మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ

‘మేడం… ఓ మాట అడుగుతా కోప్పడకుండా చెబుతారా…’ చకచకా పని చేసుకుంటున్న సహాయకురాలు యాదమ్మ అడిగింది. ‘చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? కానీ… అడుగు’ అని అన్నాను నవ్వుతూ.

‘కులం, మతం ఎక్కడున్నాయి, ఎప్పుడో పోయాయి అని చానా మంది అంటుంటే నిజం కావచ్చనుకున్నాను. కానీ, అదేంటమ్మా పై కులం పిల్లని కింద కులపోడు చేసుకుంటే నరికి పోగులు పెడుతున్నారు. చిన్న కులం, అందులోను పేదరికంలో ఉన్న పిల్లలు ఆడపిల్లను చెరబట్టి చంపేశారని వాళ్ళను పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. పోయిన పిల్లవి ప్రాణాలయినట్టు ఈ పిల్లలవి ప్రాణాలు కావా అమ్మా…
అదే పని పైసాగలవాడు, పై కులంవాడు చేస్తే ఇట్లాగే జరిగేదా అమ్మా… పాపం ఆ పిల్లల తల్లిదండ్రుల గోస గోస కాదామ్మా… ఆ పిల్లగాల్ల అమ్మానాన్నలను తలుచుకుంటే గుండె గాభరా అవుతుంది’ అంది యాదమ్మ. ‘ఏంటోనమ్మా… ఈ లోకం, పై కులపోడు, పైనున్నోడు అదే పని చేస్తే ముందు వాడికి కొమ్ముకాసి గట్టు దాటించే ప్రయత్నం చేసి, ఆ తర్వాత మిగతా సంగతి ఆలోచన చేస్తున్నారు. కులం లేదంటే ఎట్టా నమ్మాలి మేడం?’ అని అడిగింది నా హెల్పర్‌ యాదమ్మ.
కర్ణాటక సరిహద్దుల నుంచి పని వెతుక్కుంటూ హైదరాబాద్‌ చేరిన మహిళ యాదమ్మ. చదువు అంతంత మాత్రమే కానీ లోకజ్ఞానం బాగానే ఉంది. పిల్లలను చదివించుకుంటూ భార్యాభర్తలు పనిచేసుకుంటున్నారు. ఆమె భర్త హమాలీ పనికి వెళ్తే ఆమె ఇళ్ళల్లో పనిచేస్తుంది. నా చిన్న కొడుకు పుట్టినప్పుడు ఒక్క ఆడపిల్ల లేకపోయెనే అని బాధ పడిన యాదమ్మ ఆ తర్వాత లేనిదే నయమైంది అనుకుంది. ఇప్పుడు, మగపిల్లల గురించి కూడా బెంగ పట్టుకుంది ఆమెకు. వాళ్ళుండే బస్తీ యువకుడు కులం, ఆస్తి ఉన్న పిల్లను పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నాడు. ఆ పిల్ల అన్న చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి నుండి ఆమెలో రకరకాల ఆలోచనలు, భయాలు, బెంగలు… జరుగుతున్నవి చూస్తుంటే ఎదుగుతున్న తన కొడుకులకు ఏ క్షణం ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అని భయంగా ఉంది యాదమ్మకు. ప్రతిరోజూ తన పని చేసుకుంటూ తన మనసులో చెలరేగే ప్రశ్నల్ని, అల్లకల్లోలాన్ని నా ముందు విప్పుతుంది. నేను సమాధానం చెప్పినా, చెప్పకున్నా ఆమె మాత్రం మానదు…
ఆమె అడిగే ప్రశ్నలు నన్ను ఆలోచనలో పడేస్తుంటాయి. ఇప్పుడూ అంతే. చాలామంది అంటున్నట్లు కులం, మతం నిజంగా మాయమైపో యాయా? ఆలోచిస్తుంటే, లోకాన్ని తరచి చూస్తుంటే ఎక్కడా ఆ జాడ కనిపించదు. అసలు అది అంత సులభమా…? కులం, మతం పోవాలని కోరుకోవడం తప్పు కాదు, నేరం కాదు. పైగా అది ప్రోత్సహించాల్సిన విషయం. కానీ అలా జరగదు కదా…! పుట్టుక, చావు మధ్యకాలంలో కులం, మతంకి తోడు వర్గం కూడా చేరి జీవితాన్ని ఆడుకుంటున్నాయి. నీడని చీకట్లో తప్పించుకోవచ్చు కానీ ఈ త్రయాన్ని మాత్రం తప్పించుకోలేమేమో.. చట్టం, న్యాయం ముందు అందరూ సమానం అని పిల్లలు చదవగా విన్నాను, అలా అని చెప్పగా విన్నాను. నిజంగా సమానంగా చూస్తున్నారా? ఇల్లు శుభ్రం చేస్తూ నిన్న యాదమ్మ వేసిన ప్రశ్న ప్రజాస్వామిక వ్యవస్థను చర్నాకోలుతో కొట్టినట్ల నిపించింది. అప్పచెప్పిన పని తూచా తప్పకుండా చేసుకు పోయే యాదమ్మ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ శ్రమ తెలియకుండా పనిచేసుకుపోయే యాదమ్మలో కొత్తకొత్తగా తలెత్తుతున్న ప్రశ్నలు…ఎదురుగా కనిపించే నాకు ఆమె వేసే ప్రశ్నలు ఒక్కోసారి ఇరకాటంలో పెడుతున్నాయి. అమాయకంగా కనిపించే యాదమ్మ అసమ సమాజపు ముసుగు తీసి నగ్న స్వరూపాన్ని చూపుతున్నట్టు తోస్తుంది. ఆమెకు జవాబు చెప్పినా చెప్పకపోయినా నాకు నేను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కులాలు, మతాలు, వర్గాలు చట్టానికి, న్యాయానికి కూడా ఉంటాయా? అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. అలా చెప్పడానికి మనసు వ్యధపడు తోంది. కానీ తప్పదు, అది నిజం కాబట్టి. చట్టానికి, న్యాయానికి కులం ఏంటి? మతం ఏంటి? వర్గం ఏంటి? అని ఆశ్చర్యపోండి. కళ్ళెర్ర చేయకండి. మీరు విన్నది నిజమే. న్యాయానికి కులం ఉంది, మతం ఉంది, వర్గం ఉంది, జెండర్‌ ఉంది. కావాలంటే మీరు ఒకసారి జాగ్రత్తగా మన చట్టాలు, అవి ఇచ్చిన తీర్పులను పరిశీ లించండి. అప్పుడు మీకే ఎంతో కొంత అర్థమవుతుంది.
బాధితులు ఆధిపత్య కులం, మతం, వర్గం ఏదైనా వారికి సత్వర న్యాయం చేయడానికి ఉబలాటపడు తుంటారు. అదే కింది తరగతులు, వర్గాలు, బక్కపలచని మతం అయితే వారినెవ్వరూ పట్టించుకోరు. చట్టం దాని పని అది చేసుకుపో తుందని నమ్మబలుకుతారు. బాధితులు ఆధిపత్య కులం, మతం, వర్గానికి చెంది నిందితులు బలహీన కులం, మతం, వర్గం వారయితే వాళ్ళు సత్వర న్యాయం పేరుతో ఎన్‌కౌంటర్‌కు గురవుతుంటారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగు తుంది. సమాజం భళా భళా అని హర్షిస్తుంది. అదే నిందితుడు ఆధిపత్య వర్గం, మతం, కులానికి చెందినవాడైతే అతనికి చట్టం చుట్టమవుతుంది. బాధితులపై బల ప్రయోగం జరుగుతుంది, కేసు బలహీనపడుతుంది. మహిళలపై జరిగే అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, అఘాయిత్యాలు, హత్యలు వంటి సంఘటనలు జరిగినప్పుడు అధికార, ఆధిపత్య కుల, మత వర్గాలను బట్టి సమాజ స్పందన, ప్రభుత్వ స్పందన ఉంటోంది, చట్ట చర్యలు, న్యాయం ఉంటున్నాయి. నిర్భయ, దిశ దుర్ఘటనలకు వచ్చినంత పబ్లిసిటీ, ప్రజాగ్రహం, సత్వర న్యాయం కోసం డిమాండ్‌… అదే సమయంలో జరిగిన ఇతర కేసుల్లో ఎందుకు రాలేదు, అంటే కారణం ఏమై ఉంటుంది? వారి కులం, మతం, వర్గం కదా…! నిన్నటి జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో చట్టబద్ధంగా అరెస్ట్‌ చేయాల్సిన నిందితులకు రక్షణ చేకూర్చే విధంగా ప్రవర్తించడం చూశాం. ఇక్కడ నిందితుల మతం, వర్గం వారిని అరెస్ట్‌ చేసే విషయంలో కాలయాపన చేసేందుకు, వారిని రక్షించేందుకు ఉపయోగపడ్డాయి. కోర్టు, చట్టాలు, న్యాయం బలహీనుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంది చాలా సందర్భాల్లో. ఆధిపత్యపు చెరలో చిక్కిన కోర్టులు ఇచ్చే అటువంటి తీర్పులు కోకొల్లలు ఈ ప్రజాస్వామిక దేశంలో.
అవును మరి, దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న ఆధిపత్య కులం, ఆధిపత్య మతం, ఆధిపత్య వర్గం చేసే నిర్ణయాలే శాసిస్తున్నాయి. చట్టాలు రాసేది వారే. తీర్పులు ఇచ్చేది వారే. వాటిని అమలు చేసేది వారే. ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. శాసన, అధికార, పాలన, న్యాయ వ్యవస్థలో ఉన్నది ఆధిపత్య కుల, మత, వర్గాలకు చెందిన పురుషులే ఎక్కువ. జెండర్‌ ప్రాతినిధ్యం సమంగా లేని అసమాన సమాజం మనది. ఇక ఈ క్రమంలో జెండర్‌ సమస్యలకు న్యాయం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కుల, మత, వర్గ సమస్యలకు మించిన సమస్య జెండర్‌ సమస్య. అన్ని కులాల్లో, మతాల్లో, వర్గాల్లో ఉన్న సమస్య జెండర్‌ సమస్య. ప్రతిరోజూ అనేకానేక జెండర్‌ సమస్యలు, ఘటనలు పల్లె, పట్టణం అనే భేదం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. అవి అతి మామూలు సంఘటనలుగానే చూస్తోంది సాంస్కృతిక, సామాజిక, చట్ట, న్యాయ, రాజకీయ వ్యవస్థ.
మన సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో మహిళ కున్న స్థానం అందుకు కారణం. స్త్రీ, పురుష సమానత్వం గురించి రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ, చట్ట రూపకల్పనలో, అమలు చేసే పాలనలో, న్యాయంలో, అధికారంలో జెండర్‌ సమానత్వం కనిపించదు. కులం, మతం మహిళను ఎక్కడ ఉంచాలని కోరుకుంటోందో అదే మన చట్ట, న్యాయ వ్యవస్థలో ప్రతిఫలిస్తోంది. అదే అసలు సమస్య. అధికారం చేతిలో ఉన్నవాళ్ళు మరో కులాన్ని, మతాన్ని, వర్గాన్ని అణచి వేసినట్లే, పురుషుడు తన కులానికి చెందిన స్త్రీ/కుటుంబంలో స్త్రీ పై (భర్తగా, తండ్రిగా, కొడుకుగా, సోదరుడిగా) ఆధిపత్యం చెలాయి స్తున్నాడు. ఆమె తనకంటే తక్కువ కులం, మతం, వర్గంపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ అతనిపై ఆ విధంగా చేయలేదు. అందుకు వారి మధ్య ఉన్న బంధుత్వం ఆమెకు అడ్డంకి అవుతుంది. అది పురుషుడి అధికారానికి, ఆధిపత్యానికి కారణమవు తుంది. ఇక బలహీన కుల, మత, వర్గాల జెండర్‌ గురించి వేరే చెప్పాలా… బలహీనులైన జెండర్‌ ప్రాణం అధికారం, ఆధిపత్యపు చెరలో చిక్కి ఆవిరైపోతున్నది. అందుకే ఆడపిల్ల లేనందుకు ఆనందపడి ఉంటుంది యాదమ్మ.
కాలానుగుణంగా ఆధిపత్యపు నిర్ణయాలు , ఎత్తుగడలు మారిపోతున్నాయి. పీడిత కులాలు, వర్గాలు ఒకటి కాకుండా విద్వేషం విరజిమ్ముతూ తమ పబ్బం గడుపుకునే ఆధిపత్యం నిలబెట్టుకునే ఆటలో ఎప్పుడూ పావులుగా మారిపోతున్నాయి. జెండర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పీడితులం అనుకునే వాళ్ళు కూడా తమ సమయాన్ని, శ్రమను, తెలివితేటలను తమ సంక్షేమం కోసం కాకుండా పై వాళ్ళ కోసమే ఖర్చు చేయడం చూసి రేపటి రోజు తన కొడుకుల భవిష్యత్తుపై చీకటి నీడలు ఎక్కడ వాలతాయోనని భయం యాదమ్మలో చేరి తొలిచేస్తున్నది కావచ్చు.
ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఇలా…?
కులం, మతం, వర్గం, జెండర్‌ పరిధులను దాటి మనుషులుగా ఆలోచించలేమా? మనిషితనం నింపుకోలేమా? మానవత్వం నిలుపుకోలేమా?

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.