ఏడవమ్మా ఏడు
నెత్తి పగిలేలా కొట్టుకుంటూ
కళ్ళు కన్నీరై కారిపోయేలా
గుండె అగ్నిపర్వతంలా పేలిపోయేలా
ఏడవమ్మా తల్లీ ఏడు
ఏడుపు రావటం లేదా?
ఏడుపుకేం వస్తూనే ఉంటుంది
రెక్కలు రాని కూనతో
రెక్కలు తెగిన ఒంటరి పక్షి
గూడు కట్టిన పచ్చని చెట్టు
వరదగోదారిలో కొట్టుకు పోరాదని
ఈ కంటిరెప్పలు ఆనకట్టలుగా మారాయి
కన్నీరు ఇంకిపోయిందా?
లేదు లేదు
కంటిపాపలు తడితడిగానే ఉన్నాయ్
చెంపలమీద జారాల్సిన కన్నీటిని
మనసు లోపలికి పీల్చేసుకుంటుంది
ఇప్పుడు నాలో ప్రవహిస్తున్నదంతా కన్నీరే
దుఃఖం రావటం లేదా
నీకు తెలియదేమో
హృదయం నిండా ప్రవహిస్తున్నవీ
పరవళ్ళు తొక్కుతున్నవీ సజలసముద్రాలే
ఎప్పటెప్పటి జ్ఞాపకాలన్నీ చేపపిల్లలై
మునుగీతలు కొడుతూనే ఉన్నాయ్
నరాల సెలయేళ్ళ గుండా ప్రవహించి
వేళ్ళసందుల్లో అమరిన కలంలోంచి జారుతూ
అక్షరాలుగా మారాలని తోసుకోస్తూనే ఉన్నాయ్
మరైతే…
కుమిలి కుమిలి కుంగిపోవేమి?
లోపలి దుఃఖసముద్రాలన్నీ
చెలరేగుతోన్న వాయుగుండాలతో
అతలాకుతలం అవుతూనే ఉన్నాయ్
లోపల మసలుతోన్న బడబాగ్ని
ఉప్పెనై ఎప్పుడూ ఉవ్వెత్తున ఎగసి
నన్నూ, నాతో పాటు ఇల్లూ
అందులోని నా ప్రాణాలూ
కొట్టుకుపోతాయేమోనని
ఇదిగో ఇప్పుడిప్పుడే
వాటినన్నింటినీ అధిగమించటానికే
అతి ప్రయాసతో ఈత నేర్చుకుంటున్నాను
నేనిప్పుడు గజ ఈతరాల్ని
సమాజసంద్రంలో ఆటుపోట్లకు భీతిల్లే
ఒంటరినౌకలకి లంగరెలా వేయాలో
ఇకపై జీవితాల్ని మునగనీకుండా
ఎలా ఎదురీదాలో నేర్పించాల్సిందే!!