ఎక్కడమ్మా నువ్వు లేనిది -పి. ప్రశాంతి

అదో చిన్న ఆదివాసీ గ్రామం. రోడ్డుకి రెండు వైపులా మాత్రమే ఇళ్ళున్నాయి. కొండవైపున్న
ఇళ్ళు రెండు వరసల్లో, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లతో నిండున్నాయి. కొండ దిగువకి ఉన్న ఇళ్ళు ఒక వరసే ఉన్నాయి. ఆ ఇళ్ళ వెనగ్గా కొండల్లో పైనించి వస్తున్న జలాపాతాల్లాంటి నది.

ఎటుచూసినా మామిడి, పనస, కొబ్బరి, పోక, అరటి చెట్లు. అడవంతా టేకు, మద్ది, ఇంకేవో పెద్ద పెద్ద వృక్షాలు. ఇళ్ళ చుట్టూ రకరకాల పూలు, కూరగాయల మొక్కలు, ఆవరణల్లో పోక చెట్లకి పాకుతున్న మిరియాల తీగలు. ఎటు చూసినా ప్రకృతి పచ్చదనం. కొండమీద మాత్రం ఆకులు రాలిన చెట్లు, ఎండిన గడ్డి, ఇంకా చిగుళ్ళెయ్యని అడవి వృక్షాలతో ఎండుకొండలా ఉంది.
ఊరి బయట నదికి, రోడ్డుకి మధ్య ఉన్న భూమి అంతా పామాయిల్‌ తోటలు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. వాటి మధ్య రోడ్డుకి దగ్గరగా రెండు బూరుగ చెట్లు. పగిలిన కాయలు రాలి, దూది కొట్టుకొస్తుంటే కారాపి కిందికి దిగారు శాంతి, దేవి బృందం. పట్టుకుచ్చుల్లా ఉన్న ఆ దూదిని చేతుల్లోకి తీసుకుని ‘ఎన్నాళ్ళయింది బూరుగ దూదిని ఇలా చూసి! వీళ్ళేమో ఇలా వదిలేశారు’ అంది దేవి. కొండవైపు చూస్తూ చెయ్యూపుతున్న శాంతిని చూసి ‘ఎవరు కన్పించారు’ అంది స్నేహ. నలుగురు మహిళలు వీళ్ళనే చూస్తున్నారు. శాంతి గబగబా రోడ్డుదాటి వాళ్ళ దగ్గరికెళ్ళింది. ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ కూర్చున్న ఆ మహిళల్ని ‘నమస్తే’ అంటూ పలకరించింది. భాష సమస్య. చిన్న చిన్న ఇంగ్లీషు పదాలు వాడుతూ మాటల్లో పడిరది. మళయాళంలో చెప్తున్న వారి సమాధానాలను అర్థం చేసుకోవడానికి వారి ఎమోషన్స్‌ తోడ్పడ్డాయి. మాట్లాడుతూ ఉండగా అంత దూరంలో ఇంకో కారు ఆగడం చూసి ఇద్దరు మహిళలు కొంచెం అటుగా కదిలి అటే చూడటం మొదలెట్టారు. అక్కడ ఒకతను సిగరెట్‌ తియ్యడం చూసి ‘చేటన్‌’ అంటూ వడివడిగా అటువైపు వెళ్ళారు.
ముదురాకుపచ్చ సల్వార్‌ కమీజ్‌ మీద ఇంకా ముదురు రంగు షర్టులు వేసుకుని చేతిలో పొడవాటి కర్ర, భుజానికి ఒక సంచీ, కాళ్ళకి బూట్లతో సైనికుల్లా ఉన్న ఈ మహిళలు గ్రామ సైన్యమే. అడవికి నిప్పంటకుండా, చెట్లనెవరూ కొట్టెయ్య కుండా కాపలా కాసే సైన్యం. ఎక్కడంటే అక్కడ పర్యాటకులు ఆగుతుంటారు, ఒక్కోసారి అడవిలోకి కూడా పోతుంటారు కాబట్టి ఈ మహిళలు చిన్న చిన్న బృందాలుగా కాపలా కాస్తుంటారు. ఒక్కొక్క బృందం 5 కి.మీ.ల పొడవు, అడవి లోపలికి 2 కి.మీ.ల దూరం పరిరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఎక్కడున్నా చిన్నగా నిప్పంటుకున్నట్టు కనిపిస్తే వాళ్ళ బ్యాగుల్లో ఉన్న నిప్పు ఆర్పే చిన్న సిలెండర్‌తో స్ప్రే చేయడం ద్వారా ఆర్పగలుగుతారట. అలా సాధ్యం కానంత పెద్ద చిచ్చు అయితే వారి సంకేత భాషలో కూతలు పెట్టడం ద్వారా దగ్గర్లో ఉన్న ఫైర్‌ ఫైటర్‌ బృందానికి సమాచారమిస్తారు. అందరూ కలిసి అడవి తగలబడకుండా ఆపెయ్యగలుగుతారట. వారూ మహిళలే. అబ్బురంగా అనిపించింది.
నది ఒడ్డున ‘హోం స్టే’ అనున్న బిల్డింగ్‌ దగ్గర లో ఇంకో బృందాన్ని కలిశారు శాంతి వాళ్ళు. ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో చక్రాలున్న ‘ఫ్లెక్సిబుల్‌ గార్బేజ్‌ కలెక్షన్‌ బాక్స్‌’, భుజాల వెనగ్గా గోతంలాంటిది వేలాడేసుకుని ఉన్నారు. నలుగురు మహిళలున్న ఒక్కో బృందం నది ఒడ్డున 2 కి.మీ.ల దూరం తిరుగు తుంటారు. ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు, బాటిళ్ళు ఎక్కడ కనబడినా వాటిని తీసేస్తారు. పర్యాటకులు తిని పడేసే చాక్లెట్‌ రేపర్‌తో మొదలెట్టి మట్టిలో కలిసిపోని ఎటువంటి వ్యర్థం కనబడినా ఈ బృందం ఏరేస్తుంది. తర్వాత వాటిని వేటికవి విడదీసి ఉంచుతారు. ‘వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ టీం వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మహిళలే. వీరంతా పర్యావరణ పరిరక్షణ సైన్యం. గ్రామ పంచాయతీ నుండి నియ మించబడ్డారు. నెల వారి జీతం మీద పనిచేస్తారు. ఉద్యోగంగా కాక ప్రకృతి పట్లా, పర్యావరణం పట్ల బాధ్యతగా భావిస్తారు కనుక వీరిపైన సూపర్‌విజన్‌ కూడా అవసరం లేదు.
యాభై ఇళ్ళున్న ఈ ఆదివాసీ గ్రామానికి కుల పెద్ద యాభై ఏళ్ళు నిండిన ఓ మహిళ. అందరితో కలిసిపోయి వినమ్రంగా ఉన్న ఆ మహిళ మాటకి ఎవరూ ఎదురు చెప్పరు. ఏదైనా నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించరు. పదో తరగతి వరకు చదువుకున్న ఆ మహిళ అంటే ఆ ఊరివారందరికీ ప్రేమతో కూడిన గౌరవం. ఆమె ప్రోత్సాహంతో ఆ గ్రామం నుంచి యూనివర్సిటీల్లో చదువుకుం టున్న అమ్మాయిలు నలుగురు ఉన్నారు. ఇంకో ఇద్దరు పీజీ పూర్తిచేసి రీసెర్చ్‌ అసోసియేట్‌లుగా ఉన్నారు. శాంతి వాళ్ళతో మాట్లాడ్డానికి వచ్చిన మమత టాటా ట్రస్ట్‌ ఫెలో. ఆదివాసీ సంస్కృతిపైన డాక్యుమెంటేషన్‌కు గాను ఫెలోషిప్‌ అందుకుంటూ తమ జాతి మూలాల్ని, సంస్కృతీ సంప్రదాయాల్ని డాక్యుమెంట్‌ చేస్తోంది.
గ్రామంలోని యువతులంతా ఏదో ఒక ఆర్థిక కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. ఉపాధి హామీ పనులప్పుడు కొందరు ఆ పనికి వెళ్తారు. పెద్ద వయసు మహిళలు ఇళ్ళల్లో ఉండి, ఇంటి పని, తోట పని చేసుకుంటున్నారు, మహిళా సంఘా ల్లో క్రియాశీలకంగానూ ఉన్నారు. గ్రామాభివృద్ధి కమిటీల్లోను, గ్రామ పంచాయతీ సభ్యులుగానూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారు. ఇందు గలరందు లేరని చెప్పడానికి లేకుండా అన్నింటా ముందున్నారీ ఆదివాసీ గ్రామ మహిళలు. మరి మగవారేమి చేస్తున్నారు, వారంతా ఎక్కడున్నారని అడిగితే ఒకరకమైన అసౌకర్యం, నిశ్శబ్దం. ఒక చిన్న నిస్పృహ. మాట్లాడకుండానే అర్థమవుతున్న వారి బాధ…
యువకులంతా పై చదువులకో, ఉద్యోగాలకో గ్రామం వదిలి వెళ్ళిపోయారు. మధ్యవయస్కులు కొందరు డబ్బు ప్రలోభంలో పడి గల్ఫ్‌కి వెళ్ళి అమాయకంగా ఇరుక్కుపోయారట. ఇక్కడున్న వారిలో చాలామంది తాగుడుకి అలవాటుపడి ఏ పనీ చేయట్లేదు. ఈ మధ్య కాలంలోనే నలుగురు తాగుడుతో చచ్చిపోయారట. కొద్దిమంది మాత్రం, వయసు మీద పడుతున్న వారు కూడా వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. కొందరు పురుషులు వెదురు వస్తువులు తయారు చేస్తుంటే ఇంకొందరు అడవికెళ్ళి అటవీ ఉత్పత్తుల్ని సేకరించి తెచ్చి పట్నంలో మార్కెట్‌కి అమ్మకానికి తీసు
కెళ్తున్నారు. కానీ అమ్మగా వచ్చిన ఆదాయం ఇంటికి వస్తుందన్న నమ్మకం లేదు. మార్కెట్‌కి వెళ్ళిన మగవారు తాగి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా తిరిగొస్తే చాలనుకుం టున్నారు ఆ మహిళలు.
ఎక్కడా ఆదరాబాదరా పడకుండా ప్రశాం తంగా ఉన్న ఆ మహిళల్లో ఎవ్వరూ గట్టిగా నవ్వడం కాదు కదా, ముఖమంతా వికసించేలా నవ్వడం కూడా కనబడలా. అదే విషయం ప్రస్తావిస్తూ ‘మీరంతా సంతోషంగా ఉన్నారా’ ఆగలేక అడిగే సింది స్నేహ. అదే నిశ్చలమైన చిరునవ్వుతో ఒకర్నొకరు చూసుకుని అవునని సమాధానం చెప్పారు. మరి మీ నవ్వులేమైనాయని దేవి అడిగితే నిశ్శబ్దమే సమాధానం. సీమ అందుకుని ‘కేరళ మహిళలం అవసరానికి మించిన అంతర్‌ శాంతిని కొనితెచ్చుకున్నాం. అందుకే దేనికీ చలించం’ అంది. ‘మీ గలగలలన్నీ ఆ జలపాతాలు తీసేసు కున్నట్లున్నాయి’ అంది స్నేహ. ‘ఆఁ… ఆ పక్కనున్న కొండలు వాటి గంభీరాన్ని కొంత మాకిచ్చేశాయి’ అని చిన్నగా నవ్వింది మమత.
ఇటు నది ఒడ్డున, అటు కొండ గట్టున కన్పించిన పచ్చ సైన్యాన్ని, తమ ముందు కూర్చుని తమ జీవితాలని విప్పి చెప్తున్న ఆ ధీర మహిళల్ని చూస్తూ శాంతి పాటందుకుంది… ‘ఎక్కడమ్మా నీవు లేనిది… ఏమిటీ నువ్వు చేయలేనిది… ఏమిటీ నువ్వు చేయలేనిది…’

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.