బొలేరో వెనుక సీటులో ప్రసవం జిజ్ఞాస మిశ్రా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

హిమాచల్‌ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.

‘‘ఓ రోజు మధ్యాహ్నం నేనూ, నా బిడ్డ బ్రతుకుతామో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నా ఉమ్మనీటి సంచి పగిలిపోయింది. కనుచూపు మేరలో ఆసుపత్రి గానీ, అందుబాటులో ఆరోగ్య కార్యకర్త గానీ లేరు. సిమ్లాలోని ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో కదులుతున్న జీపులో నాకు నొప్పులు వచ్చాయి. నేనింక ఆగే అవకాశం లేదు. అక్కడే బిడ్డను ప్రసవించాను… ఆ బొలేరో లోపల!’’ ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత, ఏప్రిల్‌ 2022లో ఈ రిపోర్టర్‌ ఆమెను కలిసినప్పుడు, తన పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉన్న అనురాధ మహతో (అసలు పేరు కాదు)కు ఇప్పటికీ ఆ రోజు స్పష్టమైన వివరాలతో గుర్తుంది.
‘‘అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. నా ఉమ్మనీటి సంచి పగిలిపోగానే, నా భర్త ఆశా దీదీకి కబురందించాడు. పావుగంట, ఇరవై నిమిషాల్లోనే ఆమె వచ్చేసింది. వచ్చిన వెంటనే అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసింది. ఆ రోజు వర్షం పడుతోంది. పది నిమిషాల్లో బయలుదేరతామని అంబులెన్స్‌
వాళ్ళు చెప్పారు గానీ, వాళ్ళకు మా ఊరు చేరడానికి మామూలుగా పట్టే సమయం కన్నా ఒక గంట ఎక్కువే పట్టి ఉంటుంది’’ వర్షాలు పడినప్పుడు అక్కడి రోడ్లమీద ప్రయాణం ఎంత ప్రమాదకరంగా
ఉంటుందో వివరిస్తూ చెప్పింది, దాదాపు ముప్ఫయ్యేళ్ళ వయసున్న అనురాధ.
ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని కోటి గ్రామంలోని కొండ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఒక డబ్బా రేకుల గుడిసెలో తన ముగ్గురు పిల్లలతోనూ, వలస కూలీ అయిన భర్తతోనూ కలిసి నివసిస్తోంది. ఈ కుటుంబం బీహార్‌లోని భాగల్పూర్‌ జిల్లా గోపాల్‌పూర్‌ గ్రామం నుంచి ఇక్కడకు వలస వచ్చింది. సిమ్లా జిల్లాలోని మషోబ్రా బ్లాక్‌లో ఉన్న కోటి గ్రామానికి 2020లో తన భర్తతో చేరిన అనురాధ ‘‘ఆర్థిక సమస్యల కారణంగా మేం (బీహార్‌లోని) మా గ్రామం నుండి ఇక్కడికి మారవలసి వచ్చింది. రెండు చోట్లా అద్దెలు చెల్లించడం కష్టమైంది’’ అని చెప్పింది. 38 ఏళ్ళ ఆమె భర్త రామ్‌ మహతో (అసలు పేరు కాదు) నిర్మాణ స్థలాల్లో మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఎక్కడ పని ఉంటే అతను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతను తాము నివాసముండే రేకుల గుడిసెకు దగ్గర్లోనే పని చేస్తున్నారు.
మామూలు రోజుల్లో కూడా అంబులెన్స్‌ వారి ఇంటిదాకా సులభంగా చేరుకోవడమంటే కష్టమే. ఇక సిమ్లా జిల్లా కేంద్రంలోని కమలా నెహ్రు ఆస్పత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటికి రావాలంటే ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు, మంచు కురిసే సమయంలోనూ అందుకు రెట్టింపు సమయం పడుతుంది.
అనురాధ ఇంటి నుండి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్‌సి) ఉంది. ఇది సమీపంలో ఉండే గ్రామాలకూ, కుగ్రామాలకూ చెందిన దాదాపు 5,000 మంది ప్రజలకు సేవలు అందిస్తోందని ఆ ప్రాంతంలో అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌ (ఆశా)గా పనిచేస్తున్న రీనా దేవి చెప్పారు. కానీ 24 గంటల అంబులెన్స్‌ వంటి తప్పనిసరి సేవలు, సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ఈ సిహెచ్‌సిని సంప్రదించరు. ‘‘మేం 108కి డయల్‌ చేసినప్పుడల్లా ఆ వాహనం ఒక్కసారికే అంత సులభంగా వచ్చేయదు. ఇక్కడకు అంబులెన్స్‌ను తీసుకురావడం చాలా కష్టమైన పని. స్వంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని రమ్మని వాళ్ళే మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు’’ అని ఆమె చెప్పారు.
నిబంధనల ప్రకారం సిహెచ్‌సిలో గైనకాలజిస్టులు, పది మంది స్టాఫ్‌ నర్సుల బృందం
ఉండాలి. సిజేరియన్‌, ఇతర వైద్య పరీక్షల వంటి అవసరమైన, అత్యవసర ప్రసూతి సంరక్షణను అందించగలగాలి. అత్యవసర సేవలన్నీ 24 గంటలూ అందుబాటులో ఉండాలి. అయితే కోటిలోని సిహెచ్‌సి సాయంత్రం ఆరు గంటలకే మూతపడుతుంది. తెరిచి ఉన్నా ఇక్కడ గైనకాలజిస్టు అందుబాటులో లేరు.
‘‘కాన్పుల గది (లేబర్‌ రూమ్‌) పనిచేయకపోవడంతో, అది సిబ్బందికి వంటగదిగా మారింది’’ అని గ్రామంలోని దుకాణదారుడు హరీశ్‌ జోషి చెప్పారు. ‘‘నా సోదరి కూడా ఇదే విధంగా బాధపడిరది. ఆమె మంత్రసాని పర్యవేక్షణలో ఇంట్లో ప్రసవించవలసి వచ్చింది. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి. సిహెచ్‌సి తెరిచి ఉన్నా, మూసి ఉన్నా అటువంటి సందర్భాలలో ఎలాంటి తేడా ఉండదు’’ అని ఆయన చెప్పారు.
గ్రామంలో నివసించే మంత్రసాని, అనురాధకు ఎటువంటి సహాయం చేయలేదని రీనా చెప్పారు. ‘‘ఇతర కులాలకు చెందిన వ్యక్తుల ఇళ్ళకు వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు’’ అని ఈ ఆశా కార్యకర్త సూచనప్రాయంగా చెప్పారు. ‘‘అందుకనే, మేం మొదటి నుండి ఆసుపత్రికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాం’’ అని రీనా చెప్పారు. అనురాధ ప్రసవించిన రోజున రీనా ఆమెతో కలిసి వచ్చారు.
‘‘దాదాపు 20 నిమిషాల ఎదురుచూపు తర్వాత నా నొప్పి తీవ్రం కావడంతో, ఆశా దీదీ నా భర్తతో చర్చించి, అద్దె వాహనంలో నన్ను సిమ్లాకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఒక్కోవైపునకు రూ.4,000 చొప్పున ఖర్చవుతుంది. కానీ మేం బయల్దేరిన పది నిమిషాల తర్వాత, నేను బొలెరో వెనుక సీటులోనే ప్రసవించాను’’ అని అనురాధ చెప్పింది. అయితే, అనురాధ కుటుంబం సిమ్లా వెళ్ళకపోయినా డ్రైవర్‌ వారి నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేశాడు.
‘‘బిడ్డ పుట్టేటప్పటికి మేం కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాం. మా దగ్గర పరిశుభ్రమైన గుడ్డ, నీటి సీసాలు, కొత్త బ్లేడ్‌ ఉండేలా చూసుకున్నాను. అందుకు దేవునికి ధన్యవాదాలు! బొడ్డు తాడును కత్తిరించడం నేనింతకు ముందు ఎప్పుడూ చేయలేదు. అయితే అది ఎలా జరుగుతుందో నేను చూసి ఉన్నాను కాబట్టి ఈమె కోసం నేను ఆ పని చేశాను’’ అని రీనా చెప్పారు.
ఆ రాత్రి గట్టెక్కడం కేవలం అనురాధ అదృష్టమనే చెప్పాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గణనీయంగా మెరుగుపడినప్పటికీ, గర్బధారణ సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ వివిధ సమస్యల కారణంగా ప్రతిరోజూ 800 కంటే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ మరణాలలో అత్యధికం, ఆదాయం చాలా తక్కువగా, మధ్యస్థంగా ఉండే దేశాలలో సంభవిస్తాయి. 2017లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రసూతి మరణాలలో 12 శాతం మరణాలు భారతదేశంలోనే సంభవించాయి.
భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎమ్‌ఎమ్‌ఆర్‌) 2017`19లో ప్రతి లక్ష సజీవ జననాలకు 103గా ఉంది. ఈ నమోదైన సంఖ్య, 2030 నాటికి విశ్వవ్యాప్త ఎమ్‌ఎమ్‌ఆర్‌ను 70 లేదా అంతకంటే తక్కువకు తగ్గించే యుఎన్‌, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌ (ఎస్‌డిజి) నుండి ఇప్పటికీ దూరంగా ఉంది. ఈ నిష్పత్తి ఆరోగ్యం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక కీలక సూచికÑ అధిక సంఖ్యలో సంభవించే ప్రసూతి మరణాలు వనరుల అసమానతను చూపుతాయి.
హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రసూతి మరణాల రేటుకు సంబంధించి డేటా తక్షణమే అందుబాటులో లేదు. ఎన్‌ఐటిఐ ఆయోగ్‌, ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్‌ 2020`21లో తమిళనాడుతో పాటు ఇది రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, మారుమూల పర్వత ప్రాంతాల్లో పేదరికంతో బాధపడుతున్న గ్రామీణ మహిళల ప్రసూతి ఆరోగ్య సమస్యలను ఇది ప్రతిబింబించదు. అనురాధ వంటి మహిళలు పోషకాహారం, ప్రసూతి సంరక్షణ, ప్రసవానంతర సంరక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అనురాధ భర్త రామ్‌ ఒక ప్రైవేట్‌ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ‘‘పని ఉన్న నెలల్లో అతను నెలకు దాదాపు రూ.12,000 సంపాదిస్తాడు. అందులో రూ.2,000 ఇంటి అద్దెకు పోతుంది, అనురాధ నన్ను తన ఇంటిలోకి ఆహ్వానిస్తూ చెప్పింది. ‘‘ఇంటి లోపల ఉన్నవన్నీ మావే’’ అని ఆమె చెప్పింది.
ఆమె 8 శ 10 అడుగుల రేకుల గదిలో ఎక్కువ భాగాన్ని ఒక చెక్క మంచం, చిన్న చిన్న బట్టల మూటలు, పాత్రలు పేర్చి ఉన్న అల్యూమినియం రేకు పెట్టె ఆక్రమించి ఉన్నాయి. ఈ పెట్టె మంచంగా మారుతుంటుంది. ‘‘మేం చాలా తక్కువ పొదుపు చేయగలుగుతున్నాం. ఎవరైనా ఆనారోగ్యానికి గురైతేనో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితేనో ఆహారం, మందులు, పిల్లలకు పాలు వంటి అవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పు చేయాలి’’ అని అనురాధ చెప్పింది.
ముఖ్యంగా దేశంలో కోవిడ్‌`19 విజృంభిస్తోన్న 2021లో ఆమె గర్భం దాల్చడం, వారిపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచింది. రామ్‌కి పని లేదు. జీతం పేరుతో అతనికి రూ.4,000 వచ్చాయి. అందులోనే ఇంటి అద్దె చెల్లించి, మిగిలిన రూ.2,000లతో ఆ కుటుంబం బతకాలి. ఆశా దీదీ అనురాధకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను సరఫరా చేసేవారు. అయితే దూరం వెళ్ళాల్సి రావడం, అందుకయ్యే ఖర్చుల కారణంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవడం సాధ్యం కాలేదు.
‘‘సిహెచ్‌సి బాగా పనిచేసి ఉంటే, అనురాధకు ఒత్తిడి లేని ప్రసవం అయి ఉండేది. ఆమె టాక్సీ ప్రయాణానికి రూ.4,000 ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని రీనా చెప్పారు. ‘‘సిహెచ్‌సికి విడిగా కాన్పుల గది ఉంది, కానీ అది పనిచేయదు’’.
‘‘కోటి సిహెచ్‌సిలో ప్రసూతి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మాకు తెలుసు, కానీ సిబ్బంది కొరత కారణంగా పరిస్థితులు మా నియంత్రణలో లేవు’’ అని సిమ్లా జిల్లా ప్రధాన వైద్యాధికారి సురేఖ చోప్రా చెప్పారు. ‘‘ప్రసవాలు జరిపించడానికి అవసరమైన గైనకాలజిస్ట్‌, నర్సులు, తగినంత మంది శుభ్రపరిచే సిబ్బంది లేరు. కోటి వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు వైద్యులు ఇష్టపడరు. ఇది దేశంలోని అన్ని జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న చేదు నిజం’’ అని ఆమె అన్నారు.
రాష్ట్రంలో సిహెచ్‌సిల సంఖ్య 2005లో ఉన్న 66 నుండి 2020 నాటికి 85కి, స్పెషలిస్ట్‌ వైద్యుల సంఖ్య 2005లో ఉన్న 3,550 నుండి 2020 నాటికి 4,957కి పెరిగినప్పటికీ, గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2019`20 ప్రకారం, హిమాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసూతి`గైనకాలజిస్టుల కొరత 94 శాతంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, అవసరమైన 85 మందికి బదులుగా కేవలం ఐదుగురు ప్రసూతి`గైనకాలజిస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇది గర్భిణీ స్త్రీలకు అపారమైన శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది.
అనురాధ నివసించే ప్రదేశానికి ఆరు కిలోమీటర్ల దూరాన నివసించే షీలా చౌహాన్‌ (35) ప్రసవం కోసం 2020 జనవరిలో సిమ్లాలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి ఈ విధమైన ప్రయాణమే చేయవలసి వచ్చింది. ‘‘పాప పుట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా నేనింకా అప్పుల్లోనే ఉన్నాను’’ అని షీలా PARIతో చెప్పారు.
షీలా, కోటి గ్రామంలో వడ్రంగిగా పనిచేసే ఆమె భర్త గోపాల్‌ చౌహాన్‌ (40)లు తమ పొరుగింటి వారి నుంచి రూ.20 వేలు అప్పుగా తీసుకున్నారు. రెండేళ్ళ తర్వాత వాళ్ళకు ఇంకా రూ.5 వేలు అప్పు మిగిలి ఉంది.
సిమ్లా అసుపత్రిలో గది అద్దె రోజుకు రూ.5,000 కావడం వలన షీలా అక్కడ ఒక్క రాత్రికన్నా ఎక్కువ ఉండలేకపోయారు. మరుసటి రోజే రూ.2,000 కు ఒక టాక్సీని అద్దెకు తీసుకొని ఆమె, గోపాల్‌లు పసిపాపతో కలిసి కోటికి బయలుదేరారు. మంచు కప్పిన దారులలో ముందుకు పోవడానికి ఒప్పుకోని టాక్సీ డ్రైవర్‌ వారిని గమ్యస్థానాన్ని చేరడానికి ముందే దించేశాడు. ‘‘ఆ రాత్రిని తల్చుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. బాగా మంచు కురుస్తోంది. అంతకు ముందు రోజే పాపను ప్రసవించిన నేను మోకాటి లోతున ఉన్న మంచులో నడుస్తూ ఉన్నాను’’ అన్నారు షీలా.
‘‘ఇక్కడ ఉన్న సిహెచ్‌సి సరిగ్గా పనిచేస్తున్నట్లయితే, మాకు అంత డబ్బు ఖర్చుపెట్టి సిమ్లాకు పరుగెత్తే అవసరం
ఉండేది కాదుÑ ప్రసవమైన ఒక్క రోజులోనే నా భార్య మంచులో నడవాల్సిన అవసరమూ పడేది కాదు’’ అన్నారు గోపాల్‌.
ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు పనిచేయాల్సిన విధంగా పనిచేసినట్లయితే షీలా, అనురాధలిద్దరూ జననీ శిశు సురక్షా కార్యక్రమం కింద ఏ మాత్రం డబ్బు ఖర్చు పెట్టనవసరం లేని పూర్తి ఉచితమైన ఆరోగ్య సేవలు పొందగలిగి ఉండేవాళ్ళు. ప్రభుత్వ పథకం ద్వారా
వాళ్ళు ప్రజారోగ్య సంస్థలలో సిజేరియన్‌ సెక్షన్‌తో సహా ఉచిత ప్రసవం వంటి ఆరోగ్య సేవలను ఉచితంగా అందుకునేవారు. వారు మందులు, తినుబండారాలు, అనారోగ్యానికి సంబంధించిన నిర్ధారణలు (డయాగ్నస్టిక్స్‌), ఆహారం, అవసరమైతే రక్తం, రవాణా… ఇవన్నీ కూడా ఎటువంటి వ్యక్తిగత ఖర్చు లేకుండా పొందవచ్చు. కానీ ఈ సేవలన్నీ కాగితాలపైనే మిగిలిపోయాయి.
‘‘మేం ఆ రాత్రి మా రెండు రోజుల వయసున్న పాపాయి గురించి చాలా భయపడ్డాం. చలికి ఆమె చనిపోయి ఉండేది’’ అన్నారు గోపాల్‌.
గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిలపరచాలని, పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో, ూARI మరియు కౌంటర్‌ మీడియా ట్రస్ట్‌లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్‌ ప్రాజుక్టును చేపట్టాయి.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/en/articles/birthing-in-the-backseat-of-a-bolero పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (ruralindiaonline.org) ఆగష్టు 31, 2022 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.