జూన్ 5వ తేదీ. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ దినోత్సవం. ప్రకృతి, పర్యావరణంపై అవగా హన పెంచుకోవాల్సిన రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనని మనం కాపాడు కోవడం కదా! 12 ఏళ్ళ క్రితం నిజామాబాద్ జిల్లాలో 10 నుంచి 18 ఏళ్ళలోపు బాల సేవా
సంఘాల పిల్లలు స్లోగన్స్ రాసుకుని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేసేవాళ్ళు, గొంతెత్తి నినదించే వాళ్ళు, వీథి నాటకాలు తయారు చేసుకుని కూడలిలో ప్రదర్శించే వాళ్ళు.
ఆ పిల్లల చుట్టూ చేరిన గ్రామీణులు నినాదాలు వినో, వీథినాటకాలు చూసో రకరకాల ప్రశ్నలు వేసి తమ సందేహాలు తీర్చుకుని అవగాహన పెంచుకునే వాళ్ళు, మద్దతు తెలిపేవాళ్ళు, తమ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. గత ఇరవై ఏళ్ళలో చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. ప్రతి ఏడూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతున్నాయి, మొక్కలు నాటిన ఫోటోలు పత్రికల్లో చోటుచేసుకుంటున్నాయి. మరి, ఆ మొక్కలన్నీ ఏవి? ఏమైపోయాయి? ఒకవైపు మొక్కలు నాటుతుంటే మరోవైపు రోజురోజుకీ మన అడవుల విస్తీర్ణం ఎందుకు కుచించుకుపోతున్నది? కాలుష్యం ఎందుకు కోరలు చాస్తున్నది? భూతాపం ఎందుకు పెరిగిపోతున్నది? ఎందుకిలా జరుగు తున్నది? చేపట్టిన కార్యక్రమ లక్ష్యం ఏమిటో, ఎవరి కోసమో తద్వారా అందుకునే ఫలితాలేంటో, ప్రయో జనాలేంటో తెలియకుండా మొక్కుబడిగా సాగే తంతుగా మిగిలిపోతున్నాయి మన ప్రభుత్వ పథకాలు. ఉన్నచోటే నాటడం, మొక్కలు తెచ్చి ఒకచోట కుప్పగా పడేయడం, ఒకవేళ మొక్కలు నాటితే వాటి ఆలనా పాలనా మరచిపోవడం, నాటిన చోటే ప్రతి ఏటా నాటడం వలన మొక్కలు నాటే కార్యక్రమం ఒక ప్రహసనంగా మారిపో యింది. ఏ యేటికాయేడు అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నది. అవసరాల కోసం, అభివృద్ధి కోసం సహజ వనరులు కొల్లగొట్టేస్తున్నాం, రసాయన ఉత్పత్తులను పెంచేస్తున్నాం, భూతాపం పెంచేస్తున్నాం.
ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘భూమిని చంపే స్తున్నాం’’. భూమిని చంపేస్తున్నాం అన్న మాట నాది కాదు. అప్పటికి నాకు ఆ ఊహ కూడా ఎన్నడూ రాలేదు. పదేళ్ళ క్రితం ఎప్పుడో కెరమెరి వెళ్ళినపుడు ఆదివాసీ మహిళ అన్న మాటలు ఇవి. ఆనాటి నుండి ఆ రెండు పదాలు నన్ను వెంటాడు తూనే ఉన్నాయి. మనసును మెలిపెడుతూనే ఉన్నాయి.
పోడు వ్యవసాయం చేసి అడవులని నాశనం చేస్తున్నారని అడవి బిడ్డలని ఆడిపోసుకుంటాం కానీ ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల వారికి ఉన్న మమకారం మనకు ఉందా? ఒక ఆదివాసీ మహిళకు అక్షరాస్యత, ఆధునిక నాగరికత తెలియని మహిళకు ఉన్న జ్ఞానం, పట్టింపు చదువుకున్న వాళ్ళకు ఉందా? ఎందుకు ఇంత సంకుచితంగా, స్వార్ధంగా ఆలోచిస్తున్నాం. పర్యావరణ స్పృహ లేకపోవడం వల్ల మన అంతాన్ని మనమే ఆహ్వానిస్తున్నామా అని ప్రశ్న తలెత్తుతూనే ఉంది.
ఈ సందర్భంగా పర్యావరణంలో జరుగుతున్న మార్పులను, వచ్చే అనర్ధాలను నేనిక్కడ ఏకరువు పెట్టడం లేదు. లోతుగా చర్చించడం లేదు. నా మనసుకు దగ్గరైన రెండు ప్రయత్నాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
రాజస్థాన్‌లో పిప్లాంత్రి అనే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరున 111 చెట్లను నాటుతున్నారు. ఆడపిల్ల పెరిగినట్లే మొక్కలు పెరిగి పెద్దవి అవ్వాలని వారి ఆశయం. తరిగిపోతున్న ఆడ సంతానానికి, అటవీ సంపదకు ముడిపెట్టడం, గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, భూమిని, వాతావరణాన్ని సరిచేసుకోవడంతో పాటు ఆడపిల్లను కూడా రక్షించుకోవడం చాలా వినూ త్నంగా, గొప్పగా అనిపించింది.
చెట్లు ఆహారాన్నిస్తాయి, శక్తిని ఇస్తాయి, ఆదాయాన్ని ఇస్తాయి, ఆర్థిక, పర్యావరణ సస్టైన బిలిటీ, గాలిని పరిశుభ్రం చేస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి కాపాడతాయి.
ఆడపిల్లని లక్ష్మీదేవిగా కొలిచే మన దేశంలోనే అప్పుగా భావించి అంతం చేయడం మనకు కొత్త కాదు. కానీ ఆ గ్రామంలో ఆడపిల్లలు స్వతంత్రు లుగా, స్వశక్తివంతులుగా ఎదుగుతున్నారు. పిల్లలు పెరుగుతున్నట్లే చెట్లు పెరగడం అంటే అది వారికి ఒక గౌరవం. ఆడపిల్లలతో పాటు పచ్చదనం పెరిగి, పచ్చదనంతో పాటు పక్షులు, ఇతర జంతువులకు ఆలవాలమై గ్రామం రమణీయంగా తయారైంది.
ఇక రెండో విషయం, మెదక్ జిల్లా పస్తాపూర్, ఆ చుట్టు పక్కల గ్రామాలు వట్టిపోయిన నేలలతో ఉండేవి. కడుపుకు ముద్ద, బతుకులో పచ్చదనం కరువైన కాలంలో బీడు భూముల్లో అడవులు
ఉదయింపచేశారు ఆ గ్రామీణ మహిళలు. అలా వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 20 లక్షలపై చిలుకు మొక్కలు నాటారు, పెంచారు, అడవులు సృష్టించారు. అడవులుగా మారిన మొక్కల్లోంచి అనేక రకాల ఔషధ మొక్కలు స్థానిక అవసరాలు తీరుస్తున్నాయి. అనేక రకాల పక్షులు, జంతువులు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇదంతా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వారి సహకారంతో వారు చేయగలిగారు.
అంతేకాదు, నేల రాలిన ప్రతి నీటి బొట్టుని ఎట్లా ఒడిసి పట్టాలో తెలుసుకునేవారు. వాన నీటిని భూ పొరల్లోకి ఎలా ఇంకించాలో, నీటిని ఎలా భద్రపరచుకోవాలో తెలుసుకున్నారు. నేలమ్మను కాపాడుకోవడం కోసం కంకణం కట్టుకుని కృషి చేస్తున్నారు. తమని తాము కాపాడుకుంటూ తమ పర్యావరణాన్ని కాపాడుకుంటున్న విషయం వారి గ్రామ సరిహద్దులు దాటింది. మరికొందరికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, తమ పని తాము చేసుకుపోతున్న అనసూయమ్మ బృందం కృషి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. అనేక అవార్డులు, రివార్డులు అందించింది.
వారు అందుకున్న అవార్డులు, రివార్డులలో అత్యున్నత బహుమతి నోబుల్ బహుమతితో సమానమైన ఈక్వెటార్ ప్రైజ్. ఈ బహుమతిని అనసూయమ్మ బృందం 2019లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అందుకుంది.
ఎక్కడో మారుమూల గ్రామాల్లో ప్రారంభమైన వారి కృషి ఫలితాలు నేడు అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకుంటోంది. అది రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆడపిల్ల పుట్టుకను 111 చెట్లు నాటడం ద్వారా గౌరవించే, విలువనిచ్చే అద్భుత మైన సంప్రదాయం కావచ్చు, పస్తాపూర్ సమీప గ్రామాల్లోని గ్రామీణ మహిళల పర్యావరణ స్పృహ, చైతన్యం కావచ్చు. ఏది ఏమైనా, భూగోళం తర్వాతి తరాలకు అందేది ఇటువంటి స్ఫూర్తి దాతల వల్లనే అనేది వాస్తవం.
ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి నమస్సులు. ఆడపిల్లలకు మంచి అవకాశం, వారి పూర్తిస్థాయి శక్తి సామర్ధ్యాలు పెంచుకోవడానికి, నిరూపించు కోవడానికి మంచి అవకాశం. ఆడపిల్ల ప్రపంచానికి చాలా విలువైనది కావాలి. ఆమె ఒక శక్తి. ఒక పవర్ హౌస్. మగవాళ్ళలా ధ్వంసం చేసే తత్వం కాదు స్త్రీది. పిల్లల్ని తొమ్మిది నెలలు మోసి కనే తల్లికి తెలుసు ప్రకృతిని రక్షించుకోవడం కూడా, రేపటి కోసం బతికించుకోవడం కూడా.
పిప్లాంత్రిలు, పస్తాపూర్‌లు ప్రపంచంలో ఏదో ఒక మూల పురుడు పోసుకుంటూనే ఉంటాయి. చెట్టులాగే ఫలితాన్ని ఆశించకుండా తమ పని తాము చేసుకుపోతూనే ఉంటారు, ఆడపిల్లల్ని బతికిస్తారు, భూమినీ బతికిస్తారు. పచ్చగా కళకళలాడే భూమిని చచ్చిపోనీయకుండా ప్రాణవాయువులు ఊదుతూనే ఉంటారు.
వారి స్ఫూర్తిని మనమంతా అందిపుచ్చు కోవాల్సిన అవసరం నేడు అత్యవసరం.
ఆడపిల్లలు ఉంటారు. భూమి చచ్చిపోదు, పచ్చగా కళకళలాడుతుంది.