‘అమ్మా… ఈ మాట విన్నావా…’ లోపలికి పోతూ అన్నది యాదమ్మ. ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక విషయం మోసుకొస్తుంది. హడావిడిగా తన పని తాను చేసుకుంటూనే ఏ విషయమైనా చెబుతుంది. ‘పాపం… నాలుగేళ్ళ పసిబిడ్డ. లోకం పోకడ ఎరుకలేని పొల్ల.
ప్మ్‌ా… పాలుగారే పసిదానిపై మదమెక్కిన ఆబోతు పడ్డదట. అయ్యయ్యో… బిడ్డ ఎంత గోస పడిరదో… ఎంత యాతన పడిరదో…
ఎంత ఘోరం, ఎంత దారుణమమ్మా…’ చీపురుతో వచ్చిన యాదమ్మ ‘ఆడసలు మడెసేనా… థూ…’ ఒక్క దినం కాదు రెండు దినాలు కాదు రెండు నెలలు. ఆ నరకం ఎట్ల పడ్డదో. బిడ్డ గాచారం ఇట్లా కాలవడ్డది’ అంటూ వాకిట్లోకి నడిచింది. నిన్న టీవీ వార్తలలో చూసినప్పటి నుంచి మనసు కకావికలమైంది. ఇటువంటి వార్తలు ఇవ్వాళ కొత్త కాదు. ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇంకా ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఎందుకిలా…? అందుకు కారణం ఎవరు? ఎన్నాళ్ళిలా?
డిజిటల్ క్లాస్ రూంలో ఎల్‌కేజీ పిల్లలతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడట. అసలు పిల్లల క్లాస్ రూమ్‌లోకి డ్రైవర్ ఎందుకొచ్చినట్లు? క్లాస్ టీచర్ ఏమైంది? ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలల తరబడి డ్రైవర్ తరగతి గదిలో… ప్రిన్సిపల్ ఏం చేస్తున్నట్లు? ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపైనా విచారణలో తేలతాయి. ఏళ్ళ చరిత్ర కలిగిన పేరున్న స్కూళ్ళలోనే పిల్లల రక్షణ ఈ విధంగా ఉంటే మామూలు బడులలో ఇంక ఎలా ఉంటుందనుకోవచ్చు.
ప్రస్తుతానికైతే నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోవచ్చు/పోకపోనూ వచ్చు. నేరం రుజువైతే నిందితుడికి 20 ఏళ్ళ శిక్ష పడుతుందని అంటున్నారు. బాధిత బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా సరే…
కొన్నాళ్ళుగా నీరసంగా ఉంటున్న నాలుగేళ్ళ బిడ్డను ఆమె తల్లి గుచ్చి గుచ్చి అడగకపోతే, రకరకాలుగా ఆరా తీయడానికి ప్రయత్నించకపోతే, ఏడుస్తున్న బిడ్డపై లైంగిక దాడి జరిగిందని గుర్తించకపోతే…? ఇంకెంతకాలం అఘాయిత్యం కొనసాగేదో… ఇంకెంత మంది ఇబ్బంది పడేవారో.
రెండు నెలలుగా నరక యాతన అనుభవించిన ఆ చిన్నారిని తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తమ బిడ్డను లైంగికంగా ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ తల్లిదర్రడులు పరువు, ప్రతిష్టలకు పోయి విషయాన్ని చీకట్లోకి నెట్టేయలేదు. ఇతర పిల్లల తల్లిదండ్రుల్ని కూడగట్టుకుని తన బిడ్డకు జరిగిన అన్యాయంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసి నందుకు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని అభినందించాలి.
ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడు కోవడం ఆ తర్వాత మరుపు మడతల్లో పడెయ్యడం అలవాటైపోయింది. కానీ మూలాల్లోకి వెళ్ళం. కారణాలు అన్వేషించం. పరిష్కారాలు సాధించం, పై పై మాటలతో సరిపెట్టేస్తాం. శరీరంలో ఉండే కింది భాగాలైన లైంగికావయ వాల గురించి మాట్లాడడం తప్పుగా భావిస్తుంది మన సమాజం. ఆ అవయవాలపై పిల్లలకు వచ్చే సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఇవ్వదు.
అసలు అటువంటి విషయాలు పిల్లలతో ఎట్లా మాట్లాడాలని పెద్దలుగా సందేహపడతాం. పిల్లలతో ఆ విషయాలు మాట్లాడడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తాం. బూతు విషయంగా చూస్తాం. చిన్న చూపు చూస్తాం. ఉచ్ఛరించడానికి ఇష్టపడని అవయవాల గురించి పిల్లలకు విప్పి చెప్పాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి నొక్కి చెప్పింది. బాల్యాన్ని భద్రంగా ఎదగనివ్వాల్సిన బాధ్యత పెద్దలదని రుజువు చేసింది.
శరీరంలో మరి ఏ అవయవంపై దాడి జరిగినా మన స్పందన ఒకలా ఉంటుంది. అదే పునరుత్పత్తి అవయవంపై జరిగిన దాడిపై స్పందన మరోలా ఉంటుంది. లైంగికావయవాలైన ఆ శరీర భాగాలు కూడా మన శరీరంలోవే కదా… అవి కూడా ముఖ్యమైన పనులు చేస్తాయి. అయినా ఆ అవయవంపై జరిగే దాడిని చీకట్లో ఉంచడమే నేర్పింది మన సమాజం, సంస్కృతి.
లోకంలో మేకతోలు కప్పుకున్న గుంటనక్కలకు కొదువ లేదు. నీకేంట్రా మగాడివి… అంటూ మగవాడిని కొమ్ములిచ్చి నేరస్తులుగా మార్చేది మన అసమ సమాజమే. ఒక ఆడపిల్లకు ఇలా జరిగిం దంటే నలుగురికి తెలిస్తే పరువు పోతుందన్న భయం, బాధితురాల్ని, బాధిత కుటుంబాన్ని లోకం నేరస్థులుగా వేలెత్తి చూపుతుందని భయం. ఆ సంఘటన తాలూకు నీలి నీడలు ఆ బిడ్డ జీవిత మంతా వెంటాడేలా సమాజం ప్రవర్తిస్తుందన్న భయం ఆ బిడ్డ తల్లిదండ్రుల నోరు నొక్కేస్తుంది. తమ బాధని, అన్యాయాన్ని అదిమిపెట్టి లోపల్లోపలే కుమిలి పోతుంది ఆ కుటంబం.
అరిటాకు ముల్లు మీద పడ్డా, ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకుకే నష్టం అంటూ పనికి మాలిన సామెతలతో ఒక చట్రంలో బిగించే యత్నం చేసింది సమాజం. అటువంటి సమాజం ఇప్పుడిప్పుడే ఆ చట్రం నుంచి బయటికి రావడానికి, నిశ్శబ్దాన్ని ఛేదించ డానికి యత్నిస్తున్నది, మార్పు వస్తున్నది.
‘అసొంటోళ్ళకు పాపం అంటే పాత్కం చుట్టు కుంటది. బొక్కలిరగ దన్నాలే. భాడ్కావ్… కాకులకు, గద్దల పాలపడకుండ కోడి రెక్కల కింద పిల్లలను దాపెట్టినట్టు ఆడపిల్లను దాపెట్టుకోవా లంటే ఎట్ల?’ అన్నది ఇల్లు శుభ్రం చేస్తున్న యాదమ్మ. నిజమే, పిల్లల్ని ప్రతిక్షణం ఎంతకని కాచుకుని ఉండగలం? ఏ వైపు నుండి ఏ పాము బుసలు కొడుతూ వచ్చి కాళ్ళకు చుట్టుకుంటుందో, కాటేస్తుందో తెలియని స్థితి. ఆడపిల్లల తల్లిదండ్రులు అనుక్షణం భయంతో గుండె దడదడలాడుతూ ఉన్నారు. నిజమే.
భయపడడం కంటే పిల్లలూ, పెద్దలూ అప్ర మత్తంగా ఉండటం అవసరం. అందుకే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో నేర్పాలి. ఆ పామును గుర్తించడం నేర్పాలి. అదేవిధంగా ఆ పామును ఎదుర్కోవడం ఎలాగో తెలియజేయాలి. అదే విధంగా మన మగపిల్లలకి కూడా తెలియ జేయాలి. చట్టం గురించి, శిక్ష గురించి చెప్పాలి. అది మనం చేస్తున్నామా… మన ఇళ్ళల్లో, బళ్ళల్లో పిల్లలకు చెబుతున్నామా? చెబితే ఎంతవరకు?
మన ప్రైవేట్ పార్ట్స్‌ని మనమే చూడాలి. మనమే టచ్ చేయాలి. ఎవర్నీ చూడనివ్వకూడదు. ఎవరి ప్రైవేట్ పార్ట్స్‌నీ టచ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేయబోతే నో… అని పిడికిలెత్తి అరచి చెప్పమని పిల్లలకు నేర్పాలి. అది చివరకు ఇంట్లో దగ్గరి బంధువులైనా, బాగా తెలిసిన వాళ్ళయినా… నో అని చెప్పే ధైర్యం ఇవ్వాలి.
తల్లిదండ్రులు పిల్లలకు కోరిన వస్తువులన్నీ కొని ఇవ్వడమే ప్రేమ కాదు, వారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రతిరోజూ క్వాలిటీ టైం పిల్లల కోసం కేటాయించాలి. పిల్లలు చెప్పేది వినాలి. తల్లి దండ్రులకి, పిల్లలకు మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయం స్వేచ్ఛగా పంచుకునేంత దగ్గరితనం పెంపొందించుకోవాలి. ఎటువంటి సమస్యనైనా పిడికిలెత్తి ధైర్యంగా ఎదుర్కోగలం అన్న ఆత్మ విశ్వాసం ఇవ్వాలి. అది తల్లిదండ్రుల బాధ్యత.
కులం, మతం, వర్గం, చిన్న, పెద్ద, ప్రాంతం ఏదైనా సమాజం ఆడ పుట్టుకను, ఆడ శరీరాన్ని చూసే దృష్టి కోణం మారాలి. మన మతాల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో ఆడ పుట్టుకకు విలువ, గౌరవం పెరిగినప్పుడు, సమ దృష్టితో చూసినప్పుడు ఇటువంటి సమస్యలకు పరిష్కారం సాధ్యమ వుతుందేమో! ఒకవైపు ఆడపిల్లల రక్షణ పట్ల చైతన్యపరుస్తూ మరోవైపు సమాజం, ప్రభుత్వం ఇంట, బయట పటిష్టమైన రక్షణ వ్యవస్థలు ఏర్పరచాలి. ఏదేమైనా రోగానికి మందు వేయడం కాకుండా రోగమే రాకుండా చూసుకోవడం ముఖ్యం కదా…