అమ్మానాన్నలు
అవనిని నడిపించే ధర్మకర్తలు
పోషకులు సారథులు
స్త్రీ పురుషులు కలిసి సంతానానికి
కారకులైనవారే అమ్మానాన్నలు
ఆప్యాయతపాలలో పొంగించి
బతుకు మనసును పెంచుతుంది అమ్మ
నాన్న అనుబంధానికి బాధ్యతను జోడిరచి
క్రమశిక్షణ నడవడులతో
ముందుకు బాటవేసి సంతానాన్ని
ప్రయోజకులను చేస్తాడు
అమ్మ మూర్తిమత్వాన్ని దిద్దుతుంది
అమ్మానాన్నలు జీవితానికి
సమాజానికి ఆదర్శమూర్తులు
అమ్మానాన్నలు అవనికి నిధులు
అమ్మానాన్న పదాలలో ఉన్న ఆర్ద్రత
తల్లితండ్రి పదాలలో లేదు
అమ్మానాన్నల ఆలన లాలన పాలనలకు
బాధ్యతలకు బంధాలకు సరితూగే
దేవతలు సృష్టిలోనే లేరు
అసలు దేవతలే లేరు
లేని దేవతలతో అమ్మానాన్నలను సరితూచి పోలిస్తే
అమ్మానాన్నలు చూపే అనుబంధాన్ని చిన్నబుచ్చినట్లే
ఆప్యాయత అనుబంధాలు మనుషులలో
అమ్మానాన్నల రూపం గుండెలో పూచిన పరిమళాలు
అమ్మానాన్నలు సమాజానికి
భవితకు ఆదర్శమూర్తులు
మరీచకల వంటి దేవతలతో
అమ్మానాన్నలను పోల్చితే
అనుబంధ కావ్యం అర్థం కానట్లే
అమ్మానాన్నలను ఔదలదాల్చి
అనుసరించి నడిస్తే
సంతానం జన్మ ధన్యమే
అమ్మానాన్నల జన్మదినోత్సవం యాదిలో