ఏనాడు నవ్వనిచ్చారనీ
మనసారా, మనస్ఫూర్తిగా
పకపకా
నవ్వాలనిపించినప్పుడల్లా
పళ్ళు కనిపించకూడదన్నారు
పగలబడి నవ్వాలనుకుంటే
విరగబాటు వలదన్నారు
అందరి ముందూ నవ్వు
అసలే తగదన్నారు
పెద్దల ముందు నవ్వితే
పద్ధతిగా ఉండాలన్నారు
నలుగురిలో నవ్వితే
నగుబాటన్నారు
పరిచారికలతో కిలకిలమంటే
హోదా చూపించాలన్నారు
చిన్నవారితో చనువుతో నవ్వితే
హుందాగా లేదన్నారు
గురువులతో నవ్వు మోము
వినయం విధేయత కాదన్నారు
వయసుతో వచ్చిన
సిగ్గు నవ్వుకు
వలదు వలదనీ వేటు వేసారు
ప్రేమ పందిరిలో నవ్వులు చిందిస్తే…
కుదరదంటూ పీకి
పాతరేసారు
పెళ్ళయ్యాక నవ్వచూస్తే
అత్తమామల అనుమతి లేదన్నారు
జంటపక్షిగా కువకువలాడితే
కుటుంబ పరువే పోద్దన్నారు
ఆనాటి ఆడపిల్ల
ఆంక్షల వాకిట్లో
కట్టేసిన కుక్కపిల్ల
మనసారా నవ్వినదేనాడని
బాధ్యతల బరువు తీరాక
పక్కనున్నోడు పటమెక్కాక
ముగ్గుబుట్టలో సోల ముఖంతో
మనవళ్ళతో ఆటపాటలప్పుడు
నోట్లో నక్షత్రాలు రెండో మూడో
నేడో రేపో అన్నట్లు మెరుస్తూ ఉంటే…
బోసినోటితే బొక్కి మామ్మనై
నవ్వుతూనే ఉన్నా…
మనసారా…