‘‘నన్ను నేనే చెక్కుకోబడిన శిల్పాన్ని.
కాలం విసిరిన ప్రతి సమస్య నా దారికి బాట అయినది కాలం గొప్పది’’
ఆ ఆత్మవిశ్వాసపు స్వరం ఎవరిది?
‘‘సమాజంలో ఆడవాళ్ళ మీద ఎంత వివక్ష
ఉందో అంతే వివక్ష జంతువుల మీద ఉంది’’ అపసవ్యంగా సాగుతున్న సమాజాన్ని పరిశీలిస్తున్న’’ ఆ సునిశిత చూపు ఎవరిది?
‘‘దేహానికి చేసే గాయాలు అందరికీ కనపడతాయి. కానీ మనసుకు చేసే గాయాలు కనపడవు, వినపడవు’’ అంతరంగంలో అలలు అలలుగా ఎగిసే ఆలోచనల ముడులు విప్పు తున్నదెవరు? ‘‘వారసత్వంగా ఆస్తులను, డబ్బును పంచుకుంటున్నారు కానీ, తర తరాలుగా మన తాత ముత్తాతలు, అమ్మమ్మల పని, పని నైపుణ్యాన్ని మాత్రం వదిలేస్తున్నాం’’ అంటూ అనుభవాల ఆస్తిని పోగేస్తున్నదెవరు?
ఆ అరుదైన వ్యక్తిత్వం పుస్తకాలు ఔపోసన పట్టిన మెదళ్ళది కాదు. మట్టిని నమ్ముకుని బతుకుతున్న ఓ మట్టి మనిషిది. అవును, ఇది నిజం. ఆ మనిషి పుస్తకం పట్టి చదివింది ఐదవ తరగరతి మాత్రమే. కానీ విచక్షణ, వివేచన అపారం. డిగ్రీల చదువు ఇచ్చింది, ఇచ్చేది ఆ జ్ఞానం ముందు దిగదుడుపే. తన చుట్టూ జీవితాల్ని చదువుతూ, నిశితంగా పరిశీలిస్తూ, లోతుగా ఆలోచిస్తున్న ఆ మనిషిది అరుదైన వ్యక్తిత్వం. జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారం గా, పరిస్థితులకు తగినట్లుగా తనను తాను మార్చుకుంటూ రూపుదిద్దుకున్న చైతన్యం…
మనిషిగా పుట్టాక ఏ సమస్య లేకుండా జీవితం సాగదు, కానీ వాటికి భయపడి అక్కడే ఆగిపోయేవాళ్ళు కొందరైతే సమస్యలకు, శ్రమకు తలొగ్గక కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు మరికొందరు. కుటుంబాన్ని పోషించుకోవడమే కాదు జీవితాన్ని పండిరచుకోవడానికి బాటలు వేసుకునే వారు ఇంకొందరు. మూడో కోవలోకి చెందినది ఈ మట్టిలో మాణిక్యం.
ఎప్పటికప్పుడు మార్పును స్వీకరిస్తూ ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆ ఆత్మగౌరవ పతాక పేరు విజయ. ఆమె ఫేస్‌బుక్ గోడపై విజయరైతు అని ఉంటుంది.
అవును, మీరు విన్నది నిజమే. విజయ ఒక రైతు, మహిళా రైతుకు ప్రతీక. సేంద్రీయ వ్యవసాయం చేస్తుంది. ఒకసారి ఫేస్‌బుక్‌లో ఆమె అకౌంట్‌కి వెళ్ళి చూడండి. సెలబ్రిటీ పోస్టులకు ఉన్నంత ఫాలోయింగ్.
5000కు చేరువలో ఆమె ఫ్రెండ్స్ లిస్ట్. ‘‘నేను మీకు తెలుసా… నేనేంటో మీకు తెలుసా?’’ అని ఆశ్చర్యపోతుంది. ఒక సాధారణ మహిళకి, అందునా ఒక మారుమూల పల్లెలో ఉన్న విజయకి ఎందుకింత ఫాలోయింగ్…? అని ఆమెకు ఆశ్చర్యం. ఎవరో ఎందుకు నేను కూడా ఆమె పోస్టులు ఫాలో అవుతాను. కారణం తనను తాను చెక్కుకుంటున్న, వ్యక్తీకరించుకుంటున్న ఆ పోస్టులు నన్ను ఆకర్షించడమే.
‘‘మన కల్చర్ అంటే నేచర్ మాత్రమే’’… అనే ఆమె పోస్టులలో స్పష్టత, వివరణ మనసుకు హత్తుకుంటాయి, ఆలోచింప చేస్తాయి, ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ఆమె మదిలో చెలరేగే ఆలోచనల పరంపరను ఫేస్‌బుక్ వేదికగా వెల్లడిస్తుంది. అందరికీ ఏమో గానీ ఆమె భావ వ్యక్తీకరణకు ఫేస్ బుక్ ఒక అవుట్ లెట్.
మనసుకు తోచింది చేస్తుంది. తన పనిని తాను గౌరవిస్తుంది. తను తనలాగే ఉంటుంది. ఎవరి కోసమో మారదు. అది ఆమె మూర్తి మత్వం. రైతు కుటుంబంలోనే పుట్టి రైతు భార్యగా మెట్టినింటికి వెళ్ళిన విజయకి వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఆ ప్రాంతపు చాలామందిలాగే తనకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. ఆమె అవ్వ, అమ్మమ్మ, అమ్మ అందరూ రైతులే. వారి జీవితాల నుండి నేర్చుకున్నది ఈ రోజు నా జీవితానికి, నా వ్యక్తిత్వా నికి బలమైన పునాదులైనాయని అంటుంది విజయ.
మిరప రైతుగా పురుగు మందుల వల్ల జరుగుతున్న అనర్థాలను స్వయంగా అనుభవిం చింది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న విజయని ఒక పుస్తకం ఆకర్షించింది. అది రాజీవ్ దీక్షిత్ గారి పుస్తకం. వ్యవసాయంలో వాడే విషరసాయనాల వల్ల జరుగుతున్న ఆహార కల్తీ గురించి, అది తెచ్చే సమస్యల గురించి ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంది. సేంద్రీయ వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకతని గుర్తిం చింది. ఇప్పటివరకు విషరసాయనాలతో చచ్చి పోతున్న తన భూమిని రక్షించాలని తలచింది.
అదే సమయంలో పాలేకర్ వ్యవసాయ విధానా నికి ఆకర్షితురాలైంది. సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టింది. సేంద్రీయ వ్యవసాయంలో మొదటి సంవత్సరాల్లో దిగుబడి తక్కువ వస్తుంది. అందుకు ఆమె దిగులు పడలేదు. చేతికందిన పంటను శుద్ధి చేసి ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా విలువ జోడిరపు చేసి తక్కువ దిగుబడులు వచ్చిన ప్పటికీ మేలైన ఆదాయం పొందుతోంది. ఆమె రెండెకరాల చేనులో పండిన మిరప పంట 8 క్వింటాళ్ళు. దాన్ని కిలో 150కి అమ్మితే లక్షా ఇరవై వేలు వచ్చేది. ఇలా కాకుండా కారంగా మార్చి కిలో 350 రూపాయల చొప్పున అమ్మింది. రూ.2,24,000 ఆదాయం పొందింది. తక్కువ పంట దిగుబడి అయితేనేం… కారంతో వివిధ రకాల ఉత్పత్తులు చేసింది. వివిధ రకాల కారపు పొడులు, పచ్చళ్ళు, కారం, నాణ్యమైన ఆహార
ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ఇది సాధిం చింది.. ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా తన
ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వినియోగ దారులు కూడా రంగు, రుచి బాగున్నాయంటూ ఆమె ఉత్పత్తుల పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుని ఆరోగ్యమే నా సంతృప్తి, నా విజయం అంటుంది విజయ.
అసంకల్పితంగా కొత్త గమ్యంలోకి అడుగు పెట్టిన విజయ కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. చాలా ఇష్టంగా, బాధ్యతగా చేస్తోంది. ‘‘చేసే పని ఇష్టంతో చేస్తే వెయ్యిసార్లు ఓటమి పాలైనా తెలియని విషయాలు తెలుసు కుంటూ ధైర్యం, సహనం, పట్టుదలతో ఎన్నో అనుభవాలను ఒంటపట్టించుకుని ఏదో ఒకరోజు పూర్తిస్థాయిలో గెలుపు చేత పట్టు కోగలం అనే సంకల్ప బలం అదే వచ్చేస్తుందని’’ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది విజయ.
సరదాగా నేర్చుకున్న టీవీఎస్ నడపడం ఈ రోజు ఒకరిపై ఆధారపడకుండా, ఎదురు చూడకుండా తన పని చేసుకుపోవడానికి బాగా ఉపయోగపడుతోంది. కుటుంబం ఆమెకు అండా దండా అవుతోంది.
‘‘అన్ని మత్తులలోకి భక్తి అనేది ఒక మత్తు’’, ‘‘ఒక్క ఆవు పేడకు, ఆవు మూత్రంకు ఎందుకు విలువ… మిగతా వాటిలో అసలు విలువలు
ఉన్నాయో లేవో టెస్ట్ చేశారా…’’ అని ఒక పోస్టులో విజయ అనగలిగింది అంటే ఆమె సామాజిక స్పృహ, దృక్పథం అంటే ఏంటో తెలుస్తుంది.
న్యాయబద్ధంగా కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతున్న విజయ మహిళా సాధికారతకు నిర్వచనం.
‘‘మాక్కూడా కాలుమీద కాలేసుకుని
ఏమోయ్ కాస్త టీ తీసుకురా
ఏమోయ్ అన్నం పెట్టు
ఏమోయ్ అది చెయ్
ఏమోయ్ ఇది చెయ్
అనాలనుంది. ఇలా అడగాలనుంది
ఈ వేళ మహిళా దినోత్సవం అట కదా…’’
‘‘ఏ జీవి పిల్లలను కనడానికి జెండర్ ఎంచుకుని కనవు. కన్నాక ఆడదాన్ని ఒకలాగా, మగాడ్ని ఒకలాగా పెంచవు’’ అనే ఆమెలో ఓ స్త్రీ వాది దర్శనమిస్తుంది.
తనకు తాను ఓ ముడిపదార్ధంగా చెప్పుకునే విజయ ఇప్పుడు రాసే ఎంతోమంది రచయితల కంటే మేలైన రచనలు చేయగలదని నా నమ్మకం. ఆమె గమనంలో ముళ్ళు, రాళ్ళు రప్పలు ఎన్ని ఎదురైనా వాటిని ఏరిపారేస్తూ ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందని ఆశిద్దాం. విజేతగా విజయ నిలవాలని కోరుకుందాం.