నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో
అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో
పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో
ఉదయాన్నే కువకువలాడుతూ గూళ్ళనుండి ఎటో ఎగిరి వెళ్ళే పక్షులనో
చూసినప్పుడు
ఇప్పటిదాకా ఆడిన ఆటలను ఇక చాలించమని
అవి చెబుతున్నాయేమో అన్న భ్రాంతి మనల్ని వదలదు
కొంచెం తీరిక చేసుకుని
పరుగెత్తిన దారులకేసి తల తిప్పి చూసినప్పుడు
జీవితంలో సగభాగం ఇతరులను
మెప్పించే కళకై ధారపోసి
ఆ మిగిలిన మరో సగభాగం ఇతరులు
నొప్పించిన లేదా మనం నొప్పించిన
గాయాల కేసి పదే పదే చూసుకోవడంలో గతించి
మనకై మనం ఎన్నడూ మిగలలేదన్న సత్యం
మనల్ని చూసి పరిహసిస్తుంది
మీ కన్నా రెండు మెట్లు పైన నిలుచుని
ఏవేవో మీకు తెలియనివి, మీ జీవితాల్ని మార్చే
గొప్ప సంగతులను బోధించిన
ఏవేవో మహత్తర కార్యాలను చేసిన
గర్వం తలకెక్కిన ఆ దినాలు అలా కాక మరోలా
ఉండి ఉంటే అన్న తలపుల ఉక్కపోత మనల్ని నిలవనీదు
సమతలపు నేల నుండి నడిచి
ఒక పర్వతాన్ని ఎక్కాక చూపు విశాలమైన
ఆనందంలో సూక్ష్మాతి సూక్ష్మమైన
వాటిని చూసే దృష్టి మన నుండి మెల్లిగా అదృశ్యమైన
సంగతి మనకసలు ఏనాడైనా తెలుస్తుందా?
అతి పెద్ద మూటను తలకెత్తుకొని
దాన్ని మోయలేక, వదిలేయలేక
దాని కిందే కదలలేక పడివున్న ఒక ఎర్ర చీమ
ఇంకా ప్రాణాలతో మెల్లిగా పాకుతూ ఉంటుంది
ఏ బరువునైనా సరే దించుకోవడం అంత కష్టమైనది
జీవితంలో ఏముంటుంది?
కొత్త ఆటలకు, వేటలకు కొదవే లేని లోకంలో
ఎక్కడో ఎవరో గాలిపటానికి ఆశల దారాన్ని కట్టి
ఎగరేస్తూనే ఉంటారు
సంశయం, సహనం, కలలు జీవితం పొడుగునా
రెపరెపలాడుతాయి
ఒక్కోమారవి కట్లు తెంచుకు ఎగిరిపోతాయి
అసంబద్ధంలోని సంబద్ధతకై లేదూ
సంబద్దతలోని అసంబద్ధతకో
ఎప్పటికప్పుడు నివ్వెరపడుతూ
మనం అట్లా నిలబడి ఉంటాం
మరెన్నో ఏళ్ళు గడిచాక కూడా, చీమల గుంపులు
తలపై బరువుతో పాకటమే జీవించి ఉండటానికి గుర్తని
అపహాస్యపు నవ్వుల్ని మనల్ని చూసి నవ్వుతాయి