నిప్పుల పొయ్యికి
నా చెయ్యికి
నడుమ మాడి మసయ్యే
పేలికే మసిగంత పేగు
అరిగి జీర్ణమైన
మా అమ్మ మమతల కొంగులోంచి
మరో జన్మనెత్తి
నాకు సెగ తగలకుండా
సేవలందిస్తున్న చెలియ
వారసత్వ సంపదగా
వెంట వచ్చి నన్నంటిపెట్టుకొని
నా లాగే మాడి మసై నిరంతర సేవలతో
తపించి తరించి తనువు చాలించే
వంటింటి అంటరాని దోస్త్
మసిగంత పేగే…!
నకారాత్మక ఉపమానానికి
నెలవైన పరోపకారి ఈ చిరుగు వస్త్రమే
‘ఆ పిల్ల మషిగబొంతట’
ససేమిరా వద్దన్నాడు పెళ్ళికొడుకు…
పై పై మెరుగులనే తప్పా
అంతః సౌందర్యాన్ని
ఆరాధించే ఉత్తములు ఎందరుంటారనీ!?
ఉంటే ఉండొచ్చుగాక…
మసిగంత పేలికకి మసిమరకలు
అయినా…
మనిషి లోలోపల పులుముకున్న
మురికి ముందు ఇవెంతనీ…!?
మీరెన్నైనా చెప్పండి
మసిగంత పేగుని చూస్తే నాకూ…
మంగుళం పెంకల
మక్కప్యాలాలేంచి పెట్టిన మా నాయినమ్మే
కళ్ళముందు కదలాడుతుంది!