తరాలు మారినయ్
ఆమె తలరాత మాత్రం మారలే
పసిమొగ్గ నుండి, పండుటాకై రాలే వరకు
నాలుగు గోడల మధ్య కుంగిపోతోంది
వర కట్నపు వేధింపుల్లో కాలిపోతోంది
కన్యాశుల్కం నుండి వరకట్నపు నియమాన్ని మార్చిన
మదమెక్కిన మగజాతి అహానికి
సమిధలా మారి ఆరిపోతోంది…
వస్తువుగా మారి తనను తాను,
అమ్మకానికి ఉంచి…
కొనేవారిపై పెత్తనం చెలాయిస్తున్న పురుష పుంగవుడు
డబ్బులిచ్చి కొని మరీ బానిసలా బ్రతుకుతున్న
దయనీయ మగువ…
కొడుకైతే ప్లస్సు,
కూతురైతే మైనస్సు…
ఇదే కదా బాల్యం నుండి పసి మెదళ్ళలో మనం
నాటుతున్న విషబీజం…
అది పెరిగి పెద్దయ్యాక,
తియ్యని ఫలాలనివ్వాలి అనుకుంటే ఎలా?
పురుగు పట్టిన కాయలే కదా కాస్తుందా వృక్షం…
ఈడొచ్చిన కూతురు నట్టింట్లో కుంపటి అనుకునే మనస్తత్వం
భ్రూణ హత్యలకూ ఇదే కదా కారణం
పుట్టింట వివక్ష, మెట్టింట హింస…
తాళలేక ఉరితాడుతో ఊసులు పంచుకుంటున్న
హృదయ విదారక వైనం…
ఎప్పటికి మారునో దయలేని ఈ సమాజం…?
అసలు మారేనా నవయుగపు కర్కశ భావజాలం…??