20వ శతాబ్దం ప్రారంభం నుండీ స్త్రీల పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించడం ప్రారంభించారు. తెలుగు స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి స్త్రీల పత్రిక ‘హిందూసుందరి’. 1902 ఏప్రిల్‌లో ప్రారంభమైన ‘హిందూసుందరి’ 1960 తర్వాత కూడా కొనసాగింది. దీనిని సత్తిరాజు
సీతారామయ్య ప్రారంభించారు. తొలుత ఏలూరు నుండీ, తరువాత కుగ్రామమైన కంతేరు నుండీ ప్రచురించబడిరది. వాస్తవానికి పత్రికను ప్రారంభించినప్పటినుంచీ సీతారామయ్య ఒక స్త్రీని సంపాదకురాలుగా యేర్పాటు చేయాలని భావించి భండారు అచ్చమాంబ, మొసలిగంటి రమాబాయమ్మ, పులుగుర్త లక్ష్మీనరసమాంబ మొదలైనవారిని సంప్రదించినప్పటికీ వివిధ కారణాలచేత సంపాదకత్వ బాధ్యత నిర్వహించడానికి వారు ముందుకు రాలేదు. సీతారామయ్య ఆశయం ఫలించి 1903 డిసెంబరు నుండీ మొసలిగంటి రమాబాయమ్మ (చూ. ఆమె ఛాయాచిత్రంÑ ఈమె తెలుగు పాత్రికేయరంగంలో మొట్టమొదటి తెలుగు సంపాదకురాలు), వెంపలి శాంతాబాయమ్మలు ‘హిందూసుందరి’ సంపాదకురాల్లయ్యారు. 1904 ఏప్రిల్/మేలో శాంతాబాయమ్మ చనిపోవడంతో రమాబాయమ్మ ఒక్కరే పత్రిక సంపాదకత్వాన్ని నిర్వహించారు. జనవరి 1908లో కొంతకాలం పత్రిక ఆగిపోయేంతవరకు రమాబాయమ్మ సంపాదకురాలుగా కొనసాగారు.
ఆగిపోయిన ‘హిందూసుందరి’ని తూము వెంకట నరసయ్యమ్మ, వెన్నా మంగతాయమ్మ, బాలాంత్రపు శేషమ్మ, మాడభూషి చూడమ్మ మొదలైనవారి ప్రోత్సాహంతో జూన్ 1909లో పున:ప్రారంభించారు సీతారామయ్య (‘హిందూసుందరి’, జూన్ 1909, పు. 4`5). పునరుద్ధరణ తర్వాత మొసలిగంటి రమాబాయమ్మ మళ్లీ సంపాదకురాలయ్యారు. తూము వెంకట నరసయ్యమ్మ, వెన్నా మంగతాయమ్మలు సంయుక్త సంపాదకురాల్లయ్యారు. మార్చి 1913 నుండి ‘హిందూసుందరి’ని కాకినాడలోని ప్రముఖ మహిళా సంఘమైన ‘శ్రీవిద్యార్థినీ సమాజం’ చేపట్టింది. జూన్ 1913 నుండి ‘విద్యార్థినీ సమాజ’ నిర్వాహకులైన మాడభూషి చూడమ్మ, కళ్ళేపళ్లె వెంకట రమణమ్మలు ‘హిందూసుందరి’ సంపాదకురాల్లయ్యారు. ప్రచురణ స్థలం కంతేరు నుండి కాకినాడకు మారింది. 1940ల్లో బాలాంత్రపు శేషమ్మ ‘హిందూసుందరి’ సంపాదకురాలుగా పనిచేయగా వేముగంటి పాపాయమ్మ గౌరవ కార్యదర్శినిగా పనిచేశారు. ఈవిధంగా ‘హిందూసుందరి’ వివిధ కాలాల్లో పలుమంది సంపాదకురాల్ల సేవల్ని పొందగలిగింది.
పత్రిక మొదటి పుటలో ‘‘ఇది ప్రత్యేకము హిందూ స్త్రీల కొఱకు మాసమునకొకసారి ప్రచురింపబడును’’ అని తెలుగులోనూ (డిసెంబరు 1902), ‘‘మంత్లీ తెలుగు జర్నల్ కండక్టెడ్ ఇన్ ద ఇంటెరెస్ట్స్ ఆఫ్ ద తెలుగు వుమెన్’’ అని ఇంగ్లీషులోనూ (ఆగష్టు`సెప్టెంబరు 1905) యిచ్చేవారు. ‘హిందూసుందరి’ ఆశయాలను ప్రకటిస్తూ మాస్ట్‌హెడ్ క్రింద శార్దూల ఛందస్సులో ఒక పద్యాన్ని ప్రచురించేవారు. ‘హిందూసుందరి’లో ప్రారంభంలో 25 పుటలుండేవి. తపాలా ఖర్చుతో కలుపుకొని సంవత్సర చందా ఒక రూపాయి. 1909లో పునరుద్ధరణ తర్వాత సంవత్సర చందా రెండు రూపాయలకు పెంచారుÑ విడి ప్రతి వెల నాలుగు అణాలు. కొన్ని స్త్రీల పత్రికలతో పోలిస్తే ‘హిందూసుందరి’కి చందాదారులు చాలా ఎక్కువగా వుండేవారు. పత్రిక ప్రారంభమైన రెండేండ్లలోనే చందాదారుల సంఖ్య 800లకు చేరింది (సత్తిరాజు సీతారామయ్య, ‘స్వీయచరిత్ర’, ఏలూరు, 2002, పు. 97). అయినా తర్వాతి కాలంలో యిదేమీ పెరగలేదు. పత్రిక ఆర్థిక యిబ్బందుల్ని ఎదుర్కొంది. పత్రిక నిలదొక్కుకోవడానికి సహాయం చేయమని సంపాదకురాల్లు పాఠకులను దీనంగా వేడుకొనేవారు. ఆర్థిక ఇబ్బందులెదుర్కొన్నప్పటికీ అర్ధ శతాబ్దం పైగా కొనసాగడమన్నది ‘హిందూసుందరి’ ప్రత్యేకత.
ఆంధ్రదేశ మహిళా మేధో ఉద్యమ చరిత్రలో ‘హిందూసుందరి’కి ప్రత్యేకమైన స్థానం వుంది. అనేకమంది స్త్రీలను ఉత్తమ రచయిత్రులుగా తీర్చిదిద్దడమనేది ‘హిందూసుందరి’ సాధించిన విశిష్టమైన విజయం. పురుషుల సంపాదకత్వంలో వెలువడిన ‘సతీహితబోధిని’, ‘తెలుగు జనానా’ వంటి స్త్రీల పత్రికలలో స్త్రీల రచనలు బాగా అరుదు. ‘హిందూసుందరి’కి స్త్రీలే సంపాదకత్వం వహించడంతో అనేకమంది స్త్రీలు నిస్సంకోచంగా తమ రచనల్ని ప్రచురించారు. 1909 నాటికి సుమారు వందమంది స్త్రీలు ‘హిందూసుందరి’లో తమ రచనల్ని ప్రచురించడం ప్రత్యేకంగా పేర్కొనదగ్గ విశేషం (జూన్ 1909, పు. 1`6). పత్రిక ప్రచురించబడ్డ తొలి రెండు దశకాల్లో రచలన్నీ దాదాపు స్త్రీలు రాసినవే! స్త్రీలలో రచన పట్ల ఆసక్తి కలిగించడంలోనూ, వారిని మంచి రచయిత్రులుగా తీర్చిదిద్దడంలోనూ ‘హిందూసుందరి’ పోషించిన పాత్రను బాలాంత్రపు శేషమ్మ సరిగ్గా గుర్తించి ప్రశంసించారు (జనవరి 1910, పు. 13`17). ప్రఖ్యాతి వహించిన తొలితరం స్త్రీవాది భండారు అచ్చమాంబ రచనలనేకం ‘హిందూసుందరి’లో ప్రచురించబడడం గమనార్హమైనది. ఈ విధంగా ‘హిందూసుందరి’ ‘‘నిజమైన స్త్రీల పత్రిక’’గా రూపుదిద్దుకుంది. దీనిని వేదికగా చేసుకొని తొలితరం తెలుగు మహిళా మేధావులు తమకు సంబంధించిన అనేక విషయాలపై విస్తృతంగా స్పందించారు.
వలసాంధ్రలో మహిళాభ్యున్నతికి ‘హిందూసుందరి’ విశేషంగా తోడ్పడిరది. హిందూ వితంతువుల పట్ల అత్యంత తీవ్రమైన సంవేదనశీలత కనబరచడం ‘హిందూసుందరి’ మరో విశేషం. మిగిలిన స్త్రీల పత్రికలేవీ యింత సున్నితంగా వితంతు సమస్యను చర్చించలేదన్నది నిర్వివాదమైనది. వితంతు శిరోముండనాన్ని అత్యంత ఘోరకార్యంగా పరిగణించి దాన్ని తీవ్ర స్వరంతో ఖండిరచింది ‘హిందూసుందరి’. ‘‘ఘోర కిరాత కృత్య’’మైన ‘‘వితంతు కేశఖండనము శిక్షాపాత్రమగునటుల శిక్షా స్మృతియందొక నిబంధననిమిడ్చి నోరులేక బ్రతికియుండినంతకాలములో లోన కుళ్ళి యేడ్చుచు శిరోముండనమున ముండలై వీధినడుగిడుటకైన నోచుకొనని దీనదశ యందుండియుండు హిందూ బ్రాహ్మణ స్త్రీల దీనత్వముడుప’’మని ‘హిందూసుందరి’ సంపాదకురాలైన మొసలిగంటి రమాబాయమ్మ స్త్రీల సంతకాలను సేకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ‘‘మహజరు’’ను సమర్పించారు (జులై 1904, పు. 146`153). మంగళూరు నుండి ‘‘అబల’’ అనే పేరుతో ఒకరు ‘ఇండియన్ పేట్రియాట్’ పత్రికలో రాసిన వ్యాసాన్ని నవంబరు 1905 సంచికలో పునర్ముద్రించారు (పు. 198`201). ఆ వ్యాసంలో రచయిత్రి ‘‘వితంతువుల జీవనము మృగపక్ష్యాదుల జీవనముల కన్న నికృష్టమయినవా?’’ అని ప్రశిస్తూ ‘‘కాలు విరిగిన కాకిని పుండ్లచే బాధపడుచున్న కుక్కను జూచి జాలి జెందుదురుగదా. బాలవితంతువునకాయవస్థ స్వయంకృతమా. కాదు. కాని దానిని చూచిన నెవ్వరికి జాలిలేదు. ఆ దురవస్థకు తోడు ముండనము కూడ విధించిరి’’ అని వితంతువుల అత్యంత దయనీయమైన పరిస్థితిని వివరించారు.
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో చాలామంది స్త్రీలు వితంతు పునర్వివాహాలను సమర్థించడానికి జంకుతున్న చారిత్రక సందర్భంలో వారణాసి కామేశ్వరి (‘మన హిందూ వితంతువుల దుస్థితి’, ఏప్రిల్ 1905, పు. 1`5), వుప్పులూరి నాగరత్నమ్మ (‘స్త్రీ పునర్వివాహములు’, అక్టోబర్`నవంబర్ 1911, పు. 26`30) మొదలైన మహిళా మేధావులు వితంతు వివాహాలను బాహాటంగా సమర్థిస్తూ ‘హిందూసుందరి’లో రచనలు చేశారు. ‘‘కడుపున బుట్టిన కూతుండ్రను నేడో ఱేపో కాటికి కాళ్ళు చాచుకొనియున్న వృద్ధ పిశాచములకు ధన పిశాచావేశముచే’’ కట్టబెట్టే తల్లిదండ్రులను తీవ్రంగా విమర్శించారు ‘‘కృ॥ప॥’’ అనేవారు. ‘‘నోరెఱుగని యొక వితంతు బాలికామణి యొక్క యొక యశ్రుకణము చాలదా మన దేశమును పాడు చేయుటకు?’’ అని ప్రశ్నించారు (‘వితంతువుల దుర్గతి’, మే 1905, పు. 53`56). వితంతు పునర్వివాహాలను సమర్థించిన రచనల్లో అధికశాతం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వితంతు పునర్వివాహాలు సమ్మతమైనవే అని వాదించాయి. అయినప్పటికీ వుప్పులూరి నాగరత్నమ్మ వంటి మహిళా మేధావులు ధర్మశాస్త్రాలు సమ్మతించినా, సమ్మతించకపోయినా వితంతు పునర్వివాహాలు చట్టబద్ధం చేయబడ్డాయి కాబట్టి (‘విడో రీ మేరియేజ్ ఏక్ట్`1856) వాటిని నిర్వహించి తీరాలని వాదించారు (‘స్త్రీ పునర్వివాహములు’, అక్టోబర్`నవంబర్ 1911, పు.26`30). ఈ ఆలోచన అప్పటికీ, యిప్పటికీ చాలా చాలా అభ్యుదయకరమైనది. వితంతు పునర్వివాహాలను సమర్థించిన రచనల్లో అనేకం వితంతు సమస్య తీవ్రతను స్పష్టంగా అర్థం చేయించడానికి గణాంకాధారాలను పొందుపరచాయి (మే 1905, పు.53Ñ జులై 1911, పు.12`18Ñ మార్చి 1913, పు.23`40). వితంతు సమస్యపై ‘హిందూసుందరి’ ప్రదర్శించిన అత్యంత అభ్యుదయకరమైన సానుకూల దృక్పథం ‘శ్రీ విద్యార్థినీ సమాజం’లో వితంతు ప్రశ్నపై చెలరేగిన తీవ్ర వివాదం సమయంలో యింకా స్పష్టంగా గోచరించింది (‘సావిత్రి’ పత్రిక గూర్చి రాసినప్పుడు ఈ వివాద వివరాలను తెలుసుకుందాం.) వితంతు సమస్యకు ప్రధాన కారణమౌతుండడంతో ‘హిందూసుందరి’ బాల్యవివాహాలను తీవ్రంగా ఖండిరచింది. అంతేకాకుండా స్త్రీ విద్యకు బాల్య వివాహాలను పెద్ద అడ్డంకిగా భావించిన ‘హిందూసుందరి’ రజస్వలానంతర వివాహాలను సమర్థించింది (మార్చి 1913, పు. 23`40). కలగర పిచ్చమ్మ బాలికల కనీస వివాహ వయస్సు 16 సంవత్సరాలుండాలన్నారు (ఏప్రిల్ 1912, పు. 8). మొసలిగంటి రమాబాయమ్మ కూడా 16 సంవత్సరాల వరకు బాలికలకు వివాహం చేయకూడదన్నారు (మార్చి 1912, పు.30). కళ్ళేపళ్లె వెంకట రమణమ్మ బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకొని బాల్య వివాహాలను నిషేధించాలని అభిలషించారు. అలాగే బాలికలు ప్రౌఢలయ్యేంతవరకూ గర్భాదానాన్ని నిలుపుదల చేసేలా చట్టముండాలన్నారు. ఒక వేళ ఈ విషయంలో బాలికలను బలవంతం చేస్తే ఆ పెళ్ళిని రద్దుచేసుకునే హక్కు కూడా బాలికలకుండాలని వాదించారు (మే 1912, పు.19`22). ఇది అప్పటికీ, ఇప్పటికీ చాలా అభ్యుదయకరమైన ఆలోచన.
‘హిందూసుందరి’ స్త్రీవిద్యను బాగా ప్రోత్సహించింది. స్త్రీలకు విద్యనందిస్తే వారు ‘‘దుర్నడత’’ కలవారుగానూ, ‘‘అవిధేయులు’’ గానూ తయారవుతారని బలంగా వేళ్ళూనుకొనివున్న దురూహలను ఖండిస్తూ అనేక రచనలు ప్రచురించబడ్డాయి. స్త్రీ విద్యను వ్యతిరేకించిన వారిని ‘‘స్త్రీ విద్యాద్వేషుల’’ని నిందించాయి. ‘స్త్రీ విద్య’ అనే వ్యాసంలో గుండాల సుభద్రమ్మ స్త్రీ విద్యా ప్రయోజనాన్ని ఈ విధంగా వివరించారు: ‘‘విద్య … తెలివి పుట్టించును. అందువలన యుక్తాయుక్త వివేక జ్ఞానము గలుగును. ఆ పైని భార్యాభర్తలకు గల తారతమ్యమును వారు నడుచుకొనవలసిన మర్యాదలను దెలసి భర్తలకనుకూలవర్తనులయి వర్తింతురు. … విద్య వలన కలిగిన జ్ఞానముతో గృహకృత్యములను చక్కగా నెరవేర్చుకొనుచు పతిహితంబులగు కార్యంబులం చేయుచు భగవద్విషయములగు గ్రంథముల చదివి గ్రహించుచు మంచి నడవడిక గలిగియుండి పతికి వలయునపుడు యుక్తమగునాలోచనలు చెప్పుచు ఆయన కర్థాంగిjైు యుండదా? భర్త వివేకిjైు భార్య విద్యాగంధమెరుగకుండిన ఆయనకనువగు రీతిని మెలంగక తన అవివేకతచే నసూయత కలిగించుకొనుచుండును. తల్లి చదువుకున్న చక్కగా కాపురము చేయుటయే కాక తన బిడ్డలను చక్కగా చదివించి బుద్ధిమంతుల చేయును. విద్య రాని దాని మనసు దీపములేని యింటి వంటిది’’ (డిసెంబరు 1903, పు. 23`24). భండారు అచ్చమాంబ (‘భార్యాభర్తల సంవాదము: స్త్రీవిద్య’, డిసెంబరు 1902, పు. 1`10), లక్ష్మీకాంతమ్మ (‘స్త్రీ విద్య’, నవంబరు 1902, పు. 19`22) మొదలైన మహిళా మేధావులు స్త్రీ విద్యావశ్యకతపై రాసిన కథలూ, వ్యాసాల్లో యిలాంటి భావజాలమే వ్యక్తమైంది.
అయితే 1903లోనే స్త్రీలకు కేవలం విద్యే కాకుండా ఉన్నత విద్య కూడా కావాలని వాదించినవారు కూడా వున్నారు. 1903 అక్టోబరు 27వ తేదీన గుంటూరులోని మిషన్ కాలేజీలో ఉపన్యసిస్తూ ఒక పురుషుడు ‘‘స్త్రీలకు బి.ఎ. మొదలగు గొప్ప పరీక్షలు అవసరము లేద’’న్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తూ వున్నవ లక్ష్మీబాయమ్మ ఈ విధంగా ప్రతిస్పందించారు: ‘‘ఏమి హాశ్చర్యము. ఎట్టి దురవస్థ హిందూ దేశమునకు దటస్థించుచున్నది. స్త్రీల దురవస్థ వదలి యెపుడు బాగుపడును. విద్యాధికులై సర్వము తెలిసినవారె (పురుషులు) స్త్రీలను ఇట్లు అడుగంట పెట్టుట న్యాయమా? పురుషులు చదివి స్త్రీవిద్యాధ్వజమెత్తవలసినవారు పబ్లీకు మీటింగులో వలదని చెప్పుటకు ఎట్లు బుద్ధి పుట్టెను. భర్తలు భార్యలకు విద్య చెప్పుటకు మారుగా మూలనణచి బుద్ధి వికాసము కానరాకుండ చేయుట న్యాయము కాదు. విస్తారము దుర్దశలోనున్న సోదరీమణులను చూచుచుండియు స్త్రీవిద్య విషయమై విశేష ప్రయత్నము చేయుటకు మారుగా ఇట్లు వలదని చెప్పుట న్యాయమా? … హిందూ స్త్రీల బుద్ధి వికాసము కానరాకుండ చేయుటకు ముఖ్య కారణము పురుషులు. అట్టిదాని నిప్పటికైన బాగుచేసుకొనవలయునని నాయభిప్రాయము’’ (‘స్త్రీవిద్య’, నవంబరు 1903, పు. 14`16).
‘స్త్రీలకు ఇంగ్లీషు విద్య అవసరమా?’ అనే వ్యాసంలో సుభద్ర ‘‘నా అభిప్రాయము చాలా అవసరమే’’ అని ఖండితంగా ప్రకటించారు. ఇంగ్లీషు విద్య ద్వారా స్త్రీలు ‘‘నవనాగరికతను’’ సంపాదించగలరనీ, ‘‘ఐరోపా స్త్రీలతో స్వేచ్ఛగా మాటలాడి వారి సుగుణరాజమును సంపాదించుకో’’గలరనీ, ‘‘పరిపాలన చేయువారికి పరిపాలించబడు మనకు ఎక్కువ దోస్థి (స్నేహము) కలిగి మన హిందూదేశము ఎక్కువ శోభతో వర్థిల్లునటుల చేగలము’’ అనీ వివరించారు. అంతేకాక ‘‘మన దేశములో మొగవారు విద్యాధికులు. స్త్రీలు విద్యలేనివారు. వీరి దాంపత్యము దైవవశమున చక్కగా జరుగుచున్నది గాని మన పురుషులకు మనము తగిన స్త్రీలమని చెప్పుకొనలేము. ఈ కారణము చేత స్త్రీలు మగవారి చేతిలో ఆటవస్తువులై మగవారి హేళనకు పాత్రులగుచున్నారు. మనము కూడ నూతన నాగరికత సంపాదించినచో మన మగవారికి ఎక్కువ సహాయురాండ్రమై వారి మెప్పు బడయుదుము’’ అంటూ ‘‘కావున మనందఱము ఇంగ్లీషు నేర్చుకొనుటకు’’ ప్రయత్నం చేయాలని స్త్రీలకు పిలుపునిచ్చారు (ఫిబ్రవరి 1912, పు. 5`7).
స్త్రీ పురుషులిద్దరికీ విద్యార్జనకై ‘‘సమాన’’ అవకాశాలుండాలని గట్టిగా వాదించారు వుప్పులూరి నాగరత్నమ్మ. ‘‘పూర్వాచారపరాయణులు స్త్రీలకు విద్య గరపిన కీడుమూడునని జెప్పుచు వారిని పశుప్రాయులుగజేసి హీనముగా జూచుచు పురుషులకు సర్వస్వాతంత్రియములును, స్త్రీలకస్వాతంత్రియమును గల్పించి వారిచ్చవచ్చునటుల శాస్త్రపురాణేతిహాసములను వ్రాసియుండిరి’’ అనీ, ‘‘ఆ శాస్త్రములు స్త్రీలే వ్రాసియుండినచో పురుషులకంటే స్త్రీలకే సర్వస్వాతంత్రియములుండునటులగాని, లేక (కనీసం) సమాన స్వాతంత్రియములుండునటులగాని వ్రాసి యుందురు’’ అనీ ఖారాఖండీగా ప్రకటించారు. (ఈ విధంగా హిందూమత గ్రంథాల్లోని ‘‘పురుష పక్షపాతాన్ని’’ బట్టబయలు చేసిన స్త్రీవాదులనేకులు వలసాంధ్రలో ఉన్నారు.) భర్త విద్యావంతుడై భార్య విద్యాహీనురాలైతే వారికి మానసికంగా పొత్తు కలవక కుటుంబ జీవితంలో ‘‘కలహములు సంప్రాప్తమై దు:ఖభాజను’’ లౌతారని హెచ్చరించారు. పురుషునివలె స్త్రీ విద్యావతి అయితే ‘‘కాలవశంబున పతి గతించినను, తన బిడ్డలకు నీతి విద్యగఱపుటయేగాక తానును నీచపనులకొడంబడక బాలికా పాఠశాలలలో నుపాధ్యాయినిగానమరి యుదరపోషణకేలోటును రాకుండ కాలము గడపుకొనవచ్చు’’నని స్త్రీవిద్యా ప్రయోజనపు ప్రాక్టికల్ పార్శ్వాన్ని తెలియజేశారు (‘స్త్రీ విద్య’, ఏప్రిల్ 1912, పు. 19`22).
‘స్త్రీ విద్యాభ్యుదయమెటులనగును’ అనే వ్యాసంలో ‘‘ఒక స్త్రీ’’ స్త్రీ విద్యాభ్యుదయం కోసం ‘‘స్త్రీలకు స్వాతంత్య్రమీయవలయును’’ అని వాదించారు. ‘‘గాని స్త్రీ విద్యాభ్యుదయమై స్త్రీ స్వాతంత్య్రము వ్యాపించినటుల గానరాదు’’ అని వాపోయారు (మే 1912, పు. 11`16). ‘‘కూృరములగు కట్టుబాట్లతో నాచరింపబడుచున్న బాలికా వివాహములే (బాల్య వివాహములు) స్త్రీ విద్యాభ్యుదయమునకు భంగకరములై’’ ఉన్నాయనీ, బాల్య వివాహాలను నిషేధిస్తేనేగాని స్త్రీ విద్య అభివృద్ధి చెందదనీ వాదించారు కళ్ళేపళ్లె వెంకట రమణమ్మ (‘స్త్రీ విద్యకు భంగకరములగు వైవాహిక ధర్మములు: వానిని తొలగించు నుపాయములు’, మే 1912, పు. 16`22). ‘స్త్రీ విద్యావిషయము’ అనే వ్యాసంలో దామెర్ల సీతమ్మ తాము అభివృద్ధి చెందాలంటే స్త్రీల సమస్యల్ని స్త్రీలే పట్టించుకోవాలని చాలా బలంగా వాదించారు. ఆమె మాటల్లో: ‘‘స్త్రీలమగు మనము మన విషయమై పాటుపడిననేగాని మనమభివృద్ధినొందజాలము. ఎప్పుడును యెవరి విషయమై వారే యాలోచించుకొనవలయునుగాని ఒకరి విషయమై యొకరు పాటుపడుదురనుట వెఱ్ఱి. … ముప్పది సంవత్సరముల నుండి పురుషులెందరు స్త్రీవిద్యను గూర్చి గంభీరోపన్యాసములిచ్చుచున్నను మన సహాయము లేకపోవుట చేతనే వారింతవఱకెట్టి ఘనకార్యమును జేయజాలరైరి. … మనమే ఇంక కన్ను తెరచి చూచి మన మార్గమును మనము చూచుకొనిననేగాని లాభము లేదు. ఎవరి బాధను వారే దీర్చుకొనవలయును. ఒకరి బాధ యింకొకరికి తెలియుట కూడ కష్టమే. … కావున విద్యావిహీనతచే మనమొందు బాధ విద్యావిశారదులగు పురుషులకెట్లు తెలియగలదు. … స్త్రీల బాధలు పురుషులు గనుగొనజాలరు. … కావున నెవరి కష్టముల వారే తొలగించుకొనుటకు బ్రయత్నము చేయవలయును’’ (జనవరి 1912, పు. 1`4). ఇలా విస్పష్టమైన స్త్రీవాద భావజాలంతో స్త్రీల అభివృద్ధిని కాంక్షించిన దామెర్ల సీతమ్మ వంటి నిఖార్సయిన తొలితరం స్త్రీవాదులనేకులు ‘హిందూసుందరి’ శిథిలాల్లో మరుగున పడిఉన్నారు.
మార్చి 1913 సంచికలో ‘ఆంధ్ర మహిళా మహాసభ’లో కాశీనాథుని రామాబాయమ్మ చేసిన ప్రసంగాన్ని ప్రచురించింది ‘హిందూసుందరి’. ఆ ఉపన్యాసంలో రామాబాయమ్మ బాలికల విద్య పట్ల తల్లిదండ్రులు కనబరిచే వివక్షను ప్రశ్నిస్తూ ‘‘బాలురకు మడి మాన్యముల నమ్మిjైునను విద్యను జెప్పించెదరు. బాలికల విద్యకై చేయు వ్యయమత్యల్పము. మన సోదరులు బి.ఏ.లగుటకును మన యల్పవిద్యకును నిదియె కారణము’’ అని విశ్లేషించారు. అత్యల్పంగా విద్యావంతులైన స్త్రీలైనా బహుకొద్దిమందే అని గణాకాంధారాలతో నిరూపించారు. హిందూ బాలికలను క్రైస్తవ బాలికలతో పోలుస్తూ పెద్దవారైన తర్వాత కూడా క్రైస్తవ బాలికలు విద్యనభ్యసించగలుగుతున్నారనీ, హిందూ బాలికలు మాత్రం పదమూడేండ్లకే చదువు చాలించుకోవలసి వస్తోందనీ, ఈ పరిస్థితికి బాల్యవివాహాలు కారణమనీ వివరించారు. ‘‘బాల్య వివాహములు ప్రబలి యున్నంత కాలమును హిందూ స్త్రీలకున్నత విద్య వచ్చుటకు వీలు లేదని’’ నిష్కర్షగా ప్రకటించారు. బాల్యవివాహాల వల్ల కలిగే పలురకాలైన అనర్థాలను ఈ విధంగా విశదీకరించారు: ‘‘బాల్యవివాహము వలన నారోగ్యము చెడునుÑ అంగ బలము దరుగునుÑ అకాల గర్భాధారణమేర్పడునుÑ దుర్బల సంతానము కలుగునుÑ బాలింతల చావులు హెచ్చునుÑ చదువు సన్నగిలునుÑ బాల వితంతువుల సంఖ్య పెరుగునుÑ కన్యాశుల్క వరశుల్క వృక్షములు వర్ధిల్లునుÑ దుర్బల సంతానమయమైన జాతి నానాటికి క్షీణదశ పాలగును.’’ ఈ విధంగా బాల్యవివాహ ఆచారాన్ని భారత జాతి బలాన్ని తొలిచివేచే వేరుపురుగుగా సరిగ్గా గుర్తించారు. ఆంధ్ర ప్రాంతంలో బాల్యవివాహ సమస్య తీవ్రతను వెలికితెస్తూ ‘‘ఒక కృష్ణా మండలమునందే పదేండ్ల లోపల బెండ్లి అయిన బాలికలు 10,000 గలరు. తెలుగు జిల్లాలయందు పదేండ్ల లోపల బెండ్లి అయిన బాలికలు 1,24,000 (మంది) గలరు’’ అన్నారు. బాలవితంతు సమస్యపై ప్రతిస్పందిస్తూ ఈ విధంగా వివరించారు: ‘‘అతి బాల్య వివాహముల వలన గలుగు నష్టములలో నొకటి బాల వితంతువుల దుర్భర దు:ఖము. మన దేశమునందలి బాల వితంతువుల స్థితి యెంత కఠిన హృదయము గలవారికైనను జాలిని బుట్టింపకమానదు. ముక్కుపచ్చలారని పిల్లలకు పెండ్లిండ్లు జేయుదురు. కాలవశమున వరులు మృతినొందినపుడా బాలికలాజన్మాంతమును నిర్భంధకమైన వైధవ్యము ననుభవించవలసియుందురు. ఈ నిర్బంధకమునకు ముండనము, ఏకభుక్తము, అమాంగల్యము తోడ్పడి వితంతువులను కురూపులను, జీవచ్ఛవములను జేయుచున్నది. ఈ దురాచారము వలననే పాశ్చాత్యులు హిందూజాతిని హీనముగా జూచుచున్నారు. నిర్బంధ వైధవ్యము వలన యువతులకును, సంఘమునకును, దేశమునకును గలుగుచున్న కీడును వర్ణింపదరముగాదు. వారి ఘోష తొలగినగాని హిందూజాతికి సత్కీర్తి గలుగనేరదు. 1911 సం॥పు జనన మరణముల లెక్కల ప్రకారము హిందూ దేశమునందు 4,40,000 బాల వితంతువులు గలరు. … కృష్ణా మండలమందు పదునారేండ్ల లోపలి బాల వితంతువులు 2,358 మంది గలరు. బాల వితంతువుల దైన్యము దొలగించుటకు పునర్వివాహములును, విద్యావ్యాపనమును, స్వతంత్ర జీవనమును నవసరము’’ (మార్చి 1913, పు. 23`40). 19వ శతాబ్ది చివరి దశకం నుండీ వలసాంధ్ర స్త్రీలు మహిళా సంఘాల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. వలసాంధ్రలో మహిళోద్యమ అభివృద్ధికి మహిళా సంఘాలు విశేషంగా తోడ్పడ్డాయి. వివిధ మహిళా సంఘాల సమాచారాన్నీ, మహిళల సమావేశాల వివరాల్నీ అత్యంత శ్రద్ధతో ప్రచురించింది ‘హిందూసుందరి’. వివిధ మహిళా సంఘాల సమావేశాల్లో ` ముఖ్యంగా ‘ఆంధ్ర మహిళా మహాసభ’ వార్షిక సదస్సుల్లో ` మహిళా మేధావులు చేసిన ప్రసంగాల పూర్తి పాఠాల్ని ప్రచురించడం ద్వారా మహిళోద్యమ సందేశాన్ని తెలుగునాడు నాలుగు చెఱుగులా వ్యాపింపజేసింది. కాకినాడలోని ‘శ్రీవిద్యార్థినీ సమాజం’ ద్వారా ప్రచురించబడ్డంతో సహజంగానే ఆ సమాజ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు విరివిగా ప్రచురితమయ్యాయి. ఇలాంటి వివరాలు మహిళల్ని కార్యాచరణశీలురుగా నిర్ద్వంద్వంగా నిరూపించడమే కాకుండా మహిళల దృష్టికోణం నుండి మహిళోద్యమ చరిత్రను రచించడానికి అమూల్యమైన ప్రాథమిక ఆధారాలుగా తోడ్పడుతున్నాయి. లెక్కకు మిక్కిలి మేధావులూ, కార్యాచరణశీలురూ అయిన స్త్రీలు ‘హిందూసుందరి’ పుటలలో నిక్షిప్తమై వున్నారు.
స్త్రీల అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడిన పండిత రమాబాయి సరస్వతి (జనవరి 1910, పు. 1`7), స్వర్ణకుమారీదేవి (ఫిబ్రవరి`మార్చి 1910, పు. 9) మొదలైన సమకాలీన మహిళా మేధావుల, కార్యాచరణశీలుర జీవన రేఖల్ని వారి ఛాయాచిత్రాలు సహా ప్రచురించింది ‘హిందూసుందరి’. సెప్టెంబరు`అక్టోబరు 1903 సంచికలో భండారు అచ్చమాంబపై ఒక వ్యాసాన్ని ఆమె ఛాయాచిత్రం సహా ప్రచురించింది (పు. 1`7). జులై 1902 సంచికలో అచ్చమాంబ గ్రంథం ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ పై కొటికలపూడి సీతమ్మ చేసిన సమీక్షను ప్రచురించింది (పు. 1`2). అచ్చమాంబ చనిపోయినప్పుడు ఒక నివాళి వ్యాసాన్ని ప్రచురించింది (‘కీర్తిశేషులగు శ్రీమతి భండారు అచ్చమాంబ’, డిసెంబరు`జనవరి 1905, పు. 300`304). కొటికలపూడి సీతమ్మ, వుప్పులూరి నాగరత్నమ్మ, బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ, ఆచంట రుక్మిణీదేవి, కాంచనపల్లి కనకమ్మ మొదలైన సమకాలీన మహిళోద్యమంలో చురుకుగా వున్న మహిళా మేధావులపై కూడా వారి ఛాయాచిత్రాలు సహా వ్యాసాలు ప్రచురించింది. ఇలా మహిళా మేధావులు, మహిళోద్యమ నాయకుల జీవనరేఖల్ని ప్రచురించడం ద్వారా వారిని యితర స్త్రీలకు ఆదర్శంగా నిలబెట్టింది. మార్చి 1913 సంచికలో ‘హిందూసుందరి’ స్థాపకులైన సత్తిరాజు సీతారామయ్య కుటుంబపు ఛాయాచిత్రాన్ని ప్రచురించింది. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా మహిళాభివృద్ధికోసం ఆయన చేసిన కృషిని కొనియాడుతూ వ్యాసాలు ప్రచురించబడ్డాయి (మే 1904, పు. 46`50Ñ 50`53).
ఈ విషయాలే కాకుండా ‘గృహిణీ ధర్మములు’, ‘పాతివ్రత్యము’, ‘పతిభక్తి’, ‘నీతి’, ‘ఐకమత్యము’, ‘దైవభక్తి’, ‘అత్తాకోడండ్రపోరు’ మొదలైన అంశాలపై కూడా వ్యాసాలూ, పద్యాలూ ‘హిందూసుందరి’లో ప్రచురించబడ్డాయి. ‘గృహిణీ ధర్మములు’, ‘పాతివ్రత్యము’, ‘పతిభక్తి’ మొదలైన అంశాలపై ప్రచురించబడిన రచనలు గృహకార్యనిర్వహణలో స్త్రీలు పాటించాల్సిన మెలకువల్నీ, హిందూ పతివ్రతా ధర్మాల్ని ఆచరించాల్సిన ఆవశ్యకతనూ, భర్తకు అణగిమణగి వుండాల్సిన అవసరాన్నీ బోధించేవి. స్త్రీలు విద్యావంతులై తమ భర్తల మనస్సునెరిగి వారి అవసరాలూ, ఆకాంక్షలకనుగుణంగా నడుచుకోవడం ద్వారా స్త్రీలకు ‘కొంతమేరకు’ స్వేచ్ఛ ఇచ్చిన ‘‘ఆధునిక పితృస్వామ్య’’ చట్రంలో చక్కగా ఒదిపోయేలా చేయడం యిలాంటి రచనల లక్ష్యం. ‘ఐకమత్యం’పై ప్రచురించబడిన రచనలు స్త్రీలను ఒక ప్రత్యేక ‘‘జాతి’’గా నొక్కివక్కాణించి వారిని సంఘటితం కమ్మనీ, మహిళా సంఘాల్ని నెలకొల్పమనీ ఉద్బోధించేవి. స్త్రీలలో సంఫీుభావం లేకుండా ‘‘స్త్రీజాతి’’ ముందుకు సాగలేదనీ, మహిళోద్యమ నిర్మాణం కలగానే మిగిలిపోతుందనీ హెచ్చరించేవి. స్త్రీలలో యేర్పడాల్సిన విశాల ‘‘సోదరీతత్వాన్ని’’ నొక్కి చెప్పేవి.
‘వర్తమానములు’ (తర్వాత ‘వార్తావళి’) అనే శీర్షిక క్రింద ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తల్ని ప్రచురించేది ‘హిందూసుందరి’. ఈ వార్తల్లో అధికశాతం సంఘసంస్కరణకు సంబంధించినవీ, మహిళాభివృద్ధికి సంబంధించినవీ అయి వుండేవి. ఉదాహరణకు 1909 ఆగష్టు సంచికలో పునర్వివాహాభిలాషి అయిన ఒక వితంతువు యింటి నుండి పారిపోయిన వార్తనూ, ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన కష్టాల్నీ ప్రచురించింది (పు.30). (బహుశా) మే 1903 నాటి సంచికలో బెంగాళ్ ప్రెసిడెన్సీలోని వితంతువుల గణాంకాలు ప్రచురించింది. దాని ప్రకారం ఒక సంవత్సరంలోపు 538 మంది, రెండు సంవత్సరాలలోపు 576 మంది, మూడు సంవత్సరాలలోపు 651 మంది, నాలుగు సంవత్సరాలలోపు 1,756 మంది, ఐదు సంవత్సరాలలోపు 3,861 మంది వితంతువులుండేవారు. ఈ స్థితికి కారణమైన బాల్యవివాహాలను ఖండిరచి, వితంతు పునర్వివాహాలను సమర్థించింది (వెనక అట్ట).
వలసాంధ్ర స్త్రీవాదుల భావజాలంలోని అంతర్వైరుధ్యాలకు చక్కగా దర్పణం పడుతుంది ‘హిందూసుందరి’. ఉదాహరణకు అనేక విషయాల్లో అభ్యుదయ దృక్పథాన్ని కనబరచిన ‘హిందూసుందరి’ స్త్రీల విడాకుల హక్కును మాత్రం వ్యతిరేకించింది. 1930ల నుండీ ఆంధ్ర మహిళా మేధావులు ఆస్తిహక్కు, విడాకుల హక్కు, రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం మొదలైన వానిని కోరుకొని వాటిని మహిళా సంఘాల సమావేశాల్లో చర్చించేవారు. స్త్రీల సంఘాల్లోనూ, మహిళా సమావేశాల్లోనూ విడాకుల చట్టం, రిజిష్టర్డ్ వివాహాలు మొదలైన విషయాల్ని చర్చించడాన్ని ‘హిందూసుందరి’ సంపాదకురాలైన బాలాంత్రపు శేషమ్మ తీవ్రంగా నిరసించారు. 1936 ఫిబ్రవరిలో కాకినాడలో జరిగిన ‘ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ’లో (‘ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్’ ఆంధ్ర రాష్ట్ర శాఖ: స్థాపన ` 1927) చేయబడిన తీర్మానాలను గూర్చి రాసిన సంపాదకీయంలో ఇలా ప్రస్తావించారు: ‘‘కాని అట్టి మహోద్దేశములతో చేయబడు సభలలో నానాటికి వెఱ్ఱితలలు వేసి పిచ్చి పిచ్చి తీర్మానములు చేయబడుచున్నవి. … రిజిష్టర్ వివాహము, విడాకుల చట్టము, బర్త్ కంట్రోలు మొదలగునవి చర్చనీయాంశములగుట దేశ దౌర్భాగ్యమనక తీరదు. … భగవత్సముడగు భర్తయుండ విడాకుల చట్టముతో భారతనారికేమి సంబంధము? రాను రాను పూర్వ పుణ్యధర్మములు నశించి ఇదే నవత, స్వతంత్రత, సంఘాభివృద్ధిదము అని తలంచు మన స్త్రీల ఆశయములిట్లుగా మారుటకు అది కాల మహిమగా తోచుచున్నది. … ఆ మూడు తీర్మానములు మాత్రము స్త్రీ లోకమును ఎన్నటికైన పాడు చేసి తీరును. ఈలాటి తీర్మానములను మన స్త్రీలు కోరుట నేలవిడిచి సాము చేయుట వంటిది గాని యెంతమాత్ర మభివృద్ధిదాయకము కానేరదు. అది ‘‘ఆర్య భారత నారీ ధర్మ’’మెంత మాత్రము కానేరదు’’ (‘కాకినాడ సభలు’, ఫిబ్రవరి 1936). ఆర్య భారత నారీ ధర్మాన్ని గుర్తుచేసి స్త్రీల న్యాయమైన హక్కుల్ని వదులుకోమని చెప్పడం తీవ్రమైన అంతర్వైరుద్ధ్యం.
1940ల్లోనూ, తర్వాతా ‘హిందూసుందరి’ క్షీణించింది. స్త్రీల సమస్యలకు సబంధించి ప్రారంభంలో వుండిన తదనూ, గాఢతా 1940ల తర్వాత కనిపించదు. ఆర్థిక యిబ్బందులెదుర్కోవడం సరేసరి! స్త్రీల రచనలు కూడా తగ్గిపోయాయి. ఉదాహరణకు సెప్టెంబరు 1942 సంచికలోని 12 రచనల్లో కేవలం నాలుగు మాత్రమే స్త్రీలు రచించినవిÑ మిగిలిన 8 పురుషుల రచనలు. స్త్రీలకు ‘హిందూసుందరి’ పట్ల ఆసక్తి తగ్గిపోయిందనీ, వారు యితర స్త్రీల పత్రికలకు మళ్ళిపోయారనీ ‘హిందూసుందరి’ గౌరవ కార్యదర్శిని అయిన వేముగంటి పాపాయమ్మ కడుదీనంగా వాపోయారు (ఫిబ్రవరి 1945, పు. 2Ñ జులై 1941, పు. 2). ‘‘32 సంవత్సరాలనుండియు వ్యయప్రయాసలకోర్చి జ్ఞాన ప్రబోధమే ఆశయముగా పెట్టుకొని స్త్రీల కొఱకై నడపబడుచున్న యీ పత్రిక (‘హిందూసుందరి’) సంపాదకీయములో ‘అనేక పర్యాయములు స్త్రీలోకమున కంజలించి వ్యాసములనీయ ప్రార్థించినను ఏలొకో ఆంధ్ర సోదరీమణులు మా పత్రికయందు ‘శీతకన్ను’ చూపుట విచారణీయము’ అని వ్రాయుట ఆంధ్ర రచయిత్రీమణుల బద్ధకమునకొక ప్రబల నిదర్శనము. ఇన్ని సంవత్సరములుగా కృషిచేయు పత్రికకే ఆత్మాభివృద్ధినైనగోరి రచనలనంపజాలని రచయిత్రులకది యుచితముగాదని విన్నవించుచున్నాము. సర్వవిధముల ఆంధ్రులీ పత్రికకు తోడ్పడి నిలువక కొనసాగునటుల జూడగోరెదము’’ అని యింకో స్త్రీల పత్రిక అయిన ‘గృహలక్షి’ స్త్రీలను మందలించాల్సి వచ్చింది (‘హిందూసుందరి’, మార్చి 1938). జాతీయోద్యమానికి సంబంధించిన అంశాలు అంటే ఖద్దర్, మతసామరస్యం, హరిజన సమస్య, నిర్మాణాత్మక కార్యక్రమం మొదలైన అంశాలపై రచనలు ప్రచురించబడ్డాయి. జాతీయోద్యమంలో స్త్రీలు పోషించాల్సిన పాత్రను అవి బోధించేవి. తదనుగుణంగానే ముఖపత్రంలో మార్పులు చోటుచేసుకొని ‘భారతమాత’ చిత్రం దర్శితమవడమారంభించింది.
20వ శతాబ్దం ప్రారంభంలోనే మొగ్గతొడిగిన ‘హిందూసుందరి’ స్త్రీల సంపాదకత్వంలో వెలువడడం మాత్రమే కాకుండా ఒక మహిళా సంఘం ద్వారా నిర్వహించబడడం దానంతకదే ఒక ప్రాముఖ్యతగల విషయం. స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన మిగిలిన స్త్రీల పత్రికల్లాగా (ఉదాహరణకు ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’) అల్పాయుష్కురాలు కాకుండా అర్ధ శతాబ్దం పైగా కొనసాగి స్త్రీల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడడం ‘హిందూసుందరి’ విశిష్టత. వలసాంధ్రలో అక్ష్యరాస్యులై, రచనలు చేయగలిగిన స్త్రీలను ఒక దగ్గరికి చేర్చింది ‘హిందూసుందరి’. ఎంతోమంది స్త్రీలను ఉత్తమ రచయిత్రులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఔత్సాహిక రచయిత్రులు తమ రచనల్ని ప్రచురించడానికి ఒక విశాల వేదిక కల్పించి, ప్రత్యక్షంగా కలవడానికి అవకాశం లేకుండా సుదూర ప్రాంతాల్లో వున్న తమ సోదరీమణులతో సంభాషించడానికీ, బౌద్ధిక సంబంధాలు యేర్పరచుకోవడానికీ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందిÑ వలసాంధ్రలో స్త్రీల జర్నలిజానికి పటిష్టమైన పునాదులేసింది. స్త్రీలు రచయిత్రులుగా ‘హిందూసుందరి’లో పొందిన శిక్షణ వల్లే తర్వాత కాలంలో ` అంటే 1930లు, 1940లలో ` ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ వంటి వలసపాలనా కాలంనాటి మలితరం స్త్రీల పత్రికలలో బాగా పరిణతి చెందిన రచనలు చేయగలిగారు. అనేక మంది స్త్రీలు వితంతు పునర్వివాహాలను బాహాటంగా సమర్థించలేని చారిత్రక సందర్భంలో వితంతు సమస్య మీద తీవ్ర సంవేదనను కనబరచి వితంతు పునర్వివాహాలను సమర్థించడమనేది ‘హిందూసుందరి’ని మిగిలిన స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన స్త్రీల పత్రికల్లో విశిష్టంగా నిలబెడుతుంది. వలసాంధ్రలో మహిళల సంయుక్త బౌద్ధికోద్యమానికి శ్రీకారం చుట్టి మహిళోద్యమం బలంగా పాతుకోవడానికి ‘హిందూసుందరి’ బృహత్తరంగా తోడ్పడిరదనేది నిర్వివివాదాంశం.
(కృతజ్ఞతలు: ‘హిందూసుందరి’ పత్రికను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గ్రంథాలయాల నుండి సేకరించాను. ‘శ్రీగౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం’, రాజమండ్రిÑ ‘సారస్వత నికేతనం’, వేటపాలెంÑ ‘శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం’, హైదరాబాద్Ñ ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్’, హైదరాబాద్Ñ ‘అణ్వేషి’, హైదరాబాద్ ` వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘హిందూసుందరి’ స్థాపకులైన సత్తిరాజు సీతారామయ్యగారి ‘స్వీయ చరిత్ర’ ప్రచురించబడిరదని శ్రీ రామినేని భాస్కరేంద్రరావు గారు (మదనపల్లి) తెలియబరిచారు. మా గురువుగారైన శ్రీ కొప్పర్తి వెంకట రమణమూర్తి గారు (తణుకు) శ్రీ కడుపు గంగాధరరావు (ప్రస్తుతం హైదరాబాద్) గారి ద్వారా ఈ పుస్తకం నాకు అందేలా చూశారు. మరుగున పడివున్న సీతారామయ్యగారి ‘స్వీయ చరిత్ర’ను 2002లో ప్రచురించడం ద్వారా ఆయన కుంటుంబ సభ్యులు తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా వలసాంధ్రలోని మహిళోద్యమ చరిత్రకూ గొప్ప మేలు చేశారు. వారందరికీ పరిపరి విధాలా ధన్యవాదాలు.)