ఈ రోజు తెలంగాణలో అటవీ భూములపై తమ సహజ సిద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న ఆదివాసీల పోరాటం ముఖ్యంగా ఇందులో ఆదివాసీ స్త్రీల పాత్ర అటవీ భూములను అక్రమంగా ఆక్రమించడానికి మొండిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్న ప్రభుత్వానికి సవాల్
విసరడమే కాకుండా ఇప్పుడున్న నిరాశాజనక సాంఘిక, రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్‌పై ఒక చిన్న ఆశను కూడా కల్పిస్తున్నాయి. తరతరాలుగా అడవినే నమ్ముకుని ఎన్ని వాతావరణ మరియు భౌగోళిక మార్పులు ఎదురైనా అన్నిటికి తట్టుకుని అక్కడే తమదైన సమాజాన్ని నిర్మించుకుని అతి కొద్ది వనరులతో జీవనం సాగిస్తూ అక్కడున్న ప్రతి చెట్టుతోను, పుట్టతోను ఒక సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించుకున్న ఆదివాసులపై ప్రభుత్వాల పెత్తనం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు.
మొదటిసారిగా 1878లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అటవీభూముల చట్టం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాల లక్ష్యం అత్యంత మోసపూరిత విధానాలతో ఆదివాసులను అడవి నుండి బయటకు గెంటివేసి సిరులు సంపాదించే అటవీ వనరులను గ్లోబల్ కంపెనీలకు కట్టిపెట్టి, వాటికి లాభాలు తెచ్చిపెట్టడం మాత్రమే. ఏదో నామ మాత్రంగా నష్టపరిహారం చెల్లించినా, చాలా సందర్భాలలో బాధితులకు ఆ కొద్దిపాటి పరిహారం అందడం కూడా కష్టమే అనేది అందరికీ తెలిసిన విషయమే.
నెహ్రు చేత ఆధునిక దేవాలయాలుగా వర్ణించబడిన ఆనకట్టలు, మైనింగ్ ఫ్యాక్టరీలు, థర్మల్ ప్రాజెక్టులు, న్యూక్లియర్ ప్లాంట్‌లు, రైల్వే లైన్లు, ఇతర భారీ కట్టడాల కోసమే కాక, వన్య మృగ సంరక్షణ కేంద్రాల పేరుతో కూడా లక్షలాది మంది ఆదివాసీయులను తాము పుట్టి పెరిగిన నేల నుండి ఏదో ఒక కారణంతో దూరం చేస్తూనే ఉన్నారు. జాతీయ సంపదగా పేరుపడిన ఇలాంటి ఎన్నో కట్టడాలు ఆదివాసుల త్యాగానికి ప్రతిఫలమైనప్పటికీ ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆదివాసీల త్యాగాన్ని గుర్తించకపోగా, ఎక్కడ ఎదురు తిరుగుతారో అని ముందుగానే వారిమీద క్రిమినల్స్ అని ముద్ర వేసి వారిని అత్యంత క్రూరంగా అణచివేసే ప్రయత్నాల్లో ఏ ప్రభుత్వమూ తీసిపోలేదు. ఒకవైపు బాక్సైట్, మైకా లాంటి అత్యంత విలువైన ఘనులను మల్టీ నేషనల్ కంపెనీలకు దోచిపెడుతూ వంట చేసుకోవడానికి అడవిలో కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిన మహిళలపై దొంగతనం మోపడం, వారిపై శారీరక హింసకు పాల్పడడం ఈ ప్రభుత్వాలకే చెందింది.
ఏదైనా ప్రకృతి విపత్తు లేదా ఘర్షణలు జరిగినప్పుడో, యుద్ధం సంభవించినప్పుడో లేక ఇంకేమైనా విపత్కర పరిస్థితులలో ప్రజలు తమ స్వగ్రామాలను వీడి వేరే ప్రదేశాలకు వెళ్ళడం, పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి తమ ఇళ్ళకు చేరడం మామూలే అయినా అభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రజలను తమ ఇంటిని, భూమిని, వనరులని విడిచి పొమ్మనడం ఇందుకు భిన్నమైనది. ఇది చాలా అన్యాయమైన, మోసపూరితమైన చర్య. అడవిని వదిలి పెట్టడమనేది ఆదివాసులకు ఆత్మహత్యతో సమానం. ఎందుకంటే, ఒకసారి తమ నేలను విడిచి పెట్టడం అంటే తమ సంస్కృతిని, పద్థతులను, నమ్మకాలను, విజ్ఞానాన్ని మొత్తంగా తమ చరిత్రనే వదిలి పెట్టడమే అవుతుంది. తిరిగి వచ్చి చూసుకోవడానికి అభివృద్ధి పేరుతో జరిగే వినాశనం తప్ప ఏమీ మిగలదు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు లాంటి మోసపూరిత మొనగాళ్ళు ఆదివాసీలకు పోరాడడం నేర్పారంటూ వచ్చిన అసత్య చరిత్రలు మరింత బలపడడానికి కూడా ఈ బలవంతపు నిరాశ్రయం ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒకప్పుడు, తేబాగా లాంటి ఉద్యమాలలో నారీ బహిణీలుగా ఎంతో తెగువతో పోరాడిన చరిత్ర మన ఆదివాసీ మహిళలకుంది. అలాగే ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం కట్టామని గొప్పలు పోతున్న ప్రాంతం నుండి నిర్వాసితులైన ఆదివాసీ మహిళలు తమ పునరావాస హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని అగ్రకుల ఉద్యమ కారిణుల చాటున ఎంత మరుగు పరచాలని మీడియా మరియు కొందరు మేధావులు ప్రయత్నించినా వారి నిరంతర పోరాటాన్ని గుర్తించకుండా ఉండడం అసాధ్యమని తేల్చడమే కాకుండా నర్మదా బచావో అంటూ ఒకరినొకరు సమీకరించుకుంటూ, తమని తాము ఉత్తేజపరచుకుంటూ పునరావాస ఉద్యమాలలో ఆదివాసీ స్త్రీలు ముందుండడం మనం చూస్తున్న చరిత్ర. అలాంటిది ఈ రోజు బతుకు తెరువు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస
వెళ్తున్న ఆదివాసీల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నట్టు చెబుతున్న స్టాటిస్టిక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణాలు రోజురోజుకీ పెరుగుతున్న దారిద్య్రం, ఇంటా బయటా స్త్రీలపై పెరుగుతున్న హింస, ఉపాధి కోల్పోవడం అన్నింటికన్నా ముఖ్యంగా పునరావాస పథకాలేవీ కూడా స్త్రీలను దృష్టిలో పెట్టుకుని రచించినవి కాకపోవడమే. ఉదాహరణకి పరిహారంగా ఇచ్చే చిన్నపాటి ఉద్యోగాలు ప్రాధాన్యక్రమంలో సాధారణంగా కుటుంబంలో ఉన్న మగపిల్లలకి చెందడం, నష్ట పరిహారం పొందడానికి, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం మహిళలకు అన్నివేళలా సాధ్యం కాకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో ఆదివాసీ మహిళలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. వీరిలో కొంతమంది, ఉద్యోగాలిప్పిస్తామని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి పట్నాలకు వచ్చి మోసపోయి బ్రోతల్ హౌసుల్లో తేలుతున్నారు. ఎప్పుడయితే తమ ఇల్లు, ఉపాధి ఇలా సమస్తమూ కోల్పోతాము అన్న భయంతో వీలైనంత వరకూ ఎదురు తిరిగి పోరాడడం లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం… ఇంతకు మించి ఇప్పుడు ఆదివాసీ మహిళలకు వేరే దారి లేదు.
మరొక విషయం, వన్య ప్రాణి సంరక్షణ పేరుతో ఆదివాసీలను నిరాశ్రయులను చేయడం వెనుక ఉన్న కుట్రలపై ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల ఉద్యమకారులు పరిశోధనలు జరిపి ‘పర్యావరణ పరిరక్షణ’ అనేది ఎంత పెద్ద నాటకమో రుజువు చేస్తూ ఈ పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఇప్పటికే అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న ఆదివాసీలు మరింత అన్యాయానికి, నిర్బంధానికి గురవుతున్నారని వీరు సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నప్పటికీ తమ ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరులను, వర్తక వ్యాపారాలను వాడుకుంటున్న వాళ్ళని వదిలేసి తమ జీవనాధారమైన వనరులను కంటికి రెప్పలా చూసుకుంటూ అటవీ సంపదను రక్షించడం అనేది తమ జీవితాలకు ఎంత అవసరమో తెలిసిన ఆదివాసీలను ప్రభుత్వాలు శిక్షించడం ఎంత మాత్రం సమంజసం కాదు. అటవీ భూములను నమ్ముకొని జీవిస్తున్న మనుషుల సంరక్షణ కన్నా అటవీ
సంపద సంరక్షణకే ఈ కాపిటలిస్ట్ ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నప్పుడు ఈ ‘ఎన్విరాన్‌మెంటల్ రేసిజం’ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాల్సి వస్తోంది.
అలా అని ఆదివాసీల అభివృద్ధికి వ్యతిరేకమా అంటే ఖచ్చితంగా కాదు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీలు, భారీ డ్యామ్‌లు, ప్రాజెక్టులు, రిజర్యాయర్‌లు, రోడ్లు, భవనాలు కట్టాల్సిందే. ఇందులో భాగంగా ప్రజలు కొంత త్యాగం చేయడం తప్పు కాదు. కానీ ప్రతిసారీ ఈ త్యాగాలు చేసే ప్రజలు ఆదివాసీలు లేదా దళిత బహుజనులు కావడం, ఎవరి అభివృద్ధికి ఎవరు త్యాగం చెయ్యాలి, ఈ అభివృద్ధి వాళ్ళ ఎవరి జీవితాలు ఎంతగా ప్రభావితమవుతున్నాయి, ఈ అభివృద్ధి వలన లాభపడేది ఎవరు నష్టపడేది ఎవరు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒకవైపు ప్రజలను బలవంతంగా నిరాశ్రయులను చేసి వారికి పునరావాసం పేరుతో నిరాశ్రయ ప్రజలను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఇకమీదైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ సమానంగా అందేటట్టు చేయడం, సామాజిక న్యాయానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటే మంచిది.
ఫూలే అంబేద్కర్ విధానమే ఈ సమస్యకు పరిష్కారం. మన సమాజంలో వేళ్ళూనుకుపోయిన కులవ్యవస్థ కనీస మానవ సంబంధాలను విషపూరితం చేసి మనిషికి మనిషికి మధ్య భయానకమైన అవాంతరాన్ని సృష్టించడమే కాక, ఆర్థిక వ్యవస్థను కూడా తనకనుగుణంగా పటిష్టపరచుకుని శ్రమతో పాటు శ్రామికులను కూడా వర్గీకరించింది. అందుకనే బాబా సాహెబ్ దీన్ని నిచ్చెన మెట్ల సమాజమన్నారు. ఇందులో పేరుకుపోయిన వివక్ష, అశాంతి, అసమానతలు తొలగాలంటే కుల వ్యవస్థను అంతం చేయడం ఒక్కటే మన లక్ష్యం కావాలి. దానికొరకు దళిత ఆదివాసీ బహుజనులు నిరంతరం శ్రమించాలి. అలాగే ప్రభుత్వాలు డా.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, స్వతంత్రత, సాంఘిక న్యాయాన్ని అనుసరించి ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి భూములను స్వాధీన పరచుకోవాలనుకోవడం ఎంతమాత్రం తగదు.