున్న.
దగ్గర కొచ్చిందాక వరిచేన్ల కల్వవోయిన ఆడోళ్ళు పగటి వానకు తడిసి ఇంకా ఆరలేదు. తడిసిన కుల్లలు పిండుకొని నెత్తిన ఆరేసినట్లు ముసుగేసుకున్నారు. అన్ని దిక్కుల నుండి వరాల పొంటి సాలుకట్టినట్లు నడుసుకుంటొస్తున్నరు. మాయమ్మ కోసం చూస్తునే ఉన్న. నాకు దూరం నుండి వాల్లంతా ఒకేలాగా కనిపిస్తున్నారు. అందరూ కుల్లలు గప్పుకున్నరు. మాయమ్మ కొత్త ఆకుపచ్చ కుల్ల కుట్టింది. పాత చీర చింపి కొత్త కుంచి కుట్టింది. నాకండ్లు మైయమ్మ కోసం సూస్తున్నా మనసులో కుంచి కథనే మొదులుతుంది. చీర మొత్తంలో మొత్తగయి చినిగిన భాగాన్ని తీసేసి గట్టి భాగాన్ని దానికంటగుట్టి పొడువులో ఎక్కువ, వెడల్పులో తక్కువ గుడ్డలను జమాయించి నాలుగు మూలలు చేసి లోపల భాగానా మాయప్ప తెల్ల పంజబట్టను పెట్టి కుట్టింది. చీర అంచుకున్న జరిని కుల్లపై భాగాన అతికించి కుట్టింది. అది సుతారంగా వెనుకభాగాన వేలాడుతుంది. కప్పుకుంటే సరిగ్గా నెత్తిపైన దగ దగ మెరుస్తూ జరి అంచు ఎంత అందంగుంటదో. దాన్ని కప్పుకొని ఆడుకునేది, రాజకుమారి ముసుగులాగ మురిసిపోయేది. దాన్ని కప్పుకోడానికి అక్క నేను పోటీలు పడేది. కొట్లాడేది. రాత్రికి కప్పుకోనికే దాన్నే గుంజులాడేది. మాయమ్మ మమ్ముల ఆగపట్టలేక సిన్న సిన్న కుల్లలు రెండు సెరొక్కటి కుట్టింది. కుంచులు గుట్టుట్ల మైయమ్మ తెలివి ఎవరిలోను కనిపించకపోయేది. అందుకే మా పక్కింటి నింగనంపల్లి సాయవ్వ నా తల్లి సేతులు బొంగురాలోలే తిరుగుతాయి. సిట సిట కుంచి కుట్టుట్ల ఫస్టు అని మైయమ్మను తెగమెచ్చుకునేది.
ఆనలో అట్లనే నిలవడ్డ. ఊరంత వచ్చిండ్రు. మిగిలింది మాయమ్మనే.
మసక చీకట్లో మాయమ్మ ఒక్కతె సురగాలొచ్చినట్లొస్తున్నది. అక్కడ వస్తున్నామె మైయమ్మనే అనే ధైర్యంతో నిలబడ్డ. నిజంగానే అమ్మ. వానలో తడిసిన నన్ను చూసి తల్లడిల్లి పోయింది. నేను పోయి అమ్మతో కలెబడినట్లు నడుముకు సుట్టెసుకున్న. ఇంట్ల దీపం పెట్టి తమ్మున్ని వెట్టుకొని కూసోక ఎందుకు నాయన ఇక్కడున్నవన్నది. వాన రాంగా మొండి పిల్ల నన్ను సుట్టుకుంటున్నది. అడ్వికెల్లి ఏం మొసుకొస్తున్నననుకున్నవు? పండా పలారమా! అని కోపగించుకున్నది. నేను కుల్లను వెతుకుదామన్న అమ్మ నల్లిడ్వకుండ రెట్ట వట్టి ఇంటికి తీసుకొచ్చింది. వచ్చేటాల్లకింకేం సిన్నోడు మా తమ్ముడు కడపల మీద ఎడ్సుకుంట బుగులుతో గూసున్నడు. ఆడొట్టి పిరికోడు. మొగులు మెరిసినా ఉరిమినా బెదురుకుంట గూసున్నడు. ఆన్ని జూసి అమ్మ నన్ను తిట్టుడిరకెక్కువయింది. పోతూ పోతూనే నా చేయి ఒదిలేసి వాన్ని నవిరి సంకనేసుకున్నది. బెదిరినవా కొడుకా అని వీపు మీద సప్పరించింది. ఈడు జూడు ఎట్లా బెదిరిపోయిండో ఏం బోగొట్టుకున్నవని ఆనల నిలబడ్డవ్ పెద్ద పిట్టోలే అని నన్ను మల్ల తిట్టింది. అమ్మ నన్ను తిడుతుంటే సిన్నోడు సంతోషంగా భయం బోగొట్టుకున్నాడు. అన్నదాంతో వాడి మీద నా కోపం కూడా పోయింది. ఎందుకంటె ఆకలి నాక్కూడా ఎక్కువయింది. వాన్ని గబుక్కున కింద దించి కుంచిలో మూలకున్న పచ్చి పెసరుకాయ దీసి ఇద్దరికి వెట్టింది. మరికొంత ఆన్నకుంచింది. ఈ కాయ కోసమే అమ్మ ఆకరికొచ్చింది. మా కడుపులు సల్లబర్చినంకగాని ఇంట్లోని మట్టి వాసనను పట్టించుకోలేదు. ఈ వాసన వాన పడ్డప్పుడల్లా మా యింట్లో
ఉండేదే. కొటింట్ల, పోయికాడ, అడ్డగోడపక్కకు, వాన కుర్సి నడొంట్ల మడుగు గట్టింది. గోడపోంటి అదే పనిగా కర్దూపం కారుతూన్నది. ఇంట్లో వున్న రాతెండిగిన్నెలు ఉర్సె దగ్గర పెట్టింది మైయమ్మ. మిగితా జాగల్ల మట్టి పల్లాలు పెట్టింది. ఇంకా పెట్టాల్సిన జాగాలున్నయి. నేను ఏం పెట్టాలా అని వెతుకలాడుతూన్న. అంతలో అమ్మ పగిలిన కుండ బోకులు తెచ్చి పెట్టింది. ఇంక ఇంట్ల జూస్కో తప తప, టిన్ టిన్ టన్ టన్ రకరకాల సప్పుళ్ళ నడుమ అమ్మ తిరుగులాడుతున్నది. వాటిల్లో నిండిన వాన నీళ్ళు బయట పారబోస్తున్నది. నేను ఒక సేత్తో పెసరుగాయ తినుకుంట ఇంకో జేత్తో నీరును పారబోసిన. ఆగగో గోలేం సాటుకు ఉరిస్తున్నదే! సిన్నోడు కేకపెట్టిండు. అమ్మ ఉరుక్కుంటొచ్చి అక్కడ ఇనుప గంప పెట్టుకుంట ఇల్లంత జల్లెడోలైంది ఎన్నంట వెట్టాలే. ఎన్నెన్ని సర్దాలె. యాట గుడిసె కప్పుతుండె. ఈ ఏడు లేక ఈ పూరిళ్ళు ఇట్లైందనుకుంటనే మైయమ్మ ఇల్లంత కలియదిరిగుతున్నది. బైట వాన ఏ మాత్రం ఎలవలేదు. బయట వానసప్పుడు, ఉరుముల సప్పుడు ఇంట్ల ఉరిసె సప్పుడు ఎవరు ఏం మాట్లాడినా వినపడడం లేదు.
పిలగాడు ఎంతగానం తడ్సినో… ఊర్లకొచ్చెనో… అడ్విలోనే ఉన్నడో… యాది తెల్వకొచ్చె… ముసలమ్మ ఇంకా రాకపోయె అంటుంగనే సంగవ్వొచ్చింది. లేకికల్లాలు తిర్గి ఏం దొర్కక దొర్సానింటికి పోయి మూడు సంచులు జొన్నలు జేసినందుకు సద్ది రొట్టెలు పప్పుసారు పోస్తె గురిగుల కుంచి సాటుకు పట్టుకొని తీసుకొచ్చింది. సిన్న కుల్లల మూటలోంచి తాలోడ్లు వడిపిళ్ళు తీసి శాట్ల వోసింది. వాటిని మైమ్మ తీసి ఆరుసాటున ఉర్వకుండ కుండలవోసి కప్పి పెట్టింది. అన్న నిండ తడిసి ముద్దయి ఇంటికొచ్చిండు. రామచంద్రప్ప ఒచ్చిండుని మైయమ్మ గట్టిగా సంబరంగా అన్నది.
గోనె కొప్పెర సూరుకు తగిలిచ్చి పటువల నీల్లతో కాల్లు కడుక్కొని రా కొడుక… అన్నది. కట్టిచ్చిన రొట్టె సరిపోయినాదప్ప అంటూ సంగవ్వ అడిగింది. యాడెనెవ్వ దూల్లు కుసొని తిన్నిచ్చినయా? మల్ల మల్ల పటేల్ సేండ్ల వడనీకే సూస్తున్నయ్. బరుగు పట్టుకొని ముందలుండి వరాల పొంటి మేపిన మూడుగొట్టంగా మడ్గుల నీల్లు తాగిచ్చిన. అవి నెమరేసుకుంట సెట్టు నీడకు పండినయ్. రొట్ట సద్దిప్పి తిందమనుట్లనే దొంగొచ్చినట్లైంది ఆన, ఇడ్సిన రొట్టెను సుట్టుకొని ఊరు మొఖాన వచ్చిన అని సిట సిటా జెప్పిండు. కుంచి బట్టతో అన్న నెత్తి తడి తుడుస్తున్న అమ్మ కోపంతో ఆని దొంగదూల్లు ఉన్నతుండయి నా పిలగాన్ని ఆకలికి జంపినయి గదాంట కాలి కాలికి తిరిగి ఈ పిలగాడు గిట్టవడవట్టే… ఈ ఏటికి అయిపోతే ఆల్ల పీడ వొతది కొడుకా. ఒచ్చేటికయితే మీయప్ప పట్నం నుండొస్తడు అప్పు తీరుస్తడు. ఇంక శానదినాలు లేదు ఏరొంక ఎట్లా అయిపాయె మంటెడ్ల ఆమా సొంకలయితె యాడదైతది. ఉన్న నాలుగు నాగాలు పటేలుకు ముట్టజెప్తె యాడది నిండె… అనుకుంట అమ్మ అన్నపెయ్యంత జవురుకుంట ఓదార్పు మాటలు జెప్పింది.
ఈ మాటలు జెప్పుతున్నది మైమ్మ గాని ఆమెకే నమ్మిక లేదు. మైయప్ప పట్నం కెళ్ళి సంపాదించుకొస్తడు, అప్పు తీరుస్తడు అని అన్న కోసం జెపుతున్నది. ఇంతలో సంగవ్వ పొయ్యి అంటిపెట్టింది. అందరం పొయ్యి సుట్టు జేరి కాపుకుంటున్నం. తెచ్చిన రొట్టె నాకింత సిన్నోనికింతిచ్చి మిగిలిందాన్ని అన్న తిన్నడు. అన్నపాలు పెసురుకాయలో గూడ పాలుగూడినం. అన్న మెల్లిగా అమ్మా మైప్ప పట్నంకెల్లెప్పుడొస్తడే అనడిగిండు.
ఏమో కొడుకు ఇంతవరకు రాకపాయె ఏడున్నాడో? ఏం జేస్తున్నాడో పత్త తెల్వకపాయె. మూడేండ్లు దాటినా జాడలేదు అని మా యమ్మ ఒకటే యెలవోస్తుంది.
ఆ రోజు జిన జిన వాన పడుతున్నది. అయినా మా యమ్మ వాకిలూడ్చి పెండకను తీసి కసువు గంప నెత్తుకొని తలాకిలి దాటుతుందో లేదో మాయప్ప యెదురొచ్చిండ్రు. మాయమ్మ గట్టిగా మీ యప్ప వచ్చిండ్రో యని అంటుండగనే మేమంతా దిగ్గున లేచి కూర్చున్నాము. మా చిన్నోడు మా యప్పను పట్టుకొని యేడ్చుడే మొదలుపెట్టిండు. మా యన్న, నేను దగ్గర బోయి సంతోషంతో మా యప్పని కిందికెల్లి మీది వరకు చూస్తున్నము. మా సంగవ్వ లోపలికెళ్ళి చెంబుల నీళ్ళతో యేడ్చుకుంటూనే వచ్చింది. ఆ నీళ్ళు తీసుకొని మా యప్ప పక్కకు పెట్టుకొని అరుగుల కూసున్నడు. నెత్తి మీది కసువు గంప కిందపెట్టి మాయవ్వ ఓ పక్క, మా అవ్వ ఓ పక్క కింద కూర్చున్నారు. కూర్చున్నారో లేదో ఇగ మా సంగవ్వ మొదలెట్టింది. ఇన్నిదినాలాయె కొడుకా… యాడుంటివీ, ఏం దింటివీ ఏం పని జేస్తవీ అంతా నల్లకట్టబడ్డవ్ బిడ్డా, మనిషివంతా గుంజుకపోయి సగమయినవ్.
నీ పెండ్లం, పిల్లలూ పిట్టలోలె ఎదురుజూస్తుమిరా అని ఎత్వానం మొదలెట్టింది మా సంగవ్వ. మల్ల అవ్వనే ఏమనుకున్నదో ఏమో లేవు కొడుకో కాళ్ళు గడుక్కో బుక్కెడు దూపతాగి మాట్లాడుకుందాం అన్నది. ఆ రోజు ఇత్నాలకు పోసి పెట్టిన తెల్ల జొన్నలు మా యమ్మ గిర్నికి పట్టుకొచ్చి దన్న దన్న జెర్రసేపట్లో ఉడుకుడుకు రొట్టెలు జేసింది. మా యప్ప కడుపునిండా తిన్నంక ఇట్ల తినక ఎన్ని దినాలయిందో గీ పొద్దు తింటిరా అని మా యప్ప బేవు తీసిండు. ఇన్ని దినాలు పట్నంల ఆగం బతుకు బతికినా అని సెప్పుడు సురువు జేసిండు. పట్నంల ఒక్క తీరు పని దొరకలేదంట. ఉప్పరి పని జేసిండు. తోడెం దినాలు అడ్డ మీద ఉన్నాడట. బుట్టి పట్టుకొని బఠాణీలు అమ్మిండంట. యెంట గట్కపోయిన పైసలతో ఉప్పరి పని కోసం పార, సల్కెపారం కొన్నాడంట. అప్పుడే పట్నంలో యాక్షన్ జరిగిందంట. అడ్డమీదున్న మా యప్పను పోలీసులు తీస్కపోయి జరిమానా వేసిండ్రంట. అప్పుడే పార, సల్కె పార అమ్మి ఆళ్ళకి పైసలు కట్టి బయటపడ్డడంట. పెయ్యి మీదున్న బట్టెలతో పోయి సివికిన బట్టలతో ఇంటికొచ్చిండు. మా యప్పను జూసి మా సంగవ్వ తల్లడిల్లి పోయింది. ఆ సామాను మీద ఆ పట్నం మీద మన్ను బొయ్య పోతే పోయినై మనిషివి తిరిగొచ్చినవ్ సాలు కొడుక. అప్పుంటే తల్లి నల్గురం రెక్కల కష్టం జేసుకొని తీర్సుకుందాం అని మా యవ్వ జబ్బ జర్సి ధైర్యం జెప్తున్నది.
మా యప్ప సిన్నోని నెత్తిల చేతి యేళ్ళు జొర్రిచ్చి కిందికి మీదికి అనుకుంట నేలకేసి జూస్తున్నడు. అంతట్లనే బాగున్నవా బాలప్ప అనుకుంట పక్కకేరి నుండి నింగంపల్లి సాయవ్వ వచ్చింది. సాయవ్వ చేతిలో పెద్ద పెండగంప నడుమ నడుమ చినికి అతుకులేసిన రెండు గోనె సంచులు, మాసిన పచ్చ కుంచి ఉన్నాయి. ఆమె దగ్గర బోబోమని ఆగలు, యాపపండు వాసన గప్పునొచ్చింది. మనున్న మనిషి యెన్నటికయినా కంట్లపడతడంట. మంట్ల పోయిన నాడే కానరాడంట. ఇన్నాళ్ళకొస్తివి బిడ్డా యా రాజ్యం తిరిగొస్తివి నాయిన.
నీ ముగ్గురు పిల్లలను సాదిరి. అత్తకోడళ్ళంటే మీ వోళ్ళే నప్ప. కరువు కాలంలో బతుకు పల్లేరుగాయయ్యింది అనుకుంట పల్కరించింది సాయవ్వ. పట్నమొంకల పోయినక్క అని జెప్పిండు మా యప్ప. యెంటనే సాయవ్వ మా మనిషిని మా దాంట్ల పడితివి. కష్టం జేసుకుని బతికుండి అని చెప్పింది. చెపుకుంటనే మా యమ్మను, సంగవ్వను ఏమమ్మ సర్రున బయట పడుండి, ఈ పొద్దు మీరు ముగ్గురైతిరి గద అన్నది. ఇప్పుడు మా ఇంట్లో పని జేసెటోళ్ళు నలుగురైండ్రు. ఎటు తిరిగి నేను, సిన్నోడు పెడితే తినేటోళ్ళం. మా యక్కదైతే మనువైంది. మా యమ్మ మాకు కటారల జబురు పోసి అందుట్ల ఉప్పోసి గూట్లో పెట్టింది. కుక్కలొచ్చి జబురు తింటే మీరు ఆకలిగుంటరు. పైలం కొడుక. తలుపులు తెరిచిబెట్టి ఆటకు తగులకుండి అనుకుంట అడివికి యెల్లిపోయిండ్రు. ఏరిన యాప పండును అడవిలోనే మడుగుల్ల కడుక్కొని ఒచ్చేటప్పుడు యాపగింజలు కోమటి నారాయణ షావుకారికి అమ్మి దినాం లాగానే రాత్రి గాసం కొనుక్కొచ్చిండ్రు.
కరువు కాలం బర్గాలం ఎమ్మినోడొచ్చినట్లొచ్చింది. ఈ యేడన్నా వానలు పడితే కూలి మంది బతుకుతారు. లేకుంటే ఒర్రి సచ్చే కాలం వచ్చేట్లున్నది అని మైయమ్మ గునుగుక్కుంట తలెముంతలు తోమింది.
ఇన్ని దినాలు పిల్లలకు జబురు పోసి నడిపితిమి. నా కొడుకొచ్చిండు. ఇంట్లంత యాపసేదు నిండిరది. నోరంతా ఎలుగడి పెట్టినట్లున్నది. ఈ పొద్దు తోడెం యాపగింజలు ఎక్కువనే ఏరినం. ఉప్పు, మిరపకాయలు షేరు నూకలు తీస్కొచ్చి, కటికోని దగ్గరకెళ్ళి అద్ద కిలో నంజుడు తెచ్చుకొని వండుకుంటె కాదా అనుకున్నరు మా యమ్మ, మా యవ్వ. అనుకున్నట్లనే అన్ని కొనుక్కొచ్చిండ్రు. నాకు మా సిన్నోనికి మస్తు కుషి గున్నది. ఆ కుషిలో మా సిన్నోడు ఇంత దానికి పక పక నవ్వుతున్నడు. మా కుషిని జూసి మా యమ్మ మొఖం వెలిగిపోతున్నది. ఈ పూట నా పిల్లలకు కడుపునిండ పెట్టుకుంట అన్న నమ్మకం మొఖంలో కనిపిస్తున్నది.
మా సిన్నోడు వొగలు జేసుకుంట మా యమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నడు. అమ్మ నాకు తునక అంటున్నాడు. వాని మాట మీద నంజుడులోని ఎర్రతునకను పొయిలు నిపుకల మీద వేసి మంచిగ కాల్చి ఇద్దరికి ఇచ్చి అన్నకింత దాచిపెట్టింది. మేం గనకలు నములుకుంట బయట మా జతగాళ్ళ దగ్గరికొచ్చి వూరిచ్చికుంట మరీ దిన్నం. ఇంట్ల ఒక పొయ్యి మీద కూర, ఇంకొక పొయ్యి మీద నూకల బువ్వ కుత కుత ఉడుకుతున్నయ్. ఇంట్ల కూర వాసన గుమ్మని వాకిట్ల కొస్తున్నది. బజారుకి పోయిన మా యప్ప ఇంటికొచ్చిండు. మీ యమ్మ కూరొండుతున్నాదిరా… కమ్మగా వాసనొస్తున్నది అనుకుంట అరుగు మీద కూసున్నడు.
ఈ పొద్దు కల్లు తాగుతా తోడెం పైసలియ్యేయని మా యమ్మని అడిగిండు. ఇంకా యాడున్నయ్ ఉప్పు, మిరపకాయ ఇంత నంజుడు తీసుకొచ్చినంక అని చెప్పింది. మల్లి కొద్ది సేపటికి తోడెం పైసలియ్యే అంటే పది మాటలు చెప్తవ్ అని నోరు పెద్దగ జేసి అడిగిండు. ఇదేం అన్యాలం ఇంక నేను ఏడ దాసుకుంటి అన్ని జూసుకుంటనే పైసలడిగితే ఏమన్నట్లు అన్నది. అన్యాలమంటావే మాటలు శానా నేర్చినవ్ అన్ని జూస్తినా, నీవేమేమి చేసినవ్, నాకేమేమి ఎరక అనుకుంట మీది మీదికి పోతున్నడు. మా యమ్మ గమ్మున పొయి కాడ కొరకాసులు పొయిలోకి జరుపుకుంట కూసున్నది. ఏమే నేనేమి చూసినా అంటే చప్పుడు చెయ్యవని ఎంట కెల్లి నడుముల తన్నిండు. నేను సిన్నోడు అమ్మా అని గట్టిగా లొల్లి పెట్టినమ్. మా యప్ప మావైపు ఒక్కసారి ఉరిమి చూసిండు.
ఆ సూపుకి భయపడి గప్పున నోరు మూసుకుని ఒక మూలకి సతికినం. ఇక మా యమ్మను గొడ్డును కొట్టినట్లు కొడుతున్నడు. వాయమ్మో సస్తినే నా పానం తీస్తడనుకుంట మొత్తుకుంటూనే ఉంది. అయినా మా యప్ప కొట్టుడు ఆపకొచ్చిండు. అమ్మను కొడుతుంటే నా పానం పోయినట్లైంది. మా సిన్నోడు గద గద వనుక్కుంటూ లాగులో ఒంటికి పోసుకున్నడు. మాకు దగ్గర పోయే ధైర్యం చాలకొచ్చింది. దగ్గర పోతే మమ్ముల కొడతాడేమోనని భయం పట్టుకుంది. మా యమ్మ జస్తదేమోనని భయం పట్టుకుంది. మా యమ్మ సప్పుడుకు మంచినీళ్ళకు బాయికి నీళ్ళకు పోయే ఆడోళ్ళంతా మా ఆకిట్ల గుమిగూడిరడ్రు. వాళ్ళు మా యప్పను తలా ఒక మాటన్నరు. వాల్ల మాటలకు కొట్టుడాపి బయటకొచ్చిండు. ఇంక మేము మా యమ్మ దగ్గర జేరినం.
మా యమ్మ కదలకుండా పడిపోయింది. మాకు లేపడానికే రావట్లేదు. అంతట్లోనే మా సంగవ్వొచ్చి మా యప్పను తిట్టుడు సురువు జేసింది. నువ్వొచ్చి మూడు దినాలు కాకపాయే కొట్టుడు సురువు జేసినావురా. ఎమినోనిలాగా దాని పానానికి దగిలినవ్. ఎంతని కొడుతవ్ కొట్టి కొట్టి దాని పెయ్యంత తూట్లు వడగొట్టినవ్. షాత కాకుండా జేసినవ్ ఎట్ల పనిజేస్తది అనుకున్నవ్. అంతట్లనే సుట్టాలు వచ్చిండ్రు ఊరుకెల్లి. వాల్లు మా అక్క తొలుచూరు కాన్పయింది దినాలు నిండక ముందే కన్నది అని. ఆమె చేన్ల పెసరుకాయ బర్కవోయి కన్నది. ఆన్నే ఆడోల్లంతా కాన్పు జేసిన్రు. కొడవలితో బొడ్డు గోసిన్రు. పటేలు కాల్లేల్లు పట్టుకొని బండి కట్కపోయి తల్లిని, పిల్లను ఇంటికి జేర్చిన్రు. ఇప్పటికయితే తల్లి పిల్ల మంచిగున్నరు. అర్జంటుగా తల్లిని తీసుకపోతమని వచ్చిండ్రు వాల్లు.
ఇంగ మా సంగవ్వకు చల్ల చమటలు పట్టినయ్. నా పిల్లకు ఇంక రెండు నెల్ల దినముండే కననీకు. ఇప్పుడే ఎట్లయిందప్ప? మా యింటికి తొలుకొచ్చుకుంద మనుకున్నం దేవుడి గిట్ల జేసిండు. జర జెప్పు నాయిన పిల్ల, తల్లి బాగున్నరా అని మల్ల అడిగింది. అప్పుడిగ మా సంగవ్వ మా యప్ప వంక మర్లి ఇప్పుడేం జేస్తవురా దాని నడుములు ఇరగొట్టి పండవెడ్తివి ఇప్పుడు నీ బిడ్డవి మైల బట్టలు ఎవరు ఉతుకుతర్రా? తొలుసూరు కాన్పు తల్లి జేసే తరీక. ఇప్పుడెట్ల జెయ్యమంటవ్ అని నెత్తికి చెయ్యి పెట్టి కూర్చున్నది. ఆ మందిలకెల్లి నింగంపల్లి సాయవ్వొచ్చి యెంతుంటే ఏం లాభం. పిల్లకిప్పుడు తల్లి పెద్దలూకే అన్నరా ఏనుగంత తండ్రి పొయ్యి యేకుల బుట్టంత తల్లి
ఉండాలని అన్నది. జర వాయిలాకు దెచ్చి ఆమె నడుములకు కాపుండమ్మ నొప్పులు మొద్దువారినట్టు అయితాయి. నేనిక వాయిలి చెట్టుకోసం దౌడు తీసిన. (సెప్టెంబర్`అక్టోబర్ 2002లో భూమికలో ప్రచురితమైనది)