విషయం తెలియడంతోనే రేణుక దగ్గర ఉన్నపళంగా వాలింది సృజన. ఇంట్లో చాలామంది ఉంటారని… తనతో మనసు విప్పి మాట్లాడటం కుదరదని ఊహించింది. కానీ తన ఊహ తలకిందులైంది. ఆమె, వాళ్ళబ్బాయి చైతన్య, కూతురు అభిజ్ఞ తప్ప మరో ప్రాణి కన్పించలేదు. తను ఇంట్లో కాలు పెట్టిందో లేదో మీదపడి ఒకటే ఏడుపు. ఊహించని చావు.
జీర్ణం కావడం లేదు. ఐనా ఆ మరణం తనకే నమ్మశక్యంగా లేదు. ఆమె ఎలా జీర్ణించుకుంటుంది? కొంతసేపటికి ఆమె గొంతు అలసిపోయింది. మరికొంతసేపటికి కళ్ళు కూడా.
‘ఎలా జరిగింది?’
‘గుండె ఆగిపోయింది’
‘మేం మొన్న వచ్చినపుడు చురుగ్గానే కనిపించారు కదా! ఇంతలోనే..?’
‘అంతా నా దురదృష్టం’
‘మీ అన్నయ్య, వదిన వాళ్ళు రాలేదా?’
‘నా పుట్టింటి వాళ్ళే కాదు, అత్తింటి వాళ్ళూ… అంతా స్ట్రైకులో ఉన్నారు. ఆయన కళ్ళూ, కిడ్నీలూ దానం చేయడం వారెవరికీ ఇష్టంలేదు. భౌతిక కాయం దహనం చేసి పంచభూతాల్లో కలపాలట. అదే మన సంప్రదాయమంటూ ఒకటే వాదన’ అంది రేణుక జీరబోయిన గొంతుతో.
‘అయ్యో అంత మంచి పనిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా…??’ నోరు తెరిచింది సృజన.
‘దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో…’
‘అమ్మా! పిన్ని ఫోన్’ అంటూ రేణుక చేతికి ఫోన్ ఇచ్చింది అభిజ్ఞ.
‘అక్కా! నేను సంధ్యను. ఇంతకీ పెద్ద కర్మ గురించి మీ అన్నయ్య వాళ్ళకు చెప్పారా?’
‘చూడు సంధ్యా! ఆ విషయాలన్నీ చైతన్య చూసుకుంటున్నాడు. వాడితో మాట్లాడు’ అంటూ ‘ఫోన్ అన్నయ్యకివ్వు’ అంటుండగానే హాల్లోకి వచ్చిన చైతన్య ఫోన్ అందుకున్నాడు. ‘ఆఁఁ పిన్నీ చెప్పండి. ఏంటీ? పెద్ద కర్మా! అట్లాంటిదేమీ లేదే. సంప్రదాయమంటూ తెల్లచీర కట్టించడం, గాజులు, బొట్టు తీయడం…వంటి పద్ధతులేం లేవు. ఆదివారం బంధు మిత్రులను పిలిచి కండోలెన్స్ పెట్టాలనుకుంటున్నాం’ అని ఓ నిమిషం పాటు ఆగి ఇక అవతలి గొంతును పట్టించుకోకుండా ఠపీమని ఫోన్ పెట్టేశాడు చైతన్య కోపంతో.
‘సంప్రదాయం ప్రకారంగా అన్నీ జరక్కపోతే బావగారిని అవమానించినట్లేనని ఏవేవో కబుర్లు చెప్తోంది పిన్ని’ విసుగ్గా తల్లితో చెప్పాడు చైతన్య. ‘ఇదీ వరుస సృజనా! ఆయన చనిపోయి నేనేడుస్తుంటే…’ దుఃఖంతో రేణుక మరి మాట్లాడలేకపోయింది.
‘ఏమైనా ఆదివారం నువ్వు కూడా రా. మర్చిపోకు. నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది.’
‘ఎందుకు రాను? కచ్చితంగా వచ్చి తీరుతాను, నా స్నేహితులను తీసుకుని మరీ వస్తాను. మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేద’ని నొక్కి చెప్పి ఎంతో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేసి సాయంత్రం వెళ్ళిపోయింది.
… … …
‘హలో రాధిక! నేను సృజనను. బాగున్నావా?’ ‘నాకేం. నిక్షేపంగా ఉన్నాననుకో.’
‘నువ్వెప్పుడూ నిక్షేపమని నాకు తెలిసిందేననుకో. ఇంతకీ ఏం సమాచారాలు. నీ సేవా కార్యక్రమాలెట్లున్నై. మీ స్పందన సంస్థ ఎట్లా నడుస్తున్నది?’ ‘మన సమాజంలో సమస్యలకు కొదవ లేదు కదా! తప్పనిసరిగా స్పందన వాటి వెన్నంటే ఉండాలి. తప్పదు’
‘మీ స్పందన ఇప్పుడో చోట అవసరమౌతోంది’ అంటూ ఆదివారం జరగబోయే తతంగం గురించి వివరంగా చెప్పి తప్పక రావాలని, వచ్చి తీరాలని చెప్పింది. సృజన ఇచ్చిన సమాచారం తన సంస్థ సభ్యులందరికీ మెసేజ్ చేసింది రాధిక. అంతా అనుకున్నట్టే ఆదివారం రేణుక వాళ్ళింటికి ఏకంగా ఒక వ్యాన్ మాట్లాడుకుని బయలుదేరారు. వ్యాన్ దిగుతున్న సృజనను, గేటు ముందరే కొన్ని ఆడ, మగ శాల్తీలు కూర్చొని ఉండడం ఆలోచనలో పడేసింది. రాధికకు అదే ఆలోచన వచ్చిందేమో ‘అదేంటి గేటు ముందర జనం?’ మనసులో సందేహాన్ని పైకే అంది. ‘నిరసన, ప్రతిఘటనల వంటి కార్యక్రమాలేమైనా ఉన్నాయేమో…?’ అంటూ సృజన
‘చూద్దాం… అదీను’ అనుకుంటూ లోపలికి ఎంటరవుతుండగానే చైతన్య ఎదురొచ్చి
‘రండాంటీ’ అని అక్కడే రౌండుగా ఏర్పాటు చేసిన కుర్చీల దగ్గరికి తీసుకుపోయి కూర్చోమని చెప్పి అమ్మను తీసుకొస్తానంటూ పైకి వెళ్ళినవాడు పదినిమిషాల్లో వాళ్ళమ్మతోపాటు వచ్చేశాడు. రేణుక వచ్చి సృజన పక్కన కూర్చుంది. చైతన్య గేటుముందు కూర్చున్న బంధువులను తీసుకొచ్చి మామయ్య, అత్తమ్మ, చిన్నమ్మలు, చిన్నాన్నలు, పిన్ని, బాబాయంటూ ముడిచిన మూతులను కొన్నింటిని పరిచయం చేశాడు. రాని నవ్వును నటిస్తూ పరిచయాల కార్యక్రమం ముగిసింది. అంతా ఎవరి సీట్లకు వాళ్ళు అతుక్కుపోయారు. సృజన కార్యక్రమం మొదలుపెట్టమని చైతన్యకు సైగ చేసింది. చైతన్య తండ్రి భౌతిక కాయంలో కొన్ని అవయవాలను అవసరమున్న వాళ్ళకు దానం చేయడం… మిగిలిన పార్ధివ దేహాన్ని మెడికల్ కాలేజి విద్యార్థులకు డొనేట్ చేయడంలోని పరమార్ధాన్ని వివరించి కూర్చున్నాడు. ఆ మాటలు వింటూనే చైతన్య వాళ్ళ చిన్నాన్న భార్య లేచింది. ఒకరిద్దరు ఆమెను ఆపడానికి ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆమె లేవనే లేచింది కొంగు బిగించిన లెవల్లో.
‘మా బావగారంటే మాకెంతో గౌరవం. ఆయనకు అన్నదమ్ములంటే చాలా ఇష్టం, ప్రేమ. అంతేకాదు సంప్రదాయాలంటే పడి చచ్చేవారు. ఏ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా తిథి, నక్షత్రాలు తనే చూసి చెప్పేవారు. మరి వాళ్ళింట్లో తనకు సంబంధించి పెద్దకర్మ సరిగ్గా జరిపించకపోతే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది? మీరే చెప్పండి? ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కయ్య పుని స్త్రీలాగా
ఉండటమంటే ఆయనంటే ప్రేమ, గౌరవం, బాధ లేనట్లే కదా?’ అంటూ మాట్లాడిరది. ఆ మాటలు విన్న తర్వాత మాట్లాడక తప్పదనుకొని సృజన లేచింది.
‘మీ బావగారి పట్ల మీకున్న గౌరవం, మీ అందరి మధ్య ఉన్న ప్రేమానురాగాలను చూస్తుంటే మాకానందంగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి గౌరవానురాగాలు ఎంతమందికి దక్కుతున్నాయి? అది నిజమే. కానీ నాకు తెలిసి మాధవరావు గారికి పరోపకారమంటే ఆరో ప్రాణం. అవయవదానం, భౌతిక కాయం మెడికల్ విద్యార్థుల అధ్యయనానికి గాను దానం చేయడమంటే కూడా పరోపకారంలోకెల్లా
ఉత్తమమైనదని నా అభిప్రాయం. అవయవదానానికి వ్యతిరేకంగా ఆయనెప్పుడూ స్పందించినట్లు నాకు తెలియదు. ఆ విషయం చైతన్యే చెప్పాలి. ఏం చైతన్యా?’ అంది సృజన చివరిగా.
‘ఆంటీ! మా కుటుంబ మనోభావాల గురించి మీకు తెలియనిదేముంది. మా మధ్య జరిగిన సంభాషణల్లో ఈ విషయమూ చర్చకు వచ్చింది. నాన్న పాజిటివ్‌గానే మాట్లాడారు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా నేనేమీ ప్రవర్తించడం లేదు’ అంటూ తన మాటల్ని ముగించాడు. వెంటనే రాధిక అందుకుంది ‘ఇక రేణుక బొట్టూ, గాజుల విషయమంటారా? బహుశా ఆ ప్రస్తావన ఆయన బతికుండగా వచ్చిందో లేదో తెలియదు కానీ చనిపోయిన మనిషికి గౌరవం ఇవ్వాలని బతికున్న మనిషిని అవమానించడం తగదు’ అంటూ ఆక్రోశంగా దానికి సంబంధించిన పూర్వాపరాలను ప్రస్తావించింది.
‘అది కాదండీ! బాడీ డొనేట్ చేయడం నేరంగా… ఆయన మీద గౌరవం లేనట్లు మాట్లాడటం సరికాదు. మనమందరం చాలావరకు రకరకాల సమస్యలకు అల్లోపతి వైద్యానికి పోతున్నాం. ఎన్నో పార్ధివ దేహాలను డిసెక్షన్ చేసి వైద్య విద్యార్థులు తమ అవగాహనను పెంచుకుని డాక్లర్లుగా రూపుదిద్దుకుంటున్నారు. అవయవదానాన్ని వ్యతిరేకంచే మనం అలోపతి వైద్యాన్ని బాయ్‌కాట్ చేయగలమా? మీరే చెప్పండి’ అంటూ నిలదీసింది రాధిక టీంలోని ఓ అమ్మాయి. దాంతో రేణుక బంధువుల నోట మాట రాలేదు. ఆ పై అంతా నిశ్శబ్ద వాతావరణం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ‘మా నాన్నమీద గౌరవమున్న వాళ్ళంతా దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి’ అన్నాడు చైతన్య. భోజనం చేయకపోతే ఆయనమీద గౌరవం లేదని తేలిపోతుందేమో అనుకొన్నారేమో మారుమాట్లాడకుండా తిన్నామనిపించుకొని వెళ్ళిపోయారు వచ్చిన సోకాల్డ్ చుట్టాలు. రేణుక… సృజన… రాధిక వాళ్ళ టీం… చైతన్య,.. అభిజ్ఞ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక దుర్మార్గపు ఆచారాన్ని ఆపినందుకు తృప్తిగా ఫీలయ్యారు. భోజనాలు ముగిసాక వెళ్తూ ‘చూస్తే నలభై ఏళ్ళున్నట్లు లేదు మీ పిన్నికి. అవేం బి.సి. కాలం మాటలు’ అంది రాధిక.
‘ఇన్నాళ్ళూ మా మరుదులు మా ఆయనకిచ్చిన గౌరవం మీదున్న అక్కసు’ అంది రేణుక.
‘ఔను నిజమే’ అన్నారు చైతన్య, అభిజ్ఞలు.