‘నవల’ పందొమ్మిదవ శతాబ్ది చివరి నుండి ప్రారంభమైంది. కొందరు తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్ర’ అని, ‘శ్రీరంగచరిత’మని పరిశోధకులు వ్రాశారు. ‘చింతామణి’ పత్రిక నవలను బాగా ప్రోత్సహించి, నవలా పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ప్రారంభంలో ఎక్కువ నవలలు సంఘ సంస్కరణల ప్రాముఖ్యంతో కనిపిస్తాయి.
ఆంగ్లంలో ఉన్న ‘నావెల్’ అనే పదం ఆధారంగా తెలుగులో ‘నవల’ అనే పేరు వచ్చింది. నాణ్యమైన విషయాలు తెలుపునదని, నవలకు ‘నవల’ అనే పేరు పెట్టింది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. నవల అంటే స్త్రీ అని అర్థం. నవల మానవ జీవితాన్ని సమగ్రంగా చూపుతుంది.
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తికైనా తేలికగా గుర్తించడానికి వేదకాలంలో ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహం చేసుకుంటూ జీవనం కొనసాగించారు. కుల వ్యవస్థ ఆసియా (భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్) మరియు ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది.
భారతదేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడ్డాయి. మన దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. పూర్వం కొందరు ఆర్యులు ‘వాత్సాయన’ ఋషి కాలంలో శూద్ర స్త్రీలను కామకోరికలకు బానిసలుగా మార్చుకొని బలాత్కారం చేయడం వలన వారి సంతానంతో నేడు అనేక మిశ్రమ జాతులు ఏర్పడ్డాయి.
భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారికంటే ఎక్కువ, తక్కువ అనే భావం ఉండడం వలన అంటరానితనం ఏర్పడిరది.
భారతదేశ చరిత్రలో జోగిని, దేవదాసి వ్యవస్థ నేపథ్యం వివిధ కోణాల్లో, దశల్లో వైష్ణవ సాంప్రదాయం కనపడుతుంది. కాళిదాసు కీర్తనలో మాతంగి అంటే ‘దళిత స్త్రీ’ అని అర్థం. ఆమె రూపాన్ని సరస్వతీ దేవిగా అభివర్ణించారు. క్రీ.శ. మూడవ శతాబ్దానికి చెందిన ‘జోగి’ మరణశాసనం ‘జోగిని’ వ్యవస్థను గురించి వివరిస్తుంది.
దేవాలయాల్లో పరిచారకులుగా ఉండేవారిని ‘దేవదాసి’ అని పిలిచేవారు. ఈ వ్యవస్థ భారతదేశమంతటా ఉందని ‘హ్యూయాన్ త్సాంగ్’ పేర్కొన్నారు. కాళిదాసు తన ‘మేఘదూత’ కావ్యంలో ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో బాలికలను చిన్నవయసులోనే దేవుళ్ళకు సమర్పించే సంప్రదాయం ఉండేదని పేర్కొన్నారు. క్రీ.శ. పదవ శతాబ్దంలో ట్రావెన్ కోర్, తంజావూరు సంస్థానాల్లో 400కి పైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం వీరిదేనని తెలిపారు.
తెలంగాణలో ‘జోగిని, దేవదాసి’ వ్యవస్థలు నేటికీ కనబడుతున్నాయి. శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజుల కాలంలో కూడా ఈ వ్యవస్థ ఉందని చరిత్ర తెలుపుతోంది.
తరతరాల దురాచారంపై సమగ్రంగా రచించిన నవల ‘‘జోగిని’’. రచయిత్రి శాంతిప్రబోధ ఈ నవలను 2004లో ప్రచురించారు, 2010లో పునర్ముద్రించారు.
నవలా నేపథ్యం:
ఈ నవల పద్మావతి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు స్నేహితులు కవిత, విద్యల స్నేహంతో మొదలైంది. ‘కవిత’ పుట్టింది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి దగ్గర్లోని లింగంపేటలో. ‘విద్య’ పుట్టింది విజయవాడలో.
చదువంటే ఇష్టమున్న కవిత ఎం.సి.ఎ.లో ఉస్మానియాలో కాకుండా తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడ కవిత రూమ్మేట్ విద్య. వారి స్నేహం విడదీయరానిదైంది.
విద్య తల్లిదండ్రులిద్దరూ విజయవాడ పట్టణంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విద్య ‘ఉమెన్ డెవలప్‌మెంట్’ స్టడీస్’లో పరీక్షలు రాసింది. ప్రాంతాలు వేరైనా, చదివే కోర్సులు వేరైనా ఇద్దరిలో స్నేహం చిగురించింది. విద్య పరీక్షలు అయిపోయాయి. కవిత చదువు ఇంకో సంవత్సరం ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామోనని విద్యని తమ ఇంటికి రమ్మంటుంది కవిత. తిరుపతి నుండి వస్తూ విజయవాడలోని విద్య వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులుండి కవిత ఇంటికి ’సిరిపురం’ వెళ్తారు ఇద్దరూ.
ఆ రోజు తెలతెలవారుతుంటే వినిపించిన డప్పు చప్పుళ్ళకు మేల్కొన్న విద్య శబ్దం వస్తున్న వైపు వెళ్తుంది. దాదాపు ఊరంతా అక్కడే ఉన్నట్లు కనిపించింది. దివిటీలతో, డప్పుచప్పుళ్ళతో జుట్టు విరబోసుకున్న వ్యక్తుల చేతులలో కొరడాలు, మొహాన పెద్ద కుంకుంబొట్టు, కాళ్ళకు పారాణి గజ్జెలతో ఎగురుతూ, చిందులు వేస్తూ మేకను నోటితోనే కొరకడంతో చిమ్మిన రక్తంతో జనంలో కేరింతలు చూసి ఎంత ఆటవిక మనుషులు అనుకుంటుంది విద్య. అది ఊరి పండగ అని తెలుసుకుంటుంది.
తెలంగాణలో యాదవులు ‘బీరన్న’ దేవుని కొలుస్తారు. బోనాలతో, డప్పుచప్పుళ్ళతో, జగ్గు ఊపుతుంటే శివసత్తులు పూనకాలతో, మగవాళ్ళు గజ్జెల లాగులతో, కాళ్ళకు గజ్జెలతో ఎగురుతూ మేకను గావుపట్టి ఆ రక్తాన్ని అన్నంలో కలిపి ‘బలి’ అంటూ ఇళ్ళపై, పొలాలపై జల్లుతారు.
‘‘గ్రామ దేవతలను కొలిచే ఆచారం అంతటా ఉంది. ఇవి ఎక్కువగా తక్కువ కులాల వారు చేస్తారు’’ అన్నాడు రాజగౌెడ్, విద్యతో. జోగిని గురించి అడిగిన విద్యతో ‘‘జోగిని’’ అంటే దేవత భార్య, నిత్య సుమంగళి అని చెప్తాడు. జోగినులను కలవడానికి వెళ్తానన్న విద్యతో వచ్చిన తర్వాత స్నానం చేయమంటుంది కవిత వాళ్ళ అమ్మ రాంబాయి.
అవిద్య, అనాగరికత, తాగుడు, వెట్టిచాకిరీ మొదలైనవన్నీ ఎక్కువగా మాల, మాదిగ కులాల్లో ఎక్కువగా ఉన్నాయని తెలుసుకుంటుంది విద్య. ఆ కాలనీలో ఒకవైపు మాల ఇళ్ళు, మరొక మాదిగ
ఇళ్ళు ఉన్నాయి. ఎక్కువ పాకలే. కొన్ని ఇళ్ళు గూన పెంకులవి. వాటిని ఇందిరాగాంధీ హయాంలో కట్టించారని చెబుతాడు సాయన్న.
ఇందిరా ప్రియదర్శిని (నవంబర్ 19, 1917` అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖా మంత్రిగా పనిచేసింది. శాస్త్రిగారు మరణం తర్వాత గుల్జారినంద్ తాత్కాలిక ప్రధాని కాగా, 1944 జనవరి 24న మొదటిసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించింది ఇందిరాగాంధీ. 20 సూత్రాల పథకంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపింది. అలా కట్టిన ఇళ్ళల్లో కొందరివే ఇవి. ఆ కాలనీలో శుచి, శుభ్రత, అవిద్య రాజ్యమేలుతోంది.
‘జోగిని అంటే నిత్య సుమంగళి. ఆమెకు వైధవ్యం లేదు. చిన్నప్పుడే దేవతతో పెళ్ళి చేస్తారు. ఆమె ఊరు విడిచిపోరాదు. వేరే పెళ్ళి చేసుకోకూడదు. ఆమె ఊరందరికీ భార్య. వారి పిల్లలకు తండ్రి
ఉండడు. పండగలప్పుడు అడుక్కుంటూ, శవాలముందు ఆడుకుంటూ జీవించాలని’ చెబుతుంది సాయవ్వ విద్యతో. జోగినిగా ఉండడం వతనని, తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయమని, తన బిడ్డ, మనవరాలు కూడా జోగినులేనని, తమ కులంలో తమ వంశానికి మాత్రమే ఉందని, తమకు నాలుగు ఊర్లు
ఉన్నాయని గర్వంగా చెబుతుంది సాయవ్వ.
రమణీయమైన ప్రకృతి, దాంతోపాటు రాజకీయ వర్గ విభేదాలు, కులాల కుమ్ములాటలు ఎంత ఎక్కువగా ఉంటాయో రాయలసీమ పల్లెల్లో చూసింది విద్య. అలాగే తరతరాలుగా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణా పల్లెల్లో సామాజిక వివక్ష, కుల వివక్ష, పెత్తందారీ తనం, ఆచారం, సాంప్రదాయం ముసుగులో జరుగుతున్న అణచివేత, లైంగిక దోపిడీని గురించి తెలుసుకుంది. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ విభేదాలు, కులం పేరుతో అణచివేత, జెండర్ సమస్యలు, చుండూరు, కారంచేడు సంఘటనలు… ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య గురించి ఆలోచిస్తుంది విద్య.
నవలాంశం:
జీవితపు చివరి మజిలీలో ఉన్న ‘జోగుపోసాని’, సాయవ్వకు నాయనమ్మ. ఆమెకు ఆరు సంవత్సరాల వయస్సప్పుడే జోగినిగా మార్చారు. ఆ ఆచారాన్ని కాదంటే ఆ కుటుంబానికే కాక ఊరందరికీ అపచారం జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఆమెకు ఆరుగురు కొడుకులు, ఒక కూతురు. వారికి తండ్రి ఉండడు. తండ్రి ఎవరో తెలియదు. తండ్రయినా, తల్లయినా ఆమే.
పోసాని తండ్రి ఎల్లయ్యకు పిల్లలు పుట్టి చనిపోతుంటే అతని అత్త లస్మవ్వ పుట్టి బతికిన మొదటి బిడ్డను దేవతకు అంకితం చేస్తానని మొక్కుకొమ్మంటుంది. అలా పుట్టిన మొదటి బిడ్డ పీరవ్వను జోగినిగా మార్చారు. కానీ ఆమె మూగ, చెవిటి. రెండో అమ్మాయి పోసాని. ఆమెకు ఆరవ ఏట మశూచి సోకింది. అప్పటికే ఊర్లో పదిమంది వరకు చనిపోయారు. ఎల్లయ్య చేతిలో డబ్బులు లేక ఊర్లో ఊరి పెద్దలు లేకపోవడంతో భోజాగౌడ్ విషయం తెలుసుకుని 50 రూపాయలు ఇస్తూ పిల్ల బాగుందని, అమ్మోరు ఈ పిల్లని ఇవ్వమంటే నువ్వు ఎడ్డిదాన్నిచ్చావు కనుకే ఊర్లో ఇన్ని అనర్థాలన్నాడు, పిల్లకు బండారు పెట్టమంటాడు భోజా గౌడ్.
ఎల్లయ్యతో అతనింటిలోనే పని చేయించుకునేవాడు. తల్లిదండ్రులతోపాటు పోసాని కూడా పనికి వెళ్ళేది. అతని చూపంతా ఆమెమీదే ఉండేది. ఊర్లో ఏ కష్టమొచ్చినా నీ బిడ్డను దేవుడికి జోగివ్వలేదనేవాడు. ఊరి వాళ్ళ మాటలతో తొమ్మిదేళ్ళ పోసానిని జోగినిని చేశారు. ఆమె భోజాగౌడ్ నీడలోనే పధ్నాలుగవ ఏట తల్లయింది. అలా ఎందరెందరో చేతులు మారి ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
చనిపోగా మిగిలినవారు నలుగురు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు ఎవరి దారిన
వాళ్ళు వెళ్ళిపోయారు. పోసాని కూతురు ముత్తెవ్వ కూడా భోజాగౌడ్ సొంతమై చేతులు మారి నలిగిపోయింది. ఆమెకు పిల్లల్లేరు.
ఇంతటితో ఆచారం అంతం కాకూడదని పోసాని మూడో కూతురు సాయవ్వను అందరూ కలిసి జోగినిని చేశారు. భోజాగౌడ్ కొడుకు రాజా గౌడ్ కవిత తండ్రి. అతనికి సాయవ్వ అంకితమైంది.
అప్పుడప్పుడూ ముత్తమ్మకు దేవుడు వచ్చేవాడు. అలా ఆమె కావాలనే కోరికలన్నీ ఊర్లోవాళ్ళు ఇచ్చేవారు.
విద్యా! మా అమ్మకు కూడా నా చిన్నప్పుడు దేవుడు వచ్చేది అంది కవిత. అదేంటని అడిగిన విద్యకు సమాధానం చెబుతూ ‘మీ అంకుల్‌కు లేని చెడు అలవాటు లేదు. నన్ను కూడా అవమానించేవాడు. రోజూ జోగు సాయవ్వ దగ్గరికి పోయొటోడు. తర్వాత జోగు పోశవ్వని చెరబట్టిండు. నిజానికి పోశవ్వ ఈయన బిడ్డే అంటారు ఊరంతా. ఏడాదిలోపే దానికొక బిడ్డ. ఇవన్నీ ఆలోచించే నా మీదకు పార్వతమ్మ వచ్చింది. తర్వాత హాస్పిటల్‌లో డాక్టర్ ఏం చెప్పాడో కానీ అప్పటినుండి, నా బాధలు పోయాయి. మళ్ళీ నాకు దేవుడు రాలేదు’ అని చెప్పింది రాంబాయి.
వయసులో ఉన్నన్ని రోజులూ వాడుకుని పారేసిండ్లు, ఇప్పుడు ఎలా బతకాలో తెలియక, పనిచేయలేక బాధపడినప్పుడు ఇలా దేవుడొస్తాడు అని చెప్పింది ముత్తవ్వ.
జోగినికి పట్టం కట్టాలంటే పెళ్ళికి కావల్సినవన్నీ తేవాలి. కులపెద్దలు జోగినిలను, చుట్టాలను పిలుస్తారు. పోతరాజు మేకతో గుడిచుట్టూ తిరిగి పూజ సామాన్లను, అమ్మాయిని దేవత ముందు కూర్చోబెట్టి, దేవతకు స్నానం చేయించి, దేవతను, అమ్మాయిని పెళ్ళికూతుర్లుగా అలంకరించి, దేవుని పక్కన కూర్చోబెట్టి పోతరాజు ఏవో మంత్రాలు చదువుతుంటే, ఊరి పెద్ద ఆమె మెడలో పుస్తె కడతాడు. పెద్దగౌడ్ కట్టకుంటే పోతరాజు కడతాడు. మేకపోతు జడితివ్వగనే తలను కోసి రక్తం కిందపడకుండా గుడిముందు గొయ్యి తవ్వి అందులో రక్తం పోసి పూడుస్తారు. ఆ రాత్రి తిని, తాగిన తరువాత జోగినికి తెల్ల బట్టలు కట్టించి ఆమెను పెద్దగౌడ్‌కు అప్పగిస్తారు. అప్పటినుండి ఆమె ఊరందరికీ భార్య.
పోతురాజు గురించి:
శివుడు నదిలో స్నానం చేసి జటాజూటాన్ని సవరించుకొన్నప్పుడు ఒక చిన్న గవ్వ చిక్కుకుపోవడంతో దాన్ని పార్వతీదేవి తీసి ఇసుకలో దాచిందట. కొన్ని రోజులకు ఆ గవ్వ పాపగా మారిందట. ఇసుక రేణువుల నుండి పుట్టింది కనుక ఆమెను రేణుక అన్నారు. రేణుకను జమదగ్ని పెళ్ళి చేసుకున్నాడు. వారికి పరశురాముడు, సిరాయాళగౌరి అనే పిల్లలు జన్మించారు. అందమైన రేణుకను ఆమె బావ అత్యాచారం చేయబోతే తప్పించుకుని పారిపోయింది.
జమదగ్ని పరశురామునితో రేణుకను, కార్తికేయుడ్ని చంపమంటాడు. కార్తికేయుడ్ని చంపాడు కానీ, తల్లిని చంపడానికి ప్రయత్నించగా ఆమె ప్రాణభయంతో పరిగెత్తుతుంది. ఎందరినో ఆశ్రయం కోరినా పరశురాముడికి భయపడి ఎవరూ ఆశ్రయం ఇవ్వరు. చివరకు హరిజనవాడ చేరగా ఆమెను చర్మాలను నానబెట్టే తొట్టి (లందా)లో దాచారట. అలాంటి చోటుకు వెళ్ళలేని పరశురాముడు తల వెంట్రుకలు విరబోసుకుని, చేతిలో కొరడాతో వేషం మార్చుకుని వచ్చి తల్లి రేణుకను చంపుతాడు. అతడే పోతురాజు. ఊరి పండుగలు, జోగిని పట్టం కట్టడం, ఉత్సవాల్లో గావు పట్టడం, ఊర్లో కథలు చెప్పేవాడు పోతురాజు. ఇప్పటికీ పోతురాజు విగ్రహం పోచమ్మ గుడిముందు ఉంటుంది. అమ్మకు పూజ చేసిన తర్వాత పోతురాజుకు ధూప, దీప, నైవేద్యాలు పెడతారు.
ఇలా జోగిని వ్యవస్థతో అంటరాని కులం వారిని వాడుకోవడం అలవాటైపోయింది అగ్రకులాలకు. పోశమ్మకు పెళ్ళిచేస్తానంటే ఒప్పుకోని అగ్రకులం వాళ్ళు పెళ్ళికొడుకుని నక్సలైట్‌గా చిత్రించి, నానా బాధలు పెట్టి పోశవ్వను బలవంతంగా జోగినిని చేసి రాజాగౌడ్ ఆమె దగ్గరికి చేరాడు. రెండేళ్ళలో ఆమెకు కూతురు, ఆమె బతుకు పాడైపోయింది.
దళితులపై వివక్షను నిర్మూలించడం కోసం 1955లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1988లో జోగిని బసివినిన దేవదాసి నిరోధక చట్టం, 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చాయి. చట్టాలు పెద్దవాళ్ళకు చుట్టాలయ్యాయి కానీ, వారి ఆగడాలను ఆపలేదు, పేదవారి జీవితాలకు పెన్నిధవ్వలేదు.
ప్రభుత్వ సర్వేల ప్రకారం నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 2000 మంది జోగినీలున్నారని తెలిసింది. జిల్లా కలెక్టర్ విడతల వారీగా జోగినీలకు వృత్తుల్లో శిక్షణనిప్పించారు. వారి పిల్లలను సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేర్పించారు.
కరీంనగర్, వరంగల్‌లో జోగోళ్ళున్నారు. కొందరు జోగు అడుగుతారు. శివసత్తులు అంటారు. వీళ్ళను కూడా దేవుడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. వీరు కూడా నిత్య సుమంగళిగా ఉంటారు. వేములవాడ, సమ్మక్క`సారలమ్మ జాతరలలో శివసత్తులుగా భవిష్యవాణి చెబుతారు. విద్యకు పెళ్ళయిన నాలుగు సంవత్సరాల తర్వాత సిరిపురం వచ్చింది. ఆమెకు సమాజంలో చాలా మార్పు కనిపించింది. పోశవ్వ, సబిత మాటల్లో తేడా కనిపించింది.
బోధన్‌లోని అమ్మ ఆఫీసు తమను మార్చిందని చెప్పింది పోశవ్వ. పోశవ్వ తన బిడ్డ సబితను జోగినీని చెయ్యనంటూ పెద్దలను ఎదుర్కొంది. ప్రభుత్వ సహకారంతో జోగినులకు ఎకరం పొలం, పదివేల బ్యాంకు డిపాజిట్, వృద్ధాప్య పింఛన్ వస్తోంది.
1993 రాజ్యాంగ సవరణలతో సిరిపురం రిజర్వేషన్‌లో రాజాగౌడ్ ఆశీర్వాదంతో పోశవ్వ సర్పంచ్‌గా గెలిచింది. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే శిక్షణా శిబిరంలో పాల్గొంది. తన విధులు నిర్వహిస్తూ తన కుర్చీకి మర్యాద తెచ్చింది. డ్వాక్రా గ్రూప్ మరియు ఇతర సభ్యులతో కలిసి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపింది. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఆమె అంకితభావంతో పనులు చేసింది. తర్వాత పోశవ్వ మండలాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆమె సాధించిన ప్రగతికి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘‘నీరజాబానోత్’’ అవార్డు అందుకుంది. ఈ అవార్డుకు ప్రశంసాపత్రం, జ్ఞాపికతో పాటు లక్షా యాభైవేల రూపాయల నగదు లభించింది. ఢల్లీిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు తీసుకుంటూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ నగదు అవార్డులో సగం తన మండలంలోని బాలబాలికల కోసం, మిగతా మొత్తాన్ని ఏ అండా, ఆసరా లేని వృద్ధ జోగినుల అవసరాల కోసం ఇస్తున్నానని ప్రకటించింది పోశవ్వ.
ఆర్థికంగా ఎదగని పోశవ్వ మానసికంగా మహోన్నతంగా ఎదిగింది. ఆమెలోని నిస్వార్థతను, నిరాడంబరతను, సేవాతత్పరతను కొనియాడాయి పత్రికలన్నీ. సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలను, విధానాలను కళ్ళక్కట్టినట్లు చూపించి వెలుగుబాట వైపు నడిపిన నవల ‘జోగిని’. రాజుల కాలం నుండి వచ్చిన దేవదాసి వ్యవస్థను, జోగినుల దుర్భర జీవితాలను గురించి, సమాజం ఎంతో మున్ముందుకు పోతున్న వ్యవస్థలో సరైన మార్పులు చోటుచేసుకోకపోవడం మన దురదృష్టం.
సహజమైన మార్పుతో, మానసికంగా ఎదిగి సమాజానికి తోడ్పాటునందించింది పోశవ్వ. ఎందరో జీవితాలను చక్కదిద్ది, దళిత స్త్రీల జీవిత విధానాలలో మార్పునందించి, తన ఊరినే కాక చుట్టుపక్కల అందరికీ స్ఫూర్తినిస్తూ పరిసరాలను ప్రగతిపథంలో నడిపిస్తూ, విజ్ఞానాన్ని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన పోశవ్వ పాత్ర ఎందరికో స్ఫూర్తి. పెత్తందార్ల జీవన శైలిని చూపి, ఆడవాళ్ళ పట్ల వారి నడవడికను చూపించిన మంచి నవల జోగిని. మారుతున్న సమాజంలోని మార్పులను సరళభాషలో, చక్కని శైలిలో ఒక వ్యవస్థ లోటుపాట్లను సవివరంగా అందించి పరిష్కారం చూపిన నవల జోగిని.
ఈ నవల ద్వారా సామాజిక రుగ్మతలను, పల్లెల్లోని జీవన విధానాలను, ఊరి పెద్దల ఆగడాలను ఎదుర్కొన్న విధానాన్ని, జోగినీల జీవితాలు, జోగు పోశవ్వ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పెత్తందారులను గుణపాఠమైన విధానం నాకు నచ్చింది. అడ్డంకులు ఎన్ని ఉన్నా దుర్భలత్వాన్ని వీడి ధైర్యంగా, స్థైర్యంగా ముందడుగు వేయాలని, మూలాలను మర్చిపోవద్దని, అందరూ కలిసి మూలాలను తగిన విధంగా మార్చుకోవాలన్న విషయాన్ని పోశవ్వ పాత్రతో తెలిపింది ఈ నవల.
నేడు రాజకీయంగా ఎదుగుతున్న స్త్రీలు తమ భర్తలను, తండ్రులను, తమ వారిని పంపి తాము ఇళ్ళల్లో
ఉంటున్నారు. కుర్చీకున్న బాధ్యతను తెలుసుకుని మసలుకోవాలని ‘పోశవ్వ’ పాత్ర చూపించింది. సామాజికంగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిని అందించే పాత్రలు, సమాజం ఏవగించుకునే పాత్రలు ఎన్నో ఉన్నాయి ఈ నవలలో. మంచిని స్వీకరించి, చెడును వీడాలని, సామాజిక పురోగతిలో ఎవరి పాత్ర వారు నిర్వహించి ప్రగతి పథంవైపు అడుగులు వేయాలని సూచించిన నవల జోగిని.
ఇంత మంచి నవలను అందించిన వి.శాంతి ప్రబోధ గారికి ధన్యవాదాలతో…