సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

ఇలాంటి దిగ్గజాలు, ప్రతిభావంతులు వెళ్ళిపోవడంతో హఠాత్తుగా సగం నీళ్ళు తోడేసిన సముద్రంలా అయింది బొంబాయి సినీ పరిశ్రమ పరిస్థితి. ఈ ఖాళీని పూడ్చేందుకు దేశం నలువైపుల నుండి పలువురు కళాకారులు కళ్ళనిండా స్వప్నాలతో, గుండెల నిండా ఆశలతో బొంబాయి వచ్చి చేరారు. అయితే అప్పటికీ సినీ నిర్మాణానికి ఒక వ్యాకరణం స్థిరపడిరది.

కొందరు కళాకారులు తమ ప్రతిభతో ప్రామాణికాలు ఏర్పరిచారు.
ఇప్పుడు కొత్తగా సినీ ప్రపంచంలో అడుగుపెడుతున్న ప్రతి కళాకారుడినీ ఈ ప్రామాణికాలతో కొలిచి చూడడం ఆనవాయితీ అయింది. అదీకాగ ప్రతి మనిషికీ అతడు ఎంత గొప్పవాడైనా కొన్ని అపోహలు, కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలను ఉంటాయి. కొత్తగా సినీ రంగంలో అడుగుపెట్టిన వారు ఈ ప్రామాణికాలు, అపోహలు, ఖచ్చితమైన అభిప్రాయాలను దాటుకుని తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. దొరికిన అవకాశాలను సమర్దవంతంగా వినియోగించాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమ ఎలాంటిదంటే వెయ్యి విజయాలైనా ఒక పరాజయంతో తుడిచిపెట్టుకుపోతాయి. ఆరంభంలోనే అడుగు పొరపాటుగా పడితే ‘పరాజయం’ ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు. మళ్ళీ నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. దీనికి తోడు ‘అవకాశం’ లభించాలంటే కేవలం ‘ప్రతిభ’ కాక ఇంకా అనేక అంశాలు ప్రాధాన్యం వహిస్తాయి. ఆ కాలంలో సినీ సంగీత రంగంలో తవాయిఫ్‌లు (వేశ్యలు), డేరేదారినిలు (ముఘల్‌ రాజుల దర్బార్‌లో నృత్యం చేసేవారి వంశానికి చెందినవారు) అధికంగా ప్రవేశించేవారు, నటనతో పాటు పాటలు పాడేవారు. నేపథ్య గానం అంతగా వ్రేళ్ళూనుకోలేదు. దాంతో పాటలు పాడేందుకు వచ్చే యువతులంటే చులకన అభిప్రాయం ఉండేది.
అలాంటి బొంబాయి సినీ ప్రపంచంలో లతా మంగేష్కర్‌ 1945లో పదహారేళ్ళ వయసులో అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమెకు ఎవరూ పరచయం లేదు. ఆమె తండ్రి స్నేహితుడు మాస్టర్‌ వినాయక్‌ నాటక సంస్థ బొంబాయికి మారడంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న లత కూడా బొంబాయి రావాల్సి వచ్చింది. బొంబాయిలో హిందుస్థానీ సంగీత గానంలో శిక్షణ పొందింది. 1946లో ‘ఆప్‌ కీ సేవా మే’ అనే సినిమాలో ‘పా లాగూ కర్‌ జోరీ’ అనే పాటతో హిందీ సినీ ప్రపంచంలో అడుగుపెట్టింది. ‘బడీ మా’ సినిమాలో చిన్న వేషం వేయడంతో పాటు ‘మాతా తేరీ చరణోంమే’ అనే భజన పాడిరది. ఇంతలో మాస్టర్‌ వినాయక్‌ మరణించడంతో లత పరిస్థితి సంకటంలో పడిరది. బొంబాయి వదలి వెనక్కు వెళ్ళలేదు, వెనక్కు వెళ్ళినా జీవితం సాగించేందుకు ఎలాంటి ఆధారం లేదు. పైగా లతకు పాట తప్ప మరొకటి తెలియదు, రాదు. దాంతో బొంబాయిలోనే ఉండి తన అదృష్టం పరీక్షించుకోవాల్సి వచ్చింది. సన్నిహితులు అన్నవారు లేని పరిస్థితి. అవకాశం లభిస్తే మింగేసే మొసళ్ళు, ముక్కలుగా చీల్చే సొర చేపలు, కన్నుమూసి తెరిచేలోగా మాయచేసి ముంచేసే సుడిగుండాలు… ఇలాంటి సినీ ప్రపంచంలో కాళ్ళు పెట్టాలని ప్రయత్నిస్తున్న లతా మంగేష్కర్‌కు గులామ్‌ హైదర్‌ అండ లభించింది. ఆయన లతను వెంట బెట్టుకుని నిర్మాణ సంస్థకు పరిచయం చేయటం ఆరంభించాడు. కానీ అది శక్తివంతమైన, ఖంగున మోగే మహిళల స్వరాల కాలం. నూర్జహాన్‌, అమీర్‌ బాయి కర్నాటకి, సురయ్య, రాజ్‌ కుమారి, శంషాద్‌ బేగం, జోహ్రాబాయిఅంబాలేవాలి వంటి వారు రాజ్యం ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో సన్నని తీగలాంటి లత స్వరంలోనిన మెరుపును గ్రహించకలేకపోవటంలో అశ్చర్యం లేదు. ‘మరాఠీ ఆమె ఉర్దూ పదాలు సరిగ్గా ఉచ్ఛరించలేదు’ అన్నారు. ‘స్వరంలో శక్తి లేదన్నారు’, ‘కంఠం పైకి రాదన్నారు’ అన్నారు. ఇలాంటి పరిస్థితులలో పాడే అవకాశాలిచ్చిన గులామ్‌ హైదర్‌ పాకిస్తాన్‌ వెళ్ళిపోయాడు. దాంతో లత పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.
ఇదే సమయానికి దేశ విభజన జరగడంతో పేరున్న కళాకారులు పాకిస్తాన్‌ వెళ్ళిపోవడంతో సినీరంగంలో పెద్ద కొరత ఏర్పడిరది. అప్పటికే సైగల్‌ మరణం నేపథ్య గాయకుల ప్రపంచంలో పెద్ద లోటును ఏర్పరచింది. ముఖేష్‌, కిషోర్‌ కుమార్‌, మహమ్మద్‌ రఫీ వంటి యువ గాయకులు ఆ లోటును పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూర్జహాన్‌ వంటి గాయని పాకిస్తాన్‌ వెళ్ళిపోవడంతో గాయనిల ప్రపంచంలోనూ లోటు ఏర్పడిరది. సంగీత దర్శకులు ‘నూర్జహాన్‌’ లాంటి స్వరం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో ఖేమ్‌ చంద్‌ ప్రకాష్‌ ’మహల్‌’ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
‘మహల్‌’ సినిమాలో ‘ఆయెగా ఆనేవాలా’ పాట ఆత్మతో పాడేటటువంటి పాట. ఆ పాట కోసం విభిన్న స్వరం అవసరమైంది. మృదుత్వం, కోమలత్వంతో పాటు కాస్త భౌతిక ప్రపంచానికి చెందనిది అనిపించేటటువంటి స్వరం పాటకు అవసరం. అప్పటికి పేరుపొందిన స్వరాలు ఖంగుమని మ్రోగేవి. ఇంకొందరి స్వరాలలో మృదుత్వం ఉన్నా మౌగ్ధ్యం లేదు. ఒక రకమైన ూఅవ శీట ్‌ష్ట్రఱం షశీతీశ్రీస లక్షణం లేదు. అందుకని ఖేమ్‌చంద్ర్‌ ప్రకాష్‌ ఈ పాటను లతతో పాడిరచాలని నిశ్చయించాడు. ఇది నిర్మాత సవక్‌ వాచాకు నచ్చలేదు. ఇంత పీలగొంతు వల్ల పాట పాడవుతుంది, సినిమా దెబ్బతింటుందన్నాడు. ‘ఆయెగా ఆనేవాలా’ పాట మహల్‌ సినిమాకు కీలకం. పలు సందర్భాలలో వస్తుంది. కాబట్టి సినిమా విజయం ఈ పాటపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఎవరైనా పేరున్న మరో గాయనితో పాడిరచాలని నిర్మాత పట్టుబట్టాడు. కానీ ఖేమ్‌ చంద్‌ ప్రకాష్‌కు తమ ప్రతిభపై నమ్మకం, లత స్వరంపై విశ్వాసం. పాటను రెండు రకాలుగా పాడిరచి రికార్డు చేశాడు. ఒకవేళ లత పాట విఫలమైతే మరో పాట విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు లత మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించాలంటే బాధ కలుగుతుంది. సంగీతం తప్ప మరో మాట తెలియదు. అదే ఆమెకు జీవిక. ఆమెకే కాదు ఆమెపై ఆధారపడిన కుటుంబానికి ఆధారం ఆమె ‘గానం’. కానీ పలు కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆమెను తిరస్కరించినవారే. అవకాశాలు ఇచ్చేవారు అరుదు. అలా వచ్చే అవకాశాలను అడ్డుకునే వారే అందరూ. ఒక వ్యక్తి యిష్టాయిష్టాలపై ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉండటం ఎంత దుర్భరమైన దుస్థితో ఊహించవచ్చు. ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినవి ఇలాంటి పలు భయంకరమైన అనుభవాలు.
‘మహల్‌’ సినిమా విడుదలయింది. సినిమా కన్నా ముందుగా అందరినీ ‘ఆయేగా ఆనేవాలా’ పాట ఆకర్షించింది. పాట రికార్డవుతున్నప్పుడు నటి నర్గీస్‌, ఆమె తల్లి బద్దన్‌ బాయి స్టూడియోలో ఉన్నారు. పాట పాడి బయటకు వచ్చిన లతను పేరు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆమె ఉర్దూ పదాలను అంత చక్కగా పలకటాన్ని అభినందించారు. ముఖ్యంగా ‘బగైర్‌’ అన్న పదాన్ని పలికిన తీరును ప్రశంసించారు. పాట విన్న తరువాత దేశమంతా నర్గీస్‌ తల్లి అడిగిన ప్రశ్ననే అడగడం ప్రారంభించింది. ‘ఎవరీ గాయని?’, ‘ఈ పాట పాడిరదెవరు?’
ఆ కాలంలో నేపథ్య గాయకులను ఎవ్వరూ లెక్క చేసేవారు కాదు. రికార్డులపై కూడా సినిమాలో ఆ పాట పాడిన పాత్ర పేరుండేది తప్ప గాయని పేరుండేది కాదు. దాంతో పాట పాడిరది ఎవరో తెలుసుకోవాలని శ్రోతలు తహతహలాడేవారు. ఆ కాలంలో రేడియోలో కూడా గాయని పేరు చెప్పేవారు కాదు. దాంతో ‘ఈ పాట పాడిరది ఎవరు?’ అని ఉత్తరాలు రాశారు. ఆ తాకిడిని తట్టుకోలేక ఈ పాట పాడిరది లతా మంగేష్కర్‌ అని ప్రకటించాల్సి వచ్చింది. అంతవరకూ రికార్డులపై గాయనీ గాయకుల పేర్లు ప్రచురించని హెచ్‌.ఎం.వి. సంస్థకు లత పేరును ముద్రించక తప్పలేదు.
అలా హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఒక లోటును పూడుస్తూ లత రంగప్రవేశం చేసింది. జశీఎవ్‌ష్ట్ర ్‌ష్ట్రవ ష్ట్రశీబతీ, షశీఎవ్‌ష్ట్ర ్‌ష్ట్రవ ఎaఅ అన్న నానుడిని నిజమని నిరూపిస్తూ ఆరు దశాబ్దాలకు పైగా చలన చిత్ర సంగీత ప్రపంచాన్ని మకుటం లేని మహారాణిలా ఏలింది. ఎవ్వరూ లెక్కచేయని పరిస్థితి నుంచి దేశం మొత్తం సరస్వతీ దేవిలా కొలిచే స్థాయికి ఎదిగింది. ‘సినీ పరిశ్రమ ఈమెకు పాదక్రాంతం అవుతుంద’న్న గులామ్‌ హైదర్‌ మాటలను నిజం చేస్తూ లతా మంగేష్కర్‌ ఎవరూ ఊహించనంత, ఎంత ప్రయత్నించినా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ప్రపంచంలో ఒక బీథోవెన్‌, ఒక మోజార్ట్‌, ఒక తాన్‌సేన్‌, ఒక త్యాగరాజు, ఒక లతా మంగేష్కర్‌ మాత్రమే అని ముక్తకంఠంతో అందరూ నీరాజనాలు అర్పించే స్థాయిలో నిలిచింది లతా మంగేష్కర్‌.
‘ఆయెగా ఆనేవాలా’ పాట విని అందరూ ‘ఎవరిదీ స్వరం?’ ‘పాట పాడిరది ఎవరు?’, ‘ఎవరీ గాయని?’ అని అడిగారు. గాయని పేరు లతా మంగేష్కర్‌ అని తెలిసింది. అప్పుడు అందరూ ‘ఎవరీ లతా మంగేష్కర్‌’ అని అడగటం ప్రారంభించారు.
ఛోటీసీ గుడియాకీ లంబీ కహానీ
జైసీ తారోంకీ బాత్‌ సునీ రాత్‌ సుహానీ
‘సీమా’ (1955) సినిమాలోని ఈ పాట వింటే లతా మంగేష్కర్‌ జీవిత గాథ గుర్తుకువస్తుంది. ‘ఛోటీసీ గుడియా’ అన్న పదం గమ్మత్తయినది. ‘గుడియా’ అంటే బొమ్మ. చిన్న పిల్లలు బట్టలు వేసి అలంకరించి ఆడుకునే బొమ్మ. ‘ఛోటీసీ గుడియా కీ లంబీ కహానీ’. ‘గుడియా’ అన్న పదాన్ని పిల్లలకు సంభోదించేందుకు వాడతారు ‘బుట్టబొమ్మ’ అన్న అర్థంలో వాడతారు. ‘చిన్న పిల్ల పెద్ద కథ’ అని వినండి అంటున్నాడు హస్రత్‌ జైపురి. ఎలా వినాలంటే అందమైన రాత్రి తారల మాటలు ఎలా వింటుందో అలా వినండి చిన్న బొమ్మలాంటి పిల్ల కథ అంటున్నాడు కవి హస్రత్‌.
అందమైన బొమ్మలాంటి పాప శనివారం సెప్టెంబర్‌ 28, 1929న ఇండోర్‌లోని వాఘ వకీల్‌ వాడాలోని సిక్కు మహిళల ప్రసూతి ఆస్పత్రిలో పుట్టింది. అప్పుడే పుట్టిన ఆ శిశువును ఎత్తుకున్న డాక్టర్‌ మోతాబాయి ఇంకా కళ్ళు తెరవని ఆ శిశువు, భవిష్యత్తులో భారతరత్న అవుతుందనీ, తన గానంతో తరతరాల భారత ప్రజలను ఉర్రూతలూగిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు.
ఆ ఛోటీసీ గుడియా తండ్రి ప్రఖ్యాత గాయకుడు, ఉత్తమ నటుడు, ‘బల్వంత్‌ సంగీత మండలి’ వ్యవస్థాపకుడు దీనానాథ్‌ మంగేష్కర్‌, తల్లి సుధామతి. నిజానికి దీనానాథ్‌ మంగేష్కర్‌ ‘హర్దీకర్‌’ వంశానికి చెందినవారు. ఆయన తండ్రి పేరు గణేష్‌ భట్‌ అభిషేకి, తల్లి యేసుబాయి రాణి. గణేష్‌ భట్‌ అభిషేక్‌ పూజారి వంశానికి చెందినవారు. గోవాలోని మంగేషి గ్రామంలోని ‘మంగేష్‌ (శివుడు)’ దేవుడి పూజలు నిర్వహించడం, అభిషేకాలు చేయడం వారి వంశాచారం. గణేష్‌ భట్‌ యేసుబాయిని వివాహం చేసుకోలేదు, వారు కలిసి సహజీవనం చేశారు. ఆమె గోమంతక్‌ మరాఠా సమాజానికి చెందినది. గోమంతక్‌ మరాఠా సమాజానికి చెందినవారిలో రెండు రకాలున్నారు. కళావంతునులు, భావినులు. కళావంతినులు కళాకారులు. సంగీతం, నాట్యం వంటి వాటిలో ప్రవేశమున్నవారు. వీరికి సంఘంలో గౌరవం ఉండేది. ఎందుకంటే వీరు దేవాలయంలోనే సంగీత, నృత్యాలు చేసేవారుÑ పూజారులతో సహవాసం చేసేవారు. భావినులు, దేవాలయంలో దీపాలు వెలిగించేవారు, పల్లకీలకు దీపాలు పెట్టేవారు, చామరాలు వీచేవారు. వీరిని పవిత్రులుగా భావించేవారు. యేసుబాయి కళావంతిని.
గణేష్‌ భట్టు అభిషేకి బ్రాహ్మణులలో కర్హాద బ్రాహ్మణులు. వీరు ఋగ్వేద బ్రాహ్మణులు. వీరిలో ‘భట్టప్రభు’లు ప్రధానంగా కొంకణి ప్రాంతంలో ఉంటారు. వీరు అధికంగా పూజారులుగా ఉండేవారు. అలా పూజారిగా ఉన్న గణేష్‌ భట్టు అభిషేకి, యేసుబాయిలు కలిసి ఉండడంతో వారి సంతానానికి, అంటే దీనానాథ్‌కు బ్రాహ్మణ కులం రాలేదు, ఇంటి పేరు రాలేదు. దాంతో దీనానాథ్‌ తనకంటూ ప్రత్యేకమైన ‘ఇంటిపేరు’ పెట్టుకున్నాడు. తన వారసత్వాన్ని మరచిపోకుండా ఉండేందుకు, తన కుటుంబం మంగేష్‌ దేవుడి పూజారులన్న విషయాన్ని గుర్తుచేస్తూ ‘మంగేష్కర్‌’ అన్న పేరును ఇంటిపేరుగా స్థిరపరచుకున్నాడు. అలా దీనానాథ్‌, దీనానాథ్‌ మంగేష్కర్‌ అయ్యాడు.
దీనానాథ్‌కు బాల్యం నుంచి సంగీతం, నాట్యాలపై ఆసక్తి ఉండేది. అతని తల్లి యేసుబాయి దేవాలయంలో పాటలు పాడేది, నృత్యాలు చేసేది. ఆనాటి ప్రజలలో ఆమె అంటే అభిమానం, ఆదరణ ఉండేది. బహుశా ఇది దీనానాథ్‌లో నాటకాలు, గానం పట్ల ఆసక్తిని రగిల్చి ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఆయన పధ్నాలుగేళ్ళ వయసులోనే గోవా వదిలి మహారాష్ట్ర వచ్చాడు. బొంబాయిలో ఆయనకు బల్వంత్‌ పాండురంగ్‌ కిర్లోస్కర్‌తో పరిచయమయింది.
‘అన్నా సాహెబ్‌’ అన్న పేరుతో ఆదరంగా పిలిచే బల్వంత్‌ పాండురంగ్‌ కిర్లోస్కర్‌ 1879`80 ప్రాంతాల్లో ‘కిర్లోస్కర్‌ నాటక మండలి’ని స్థాపించాడు. ఆ కాలంలో ప్రజలకు నాటకాలు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ప్రజలకు పురాణాల అంతరార్థం అత్యంత సులువుగా బోధిస్తూ, వారిలోని సృజనాత్మకతను జాగృతం చేసేవి. ఈ కాలంలో క్రికెట్‌ ఆటగాళ్ళు, సినీ కళాకారులు పొందుతున్న అభిమానం కన్నా అధికంగా అభిమానాన్ని పొందేవారు నాటక కళాకారులు. ‘కిర్లోస్కర్‌ నాటక మండలి’ మహారాష్ట్రలోని వీథుల్లో నాటకాలు ఆడుతూ మరాఠీ భాషను, నాట్యాన్ని, సంగీతాన్ని ప్రజలకు చేరువ చేసింది. బాలగంధర్వ, మాస్టర్‌ కృష్ణారావు, పండిత భాస్కర్‌ బువా బఖలే, బాపూ సాహెబ్‌ పెణ్ధార్కర్‌, గోవింద్‌ బల్లాల్‌ దేవల్‌, గోవిందరావు టెంబే, గణపతిరావు వంటి ప్రముఖులు ఆ కంపెనీలో పనిచేశారు. ఈ కిర్లోస్కర్‌ నాటక కంపెనీలో చేరాడు దీనానాథ్‌ మంగేష్కర్‌. ఈ సమయంలోనే బాల గంధర్వ పాల్గొన్న ‘మానాపమాన్‌’ నాటకం మహారాష్ట్ర ప్రజలను ఉర్రూతలూపింది. 1918లో దీనానాథ్‌ మంగేష్కర్‌ ‘కిర్లోస్కర్‌ కంపెనీ’ వదిలి తన మిత్రులు చింతామణిరావు కోల్హాట్కర్‌, కృష్ణారావు కోల్హాపురెలతో కలిసి ‘బల్వంత్‌ సంగీత్‌ మండలి’ని స్థాపించాడు. తనదైన పద్ధతిలో పాటలు జోడిరచి ‘మానాపమాన్‌’ నాటకాన్ని ప్రదర్శించి మన్ననలందుకున్నాడు. (మానాపమాన్‌ నాటకంలోని పాటలు లతాకు ఎంతగా నచ్చాయంటే 1990లో లేకిన్‌ సినిమా నిర్మించినపుడు ఆ సినిమాలోని ‘మై ఏక్‌ సదీసే బైఠీ హు’ అన్న పాటను ‘భారీ చంద్ర్‌ ఉసే ధరీ లా’ అన్న మానాపమాన్‌ పాట బాణీలో తమ్ముడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ రూపొందించేలా చేశారు).
దీనానాథ్‌ మంగేష్కర్‌ అందగాడు. అతనిది ఆకర్షణీయమైన గాత్రం. దాంతో అచిరకాలంలోనే మహారాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. సాటి కళాకారుల గౌరవ మన్ననలందుకున్నాడు. ఆయన అడుగుపెట్టిన చోట పూల వర్షాలు కురిశాయి. అతనికి నీరాజనాలందించేందుకు సామాన్యులతో పాటు పండితులు, ఉస్తాద్‌లు పోటీలు పడ్డారు. దీనానాథ్‌ మంగేష్కర్‌ ఎంతటి గౌరవాభిమానాల పాత్రుడయ్యాడో ఆ సమయంలో అతని తోటి కళాకారుడు ‘కిర్లోస్కర్‌ నాటకమండలి’కి చెందిన బాల గంధర్వ చేసిన వ్యాఖ్య నిరూపిస్తుంది. ‘ఒకవేళ దీనానాథ్‌ మంగేష్కర్‌ కనుక మా కంపెనీలో చేరతానంటే మా కంపెనీకి నడిచివచ్చే దారంతా గులాబీ పూలు పరుస్తాను. దారంతా ఆయనపై పన్నీరు చల్లుతుంటాను. నా హృదయాన్ని చీల్చి మాలలా మలిచి ఆయన మెడలో వేసి మా నాటక సమాజానికి ఆహ్వానిస్తాను’ అన్నాడు బాల గంధర్వ. ఈ వ్యాఖ్య చాలు ఆ కాలంలో దీనానాథ్‌ మంగేష్కర్‌కు ఎంత గౌరవ మర్యాదలుండేవో, ఆయన మహారాష్ట్ర నాటక సమాజంలో ఎంతటి ఉచ్ఛస్థాయిలో ఉండేవాడో తెలుసుకునేందుకు. ప్రత్యర్థి నాటకమండలి వాడైనా బాలగంధర్వ, దీనానాథ్‌లు ఎంతో స్నేహంగా ఉండేవారు. జీవితాంతం కొనసాగిన ఈ స్నేహం దీనానాథ్‌ మరణం తరువాత లతపై కరుణలా ప్రసరించింది.
దీనానాథ్‌ 1922లో, హరిదాస్‌ రామదాసు లాద్‌ అనే గుజరాతీ వ్యాపారి కూతురిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప కలిగింది. పాపకు లతిక అని పేరు పెట్టారు. కానీ ఆ పాప ఎక్కువ కాలం బ్రతకలేదు. ఆ విచారంలో అతని భార్య మరణించింది. దీనానాథ్‌ అందరి సమ్మతితో ఆమె చెల్లెలిని 1927లో వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అయిదుగురు సంతానం కలిగారు. లత, మీనా, ఆశా, ఉష, హృదయనాథ్‌ మంగేష్కర్‌లు.
దిల్‌ మె యె అర్మాన్‌ థే ఎక్‌ ఛోటా సా బంగ్లా హో
చాందీసీ ధర్తీపర్‌ సోనేకా జంగ్లా హో
ఖేల్‌ హో జీవన్‌ కీ యహా మేల్‌ హు జీవన్‌ కే
గయా బచ్‌ పన్‌ తో ఆసూభరీ ఆయా జవానీ…
లతా మంగేష్కర్‌ బాల్యం నుంచి అల్లరి పిల్ల. దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆమెను ఎంతో గారాబం చేసేవాడు. తల్లి దగ్గర లతకు అమితమైన ప్రేమ లభించేది. దాంతో లతా మంగేష్కర్‌కు బాల్యం నుంచీ తనకు కావాల్సింది సాధించే తెగువ, మొండితనాలు ఉండేవి. దీనానాథ్‌ ఇంట్లో పిల్లలకు సంగీతం నేర్పించేవాడు. బయట ఆడుకుంటున్నా లత ఇంట్లో తండ్రి నేర్పుతున్న విషయాలపై ఓ చెవి వేసి ఉంచేది. తండ్రి లేనప్పుడు వంటింట్లో తల్లి వంట చేస్తుంటే, తాను విన్నదంతా అమ్మకు వినిపించేది. ఆమె ఆనందిస్తూ వింటుండేది.
లతకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు ఓ రోజు తండ్రి తన విద్యార్థికి పూరియా ధనుశ్రీ రాగం నేర్పించి సాధన చేయమని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ విద్యార్థి సాధనను పొరపాటుగా చేస్తుంటే ఛోటీసీ గుడియా లత వెళ్ళి అతని తప్పును సరిదిద్దింది. అతడు సాధన చేస్తున్నట్లు కాక తన తండ్రి ఎలా నేర్పించాడో తాను పాడి చూపించింది. బయటకు వెళ్ళిన దీనానాథ్‌ ఎందుకో వెనక్కి వచ్చాడు. తన కూతురు నేర్పినదంతా విన్నాడు. ‘ఇంట్లోనే గాయనిని పెట్టుకుని ఊరంతా గానం నేర్పిస్తున్నాన’ని నాలిక కరచుకున్నాడు. ఆ రోజు నుంచీ లతకు పద్ధతి ప్రకారం శాస్త్రీయ సంగీతం నేర్పటం ప్రారంభించాడు. అలా మొదలయింది సంగీత ప్రపంచంలో లత తొలి అడుగులు వేయటం. పండిత్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ సజ్జనుడు. సంగీతం విషయంలో ఎలాంటి రాజీ పడేవాడు కాదు. సంగీతం సరస్వతి అన్నది ఆయన విశ్వాసం. లతలో కూడా ఈ విశ్వాసాన్ని బలంగా నాటాడు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, తన తండ్రి ఎంత గొప్పవాడో ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవించి, అభిమానించి, ఆదరించేవారో లత ప్రత్యక్షంగా చూసింది. తండ్రి పలికిన ప్రతి పదాన్ని దైవవాక్కులా భావించి పాటించిందామె. ఇది ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా తెలుస్తుంది.
‘‘నేను చిన్నప్పుడు చాలా అల్లరిపిల్లను. పిల్లలందరం ఇంట్లో అల్లరి చేస్తే మా నాన్నగారు అందర్నీ కోపంగా పిలిచేవారు. ఆయన పిలుపు వినగానే మా గుండెలు జారిపోయేవి. అందరం భయం భయంగా వణుకుతూ వెళ్ళి ఆయన ముందు నిలబడేవాళ్ళం. ఆయన అందరినీ వరుసగా నిలబడమనేవాడు. అందరం నిలబడిన తరువాత ‘నేనెందుకు పిలిచానో తెలుసు కదా?’ అని అడిగేవారు. ‘తెలుసు’ అని సమాధానం ఇచ్చేవాళ్ళం. ‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి’ అని పంపేసేవారు. తప్పు చేస్తే కొట్టేవారు కాదు, కానీ ఆయన చూసే చూపు మరోసారి తప్పు చేయనిచ్చేది కాదు’ అని చెప్పింది లతా మంగేష్కర్‌.
తండ్రి నేర్పిన విలువల గురించి చెప్తూ ఓ సంఘటనను వివరించింది లత. ఆమె చిన్నప్పుడు ఓ దుకాణం నుంచి సబ్బు కొనటానికి వెళ్ళిన అబ్బాయి ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చాడు. ఎందుకంటే అతడికి ఇచ్చిన రెండణాల నాణెం చెల్లనిది. అది చూసిన లత ‘నేను తెస్తాను’ అని ఆ నాణెం తీసుకుని పరిగెత్తింది. దుకాణం చేరి నాణెం గల్లా పెట్టెలో పారేసి తనకు కావల్సింది తెచ్చింది. ఇంట్లో తన ఘనకార్యాన్ని గర్వంగా చెప్పింది. అది విన్న దీనానాథ్‌ లతను మందలించాడు. ‘‘నువ్వు దీనానాథ్‌ కూతురివన్న గౌరవంతో దుకాణదారుడు నిన్ను ఏమీ అనలేదు. నిన్ను నమ్మాడు. దీనానాథ్‌ కూతురు అబద్ధం చెప్పదన్న విశ్వాసం అది. కాబట్టి నువ్వు చేసే పొరపాటు, నువ్వు చెప్పే అబద్ధం ప్రభావం నాపై పడుతుంది’’ అని మంచి నాణెం ఇచ్చి దుకాణానికి పంపాడు. జరిగింది చెప్పి క్షమార్పణలు వేడుకుని డబ్బులిచ్చి రమ్మన్నాడు. ఈ సంఘటన లత మనస్తత్వంపై తిరుగులేని ప్రభావం చూపింది. భవిష్యత్తులో ఆమె తన ప్రతి చర్య ప్రభావం తన తండ్రి ప్రతిష్టపై ఉంటుందన్న గ్రహింపు ప్రదర్శించటానికి ఇలాంటి అనేక సంఘటనలు కారణం.
తండ్రి దగ్గర మాల్కౌస్‌, హిండోళ్‌, జైజయవంతి, పూరియా ధనుశ్రీ వంటి రాగాలు నేర్చుకుంది లత. ఇన్నేళ్ళ తరువాత కూడా పలు ఇంటర్వ్యూలలో ఆమె తన తండ్రి జైజయవంతి రాగంలోని ‘తన్‌ జహాజ్‌ మన్‌ సాగర్‌’ను గానం చేస్తూ రాగం ఎలా తీయాలో నేర్పించిన విధానం వినిపిస్తుంది. ‘హిండోళ్‌’లో ‘కాంచన్‌ బరన్‌ హిండోళా’ను ఎలా పాడాలో వినిపిస్తుంది. విలంబిత్‌ లయలో మాల్కౌస్‌ రాగంలో ఎలా పాడాలని నేర్పాడో చెప్తుంది. ఖంభావతీ రాగంలోని ‘ఆవీరీ మై జాగీ సారీనైనా’ను తండ్రి ఎలా నేర్పాడో అలా పాడి వినిపిస్తుంది. సంగీతం నేర్పిస్తూ, బాల లతకు దీనానాథ్‌ ఇచ్చిన సలహా ఆమె జీవితాంతం మర్చిపోలేదు. నేపథ్యగాయని అయి, ప్రపంచాన్ని తన గానంతో పాదాక్రాంతం చేసుకోవటంలో ఈ సలహా ఉపయోగపడిరదని, ప్రతి పాటను పాడే సమయంలో ఈ సలహా తన చెవులలో మారుమ్రోగుతుందనీ, లత పలు సందర్భాలలో చెప్పింది. ‘ఎలాగైతే కవితలోని ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుందో, అలాగే పాటలోని ప్రతి స్వరానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. పాట పాడేటపుడు పాటలోని పదాల అర్థాలతో పాటు స్వరాల అర్థాలు కూడా ప్రస్ఫుటం కావాలి’ అన్న సలహాను సంపూర్ణంగా అర్థం చేసుకుని తన గానంలో ప్రదర్శించటం వల్లనేమో లత పాటలలో పదాల అర్థాలకు స్వరాల అర్థాలు తోడై పాట మరింత తేజోమయం అవుతుంది. భాషరాని వారు కూడా పాట భావనను అనుభవించి పలకరిస్తారు. పదాలకు భాష కానీ, స్వరానిది మానవ మనస్సు భాష కదా!

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.