‘‘అమ్మమ్మా! ఇవ్వాళ పులిహోర చేస్తావా’’ బుంగమూతి పెట్టి అడిగింది వర్షిత.
‘‘ఓ ఎందుకు చేసి పెట్టను? అరగంటలో నీ ప్లేట్లో పులిహోర ఉంటుంది. సరేనా?’’ బుజ్జగింపుతో అంది వర్ధనమ్మ.
‘‘అమ్మమ్మా! నాకు పులిహోరేం వద్దు. ఫ్రైడ్ రైస్ కావాలి’’ అడిగాడు అనురాగ్ బతిమలాడే ధోరణిలో.
‘‘చూడండి పిల్లలూ! ఇద్దరికీ కావలసినవి చేసి పెడతాను. కాస్త ఓపిక పట్టండి. ముందు వర్షిత అడిగింది. అంచేత ఇవ్వాళేమో పులిహోర, రేపు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఓకేనా’’ సముదాయింపుగా చెప్పింది వర్ధనమ్మ.
కూతురు తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారనే అనుకోలేదు వర్ధనమ్మ, పరంధామయ్య దంపతులు. కూతురు సంయుక్త తర్వాత ఏడేళ్ళకు వచ్చిన గర్భాన్ని వద్దనుకోలేదు. అట్లా ఆ ఇంట్లో ప్రవేశించిన మరో ప్రాణి మాధవ్. ముప్ఫై ఏళ్ళు దాటాయి. పెళ్ళి మాటెత్తితే చిరాకు. సెటిల్ కావాలంటాడు. అడ్వకేట్‌గా ఈ మధ్యే ప్రాక్టీసు మొదలుపెట్టిండు. డిస్ట్రిక్ట్ కోర్టులోనే కాక హైకోర్టుతో పాటు వేరే జిల్లాలకు కేసులకు అటెండవుతుంటాడు. ఇటీవలి కాలంలో మంచి పేరే తెచ్చుకున్నాడు. అక్క పిల్లలంటే ప్రాణం. ప్రతి ఎండాకాలం సెలవులకు టంచన్‌గా అమ్మమ్మ ఊరికి చేరుకుంటారు అనురాగ్, వర్షితలు. దానికి కారణం లేకపోలేదండోయ్. అమ్మమ్మ, తాతయ్యలు ప్రాణపదంగా చూసుకుంటారాయె. మామయ్య సంగతి చెప్పాల్సిన పనే లేదు. మరి రాకుండా ఎట్లా ఉంటారు? వాళ్ళడగాలే కాని అమ్మమ్మకు నీరసం పటాపంచలైపోతుంది. లేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. నిజం చెప్పాలంటే వారం రోజులుగా ఆమెకు ఒంట్లో నలతగా ఉంది. ఐనా సరే ఆ అమ్మమ్మ వెనకడుగు వేసేది లేదు. తోటనుండి కావలసిన పండ్లు, చెరకుగడలు, తాటిముంజెలు, మొక్కజొన్న కంకులు, వేరుశనగ కాయల లాంటివి సమకూర్చడం తాతయ్య పని.
‘‘ఏంటర్రా పిల్లలూ! తాతయ్య మిమ్మల్ని తోటకు తీసుకెళ్తారట. తొందరగా లేచి తయారవ్వండి’’ వర్ధనమ్మ మనవడు, మనవరాలిని తొందరపెట్టింది.
‘‘ప్లీజ్ అమ్మమ్మా! ఇంకాసేపు పడుకుంటా. రాత్రేమో చాలా పొద్దుపోయి పడుకున్నాం కదా!’’ అంది వర్షిత.
‘‘ఎందుకో…?’’ దీర్ఘం తీసి అడిగింది అమ్మమ్మ.
‘‘మరేమో తాతయ్య కథలు చెప్తుంటేను…’’ తన నిద్రకు కారణాన్ని చెప్పచూశాడు అనురాగ్.
‘‘ఆ కారణాలన్నీ నాకనవసరం. పొద్దున్నే లేవడం మంచి అలవాటు. సరె సరె తొందరగా స్నానాలు చేసి రండి’’ అంటూ హెచ్చరించి వర్ధనమ్మ వంటింట్లోకి దూరింది. పది నిమిషాల్లో అన్నా చెల్లెండ్లిద్దరూ అమ్మమ్మ ఆజ్ఞను శిరసావహించారు. అమ్మమ్మ పెట్టిన టిఫిన్ తినేసి చెప్పులేసుకుంటున్నారిద్దరూను.
‘‘పిల్లలూ, ఆగండాగండి. ముందు నాకెదురు రండి. ఓ ముఖ్యమైన కేసు వాదించడానికి హైకోర్టుకు పోతున్నాను. కాస్త ఎదురు రండర్రా!’’ చిరునవ్వుతో అడిగాడు మాధవ్.
‘‘ఓ అలాగే’’ అంటూ మామయ్యకు ఎదురొచ్చి అమ్మమ్మ ఇచ్చిన బ్యాగులు తీసుకొని తాతయ్యతో తోటకు చెక్కేసారు. ఆ రోజంతా తోటంతా గెంతులేశారు. కొబ్బరి బొండాలు కొట్టించుకొని తృప్తిగా తాగారు. చెట్లకున్న ఉయ్యాలలూగారు. విరగకాసిన మామిడికాయలను, పండ్లను ఏరి ఏరి బుట్టలలో నింపడం మొదలు పెట్టారు. ఈలోగా అమ్మమ్మ పనివాళ్ళతో పంపించిన క్యారేజ్‌ను ఖాళీ చేశారు. టైం చూస్తే మూడైంది. తోటలోనే ఓ మూలగా రెండు గదుల పెంకుటింట్లో కాసేపు విశ్రాంతి తీసుకొని ఇంటిముఖం పట్టారు. ఇంట్లో కాలు పెడుతూనే పకోడి వాసన వాళ్ళ ముక్కుపుటాలను అదరగొట్టింది.
‘‘కాళ్ళూ చేతులూ కడుక్కొని రండర్రా! వేడివేడిగా పకోడీలు తిందురుగానీ’’ అంటూ వర్ధనమ్మే కాదు, ఆ వాసనకు మనసు కూడా తొందరపెట్టింది. కాళ్ళూ చేతుల పని కానిచ్చేసి పకోడీ ప్లేట్లతో వరండాలో చెక్కబల్లపైకి చేరుకున్నారు పిల్లలు. పరంధామయ్యేమో అరాంచేర్లో కూర్చొని మనవడు, మనవరాళ్ళ సందడి చూసి తెగ మురిసిపోతూ తానూ ఒక్కో పకోడీ పని పట్టేస్తున్నాడు.
‘‘ఏంటి ఏదో ఘుమ ఘుమ వాసన. ఓ పకోడీనా? మరి నాకేదర్రా? మీరే లాగించేస్తే ఎట్లా?’’ అంటూ మాధవ్ వచ్చాడు.
‘‘నీకూ ఉన్నాయిలే. అమ్మమ్మ చేస్తూనే ఉంది. ముందు కాళ్ళూ చేతులు కడుక్కొని రా. లేకపోతే అమ్మమ్మ పెట్టదుగా!’’ అంది వర్షిత కళ్ళెగరేస్తూ. కొడుక్కి పకోడీ ప్లేటు తెస్తున్న భార్యను చూసి నువ్వూ ఓ ప్లేటు తెచ్చుకోవచ్చుగా’’ అన్నాడు పరంధామయ్య.
‘‘కాళ్ళూ చేతులు కడుక్కొని నేనూ తింటాను. మీరేం బెంగ పడకండి’’ అని నవ్వుతూ ఇంటి వెనకాలకు పోతూనే ‘‘వర్షితా’’ అని కేకేసింది. పకోడీలు తిన్ని మూతి తుడుచుకుంటూ ఒక్క అంగలో వెళ్ళి అమ్మమ్మ కొంగు పట్టుకొంది. ‘‘నా ముందుకు ఇలా రా’’ అంటూ వర్షితను తన ముందుకు లాక్కొని కళ్ళు తెరిచింది. విదియనాటి చంద్రరేఖను చూసి అలా చేయడం వర్ధనమ్మకు అలవాటు. అలా ఇష్టమైనవాళ్ళ మొహం చూస్తే ఆ నెలంతా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా.
పిల్లల సెలవులు అయిపోయాయి. నాలుగు రోజుల్లో స్కూళ్ళు తెరుస్తారనగా సెకండ్ సాటర్ డే, సండేతోపాటు మరో రెండు రోజులు సెలవు పెట్టి సంయుక్త, సాగర్లు వచ్చేశారు. వర్ధనమ్మ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఆ విషయం ముందే తెలిసినందువల్ల ముందే కొడుక్కి చెప్పి కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు అందరికీ బట్టలు తెప్పించింది. పక్కింటి వనజాక్షి సాయం తీసుకొని చక్కిలాలు, కారప్పూస, అరిసెలు, లడ్డూలు, కజ్జికాయలు చేయించింది. సప్తమి తిథి శుక్రవారం బాగుందని ఒడిబియ్యం నింపడానికి నిర్ణయించుకొంది కూడా.
‘‘ఎందుకమ్మా ఈ హడావిడి! పెళ్ళై పదిహేను సంవత్సరాలు కావస్తోంది. మేమిద్దరమూ
ఉద్యోగాలు చేస్తున్నాం. మంచి పొజిషన్లో ఉన్నాం కూడా. ఈ పెట్టుపోతలు… ఇంత తాపత్రయం ఇంకా అవసరమా అమ్మా’’ అంది సంయుక్త.
‘‘నువ్వెంత ఎత్తుకు ఎదిగినా నాకు కూతురివే తల్లీ! నేనున్నంతవరకు ఇలా జరగాల్సిందేనమ్మా. అది సంప్రదాయం కూడా’’ అంది వర్ధనమ్మ.
మర్నాడు ఇరుగుపొరుగు ముత్తైదువులను పిలిచి ఒడిబియ్యం నింపింది. వర్షిణి, అనురాగ్‌లకు కూడా మంచి డ్రెస్‌లు కుట్టించడంతో వాళ్ళు తెగ సంబరపడిపోయారు.
… … …
‘‘ఏమండీ, ఒకసారి వీలుచూసుకొని మధురానగరం వెళ్ళొద్దామా?’’ అంది సంయుక్త.
‘‘ఏంటి అమ్మానాన్నలపై బెంగ పెట్టుకొన్నావా?’’ అన్నాడు సాగర్.
‘‘నిజమేనండీ. దుక్కలా ఉండే నాన్న ఎలా అయిపోయారో? కాస్తో కూస్తో అమ్మ బావుండబట్టి సరిపోయింది’’ దిగులుగా అంది సంయుక్త.
‘‘ఏం చేస్తాం గుడ్డిలో మెల్ల. మీ తమ్ముడు, మరదలేమో ఏ సెలవుల్లేని ఉద్యోగాలు చేస్తున్నారాయె. పోనీ ఇంటిదగ్గరేమన్నా వెసులుబాటా అంటే అదీ లేదు. క్లయింట్లతోనే సరిపోతుంది.’’
‘‘అదే బాధగా ఉందండి. కనీసం ఊళ్ళో ఉన్నా పనివాళ్ళ ఆసరా ఉండేది. ఈ హైదరాబాద్‌లో అదీ లేదు. నాన్న మంచానపడి ముక్కుతూ మూల్గుతూ… అమ్మ చేయలేక…’’ బాధగా మూల్గింది సంయుక్త.
‘‘బాధపడకు. ఈ సృష్టిలో జరుగుతున్న సంఘటనలకు మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. పరిస్థితులతో సహజీవనం తప్పదు. అన్ని పరిస్థితులను జీర్ణించుకోవాలె. సరే రేపు ఎలాగూ సెలవే కదా! ఓసారలా వెళ్ళొద్దాంలే’’ సమాధానపరిచాడు సాగర్.
‘‘ఎక్కడికేంటి?’’ అటుగా వస్తున్న అనురాగ్ అడిగాడు.
‘‘అమ్మమ్మ, తాతయ్యలను చూడటానికి’’ చెప్పింది సంయుక్త.
‘‘ఎప్పుడు?’’ అనురాగ్ వెనకాల వస్తున్న వర్షిత ప్రశ్న.
‘‘పది గంటలకంతా బయలుదేరాలనుకుంటున్నాం’’
‘‘మేము లేకుండానే…?’’ ఇద్దరు పిల్లల ఎదురు ప్రశ్న.
‘‘మీకు 15 నుండి ప్రీ ఫైనల్స్. బుద్ధిగా చదువుకోండి. మళ్ళీ వెళ్ళినపుడు వద్దురుకాని’’ సముదాయించింది సంయుక్త.
‘‘కుదరదు. మేం సిలబస్‌లో అప్ టు డేట్‌గా ఉన్నాం. నేనైతే మామయ్యతో చెస్ ఆడి ఎన్ని రోజులైందో తెలుసా?’’ అన్నాడు అనురాగ్.
‘‘నేను అత్తయ్యతో టెన్నికాయిట్ ఆడాలి’’ అంది వర్షిత.
‘‘ఇప్పుడంత సీన్ లేదురా. వాళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు.’’
‘‘ఏం లేదు. నువ్వలాగే అనుకో. అత్తయ్య, మామయ్య మేమెళ్ళామంటే మాతోనే స్పెండ్ చేస్తారో లేదో చూడు’’ అన్నారు పిల్లలిద్దరూ.
అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి పోవడమనగానే వర్షిత, అనురాగ్ల ఆనందానికి అవధుల్లేవు. ఏ సుప్రభాతాలు లేకుండానే ఉదయాన్నే లేచి బుద్ధిగా తయారయ్యారు. పది గంటలకల్లా కారు మధురానగరం చేరుకుంది. మనవడు, మనవరాలిని చూడగానే వర్ధనమ్మ, పరంధామయ్యలు తెగ సంతోషపడిపోయారు. కానీ పిల్లలు అనుకున్నట్టు మాధవ్, అర్చనలు అంత సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోయారు. నామమాత్రపు పలకరింపుల తర్వాత ముందు రూమ్‌లో తన క్లయింట్లతో వాళ్ళు మమేకమైపోయారు. సంయుక్త వాళ్ళమ్మకు సాయంగా ఏదో పనిలో మునిగిపోయింది. సాగర్ మాత్రం మామగారిని తన కబుర్లతో ఊరట కలిగించే పనిలో లీనమైపోయాడు. నిరుత్సాహంగా పిల్లలిద్దరూ టివితో కాలక్షేపం చేయక తప్పలేదు.
‘‘సంయుక్తా! పిల్లల్ని భోజనానికి పిలువు తల్లీ’’ అంది వర్థనమ్మ.
‘‘వర్షితా, అనురాగ్ రండర్రా! అమ్మమ్మ మీ కోసం పులిహోర, పాయసం చేసింది’’ అంటూ పిల్లల్ని పిలిచింది సంయుక్త. అమ్మమ్మ వంటలంటే లొట్టలేసుకుంటూ తినే పిల్లలకు ఆ రోజు ఆ వంటలు పెద్దగా సంతృప్తినివ్వలేదు. కాసేపు అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్పి సాయంకాలం మాధవ్ స్విగ్గీనుండి తెప్పించిన స్నాక్స్ తిని వాళ్ళకు బై చెప్పి ఆరుగంటల కల్లా ఇల్లు చేరుకున్న పిల్లలకు మనసు మనసులో లేదు.
ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా ఉండే మామయ్య పెద్దగా పట్టించుకోలేదు. పెళ్ళైన కొత్తలో అత్తయ్య బానే మాట్లాడేది. అదేంటో ఈ మధ్య ఆ చనువు కనబడటమే లేదు. మరీ ఈ రోజు ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పనులలో మునిగిపోయారు. వాళ్ళ పెళ్ళిలో అంతా తామై తిరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మామయ్య పెళ్ళి పనులన్నిటినీ అమ్మా నాన్నలే దగ్గరుండి చేశారు. ‘ఎందుకిట్లా జరిగింది?’ అనుకొని చాలా మధనపడ్డారా పిల్లలు.
… … …
‘‘అనురాగ్! నన్నోసారి మామయ్య ఇంటి దగ్గర దింపిరా నాన్నా’’ బతిమలాడే ధోరణిలో సంయుక్త.
‘‘నాకు వీలుకాదమ్మా. రేపటినుండే మా ఇంటర్నల్స్. నేను మాంచి మూడ్‌లో ప్రిపేరవుతున్నా’’ అనురాగ్ సమాధానం.
‘‘వర్షితతో నువ్వైతే రాఖీ కట్టించుకున్నావుగా. మరి నేను మా తమ్ముడికి కట్టక్కర్లేదా?’’ కాస్త నిలదీస్తున్న ధోరణిలో నవ్వుతూ అంది సంయుక్త.
‘‘ఇదిగో ముందే చెప్తున్న. దింపడమొకసారి… పికప్ చేసుకోవడం మరోసారి కుదరదంటే కుదరదు. మనం వెళ్ళామా, నువ్వు రాఖీ కట్టావా, తిరుగు ప్రయాణం చేశామా అన్నట్లుండాలి. ఓకేనా?’’ ఖచ్చితంగా చెప్పాడు అనురాగ్.
‘‘ఓకే బంగారం’’ అంటూ చెవులు పట్టుకుంది సంయుక్త నవ్వుతూనే.
‘‘నాన్న రావడానికి ఎంత టైం పడుతుందో ఏమో. ఒక్కదాన్నే బోర్. ఎలాగూ తొందరగా వచ్చేస్తామంటున్నారుగా నేనూ వస్తా’’ అంది వర్షిత.
‘‘మరీ సంతోషం తల్లీ!’’ అంటూ కొడుకు, కూతురితో తమ్ముడి ఇంటికి బయలుదేరింది సంయుక్త. మాధవ్ వాళ్ళ ఇంటి ముందు కార్లు ఆ ఇంటి సందడిని తెలిపాయి. నవ్వులు, కేరింతలు బయటి వరకు వినిపిస్తున్నాయి. ఎవరై ఉంటారని ఆలోచిస్తూనే ముగ్గురూ లోపలికి ఎంటరైతే కానీ అర్చన అన్నా, వదినలు, వాళ్ళ పిల్లలు వచ్చారని అర్థం కాలేదు.
‘‘రండి వదినా! బావున్నారా? మీ రాక కోసమే మీ తమ్ముడి ఎదురు చూపులు…’’ అంటూ ఆహ్వానించింది అర్చన.
‘‘మా తమ్ముడు నీతో చెప్పాడేంటి నా కోసం ఎదురుచూస్తున్నట్టు?’’ అడిగింది సంయుక్త.
‘‘ప్రత్యేకంగా చెప్పాలేంటి? ఆ చూపులే చెప్తున్నాయి’’ నవ్వుతూ అంది అర్చన.
‘‘నిజమే. సారీ మాధవ్! రేపు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది. రికార్డ్స్ అప్డేట్ చేసుకోవడంలో టైమే తెలియలేదనుకో’’ కొంచెం సముదాయింపు ధోరణిలో అంది సంయుక్త.
‘‘ఇప్పుడు మీ తమ్ముడి మొహం వెయ్యి వాల్ట్ బల్బులా వెలుగుతుందనుకోండి’’ అంటూనే వాళ్ళ వదిన, అన్నయ్యల మధ్య దూరిపోయింది అర్చన.
సంయుక్త రాఖీ కట్టి, తాను తెచ్చిన స్వీట్ తినిపించింది. అర్చన అన్నయ్య పిల్లలతో పెద్దగా రాపోర్ట్ లేనందున బోర్‌గా ఫీలైన అనురాగ్, వర్షితలు తొందర పెట్టడంతో ‘‘ఒరేయ్ మాధవ్! వెళ్ళొస్తాను’’ అంటూ లేచింది.
‘‘అదేంటి వదినా! భోజనం చెయ్యకుండా వెళ్ళడమేంటి? ఓ అరగంటాగండి. కేటరింగ్ వాడు వచ్చేస్తాడు’’ అంది అర్చన.
‘‘లేదు అర్చనా! ఆయనొచ్చే టైమైంది. వెళ్ళాలి. ఎలాగూ రాత్రి తినేది చపాతీనే. పిండి తడిపే వచ్చా. పిల్లలు సాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నారు’’ అంది సంయుక్త.
‘‘వదినా! మీరు నన్ను చాలా డిజప్పాయింట్ చేస్తున్నారు. ఉండండి బొట్టు పెడతాను’’ అంది అర్చన.
‘‘ఇంకా ఈ ఫార్మాలిటీస్ అవసరమా అర్చనా!’’ అంది సంయుక్త.
‘‘అలా అంటారేంటి వదినా! ఎన్నేళ్ళయినా మీ అక్కా తమ్ముళ్ళ అనుబంధం తరుగుతుందేమిటి? మీరు రాఖీ కట్టక మానరు. మీ తమ్ముడేమో చీర ఇవ్వక మానడు’’ అంటూనే బొట్టు పెట్టి కవర్ చేతికందించింది అర్చన.
యాంత్రికంగానే ఆ కవర్‌ను అందుకొని ‘‘వెళ్ళాస్తాన’’ంటూ తమ్ముడికీ చెప్పి బయటపడ్డారు ముగ్గురూ. కారు ఇంటివైపు దూసు కెళ్తుంటే ఆలోచనలు గతాన్ని వెతుక్కున్నాయి.
… … …
ఆ ఒక్క రాఖీ పౌర్ణమే కాదు. అలాంటి ఎన్నో రాఖీ పౌర్ణములు చాలా ఏళ్ళుగా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాయి. ఇటు సంయుక్త పిల్లలు, అటు మాధవ్ పిల్లల చదువైపోవడమే కాదు, మంచి ఉద్యోగాలు వాళ్ళను అమెరికా పంపించేసినై. సంయుక్త, సాగర్లు చాలా ఇష్టంగా కట్టుకొన్న ఇంట్లో ఇద్దరుగా మిగిలిపోయారు.
ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఆవరణలో మామిడి, అరటి, నేరేడు, సీతాఫల్, జామ చెట్లకు నీరు పారిస్తూ… వెనకాల ఉన్న ఆకుకూరలు పెంచడంలో మునిగిపోయారు. వాటిని పిల్లలను పెంచినంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పిల్లలు దూరమయ్యారన్న దిగులును దూరం చేసుకునే ప్రయత్నంతోపాటు ఎంతో కొంత ఊరట ఏదైనా కావచ్చు, రెండూ కావచ్చు.
కాలం మరింత వేగాన్ని పెంచింది. ఉరుములు మెరుపులు లేని వర్షంలా అనురాగ్ ఒకానొకనాడు ఓ అమెరికా అమ్మాయితో ఊడిపడ్డాడు మా పెళ్ళయిందంటూ. జరిగిన, జరుగుతున్న సంఘటనలను అంగీకరించాలని నిర్ణయించుకున్నా ఏదో అలజడి. తమ పెద్దరికం నిలుపుకోదలచి… కొడుకు పెళ్ళిని పరిచయం చేయడంలో భాగంగా బంధుమిత్రులకు ఓ విందు ఏర్పాటు చేశారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన కొడుకు పెళ్ళిని జీర్ణించుకుంటుండగానే వర్షిత నుండి తానో అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు కబురొచ్చింది.
‘‘ఏమ్మా వర్షితా! ఇంతకీ ఎవరా అబ్బాయి? ఏ ఊరు? వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ పూర్వాపరాలు తెలుసుకున్నావా?’’అని ప్రశ్నల వర్షం కురిపించింది సంయుక్త.
‘‘ఏంటమ్మా! నీ సోది. కశ్యప్ మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. చాలా మంచివాడు. మేమిద్దరమూ అమెరికా వాసులం. వాళ్ళ కుటుంబంతో మనకేం పని చెప్పు?’’ విసుగ్గా సమాధానమిచ్చింది వర్షిత.
కూతురి భవిష్యత్తు భద్రంగా ఉండాలని సంయుక్త ఆవేదన. అది అర్థం చేసుకునే స్థితిలో లేదు వర్షిత. అంగీకారం తెలపడం నామమాత్రమే అయినా బంగారం, బట్టలు… పెట్టుపోతలు అన్నీ పద్ధతిగా అడిగి మరీ చేయించుకుంది వర్షిత. అనురాగ్ మాత్రం ఆఫీస్ పనుల వల్ల రాలేకపోతున్నానంటూ ఓ వెయ్యి డాలర్లు పంపించాడు.
‘‘ఏవండీ చూశారా? అనుబంధమంతా డాలర్లుగా మారిపోయింది. చెల్లి పెళ్ళి దగ్గరుండి జరిపించాల్సిన అన్న డబ్బులు పంపి చేతులు దులిపేసుకున్నాడు’’ బాధగా అంది సంయుక్త.
‘‘పరిస్థితులు మారినై. వాటికనుగుణంగా మనం సర్దుకుపోవాలి. తప్పదు. వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు మనకు తెలియవు కదా!’’ మనసులో అసంతృప్తి ఉన్నా పైకి మాత్రం అనునయ వాక్యాలు పలికాడు సాగర్.
‘‘కాక ఏం చేయగలంలెండి’’ అంది సంయుక్త. ఏ లాంఛనాలు తక్కువ కాకుండా పెళ్ళి ఘనంగా చేశారు. పెళ్ళికి మాధవ్, అర్చనలు రానైతే వచ్చారు. వాళ్ళ వ్యవహారం ఏదో చుట్టం చూపులా తప్ప మేనమామ, అతని భార్యలా కనబడలేదు, మంగళసూత్రాలను అందరిచే ముట్టించడం వంటి తంతు తప్ప. చెప్పాలంటే సంయుక్త, సాగర్ల ఆత్మీయ స్నేహితులే వెన్నుదన్నుగా నిలబడడంతో ఏ ఆటంకాలూ లేకుండా పెళ్ళి సవ్యంగా జరిగింది. ఒక వారం రోజుల లోపు వర్షిత, కశ్యప్‌లు బాక్ టు పెవిలియన్ అంటూ అమెరికా చెక్కేశారు.
ఇల్లంతా బోసిపోయింది. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోక తప్పదనే వాస్తవం తెలిసిందే. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నారా భార్యాభర్తలు. మనసు మనసులో లేదు. రోజులు యాంత్రికంగా అడుగులు వేస్తున్నాయి. అయినా వాటి ప్రయాణం సాగుతూనే ఉంది. ఓ సంవత్సరం అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. ఓ రోజు పొద్దున్నే పేపర్ చదువుతూ రాజకీయాలను చర్చిస్తున్న సాగర్, సంయుక్తలను సెల్‌ఫోన్ నన్ను పట్టించుకోమంటూ గోల పెట్టింది. ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారని ఆలోచించిన సంయుక్తను సెల్ఫోన్లో బాల్యమిత్రురాలు రంజిత పలకరించింది.
ఆ పలకరింపు చర్చాగోష్టిలా సాగిపోతుండగా ‘‘సంయుక్తా! వాకింగ్‌కు వెళ్తున్నాను. తలుపేసుకో’’ అంటూ బయటపడ్డాడు సాగర్. వాకింగ్ చేస్తున్నాడన్న మాటే కానీ పిల్లల గురించే ఆలోచన. రైల్వే ట్రాక్ దాటాడు. రోడ్డంతా నిర్మానుష్యంగానే ఉంది. నడక వాకింగ్‌లా లేదు. కాళ్ళను బలవంతంగా ఈడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఎదురుగా రెండు బుల్లెట్లు. పక్కపక్కనే. అదేం విచిత్రమో వాటిని నడుపుతున్న మహానుభావుల చేతులు చెట్టాపట్టాలేసుకుని ఉన్నాయి. ఆ బండ్ల లైట్లు సాగర్ కళ్ళను మూసుకోమన్నాయి. స్పీడ్ బ్రేకర్‌ను దాటుతున్న ఆ బండ్లు దారి తప్పాయి. కుడివైపు దూసుకురావడమే కాదు. ఏకంగా సాగర్‌ను పడేసి మరీ ముందుకు దూసుకుపోయాయి. అవి కూడా మరికొంత దూరం పోయి ఓ చెట్టును ఢీకొట్టి శవాసనం వేశాయి, వాటితోపాటు దాని మీదున్న మనుషులూనూ. ఏకంగా ఐదు నిమిషాల్లో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
… … …
తండ్రి దహన క్రియలకు రాలేకపోయినా అంత్యక్రియలకు అనురాగ్, వర్షితలు రానూ వచ్చారు, పోనూ పోయారు. ఇద్దరూ తమ వెంట రమ్మని ఒకటే యాగీ. ‘‘చూద్దాంలే… నాలుగు రోజులు పోనీయండి’’ అని సరిపెట్టింది. తనన్న నాలుగు రోజులు నాలుగు నెలలై పోయాయి. కోడలి పాశ్చాత్య సంస్కృతిలో ఇమడలేనేమో అన్న సందేహం…
వర్షిత డెలివరీ టైం కారణంగా ఆమె ఉంటున్న టెక్సాస్‌లో అడుగుపెట్టింది. తను వచ్చిన వారం రోజులకు వర్షిత డెలివరీ అయింది. హాస్పిటల్ డెలివరీ టైంలో భర్త మాత్రమే అటెండ్ కావడానికి అనుమతించింది. తను ఇంట్లో ఎదురు చూపులతో మిగిలిపోయింది. నాలుగైదు గంటల నిరీక్షణ తర్వాత కూతురు పుట్టిందని, లక్షిత అని పేరు పెట్టామన్న వార్తతో అల్లుడి నుండి ఫోన్. ఆ దేశంలో పుట్టగానే పేరు పెడతారనే విషయం అప్పుడు గాని గుర్తురాలేదు సంయుక్తకు. మనవరాలు పుట్టిందన్న వార్త సంతోషాన్ని మోసుకొచ్చినా మనవరాలికి పెట్టే పేరు ప్రస్తావన తన దగ్గర రాకపోవడం ఏ మూలనో కలుక్కుమంది.
నో వర్క్, నో పేమెంట్ రూల్ వల్ల వర్షిత నెల రోజులకే ఆఫీసుకు వెళ్ళక తప్పలేదు. ఇద్దరూ ఉద్యోగస్తులే. పని మనుషులు లేని దేశం. బట్టలు… బాసండ్లు… వంటపని, ఇంటిపని సమస్తం స్వయంగా చేసుకోవలసిందే. చూస్తూ, చూస్తూ కూతురికే వదిలేయలేకపోయింది. పైగా చంటిపిల్లొకతి. అలా అని వయసు, మనసు సహకరించకపోవడంతో ఆ పనులకు పూర్తి న్యాయం చేయలేకపోయింది.
మాట్లాడేవారు కరువు. ఎటు పోవాలన్నా పిల్లలపై ఆధారపడి తీరాలి. పోనీ పిల్లలేమైనా పలకరిస్తారా అంటే అదీ లేదు. అలసిపోయిన శరీరాలు… సెల్‌ఫోన్‌కు అంకితమైపోయిన మనసులు… ఈ చెవి మాట ఆ చెవికి కూడా వినపడని సంస్కృతుల నీడలు. వీకెండ్స్ ఏ సైట్ సీయింగ్‌కో బయటికి వెళ్ళినా అన్నీ శూన్య దృక్కులే. మనసంతా సాగరమయమే. బాగుండదని న్యూయార్క్‌లో ఉన్న కొడుకు దగ్గర ఉండి వచ్చింది. ఆపై ఆరు నెలల గడువు ముగియడంతో ఇండియాకు తిరుగుముఖం పట్టింది సంయుక్త. మనసు చాలా విచిత్రమైంది. ఏదో కోరుకుంటుంది. కోరుకున్నది చేరువైనా మళ్ళీ ఏదో అసంతృప్తి. పరాయిదేశంలో అసౌకర్యం సరే. మరి ఇండియాలో… తన ఊర్లో… తన ఇంట్లో… ఎందుకీ పరిస్థితి. ఎడతెగని ఆలోచనలు.
చిన్నతనంలో తాతయ్య, నానమ్మ, అమ్మా, నాన్న, తమ్ముడు, తను, వచ్చీపోయే బంధువులు ఎనలేని హాయి. పరిస్థితుల వల్ల క్రమంగా పుట్టిన ఊరితో సంబంధం తగ్గిపోయింది. అమ్మా, నాన్న పట్నంలో తమ్ముడి సంసారంలో చేరుకున్నాక ఏంటో అది పుట్టింటి వాసనలా అనిపించలేదు. నాదైన సంసారంలో మునిగిపోయి ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సద్యోగంతో సతమతమై వాళ్ళ చదువులు పూర్తయి ఉద్యోగాలలో స్థిరపడగానే ఊపిరి పీల్చుకుందామనుకున్నా, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడా అన్నట్లు తమ ఉన్నతికి బాధ్యతను అంగీకరించిన ఆ మనసులు పెళ్ళి, పిల్లల విషయంలో తమ ప్రమేయాన్ని కాదు పొమ్మన్నారు. దురదృష్టం వెంటాడి సహచరుణ్ణి దూరం చేసింది. క్రమంగా జీవితంలోని సంబంధాలన్నీ పిడికిట్లో ఇసుకలా జారిపోయాయి. తను మాత్రం రేణువులా మిగిలిపోయింది. అది కూడా జారడానికి ఇంకెంతో కాలం పట్టదేమో అన్న ఆలోచన ఆమెను వెంటాడుతోంది. శాశ్వత నిద్రకు ఎదురు చూస్తున్న ఆమెకు రోజువారి నిద్ర ససేమిరా రానంది.