అనువాదం: వై. కృష్ణజ్యోతి
ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదన్న ఉద్దేశ్యంతో సులభమైన, సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకున్నారు సునీతాదేవి. కానీ కాపర్`టి విఫలమవడంతో, అబార్షన్ చేయించుకోవడానికి ఆమె స్థానిక పిహెచ్‌సి నుండి ఢల్లీి, బీహార్‌లలోని ప్రభుత్వ ఆస్పత్రుల వరకు తిరగవలసి వచ్చింది.
తన కడుపులో ‘‘గడ్డ’’లాంటిదేదో పెరుగుతోందని సునీతా దేవి ఆందోళనపడ్డారు. కడుపు ఉబ్బరంగా అనిపించడంతో ఆమె సరిగ్గా తినలేకపోయేవారు. రెండు నెలలు దాన్ని నిర్లక్ష్యం చేశాక, ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళినపుడు, అక్కడ డాక్టర్ చెప్పిన విషయాన్ని ఆమె నమ్మలేకపోయారు. ‘‘ఆప్‌కో బచ్చా ఠహర్ గయా హై (మీరు గర్భవతి)’’.
అదెలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు. గర్భం రాకుండా కాపర్`టి పెట్టించుకుని ఇంకా ఆరు నెలలు గడవలేదు! 2019లో జరిగిన ఆ సంఘటనను వివరిస్తున్నప్పుడు ఆమె ముఖం ఇంకా పాలిపోయి, అలసటగా కనబడిరది. ఆమె జుట్టు వెనక్కి ముడివేసి ఉంది. ఆమె లోతైన కళ్ళు నిస్తేజంగా, నీరసంగా ఉన్నాయి. ఆమె నుదుటిపై ఉన్న ఎర్రటి బొట్టు మాత్రమే ప్రకాశవంతంగా కనబడుతోంది.
30 ఏళ్ళ సునీతకు (ఆమె అసలు పేరు కాదు) 4`10 ఏళ్ళ వయసులో ఉన్న నలుగురు పిల్లలున్నారు… ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. మే 2019లో, తన చిన్న బిడ్డకు రెండేళ్ళ వయసున్నప్పుడు, ఇంక పిల్లల్ని కనకూడదని సునీత నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించే ఆశా కార్యకర్తను కలిసి, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. వివరాలు పరిశీలించాక, మూడు నెలల పాటు గర్భం రాకుండా ఆపుతుందని చెప్పే ‘‘అంతర’’ అనే ఇంజక్షన్‌ను ఎంచుకున్నారు. ‘‘నేను ఇంజెక్షన్ వేయించుకుందామనుకున్నాను’’ అని ఆమె అన్నారు.
తన 8ఞ10 అడుగుల గదిలో పరిచిన చాపపై మేం కూర్చున్నాం. ఆ గదికి ఒక మూలన
ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్‌పై మరిన్ని చాపలు పేర్చి ఉన్నాయి. ప్రక్క గదిలో సునీత బావగారి కుటుంబం నివసిస్తోంది. మూడో గదిలో బావమరిది ఉంటున్నారు. నైరుతి ఢల్లీిలోని నజఫ్‌గఢ్‌లోని మహేశ్ గార్డెన్ ప్రాంతంలో ఉంది ఆ ఇల్లు.
సునీత ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గోపాల్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి) ఉంది. ‘‘అంతర’’ ఇంజక్షన్ వేయించుకునేందుకు ఆశా వర్కర్‌తో కలిసి అక్కడికి వెళ్ళారు సునీత. కానీ, పిహెచ్‌సిలోని డాక్టర్ తనకు మరో సలహా ఇచ్చారు. ‘‘ఇంజక్షన్‌కు బదులు నాకు కాపర్`టి గురించి వివరించింది డాక్టర్. అది సురక్షితమైనది కనుక పెట్టించుకోమని కోరింది. కానీ, నేను ఆమెను కాపర్`టి గురించి ఎప్పుడూ అడగలేదు’’ సునీత నొక్కి చెప్పారు. ‘‘కానీ అది బాగుంటుందని డాక్టర్ పట్టుబట్టింది. ‘నువ్వు ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదనుకుంటున్నావు కదా’ అని ఆమె నన్ను అడిగింది!’’
నజాఫ్‌గఢ్‌లో పండ్లు అమ్ముతుండే సునీత భర్త (అతని పేరు వెల్లడిరచడానికి ఆమె ఇష్టపడలేదు) ఆ సమయంలో బీహార్ రాష్ట్రం, దర్బంగా జిల్లాలోని తన స్వగ్రామమైన కొల్హంతా పటోరికి వెళ్ళారు. డాక్టర్ పట్టుబట్టింది. ‘నీ భర్తకు దీంతో ఏంటి సంబంధం? ఇది నీ చేతుల్లోనే ఉంది. దీన్ని వాడితే ఐదేళ్ళ వరకు నీకు గర్భం రాదు’ అని తనతో వాదించిందని సునీత గుర్తు చేసుకున్నారు.
దాంతో, గర్భనిరోధక ఇంజెక్షన్ (అంతర)కి బదులు, గర్భసంచి లోపల పెట్టే పరికరం, కాపర్`టిని ఎంచుకున్నారు సునీత. తన భర్త గ్రామం నుండి తిరిగి వచ్చేవరకూ, అంటే సదరు ప్రక్రియ జరిగిన పది రోజుల వరకూ, దీని గురించి ఆమె అతనికి చెప్పలేదు. ‘‘నేనతనికి చెప్పకుండా రహస్యంగా ఈ పని చేశాను. దాంతో అతను నన్ను కోప్పడ్డాడు. నన్ను ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినందుకు ఆశా వర్కర్ని కూడా తిట్టాడు’’.
అయితే, ఈ ప్రక్రియ తర్వాతి రెండు నెలల్లో, పీరియడ్స్ సమయంలో సునీతకు భారీగా రక్తస్రావమైంది. కాపర్`టి వల్లే అధిక రక్తస్రావం జరిగిందని భావించిన ఆమె, 2019 జులైలో దాన్ని తొలగించుకునేందుకు రెండుసార్లు గోపాల్‌నగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కానీ, ప్రతిసారీ ఆమెకు రక్తస్రావాన్ని నియంత్రించేందుకు మందులు ఇచ్చి పంపించేసేవాళ్ళు.
2019 నవంబరులో ఆమెకు నెలసరి రాలేదు. కడుపులో ‘‘గడ్డ’’ లాంటిదేదో ఉన్నట్లనిపించేది. నజాఫ్‌గఢ్‌లోని వికాస్ హాస్పిటల్‌లో చేసిన ‘‘బాత్రూమ్ జాంచ్’’, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆమె గర్భవతి అనీ, గర్భసంచి లోపల పెట్టే పరికరం (ఇంట్రాయుటిరైన్ కాంట్రసెప్టివ్ డివైజ్`ఐయుసిడి) విఫలమైందనీ నిర్ధారించింది.
కాపర్`టి పెట్టించుకున్నాక గర్భం దాల్చడం అంత మామూలు విషయమేమీ కాదని పశ్చిమ ఢల్లీి జిల్లాలో ప్రాక్టీసు చేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ పూనమ్ చద్దా అన్నారు. ‘‘ఇలాంటివి జరిగే అవకాశం వందలో ఒకరికి ఉంటుంది. ప్రత్యేక కారణమంటూ ఏం ఉండదు. ఏ (గర్భనిరోధక) పద్ధతైనా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె వివరించారు. ఐయుసిడి సురక్షితమైన, ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, అది విఫలమై అవాంఛిత గర్భాలకూ, ప్రేరేపిత గర్భస్రావాలకూ దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.
‘‘మై తో ఇసీ భరోసే బైఠీ హుయీ థీ (నేను దీన్నే నమ్ముకున్నాను). కాపర్`టి ఉంది కాబట్టి నాకు గర్భం రాదనే నమ్మకంతో ఉన్నాను. డిస్పెన్సరీ (పిహెచ్‌సి) దగ్గరున్న డాక్టర్ ఇది ఐదేళ్ళపాటు పనిచేస్తుందని హామీ కూడా ఇచ్చింది. కానీ, సంవత్సరంలోపే ఇలా అయింది’’ అంటూ సునీత కలత చెందారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019`21 (ఎన్‌ఎఫ్‌్‌హెచ్‌ఎస్`5) ప్రకారం భారతదేశంలో, 15`49 సంవత్సరాల వయసుగల వివాహిత మహిళల్లో, కేవలం 2.1 శాతం మంది మాత్రమే కాపర్`టి వంటి ఐయుడిసిలను ఉపయోగిస్తున్నారు. గర్భనిరోధక పద్ధతులలో అత్యంత సాధారణ పద్ధతైన ట్యూబెక్టమీని 38 శాతం మంది వివాహిత స్త్రీలు ఎంచుకుంటున్నారు. వివాహిత మహిళల్లో గర్భనిరోధక పద్ధతుల వినియోగం, ఇద్దరు`ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతుందని ఒక సర్వే నివేదించింది. సునీత ఐదో బిడ్డని కనాలని కోరుకోలేదు.
వికాస్ ఆస్పత్రిలో గర్భస్రావం చేయడానికి రూ.30,000 వరకు ఖర్చవుతుంది. కానీ, సునీతకు అంత డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థోమత లేదు. సునీత ఒక సాధారణ గృహిణి. 34 ఏళ్ళ వయసున్న ఆమె భర్త పండ్లు అమ్ముకోవడం ద్వారా నెలకు సుమారు రూ.10,000 వరకూ సంపాదిస్తారు. అతని సోదరులిద్దరూ, వారి వారి కుటుంబాలతో మూడు పడక గదులున్న ఆ అద్దె ఇంట్లో ఉంటూ, స్థానికంగా ఉండే ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంటి అద్దెలో వారి వాటా కింద, ప్రతి సోదరుడు నెలకు దాదాపు రూ.2,300 అద్దె చెల్లిస్తారు.
ఆకుపచ్చ`పసుపు రంగుల త్రిభుజాలు ముద్రించి, కొట్టొచ్చినట్లు ఎరుపు రంగు సల్వార్ కమీజ్‌కి సరిపోయేలా, తన సన్నని మణికట్టుపై రంగురంగుల గాజులు వేసుకున్నారు సునీత. మెరుగు మాసిన వెండి పట్టీల కింద, అల్తా (పారాణి) అంటిన ఆమె పాదాలు చిక్కని ఎరుపు రంగులో ఉన్నాయి. నాతో మాట్లాడుతూ, తన కుటుంబం కోసం వంట చేస్తున్న ఆమె ఆ రోజు ఉపవాసం చేస్తున్నారు. ‘‘నా పెళ్ళై ఆరు నెలలు కూడా కాకముందే నా ముఖంలోని మెరుపంతా పోయింది’’ అంటూ ఒకప్పటి తన బొద్దు ముఖాన్ని గుర్తుచేసుకున్నారావిడ. పద్దెనిమిదో ఏట పెళ్ళయినపుడు, 5.1 అడుగుల ఎత్తున్న సునీత దాదాపు 50 కిలోల బరువుండేవారు. ఇప్పుడు ఆమె 40 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.
సునీతకు రక్తహీనత ఉంది. అందుకే ఆమె ముఖం పాలిపోయి ఉంటుంది. ఆమెకు అలసటగా ఉంటుంది. భారతదేశంలో, 15`49 ఏళ్ళ వయసున్న స్త్రీలలో, రక్తహీనత ఎదుర్కొంటున్న 57 శాతం మందిలో ఆమె కూడా ఒకరు. సెప్టెంబరు 2021 నుండి ప్రతి పది రోజులకొకసారి, నజాఫ్‌గఢ్‌లోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారామె. డాక్టర్ సంప్రదింపులు, మందుల కోసం ప్రతిసారీ దాదాపు రూ.500 ఖర్చవుతోంది. కోవిడ్`19 భయం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళకుండా చేసింది. ఇదనే కాకుండా, తన ఇంటి పనంతా పూర్తి చేసుకొని, సాయంత్రం వెళ్ళవచ్చని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదని కూడా ఆమె ఇక్కడికే వెళ్ళడానికి మొగ్గు చూపుతారు.
అవతలి గది నుండి వస్తున్న పిల్లల అరుపులు మాకు అంతరాయం కలిగిస్తున్నాయి. ‘‘నా రోజంతా ఇలాగే గడిచిపోతుంది’’, పిల్లల మధ్య జరిగే గొడవలు తనే తీర్చాలని సూచనప్రాయంగా తెలియచేస్తూ అన్నారు సునీత. ‘‘నేను గర్భవతినని తెలిసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను. ఉంచుకోమని నా భర్త చెప్పాడు. ‘జో హోరా హై హోనేదో’ అన్నాడు. కానీ భరించాల్సింది నేనే కదా? ఆ బిడ్డను పెంచాల్సింది, ప్రతిదీ చెయ్యాల్సింది నేనేగా’’ ఆమె ఉద్రేకపూరిత స్వరంతో అన్నారు.
తను గర్భవతినని తెలిసిన కొద్దిరోజులకే సునీత నజాఫ్‌గఢ్`ధన్సారోడ్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో రూ.1,000 ఖర్చు పెట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు. ఇక్కడకు ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త, సునీతను ఇంటికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జాఫర్‌పూర్‌లో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న రావు తులారామ్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ కాపర్`టిని తొలగించి, గర్భస్రావం చేయించుకోవాలని సునీత అనుకున్నారు. ప్రజారోగ్య కేంద్రంలో ఈ ప్రక్రియను ఉచితంగా చేస్తారు.
‘‘కాపర్`టిని తొలగించలేమనీ, బిడ్డ పుట్టినప్పుడు అదే బయటకు వస్తుందనీ జాఫర్‌పూర్‌లో వాళ్ళు (డాక్టర్) చెప్పారు’’. గర్భస్థ శిశువుకు మూడో నెల రావడంతో, అబార్షన్ చేయడం కష్టమనీ, అంతేకాకుండా అది తల్లికి ప్రాణాంతకమని కూడా సునీతతో అక్కడి డాక్టర్ అన్నారు. ‘‘వాళ్ళు (వైద్యులు) రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేరు’’.
‘‘నా ప్రాణానికి ప్రమాదమన్న విషయాన్ని నేనసలు పట్టించుకోలేదు. నాకు మరో బిడ్డను కనాలని లేదు’’ అని ఆమె నాతో అన్నారు. సునీత ఒక్కరే కాదు, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్`5 ప్రకారం, 85 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఇద్దరు పిల్లలు పుట్టాక మరో బిడ్డను వద్దనుకుంటున్నారు.
గర్భస్రావం చేయించుకోవడం కోసం మరో ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు సునీత. ఫిబ్రవరి 2020లో, దాదాపు నాలుగు నెలల గర్భిణిగా ఉన్న ఆమెను మరొక ఆశా కార్యకర్త నజాఫ్‌గఢ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ ఢల్లీిలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వారిద్దరూ ఆ రోజు చెరొక రూ.120 ఖర్చు పెట్టి ఢల్లీి మెట్రోలో ప్రయాణించారు. గోపాల్‌నగర్ పిహెచ్‌సి డాక్టర్‌తో చర్చించాక, సునీతకి ఆస్పత్రిలోనే గర్భస్రావం చేయాలని లేడీ హార్డింగ్‌లో పనిచేసే డాక్టర్ నిర్ణయించుకున్నారు.
‘‘వాళ్ళేం మాట్లాడారో నాకు తెలియదు. వైద్యులిద్దరూ చర్చించుకొని, నాకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు’’. మొదట తనకి రక్తపరీక్షలు చేసి, తర్వాత ఏదో మందు పూశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘అది ఏ రకమైన మందో నాకు గుర్తులేదు. ఉన్‌హోనే కుచ్ దవాయి దాల్‌కర్ సఫాయి కియా థా (వారు లోపల ఏదో మందు రాసి శుభ్రం చేశారు). అది లోపల మండుతోందిÑ నాకు కొంచెం మత్తుగా ఉంది’’. ఈ ప్రక్రియ కోసం భర్త ఆమె వెంట వచ్చినప్పటికీ, ‘‘అతనందుకు అంత సుముఖంగా లేడు’’ అని ఆమె చెప్పారు.
తాము బయటికి తీసిన విరిగి ఉన్న కాపర్`టిని వైద్యులు సునీతకు చూపించారు. గర్భం నుండి బయటకు తీసిన పిండం వయసు దాదాపు నాలుగు నెలలుంటుందని ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళిన ఆశా కార్యకర్త సోని రaా ధృవీకరించారు. ‘‘ఆమెది సున్నితమైన కేసు కావడంతో ‘సాధారణ ప్రసవం’ ద్వారా పిండాన్ని తీసేయాల్సి వచ్చింది’’ అని ఆవిడ వివరించారు.
గర్భస్రావం చేయించుకోవడం యుద్ధంలో సగం మాత్రమే. ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లేదా ట్యూబల్ లైగేషన్`ఫెలోపియన్ ట్యూబులను (గర్భాశయం నుండి అండాన్ని రవాణా చేసే నాళాలు) ముడివేయడం/కత్తిరించడం ద్వారా గర్భధారణను నిరోధించే ప్రక్రియ చేయించుకోవాలనుకున్నారు. గర్భస్రావం చేయించుకున్నాక ఒక రోజు తర్వాత, అదే ఆస్పత్రిలో ఆమె ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నారు. కానీ, వైద్యులు ఆ రోజు చేయలేకపోయారు. ‘‘నాకు దగ్గు మొదలయ్యే సమయానికి నేను ఆపరేషన్ దుస్తుల్లో ఉన్నాను. కానీ వైద్యులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు’’. గర్భస్రావం చేయించుకున్న నాలుగు రోజుల తర్వాత ఆమెకు ‘‘అంతర’’ ఇంజక్షన్ ఇచ్చి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ట్బూబల్ లైగేషన్ చేయించుకోవాలని సునీత దృఢనిశ్చయంతో ఉన్నప్పటికీ, మార్చి 2020లో ఆమెకు కోవిడ్`19 సోకింది. ఒక ఏడాది తర్వాత ఫిబ్రవరి 2021లో, సునీత కుటుంబం ఆమె మరిది పెళ్ళి కోసం హనుమాన్ నగర్ బ్లాక్‌లోని స్వగ్రామమైన కొల్హంతా పటోరికి వెళ్ళారు. అక్కడ ఆమె ఒక ఆశా కార్యకర్తను సంప్రదించారు. ఆ కార్యకర్త సునీతను దర్బంగాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ‘‘ఆ ఆశా వర్కర్ ఇప్పటికీ ఫోన్ చేసి నా బాగోగులు కనుక్కుంటుంది’’ అని సునీత చెప్పారు.
‘‘అక్కడ (దర్బంగాలో) మనల్ని పూర్తి అపస్మారక స్థితిలో ఉంచరు. మెలకువగానే ఉంచుతారు. మనం కేకలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోరు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచియిత్స చేయించుకున్నందుకు సునీతకు ప్రభుత్వం నుండి రూ.2,000 పరిహారం లభించింది. ‘‘అయితే, అది నా (బ్యాంక్) ఖాతాలో పడిరదో లేదో నాకు తెలీదు. కనుక్కోమని నేను ఎవర్నీ అడగలేదు’’ అన్నారు సునీత.
తన కథని ముగించేటప్పుడు, ఆమె ముఖంలో కాస్త ఉపశమనం కనిపించింది. ‘‘చివరికి నేను సజావుగా పూర్తి చేసుకున్నాను. నన్ను నేను కాపాడుకున్నాను. లేదంటే ప్రతిసారీ ఏదో ఒక సమస్య వచ్చేది. చేయించుకొని ఒక సంవత్సరం పైనే అయింది. నేను బాగానే ఉన్నాను. ఇంకో ఇద్దరు పిల్లల్ని కనమంటే మాత్రం నా పని అయిపోయి ఉండేది.’’ ఇదే సమయంలో ఆవిడ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ‘‘నేను దేని కోసం ఎన్నో ఆస్పత్రులు, క్లినిక్‌లు తిరిగి, చాలా మంది వైద్యులను సంప్రదించాల్సి వచ్చింది. నా పరువుపోలేదా, చెప్పు?’’ గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిలపరచాలని, పాప్యులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, ూARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్‌లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/i-just-didnt-want-to-have-another-child/ పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా (ruralindiaonline.org) జూలై 12, 2022 లో మొదట ప్రచురితమైనది.)