గమనమే గమ్యం -ఓల్గా

యుద్ధం రోజుల్లో ఏదో ఒక హడావిడి. శారదాంబ ఇంట్లో రెండు రోజులుగా ముఖ్యమైన సమావేశాలు జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఐదారుగురునారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా

ఉంది. విద్య, శారద మంచి స్నేహితురాలయ్యారప్పటికే. ఆ ఐదారుగురూ భోజనాలు చేస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. విద్య, శారద ఒకళ్ళను మించి మరొకళ్ళు ఛలోక్తులు విసురుతున్నారు. ఆ సమయంలో పార్టీ ఆఫీసు నుండి గోపాలరావు పదిహేనేళ్ళ అమ్మాయిని వెంటబెట్టుకుని ఆ ఇంటికి వచ్చాడు.శారద భోజనం నుంచి లేచి చేయి కడుక్కుని వచ్చింది.
‘‘ఏంటి గోపాలరావ్‌ ఎవరీ అమ్మాయి’’ అంది ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తూ. ‘‘తెలియదు డాక్టర్‌ గారు. మన దాసు గారికి చెల్లెలి వరసట. సూర్యాపేట నుంచి వచ్చానంటోంది. ఎందుకంటే దాసుగారు రమ్మన్నారంటోంది. మీ దగ్గరుంటే మంచిదని తెచ్చాను’’ అన్నాడు.
వాడిన ముఖం, రేగిన జుట్టు, అలసిన శరీరం… ఐనా కళ్ళల్లో, పెదవుల్లో కనిపించే పట్టుదల. ఆ అమ్మాయి వంక చూసి ఆప్యాయంగా నవ్వింది శారద. ‘‘రామ్మా, కాళ్ళు ముఖం కడుక్కొని అన్నం తిన్న తర్వాత నీ కథ చెబుదువుగాని’’ అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని నీళ్ళతొట్టె దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కునేసరికి ఎవరో తువ్వాలు తెచ్చి ఇచ్చారు. ముఖం తుడుచుకుని శారద వెంటే వెళ్ళింది. తెలియని మనుషులు. అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి భయం, అయోమయం. శారద తినమని మధ్యమధ్యలో హెచ్చరిస్తూ వాళ్ళతో మాట్లాడుతోంది. రెండు రోజులుగా భోజనం లేకపోయినా ఆ వ్యక్తులందరి మధ్యా కూర్చుని కడుపునిండా తినలేకపోయిందా అమ్మాయి.
అందరినీ పంపించాక ఆ అమ్మాయిని తీసుకుని సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది శారద.
‘‘ఇప్పుడు చెప్పు. నీ పేరేమిటి? ఎక్కడినుంచి వచ్చావు?’’ లాలనగా అడిగింది.
‘‘నా పేరు సత్యవతి. మాది సూర్యాపేట దగ్గర ఒక చిన్న ఊరు’’… ‘‘ఐతే…’’ శారదను మాట్లాడనివ్వకుండా సత్యవతి చెప్పుకుపోయింది. ‘‘మా అమ్మది కాటూరు. చిన్నప్పుడు అక్కడా రెండేళ్ళు పెరిగాను. మా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా దగ్గరంతా ఆడవాళ్ళకు ఘోషా పద్ధతి. ఐతే మా నాన్న ఇంట్లోనే ఒక పంతులు గారిని పెట్టి తెలుగు రాయటం, చదవటం మూడేళ్ళపాటు నేర్పించాడు. మా అన్నయ్యలు ఆర్య సమాజంలో ఆంధ్ర మహాసభల్లో ఉన్నారు. మా ఇంటికి పుస్తకాలు, పత్రికలు అన్నీ తెస్తారు. నాకు అవన్నీ చదవటం అలవాటయిందండి. అన్నం తినకుండానన్నా ఉంటాను గానీ పుస్తకం చదవకుండా ఉండలేను. ఏడాది నాడు ‘గృహలక్ష్మి’ పత్రికలో దుర్గాబాయమ్మ గారి ఫోటో చూశాను. ఆమె ప్లీడరీ చదివి పట్టా తీసుకుంటూ కోటు వేసుకుని, నెత్తిన టోపీ పెట్టుకున్న ఫోటో. ఎంత బాగుందంటే… అప్పటికప్పుడు నా మనసులో గొప్ప కోరిక పుట్టుకొచ్చిందండీ. ఎట్లాగయినా చదువుకోవాలి. దుర్గాబాయమ్మ లాగా పట్టా తీసుకుని అట్లా కోటు వేసుకోవాలి అని. మా ఇంట్లోనేమో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. బాగా డబ్బుందని ఒక రెండో పెళ్ళి సంబంధం కూడా తెచ్చారు. నేను చేసుకోనంటే చేసుకోనన్నాను. సరే ఆ సంబంధం కాకపోతే నీకు ఈడైనవాడినే చూస్తాం అన్నారు. సంబంధాలు చూస్తున్నారు. నేనేం చెయ్యను? మా దాసన్నయ్య కమ్యూనిస్టు. ఒకరోజు మా ఇంటికి వస్తే అన్నయ్యకు చెప్పాను నాకు పెళ్ళి ఇష్టం లేదని, చదువుకోవాలని. సరే నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు అన్నయ్య. తర్వాత కొన్ని రోజులయ్యాక ఒక మనిషితో ఉత్తరం పంపించాడు. ఎట్లాగయినా బెజవాడరా. అక్కడ బస్సులు ఆగే చోట, పక్కనే భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుంటుంది. నువ్వక్కడికి వస్తే నీ పెళ్ళి జరగకుండా పార్టీ చూస్తుంది. మహిళా సంఘంలో పనిచెయ్యొచ్చని చెప్పి పంపించాడు. నేను సమయం కోసం చూస్తున్నాను. మా ఊళ్ళోనే మా బంధువు ఇంట్లో పెళ్ళి. అందరూ వెళ్ళారు. నేనూ వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి, కాసిని డబ్బులు తీసుకుని సూర్యాపేట వచ్చాను. అక్కడ మా పంతులు గారుంటారు. ఆయనా ఆంధ్ర మహాసభే. ఆయన ఉండి ఉంటే నాకీ తిప్పలు ఉండేవి కావు. ఆయన ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తారో తెలియదు. ఇంక చేసేదేముంది? సూర్యాపేటలో ఓ బస్సు ఎక్కాను. ఆ బస్సులో ఎవరో పద్మశాలీలు, భార్యాభర్తలు బెజవాడ వెళ్తున్నామంటే వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళ పిల్లలాగానే వాళ్ళతోనే కూర్చున్నాను. జగ్గయ్యపేటలో రాత్రి ఆగాం. వాళ్ళు వండుకుని తిని సత్రంలో పడుకున్నారు. వాళ్ళు నా కులం అడిగితే చెప్పానుగా… నాకు వాళ్ళు వండుకున్నది పెట్టలేదు. మంచినీళ్ళు తాగి పడుకున్నాను. పొదున్నే మళ్ళీ ఇంకో బస్కెక్కి మధ్యాహ్నానికి బెజవాడలో దిగాం. దాసన్నయ్య రాసినట్టే బస్సు దిగంగానే పార్టీ ఆఫీసు కనిపించింది. అక్కడికి వెళ్ళి మా దాసన్నయ్య కావాలంటే వాళ్ళు నన్ను మీ ఇంటికి పంపారు. నేను మళ్ళీ మా ఇంటికెళ్తే పెళ్ళి చేస్తారు. నేను పెళ్ళి చేసుకోను. చదువుకుంటాను. మహిళా సంఘంలో పనిచేస్తాను. దుర్గాబాయమ్మలాగా పట్టా తీసుకోవాలి నేను’’ కళ్ళల్లో నీళ్ళు అదిమిపట్టి గొంతులో జీరను పక్కకు నెట్టి చెబుతున్న సత్యవతిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది శారద. ‘‘అలాగే సత్యవతి. పెళ్ళి వద్దు, పాడూ వద్దు. చదువుకుంటూ మహిళా సంఘంలో పని చేద్దువుగాని. ఇవాళ నాదెళ్ళవారి పాలెంలో మహిళా సంఘం మీటింగు జరుగుతోంది. వెళ్దువుగాని. అక్కడ బోలెడుమంది అమ్మాయిలు పరిచయమవుతారు. నీకు స్నేహం కలుస్తుంది వాళ్ళతో. ధైర్యం వస్తుంది. ఒంటరిదానివి కాదు నువ్వు. ఏమీ భయం లేదు. పద, కాసేపు పడుకుని సాయంత్రం వెళ్తావా? ఇప్పుడే వెళ్తావా? ఇప్పుడైతే మా పద్మావాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళవచ్చు’’. శారదను చూస్తే ఆమె మాటలు వింటే సత్యవతి బెరుకంతా పోయింది.
‘‘ఇప్పుడే వెళ్తానండి’’ అని ఉత్సాహంగా లేచింది.
శారద సత్యవతిని నాదెళ్ళవారిపాలెం వెళ్ళే వాళ్ళకు అప్పజెప్పి, గత రెండు రోజుల సమావేశాల వివరాలు రాసుకోవటానికి కూర్చుంది. కాగితం మీద కలం పెడితే ఆ పదిహేనేళ్ళ సత్యవతి మాటలే గుర్తొస్తున్నాయి. దుర్గాబాయి ప్లీడరు పట్టా పుచ్చుకుని దిగిన ఫోటో ఎందరు ఆడపిల్లల మనసుల్లో ఎన్ని కలలు రేపిందో. అట్లా చదవాలనీ, అంతెత్తు ఎదగాలనీ ప్రపంచమంతా చూడాలనీ ఆడపిల్లల గుండెల్లో ఎన్ని కలలు రేపిందో, ఎన్ని కోరికలు గూడుకట్టుకుని ఉన్నాయో. శారద తెలియని భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరయింది. సంతోషం, దిగులు రెండూ కమ్ముకొచ్చి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ గుర్తొచ్చింది శారదకు.
రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ దగ్గరకు పెళ్ళి చేయమంటూ వితంతువులు వచ్చేవారు. ఆమె వాళ్ళను సొంత పిల్లల్లా చూసుకునేది. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళి ఒద్దంటూ ఇళ్ళనుండి బయటపడుతున్నారు. చదువు కోసం, జ్ఞానం కోసం తపిస్తున్నారు. అమ్మమ్మ అనుకున్న మార్పు వస్తుంది. కేవలం పెళ్ళే కాదు విద్య కావాలంటున్నారు ఆడపిల్లలు. చదువుకుంటే వాళ్ళకేది మంచో, ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది. అందుకేగా గురజాడ కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ పెళ్ళి చేయకుండా చదువుకునే దారి చూపాడు. ఆ దారిలో నడుస్తున్నారు అమ్మాయిలు. ఆ రోజు వీరేశలింగం గారు చేసిన పనిని ఆయన వారసులుగా కమ్యూనిస్టులు చేస్తున్నారు. ఔను… ఆయనకు, రాజ్యలక్ష్మమ్మకు వారసులు తామే… కమ్యూనిస్టులమే. శారదకు గుండెల నిండా ఆనందం పొంగింది. కమ్యూనిస్టులు వీరేశలింగం గారి భావాలను, ఆయన చేసిన పనిని స్వంతం చేసుకోవాలి. ఆయనను గుర్తు చేసుకుంటూ సభలు జరపాలి ఇంకా ఎక్కువగా. ఈ సారి దానిని పార్టీ కార్యక్రమంలో భాగంగా చేయాలి. స్త్రీలలో చైతన్యం పెరగాలన్నా, స్త్రీల గురించి పార్టీ సభ్యులతో చైతన్యం పెరగాలన్నా అదొక మంచి మార్గం. కొత్త కొత్త కార్యక్రమాలెన్నో శారద మనసులో ఆకారం దాల్చుతున్నాయి. అన్నిటినీ సూర్యంతో చెబుతోంది. రచయితలు, సాహిత్య కారులంటే అతనికెంతో ఇష్టం.
… … …
అన్నపూర్ణ ఏ క్షణమైనా అరెస్టు కావొచ్చునని అందరూ అనుకుంటున్నారు. అబ్బయ్య తన ఉద్యోగం వదలడానికి సిద్ధంగా లేడు. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి వంతు పనీ అన్నపూర్ణే చేయాలని. పిల్లలను అమ్మమ్మ గారి ఊరు పంపించారు. అన్నపూర్ణ రోజుకో ఊరు తిరిగి క్విట్‌ ఇండియా ప్రచారం చేస్తోంది. ఆమె వెళ్ళిన చోటల్లా ఏదో ఒక బ్రిటిష్‌ వ్యతిరేక చర్య చేయకుండా, చేయించకుండా వెనక్కు రావటం లేదు. తెనాల్లో రైలు పట్టాలు పక్కకు తొలిగాయి. ఇంకో ఊళ్ళో టెలిఫోన్‌ వైర్లు తెగాయి. మరో చోట ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్ళు తగలబడ్డాయి. ఏ రోజు ఎక్కడుంటుందో తెలియకుండా జాగ్రత్త పడుతోంది. పోలీసులు అబ్బయ్యను ప్రశ్నించి, రోజూ పోలీస్‌స్టేషన్‌కొచ్చి కనపడమని చెప్పి వదిలేశారు. వారి ఇంటి మీద నిఘా పెట్టారు. భర్తను కలుసుకోవటానికి అన్నపూర్ణ వచ్చినా, ఆమెను కలుసుకోవాలని అబ్బయ్య కదిలినా తమ పని సులువవుతందని పోలీసులు అబ్బయ్యను అరెస్టు చేయలేదు. అసలు సమస్య అన్నపూర్ణ అని వాళ్ళకు తెలుసు. ఒకే సమయంలో, ఒకే సందర్భంలో అన్నపూర్ణ రహస్య మీటింగులు జరపటమూ, తను బహిరంగంగా తిరిగి మాట్లాడగలగటమూ చిత్రమనుకుంది శారద. అన్నపూర్ణ అరెస్టు కాకుండా ఉండాలని తనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఆశ్రయం అడగటం, ఆ సంగతి అన్నపూర్ణకు తెలియపరచటం ఈ పనిలో ఏమరుపాటు లేకుండా ఉంది శారద.
నందిగామ దగ్గర ఊళ్ళో తెలంగాణా నుంచి వచ్చిన నాయకులతో రహస్య సమావేశానికి రకరకాల మార్గాల్లో ప్రయాణం చేసి వెళ్ళింది శారద. తెలంగాణా పోరాటానికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఎలా మద్దతివ్వాలా, ఆహారం, ఆయుధాల వంటి వారి అవసరాలను ఎలా తీర్చాలా అని ఇరువైపుల వాళ్ళూ కూర్చుని మాట్లాడుకున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన గురించి చెబుతుంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ రక్తం ఉడుకెక్కుతోంది. అందులోనూ వచ్చింది యువకులు. వాళ్ళల్లో చలసాని శ్రీనివాసరావునున చూస్తే శారదకు ముచ్చటేసింది. ఒట్టి ఉద్రేకమే కాదు అతని మాటల్లో వివేకం ఉట్టిపడుతుంది. తెలంగాణా ప్రాంతంలోని భూస్వామ్య సమాజానికీ, ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య సమాజానికీ తేడా చక్కగా వివరంగా చెప్పాడు. ఆంధ్ర ప్రాంతంలో కూడా రైతుల దయనీయ పరిస్థితి గురించి అంకెలతో సహా చెప్పాడు. శారద అతనిలో భవిష్యత్తుని చూసింది. కాట్రగడ్డ వెంకట నారాయణ, బాపయ్య, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, వాసుదేవరావు… ఆ యువకులను చూస్తే శారదకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు తమ ఇంట్లో చేరిన యువ బృందం గుర్తొచ్చింది. వాళ్ళల్లో కొందరిప్పుడు కాంగ్రెస్‌, కొందరు కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నారు. మరి కొందరు లోహియాకు అభిమానులై సోషలిస్టులయ్యారు. ఈ యువకులందరూ కమ్యూనిస్టులు. వాళ్ళను చూస్తే శారదకు గర్వంగా అనిపించింది. వాళ్ళందరికంటే తను పెద్దది. కానీ శారదకు అలా అనిపించలేదు. ఈ యువకులు తనకంటే నాలుగడుగులు ముందే ఉన్నారనిపించింది. మా తరం ఈ తరాన్ని సృష్టించింది. వీరికి తిరుగులేదు. వీరి వయసులో తమకున్న అస్పష్టతలు, అయోమయాలు, సందేహాలూ వీరికి లేవు. ఎలాంటి యువతరం ఇది. వీళ్ళు దేశానికి కొత్త రూపాన్నిస్తారు. భవిష్యత్తంతా వీరిదే. వీళ్ళ నాయకత్వంలో నటాషా పనిచేస్తుందని అనుకుంటే మురిపెంగా అనిపించింది శారదకు.
చర్చలు రెండు రోజులపాటు రాత్రింబగళ్ళూ సాగాయి. నైజాంలో రాబోయే గడ్డు రోజులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రణాళిక ఒకటి రాసుకున్నారు. రెండోరోజు రాత్రి పదిగంటల తర్వాత శారద నందిగామ నుంచి బయల్దేరింది. కొంతదూరం పొలాల గుండా నడిచి రోడ్డెక్కితే అక్కడేదో బస. తెల్లారేవరకూ అక్కడ ఉండేందుకు డాక్టరు గారి కోసం ఏర్పాట్లున్నాయి. బాగా తెల్లారాక ఆవిడ బండిలో దగ్గరున్న రైల్వే స్టేషన్‌కి వెళ్ళి రైల్లో బెజవాడ వెళ్ళిపోవాలని అన్ని జాగ్రత్తలతో ముందే నిర్ణయమయింది. శారదకు తోడుగా చలసాని శ్రీనివాసరావునీ, నారాయణనీ, వెంకటరెడ్డినీ పంపారు. శారద నడుస్తూ వాళ్ళతో మెల్లిగా మాట్లాడుతోంది. శ్రీనివాసరావు ఉత్సాహంగా తన కుటుంబం గురించి చెబుతున్నాడు. ‘‘మా ఇంట్లో అందరం కమ్యూనిస్టులమే డాక్టరు గారు. మా నాన్న బసవయ్య మాకు పెద్ద అండ. మేమేం చేసినా మావైపే మాట్లాడతారు. మా చెల్లెళ్ళు మన పాటలు పాడుకుంటూ పెరుగుతున్నారు. అందరూ చదువుకుంటున్నారు. మా చిన్న తమ్ముడు ప్రసాదున్నాడాండీ, వేలెడు లేడు జెండా పుచ్చుకుని పరిగెత్తుతాడు. బాల సంఘం, యువ సంఘం ఎక్కడ చూడు వాడుండాల్సిందే. మా చెల్లెళ్ళు కూడా మీలా డాక్టర్లు కావాలని మా నాన్న చెబుతుంటాడండీ. ఆడపిల్లలందరికీ మంచి చదువులుంటే మన దేశం తొందరగా మారుతుంది. మన మహిళా సంఘంలో చూడండి, కాస్త చదువు నేర్చుకునేసరికి ఆడవాళ్ళ ముందు, వాళ్ళ ఉపన్యాసాల ముందు, నాటకాలు, బుర్రకథలు చెప్పే వాళ్ళ నేర్పు మేమెవరం ఆగలేం డాక్టరుగారూ. మహిళా ఉద్యమం గురించి మీకు నేను చెప్పేదేముంది. అదంతా మీ సృష్టే కదా’’. ‘‘నేనేం చేశాను వాసూ! మీ అందరూ గ్రామాల్లో వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. వాసూ మీరంతా నవ యువకులు. ఒక్క విషయం చెబుతాను. ఆలోచించండి. ఇప్పటికిప్పుడు కాదు, ప్రతిరోజూ ఆలోచించండి’’.
‘‘చెప్పండి డాక్టర్‌ గారూ’’
పొలాల మధ్య ఆ సన్నని డొంకదారిలో మసక వెన్నెల్లో బాగా చూసుకుంటూ, ఆగుతూ నడుస్తున్నారు. పైన ఆకాశంలో నక్షత్రాలు. రెండువైపులా ఏపుగా పెరిగిన జొన్నచేలు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో చిన్నగా మాట్లాడుతున్న శారద గొంతు సెలయేటి పాటలా ఉంది. ‘‘వాసూ, మీరు ఆలోచించండి. స్త్రీలు మహిళా సంఘాల్లోకి బాగా వస్తున్నారు. పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు. కానీ వారు నాయకులుగా ఎదగగలిగే పరిస్థితి ఉందా? వాళ్ళకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నారా? మనందరం ఏం చెబితే అది చేసే అనుచరులుగా తయారు చేస్తున్నామా? నిజంగా వాళ్ళకేం కావాలి? వాళ్ళ ఆశలేమిటి? కలలేమిటి? స్త్రీ పురుష సమానత్వం గురించి మనం వాళ్ళకు కొత్తగా చెబుతున్నదేమిటి? స్త్రీలకు సమానత్వమంటే అర్థం ఏమిటని మీరంతా ఆలోచించండి. ఆడవాళ్ళను సమానంగా చూడటానికీ, వాళ్ళను ఉద్ధరించటానికీ తేడా ఉంది. ఆ తేడా గురించి ఆలోచించండి’’ ఒక ఆర్తితో చెబుతున్న ఆ మాటలు ఆ యువకుల మనసుల్లో ఏదో సంచలనం రేపాయి. వాసు, నారాయణ, వెంకటరెడ్డీ కూడబలుక్కున్నట్టు ‘‘మాకందరికీ మీరు చెప్పాల్సింది చాలా ఉంది డాక్టరుగారు. మేం తొందరలో యువజన సమావేశం ఏర్పాటు చేశాం. మీరు వచ్చి మాకు పాఠాలు చెప్పాలి’’.
ఇదే మాట పెద్ద నాయకులతో చెబితే వారు నవ్వి తీసిపారేసేవారు. ఈ యువకులు ఆలోచిస్తున్నారు. తెలుసుకోవాలనుకుంటున్నారు. వీరే గొప్ప ఆశ పార్టీకి, దేశానికి, వీరి కుటుంబాలకు కూడా. శారదకు తృప్తితో, ఆశతో గుండె నిండిపోయింది.
తన ముందూ, వెనకా నడుస్తున్న ఆ యువకులను ఆ మసక వెన్నెల్లో కళ్ళారా చూస్తుంటే సూర్యోదయం త్వరలో జరుగుతుందనిపించింది. ఆ రాత్రి, తన తర్వాతి తరం యువకులతో కలిసి నడిచిన ఆ రాత్రి ఒక సుందర భవిష్యత్‌ స్వప్నాన్ని చేరువ చేసిన రాత్రి అనుకుంది శారద. తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో అదొకటి అనుకుంది.
మాటలు. ప్రశ్నలు. సమాధానాలు. వినిపించీ వినిపించని నవ్వులు, ఆ గతుకుల డొంకదారి విజయ పథమే అనిపించింది వారందరికీ. తారు రోడ్డు ఎక్కేసరికి తెల్లవారు రaాము కావొస్తున్నట్లుంది. వీరు నిలబడిన చోటికి దూరం నుంచి ఎవరో నడిచి వస్తున్నట్లు లీలగా కనబడుతోంది.
‘‘ఈ వేళప్పుడు ఒక్కరే ఇక్కడ’’ వెంకటరెడ్డి మాటలే అందరి మనసుల్లో. ఆ ఆకారం దగ్గర కొచ్చేసరికి శారద గుర్తు పట్టేసింది.’’
‘‘అబ్బయ్యా, నువ్వా. ఏంటోయ్‌ ఈ వేళప్పుడు…’’
‘‘ఇవాళ సాయంత్రం అన్నపూర్ణను అరెస్టు చేశారు. నందిగామ జైల్లో ఉంది. ఆమెను చూసి, మా అత్తగారి ఊరు వెళ్ళి పిల్లల్ని చూసి వస్తున్నాను.’’
మీరేమిటిక్కడ అని అబ్బయ్య అడగలేదు. అందరివీ రహస్య సమావేశాలే. రహస్య జీవితాలే.
‘‘పిల్లలెలా ఉన్నారోయ్‌’’
‘‘బాగా దిగులు పడ్డారు. పెద్దది నాతో వచ్చేస్తానని ఏడుపు. సముదాయించి వాళ్ళను నిద్రపుచ్చి నేనిలా పారిపోయి వస్తున్నా’’ అబ్బయ్య గొంతు నిండా దిగులే.
‘‘నారాయణా… అబ్బయ్య తెలుసుగా’’
‘‘తెలుసండీ’’ అన్నారందరూ.
‘‘మా యువరక్తం. దేశ భవిత’’ అంది శారద అబ్బయ్యతో గర్వంగా.
‘‘నేను వెళ్తాను. అన్నపూర్ణను తొందరగానే విడుదల చేస్తారనుకుంటా. జైలు కిటకిటలాడుతోంది. మీరు జాగ్త్రత్తగా వెళ్ళండి’’. అబ్బయ్య మరోవైపు వెళ్ళాడు.
శారద కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన ఇంటికి ఆమెను చేర్చి వాళ్ళు ముగ్గురూ మళ్ళీ చేలకడ్డంబడ్డారు.
… … …
బెంగాల్‌ కరువు గురించి చిన్నగా మొదలైన వార్తలు కొన్ని రోజుల్లోనే దేశాన్ని ఒణికించేంత పెద్దవయ్యాయి. బెంగాల్‌ ప్రజలకు సహాయం చెయ్యాలనే ప్రచారంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కమ్యూనిస్టు యువతీ యువకులు. వారిలో కొందరు పాటలు రాశారు. మరికొందరు నాటకాలు తయారుచేశారు. కొందరు ఒక బృందంగా ఏర్పడి బెంగాల్‌ వెళ్ళి కరువుని స్వయంగా అధ్యయనం చేయాలనీ, దాంతోపాటు వాలంటీర్లుగా అక్కడ పనిచేయాలనీ నిశ్చయించుకున్నారు. ఆ బృందంలో కామేశ్వరరావు ఉన్నాడని తెలిసి శారదకు ఆందోళనగా ఉంది. కామేశ్వరరావు శారదకు మంచి స్నేహితుడు. మేధావి. బాగా చదువుతాడు. శారదతో దీటుగా చర్చలు చేయగల సామర్ధ్యం ఉన్నవాడు. కానీ అతి సున్నిత హృదయుడు. ఎదుటివారు బాధపడుతుంటే చూడలేడు. వారి కళ్ళు తడికాకముందే ఇతని చెంపలు తడిసిపోతాయి. అలాగే హఠాత్‌ నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఇలాంటివాడు ఆ కరువు దృశ్యాలు చూసి భరించగలడా అని శారదకు భయం వేసింది. వార్తల్లో చదువుతుంటేనే ఒళ్ళు జలదరించి, అన్నం సహించటం లేదు. కామేశ్వరరావు అవన్నీ చూసి మనిషిలా తిరిగి రాగలడా అనిపించింది. కానీ ఏం లాభం? ఎవరు చెప్పినా వినే మనిషి కాదు. ఈ బృందంతో వెళ్ళకుండా బలవంతంగా ఆపినా ఒక్కడే ఏదో ఒకరోజు కలకత్తా రైలు ఎక్కేయగల సమర్ధుడు. దానికంటే పదిమందితో కలిసి వెళ్ళటమే నయం అనుకుని ఆందోళన అణుచుకుంది. సూర్యం కూడా అదే నయమన్నాడు. ‘‘మధ్యలో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా తీసుకురావటానికి మనవాళ్ళుంటారు. వెళ్ళనివ్వక్కా’’ అన్నాడు.
మూర్తితో చెబితే ‘‘నువ్వు ఇన్ని విషయాలు ఎందుకు పట్టించుకుంటావు. ఒకవైపు ప్రజాయుద్ధ ప్రచారం. మహిళా సంఘం సభలు. నీ హాస్పిటలు, పార్టీ సమావేశాలు వీటన్నిటితో మళ్ళీ కామేశ్వరరావు ఏమవుతాడు, సోమేశ్వరరావు ఏమవుతాడు అని ఒక్కొక్కరి గురించి పట్టించుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఒక మనిషి చేసే పనులేనా నువ్వు చేసేది? అందరి బాధ్యతలూ నువ్వేనా మోసేది? కామేశ్వరరావు సంగతి తర్వాత కాస్త నటాషా గురించి కూడా ఆలోచించు’’ అని మనసులో కోపమంతా వెళ్ళగక్కి వెళ్ళాడు.
శారద ఈ ఉరుములేని పిడుగుల జడికి ఆశ్చర్యపోయింది. ఏమయింది మూర్తికి? ఏదో జరిగింది. లేకపోతే ఇంత ఉద్రేకపడడు అనుకుని మేడమీది నుంచి కిందికి దిగింది. కింద సుబ్బమ్మ నటాషాని ఎత్తుకుని నిలబడి ఉంది.
‘‘డాక్టరుగారి కూతురికి కాస్త ఒళ్ళు వెచ్చబడిరది. డాక్టరు గారి మొగుడికి కోపం వచ్చింది’’ అంది తమాషాగా.
శారదకంతా అర్థమైంది. నటాషాను ఎత్తుకొని మేడమీదికి వెళ్ళి మందు తాగించి నిద్రబుచ్చి మళ్ళీ భుజాన వేసుకుని తల్లికి అప్పగించింది.
‘‘ఇవాళ అన్నం పెట్టకమ్మా. పాలు చాలు. రేపటికి తగ్గిపోతుంది.’’
‘‘నీ కూతురి గురించి మీ ఆయనకు దిగులు. నా కూతురి గురించి నాకు దిగులు. మరీ పనులెక్కువవుతున్నాయి. తిండి తినటం లేదు. నిద్ర పోవటం లేదు. ఎట్లాగమ్మా ఇట్లాగయితే’’.
‘‘ఏం ఫరవాలేదమ్మా. మా అమ్మ నా పొట్ట మాడనివ్వదు. ఎలాగోలా నిద్రబుచ్చుతుంది’’.
సుబ్బమ్మ నవ్వి ‘‘మాటలు చెప్తావ్‌. మూర్తి మాత్రం బాగా దిగులుపడుతున్నాడు. అతను మద్రాసు నుంచి వచ్చినా నీకు తీరిక దొరకదు. అక్కడున్నా నీ గురించిన బెంగే కదా పాపం. పిల్ల కూడా నన్ను ఒదిలి తొందరగా అతని దగ్గరికి పోదు. ఈ దిగుళ్ళతో సతమతమవుతున్నాడు. తనూ ఇక్కడికే వచ్చేస్తానంటున్నాడు’’.
‘‘వచ్చి ఇక్కడేం చేస్తాడు? మద్రాసు పనులు ఎవరికి అప్పజెప్పి వస్తాడు? అతనిక్కడికి వస్తే నాకు మాత్రం కాస్త తెరిపిగా ఉండదా? కానీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయమ్మా. అందరం సర్దుకుపోవాలి’’ అంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది శారద.
మూర్తిని బెజవాడకు వచ్చి పూర్తికాలం ఇక్కడి పార్టీ పనులు చూసుకోమంటున్నామని రాష్ట్ర కమిటీ నుంచి వార్త వచ్చిన రోజు శారద సంతోషించింది. ముఖ్యంగా నటాషా, మూర్తి దగ్గరవుతారని నిశ్చింతగా అనిపించింది. ఇంట్లో వచ్చిన ఈ మార్పే కాదు బైట వాతావరణంలో కూడా మార్పు వస్తోంది.
ప్రపంచ యుద్ధంలో హిట్లరు పరాజయం తప్పదని గట్టిగా రుజువవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజలకు దగ్గరవుతుంటే కమ్యూనిస్టులు ప్రజాయుద్ధ పంథాతో దగ్గరయ్యారు. అది పై తరగతి, మధ్య తరగతి వర్గాలలో ఎక్కువ కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో చిన్న రైతులలో, కూలీలలో కూడా వారు గట్టి పట్టు సంపాదించారు. క్విట్‌ ఇండియా అంటున్న ప్రజల మనసుల్లో కూడా సోవియట్‌ యూనియన్‌ గురించి ఆసక్తిని పెంచారు. దాని ద్వారా సోషలిజం అనే భావనను బలంగా వ్యాపింపచేయగలిగారు. శారదాంబ, ఆమె చుట్టూ ఉన్న మహిళా బృందం చేసే పనులు మామూలు ప్రజలకు ఆశ్చర్యంగా ఉండేవి కానీ వారి పట్ల విముఖత కలగలేదు. ఒకవైపు బోసు, మరొకవైపు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నా, కమ్యూనిస్టు భావాలు ప్రజలకు దగ్గరయి కమ్యూనిస్టుల మీద గౌరవం పెరిగిందంటే అది శారద, రామకృష్ణయ్య, ఈశ్వరయ్య, వెంకట్రావు, సూర్యావతి వంటి వాళ్ళ నాయకత్వ ప్రభావమే.
జర్మనీ ఓడిపోయిన రోజున ప్రజల్లో పెద్ద పండగలా ఉత్సాహం నింపగలిగారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది అసలు సమస్య. ప్రజలలోకి ఎట్లా వెళ్ళాలి. ప్రజాయుద్ధ్ద పంథా తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కార్యక్రమం ఏమిటి? ఈ చర్చలు జరుగుతుండగానే ఒకవైపు ఎన్నికలు, ఇంకోవైపు తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటంలో పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం, బెంగాల్‌ కరువు గురించి పట్టించుకుని పనిచేయాలనే నిర్ణయం, వీటన్నిటికీ తోడు కళా సాహిత్య రంగాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు, రచయితల సంఘాల ఏర్పాట్లు, నాటకాలు… ఒకటి కాదు ఆలోచించుకునే వ్యవధానం లేకుండా పనులు వచ్చి మీద పడుతున్నాయి.
మూర్తి మద్రాసు నుంచి బెజవాడకు వచ్చేసిన రెండు నెలలకు అప్పటివరకూ శారద చూస్తున్న కృష్ణాజిల్లా బాధ్యతలను మూర్తికి అప్పగించింది పార్టీ.
శారదకు ఆ మార్పెందుకో అర్థం కాలేదు.
‘‘నువ్వు కొత్తగా వచ్చావు. ఇక్కడి పరిస్థితుల గురించి అవగాహన లేదు. పార్టీ నిన్ను గౌరవించటానికన్నట్లు, నీకో పని చూపటానికన్నట్లు ఈ బాధ్యత ఇచ్చిందనుకో, నువ్వెట్లా ఒప్పుకున్నావు? నావల్ల కాదని ఎందుకు చెప్పలేకపోయావు?
శారద ప్రశ్నకు మూర్తి దగ్గర సమాదానం సిద్ధంగానే ఉంది.
‘‘నువ్వు చాలా అలిసిపోతున్నావు శారదా. ఒకవైపు నీ ప్రాక్టీసు, ఇంకోవైపు మహిళా ఉద్యమం. ఇప్పుడు తల్లివయ్యావు. వీటన్నిటితో జిల్లా అంతటినీ నీ భుజాలకెత్తుకోవటం కష్టం. నా భుజాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడి విషయాలు నీ ద్వారా నాకు చాలా వరకు తెలుసు. తెలియనివి తెలుసుకుంటాను. పార్టీ నిర్ణయం వెనక కూడా ఇవన్నీ ఉన్నాయి’’.
‘‘గృహిణి, భార్య, తల్లి… ఈ పదాలు నాకు నప్పవు, నచ్చవు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందువల్ల నా జీవితం ఏమీ మారదు. మారనవసరం లేదు’’ విసుగ్గా అంది.
‘‘మారుతుందో మారదో ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది గానీ, నీకు బాధ్యతలు పెరిగిపోయాయి. డాక్టర్‌గా నువ్వు చెయ్యవలసినంత చెయ్యలేకపోతున్నావు. నాకు ఈ జిల్లా పనుల గురించి తెలియజెప్పటానికి నువ్వున్నావుగా’’ శారదకు ఏదో చికాకు మనసంతా. కానీ పార్టీ నిర్ణయం కాదనటం తేలిక కాదు. తను జిల్లా పార్టీ నాయకత్వం వదలకూడదని కాదు. తన స్థానంలో రావటానికి అర్హులైనవారు చాలామంది ఉన్నారు. సుబ్బారావుగారే ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచీ పైకి వచ్చిన కార్యకర్త. నిజమైన కమ్యూనిస్టు. ఊరికే మాటలు చెప్పి తప్పించుకునే మనిషి కాదు. తన జీవితంలో ఆచరించే వ్యక్తి. మూర్తికి జిల్లా బాధ్యత అప్పగించటమంటే కేవలం తన భర్త కాబట్టే. తమ పెళ్ళి కాకపోతే అతనిక్కడికి రానే రాడు కదా అంత స్పష్టంగా కనపడుతున్న విషయానికి మూర్తి కళ్ళెందుకు మూసుకున్నాడు.
ఏదేమైనా పార్టీ నిర్ణయించినపుడు తనకు ఇన్ని ఆలోచనలు అనవసరం అని అక్కడితో సమాధానపడిరది శారద.
సత్యవతి నాదెళ్ళ వారి పాలెంలో మహిళా సంఘం సభ తర్వాత వాళ్ళన్నయ్య దాసుని కలిసింది. దాసు పార్టీ నాయకులతో మాట్లాడి ఆమెను రాజమ్మతో కలిసి పార్టీ ఆఫీసు వెనుక గదిలో ఉండి మహిళా సంఘం పనులు చేసేలా ఏర్పాటు చేశాడు. రాజమ్మది, సత్యవతిది దాదాపు ఒకే వయసు. కాస్త రాజమ్మే పెద్దదేమో. ఇద్దరూ బాగా కలిసిపోయారు. రాజమ్మ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి మహిళా సంఘం ఆశయాలను వివరిస్తూ మహిళలను సమీకరించే పని చేస్తోంది. సత్యవతికి బెజవాడలో మహిళా సంఘం పనులు కొన్ని అప్పగించి రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. నెలకు చెరొక 20 రూపాయలు ఇచ్చేవారు. అద్దె, భోజనం, మిగిలిన ఖర్చులన్నీ అందులోనే. రాజమ్మకు గ్రామాలకు వెళ్ళినపుడు అక్కడ మంచి భోజనం దొరికేది. సత్యవతికి వంట సరిగా రాదు. మొదట్లో అవస్థ పడినా రాన్రానూ అలవాటు పడిరది. పార్టీ ఆఫీసులో, మహిళా సంఘంలో చురుగ్గా పనిచేస్తూ, కుదురుగా ముచ్చటగా ఉంటూ, ఎంతో సంస్కారంగా మాట్లాడే సత్యవతి పార్టీ సానుభూతిపరులైన కొందరి యువకుల మనసుల్లో కల్లోలం రేపింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనే కోరికను పార్టీ పెద్దలతో చెప్పారు. అవివాహితుల బాధ్యత పెద్ద బాధ్యత అని పార్టీ భావించేది. వాళ్ళకు పెళ్ళి చేస్తే తమ గుండెల మీద బరువు తగ్గి, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అనే భావన తెలిసీ తెలియకా అందరిలో ఉండేది. దాంతో సత్యవతికి ఇక్కడ కూడా సంబంధాలు రావటం మొదలైంది. సత్యవతి ప్రతి సంబంధాన్నీ తిరస్కరించేసరికి పార్టీ నాయకులకు చికాకు, అనవసరమే అయినా వచ్చింది. ఈ సత్యవతి సంగతేమిటో తేల్చమని మహిళా సంఘ నాయకులకు ఆదేశాలిచ్చారు. అది శారద వరకూ వచ్చింది. శారద జరిగిందంతా తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ‘‘సత్యవతి పెళ్ళి తప్పించుకుని చదువుకోవాలని వస్తే చదువు గురించి ఆలోచించకుండా సంవత్సరంలో నాలుగైదు పెళ్ళి సంబంధాలు ఆమె ముందు పెట్టటం ఏమిటి? ఆ అమ్మాయి వద్దంటే ఈ అమ్మాయికి ఎవరూ నచ్చరేమిటని కోపగించుకుని అదొక చర్చ చేయటమేమిట’’ని అందరినీ మందలించి, ‘‘మీకు వీలైతే ఆ అమ్మాయిని బెనారస్‌ మెట్రిక్‌కు తయారు చేయండి. లేదంటే జనరల్‌ పుస్తకాలు చదువుతూ ఆ అమ్మాయి తనే తంటాలు పడి చదువుకుంటోంది. మహిళా సంఘంలో పని చేస్తోంది కాబట్టి ధైర్యం, ఆత్మ విశ్వాసం, లోక జ్ఞానం పెరుగుతాయి. ఆ పిల్లకు పదహారేళ్ళే, చిన్నపిల్ల. ఇది కూడా బాల్య వివాహమే’’ అంటూ బాగా చిరాకుపడిరది. శారద మాట్లాడిన తర్వాత ఇక సత్యవతికి పెళ్ళి చేయాలనే ఆలోచనను అందరూ మానుకున్నారు. సత్యవతి తన పని తాను నిశ్చింతగా చేసుకుంటోంది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.