గమనమే గమ్యం -ఓల్గా

‘‘ఎలా ఉందీ ఇదంతా’’.
‘‘చాలా బాగుంది. మా కుటుంబాలు ఒక దారికి వచ్చాయి. నిరంతరం ప్రభువు నామం స్మరించుకుంటూ, విద్యా దానం చేయడం. అంతకంటే ఏం కావాలి? పైగా ఒకప్పుడు ఎక్కడ తలదించుకుని బతికామో అక్కడ అధికారంతో బతకడం కూడా బాగుంది.’’

‘‘తలదించుకు బతకటం ఏమిటి?’’
‘‘అంతా మర్చిపోయావా శారదా? ఆ రోజుల్లో మేం ఎలా ఉండేవాళ్ళం. మీరంతా తిని వదిలిన ఎంగిళ్ళు ఎత్తి పారేసి ఆ స్థలమంతా కడిగి, మీరు పారేసిన పదార్థాల వాసనలు నోరూరిస్తుంటే రుచీపచీ లేని జొన్నన్నంలో ఇంత సాంబారు, మజ్జిగ పోసుకుని కడుపు నింపుకునేవాళ్ళం. స్కూలంతా శుభ్రం చేసి, కడిగి ఎంత పుణ్యం చేస్తే ఈ నాలుగక్షరాలూ అబ్బాయనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడ హెడ్‌ మిస్ట్రెస్‌గా…’’
‘‘సారీ… థెరిసా’’
‘‘నువ్వెందుకు సారీ చెప్తావు. మా పరిస్థితి అది. అప్పుడదే మహా భాగ్యం. ఇప్పుడిది ఆ శ్రమ ఫలితం. మీ ఇంటికొచ్చినప్పుడు మీ అమ్మగారు పెట్టే ఫలహారాలు, భోజనాలు మాత్రం ఇప్పటికీ మర్చిపోలేం. నువ్వేం చేస్తున్నావ్‌?’’
‘‘బెజవాడలో డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తున్నా’’.
‘‘సాధించావన్నమాట. స్వతంత్రం వచ్చింది. సంతోషమేగా’’.
‘‘ఏం సంతోషం? నేనిప్పుడు కమ్యూనిస్టువి.’’
‘‘జీసస్‌’’ ఒంటిమీద శిలువ గుర్తు చేసుకుంది థెరిసా. ఆమె కళ్ళలో భయం.
‘‘శారదా. కమ్యూనిస్టువా? అయ్యో ప్రభువా? శారదను కాపాడు తండ్రీ’’ కుర్చీ దిగి మోకాళ్ళ మీద కూర్చుని శారద కోసం రెండు నిమిషాలు ప్రార్థన చేసింది.
‘‘థెరిసా… డోంట్‌ బి ఫూలిష్‌. నేను ఎలా కనపడుతున్నాను?’’
‘‘మా తమ్ముడు చదువుకోమంటే కమ్యూనిస్టుల్లో కలిశాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. కమ్యూనిస్టులు రాక్షసులు. శారదా… ఒదిలెయ్‌ దాన్ని. నువ్వు మంచిదానివి. ప్రభువు నిన్ను రక్షించు గాక. పరలోకమందున్న ప్రభువా… నీ నామము స్మరింపబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. తండ్రీ శారదను కాపాడు.’’ ‘‘ప్రభువు రాజ్యానికీ మా రాజ్యానికీ తేడా లేదు థెరిసా?’’ ఇంతలో బెల్‌ కొట్టారు.
‘‘శారదా. ఇంక నువ్వు వెళ్ళు. నాకిప్పుడు క్లాసుంది’’. శారదను తోస్తున్నట్టే బైటికి నడిపించింది.
థెరిసా తరగతి వైపు, శారద గేటు వైపు నడిచారు. కాస్త దూరం నడిచాక బక్కెట్లు పట్టుకుని వెళ్తున్న ఐదారుగురు అమ్మాయిలు కనిపించారు. శారద వాళ్ళనాపి మాట్లాడిరచింది.
అప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు. గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద బాలికలే అక్కడ ఎంగిళ్ళెత్తి, ఊడ్చి, కడిగి, ముతక అన్నం చాలీ చాలకుండా తిని చదువుకుంటున్నారు.
వెరొనికా, థెరిసాలు దీని గురించి బాధపడుతున్నారు గానీ మార్చాలని ఎందుకు చూడటం లేదు. థెరిసాతో మాట్లాడాలనిపించింది. థెరిసా పాఠం చెబుతున్న హాలువైపు నడిచింది. కాస్త దూరం నుంచే థెరిసా కంఠం కంగున మోగుతోంది.
‘‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలుÑ మరి బావులు నూరిటికంటె నొక్కస
త్క్రతువది మేలుÑ తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు, త
త్సుత శతకంబు కంటె నొక సూసృత వాక్యము మేలు సూడగన్‌’’
అన్నిటికంటే సత్యం చెప్పటం మేలు చేస్తుంది. సూనృతమంటే సత్యం. నిజం అన్నమాట. శకుంతల దుష్యంతుడిని నిజం చెప్పమంటోంది. అన్నింటికంటే నిజం గొప్పదంటోంది. పైగా దుష్యంతుడిని సూనృత వ్రత అని పిలుస్తున్నది. సత్యాన్ని వ్రతంలాగా ఆచరించేవాడికి నిజం, నిజాయితీల గురించి శకుంతల చెప్పాల్సి వస్తోంది. అంటే శకుంతల నిజంగా సూనృతవ్రత అందా కోపంగా వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ అందా? మనకు తెలియదు. ఎవరు ఎలాగైనా అనుకోవచ్చుగా…
ఎవరో ఒక పిల్ల లేచి నిలబడిరది.
‘‘ఎవరు ఎలాగైనా అనుకుంటే ఎట్లా టీచర్‌? నిజం ఒకటే గదా.’’
శారద దిమ్మెరపోయింది? ఎవరీ పిల్ల? థెరిసా ఇట్లాంటి పిల్లను తయారుచేస్తోందా పాఠాలు చెప్పి.
థెరిసా నవ్వింది. ఆ పిల్లను కూర్చోబెట్టింది.
‘‘సత్యం ఒక్కటే ఉంది. దానికి చాలా నీడలుంటాయి. దీపం కింద నీడల్లాగానన్నమాట. మామూలు వాళ్ళు ఆ నీడలను నిజాలనుకుంటారు. దీపం దాకా వస్తేగాని సత్యం తెలియదు. నీడలతో కవులు, రచయితలు చాలా తమాషా ఆటలు ఆడతారు. మీకు బైబిల్‌ కథ ఒకటి చెప్తాను వినండి.’’
థెరిసా చెప్తుంటే ఎంతో బాగుందా కథ.
భారతం, బైబిల్‌ కలగలపి సత్యం ఒక్కటేనని థెరిసా చెప్తోంది. కమ్యూనిజం అంటే భయపడుతోంది. కమ్యూనిజమే సత్యమని థెరిసా ఎన్నటికీ గ్రహించలేదు. బైబిల్‌, మహాభారత, భాగవతాలు సత్యమని తను నమ్మదు. అన్నీ నీడలేనా? దీపం ఎక్కడుంది?
చూడు చూడు నీడలు
సూర్యునితో క్రీడలు
సూర్యునితో సూదులతో
క్రీడలాడు నీడలు.
అనే శ్రీ శ్రీ కవిత ఈ మధ్యే చదివింది గుర్తొచ్చి అది మనసులో తల్చుకుంటూ పాడుకుంటూ బైటికి నడిచింది.
స్కూల్లో హరిజన బాలికల స్థితిగతులు మార్చే విషయంపై థెరిసాకు ఉత్తరం రాయాలనుకుంది. ఒక్కరోజుతో మారే పద్ధతులు కావివి. వెరోనికాను చూడటానికి వెళ్ళాలి తప్పకుండా. టాక్సీ ఒకటి ఆపి త్యాగరాయ నగరులో కోటేశ్వరి ఇంటి చిరునామా చెప్పింది.
కోటేశ్వరి ఇంటిముందు ఒక నేపాలి ఘుర్కా కాపలా. లోపలి ఇల్లు కనపడనంత పెద్ద గేటు. సినిమా వాళ్ళ జీవితాల గురించి వింటూనే ఉంది గాబట్టి శారదకు ఆశ్చర్యమనిపించలేదు. చకచకా నడుచుకుంటూ వస్తున్న శారదను ఘుర్కా ఆపి, పేరు, ఊరు కనుక్కుని అక్కడున్న తోటమాలిని పిల్చి లోపలికి కబురు చెప్పమని పంపాడు. ‘సినిమా అంటే ఇదే’ అని నవ్వుకుంటూ నించుంది శారద. ఐదు నిమిషాలకు కోటేశ్వరి దాదాపు పరిగెత్తినట్లే వచ్చింది. తన చేతుల్లో ఆయాసపడుతున్న కోటేశ్వరిని సముదాయిస్తూ, ‘‘ఎందుకమ్మా ఇంత పరిగెడుతూ వచ్చావు. నేను వస్తూనే ఉన్నాగా. మెల్లిగా మెల్లిగా నడువు. నీ గుండె ఏంటిలా కొట్టుకుంటోంది. ముందు నువ్విక్కడ కూర్చో.’’ వాచ్‌మెన్‌ స్టూలు మీద కోటేశ్వరిని కూర్చోబెట్టింది. పల్స్‌ చూసింది. మెడ దగ్గర చేయిపెట్టి అక్కడ చూసింది. పర్సులో స్టెత్‌ వేసుకోనందుకు అయ్యో అనుకుంటూ తోటమాలిని మంచినీళ్ళు తెమ్మని పంపింది.
‘‘నీ పేరు వినగానే ఆగలేకపోయానమ్మా’’ కోటేశ్వరి కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నాయి.
‘‘నన్ను చూడాలంటే ఒక ఉత్తరం రాస్తే వచ్చేదాన్ని. లేదా నువ్వే కారెక్కి బెజవాడ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులుండే పని. నీ ఆరోగ్యం ఏమీ బాగున్నట్టు లేదు. నాతో పాటు బెజవాడ తీసుకుపోతాను. వస్తావా?’’ కోటేశ్వరి నవ్వి తన మీదకు ఒంగి పరీక్షిస్తున్న శారద బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంది. వంటమనిషి కాబోలు మంచినీళ్ళు తెచ్చింది. తాగి, స్థిమిత పడ్డాక మెల్లిగా లోపలికి నడిపించుకు వెళ్ళారు కోటేశ్వరిని. ఇల్లు పెద్దదే గానీ తీరూ తెన్నూ లేకుండా చిందరవందరగా ఉంది. ఆ ఇంటిని నాది అనుకుని పట్టించుకునే వాళ్ళెవరూ ఉన్నట్టు లేరు.
‘‘అందరూ షూటింగుకు పోయారు. బెంగుళూరు. నాలుగు రోజుల దాకా రారట. ఒక్కదాన్నే. నేనూ పోయేదాన్ని. ఒంట్లో బాగోలేదని ఒదిలేసి పోయారు.’’
‘‘అమ్మా. రాజ్యం నిన్ను బాగానే చూసుకుంటోందా?’’
‘‘నాకేమే. పాపం దానికి షూటింగులే షూటింగులు. తీరిక లేక కాని లేకపోతే వల్లమాలిన ప్రేమ నేనంటే. మీ స్నేహితురాలల్లే కాదు.’’ విశాలాక్షి ప్రస్తావనతో ఆమె ముఖం మారింది.
‘‘ఢల్లీి చేరిందిగా ఇప్పుడు. పెద్ద ఉద్యోగం అయిందట. అది బాగుండటమేగా నాకైనా కావలసింది’’ నిష్టూరంగా అంది.
‘‘విశాలాక్షిని ఈ మధ్య నేనూ చూడలేదు. నా ప్రాక్టీసు, పార్టీ పనులు… సరిపోతూనే ఉంది. అమ్మ నిన్నెప్పుడూ గుర్తు తెచ్చుకుంటుంది.’’
‘‘మీ అమ్మ దేవత గాని మామూలు మనిషా? బాగా చూసుకోమ్మా. నువ్వు కమ్మీనిస్టువైనావట గదా. మొన్నా మధ్య కమ్మీనిస్టులొచ్చి ఇక్కడ మద్రాసులో నాటకం వేశారులే. ఎంత బాగుందని. ‘మా భూమి’ అని, దాని ముందు ఏ నాటకమూ చాలదు. నువ్వు కూడా వస్తావు, కమ్మీనిస్టు నాటకం గదా అనుకున్నా. రాజారావుగార్ని కలిసి అడిగా కూడా మా శారదాంబ రాలేదా అని. రాలేదన్నాడు. అమ్మా శారదా. నాకు మళ్ళీ అట్టాంటి నాటకాలు ఆడాలనుందమ్మా.’’ ‘‘అలాగే ఆడొచ్చు. అసలు నువ్వొచ్చి మా వాళ్ళందరికీ నటించటం ఎట్లాగో నేర్పొచ్చు.’’ ‘‘ఛా! ఛా! నేను నేర్పేదేమిటీ… అచ్చం నిజం మనుషులల్లే స్టేజీ మీద వాళ్ళు కనపడగానే మన గుండెలు పట్టేస్తుంటేను. మొత్తానికి కమ్మినిస్టులు భలే పని చేస్తున్నారమ్మాయ్‌…’’
శారద మెల్లిగా కోటేశ్వరి జీవితం గురించి చిన్న చిన్న ప్రశ్నలడిగి ఆమె పరిస్థితి బాగానే ఉందని అర్థం చేసుకుని తృప్తి పడిరది.
‘‘శారదా. నాకో సమస్యుంది. నువ్వే ఒక దారిచెయ్యాలమ్మా.’’
‘‘ఏంటమ్మా’’ ఆమె అడిగిన తీరుకి శారదకి నవ్వొచ్చింది.
‘‘సినిమాల్లో నేనూ వేషాలేస్తూనే ఉన్నాగా. నా ఖర్చును నేను పెట్టుకోంగా దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా దాచిపెట్టుకున్నా. ఆ డబ్బు విశాలాక్షికీ ఇవ్వను. రాజ్యానికీ ఇవ్వను. వాళ్ళకవసరం లేదు. నా పొడంటే గిట్టని కూతురికి ఇస్తే అది తీసుకోకపోతే ఆ అవమానం భరించటం నావల్ల కాదు. ఇప్పటిదాకా పడిరది చాలు. రాజ్యానికి చాలా చేశాను. ఇంక అక్కర్లేదు. అప్పుడు నేను తెచ్చి మద్రాసులో ఎన్ని తిప్పలు పడి, ఎంతమంది చుట్టూ తిరిగితే ఇంతయింది! అది దానికీ తెలుసులే. అందుకని ఈ డబ్బు ఏం చెయ్యమంటావు. మీ నాన్న ఎన్నో మంచి పనులు చేశాడని అందరూ చెప్పుకుంటారు. నీకూ అవి తెలిసుంటాయి. నా చేత కూడా చేయించి నాకింత పుణ్యం సంపాదించి పెట్టు తల్లీ!’’ ‘‘చాలా మంచి పని చెయ్యగలవమ్మా. నీ దగ్గరున్న డబ్బు సగం బెంగుళూరు నాగరత్నమ్మ గారికివ్వు. ఇంకో సగం దుర్గాబాయికివ్వు. నీకు సంగీతమంటే ఇష్టం. త్యాగరాజస్వామి కోసం నాగరత్నమ్మ గారు ఎంతో చేస్తున్నారు. మనందరం ఆయనకు ఋణపడి ఉన్నాం. ఇక ఆడపిల్లల్ని పెంచావు. చదివించావు. కళలు నేర్పావు. దుర్గాబాయి ఆ పనే చేస్తోంది ఆంధ్ర మహిళా సభ పెట్టి. ఆ సభకిస్తే డబ్బు సార్థకమవుతుంది. నీకు పుణ్యం రావటమేంటి మోక్షమే దొరుకుతుంది.’’
‘‘నీ తెలివే తెలివి శారదా. బెంగుళూరు నాగరత్నమ్మ కచేరీలకు వెళ్ళాను కానీ నాకిట్టా చెయ్యాలనే అనిపించలా. ఎలాగైనా మా శారదమ్మ శారదమ్మే’’ శారద ముఖం నిమిరి తన కణతల మీద మెటికలు విరిచింది కోటేశ్వరి.
శారద భోజనం చేసేవరకూ వదల్లేదు. ఆ వంటమనిషి అన్నీ అరవ వంటలే చేసింది. శారదకు అలవాటు తప్పి సహించకపోయినా కోటేశ్వరి తృప్తి కోసం శుభ్రంగా పెట్టినవన్నీ తినేసింది. శారదను ఒదలటం కోటేశ్వరికి కష్టమైంది. ఆమె విశాలాక్షిని మర్చిపోలేకపోతోందని శారద అనుకుంది. సాయంత్రం కాఫీ తాగాక బలవంతాన విడిపించుకుని బైటపడిరది శారద. మద్రాసులో బంధువులు, స్నేహితులు అందరినీ కలవటం అసాధ్యం అని తెలిసిపోయి మర్నాడు ప్రయాణం పెట్టుకుంది.
నెహ్రుగారి ఇంటర్వ్యూ సంపాదించమని పదే పదే దుర్గాబాయితో చెప్పి బెజవాడకు ప్రయాణమైంది. శారద బెజవాడ తిరిగి వచ్చేసరికి ‘‘కంటికి కన్ను పంటికి పన్ను’’ మన విధానమని పార్టీ ప్రకటన బహిరంగంగా చూసేసరికి దుఃఖం వచ్చింది. ప్రతిపాదించింది ప్రతి హింసే… కానీ హింసను హింసతో ఎదుర్కొనే పరిస్థితా ఇది. కార్యకర్తల ప్రాణాలతో చెలగాటం కాదూ?
తెలంగాణా పోరాటం ఆంధ్రకు కూడా విస్తరించాలనే డిమాండ్‌తో మరో డాక్యుమెంటూ…
అదెలా కుదురుతుంది? అక్కడ రాచరిక వ్యతిరేక పోరాటం… ఇక్కడ పరిస్థితి వేరు. కానీ ఎవరితో చెప్పాలి? అందరూ రహస్య జీవితంలో ఉన్నారు. ఢల్లీి ప్రయాణంలో సేద దీరింది శారద. దుర్గ చాలా గంభీరంగా ఉంటుంది గానీ హాస్యాన్ని ఆనందిస్తుంది. దుర్గ పెదవులు ఆలోచనతో బిగించినట్టు ఉంటాయి. రెండు రోజులు రైల్లో దుర్గాబాయి చిరునవ్వును చూసే అదృష్టం కొందరికి కలిగిందంటే అది శారద పుణ్యమే. కాకినాడ కాంగ్రెస్‌ నుండీ ఇద్దరూ జ్ఞాపకాలు కలబోసుకున్నారు. సరస్వతి విజయవాడ వచ్చిన సంగతి శారద చెబితే విని దుర్గాబాయి సంతోషించింది. ‘‘సరస్వతి ఇంకా పెద్ద పనులు చేయాలి. పెద్ద సంస్థలు నడపాలి. నువ్వు కూడా శారదా… ఈ రాజకీయాలు వదిలెయ్‌. విద్య, ఆరోగ్యం… ఈ రెండూ స్త్రీలకు అందకుండా ఉన్నాయి. నేను ఆంధ్రమహిళా సభను చాలా విస్తరిస్తాను. స్త్రీలకు విద్యని దగ్గర చేస్తాను. వృత్తి విద్యలు, పరిశోధన వీటన్నిటిలో చాలా చేయాలి. అదే నా జీవితాశయం. నా సమస్త శక్తులూ దానికే ధారోస్తాను. నువ్వు ఆరోగ్యం విషయంలో అలాంటి పనిచెయ్యి. సంస్థలు స్థాపించు. నీ శక్తి దానిమీద పెట్టావో చాలా మార్పులు తేగలవు.’’
‘‘ఏమోనోయ్‌! సంస్థలు చాలా పరిమితంగా మార్పు తెస్తాయి. రాజకీయాలు పాలసీలను, చట్టాలను తెచ్చి దేశమంతా మారుస్తాయి కదోయ్‌. నేనక్కడ పని చెయ్యాలనోయ్‌. అది చేస్తూ ఇదీ చెయ్యవచ్చు నువ్వు చేస్తున్నట్లుగా. ముందు మా పార్టీ పరిస్థితి చూడాలి.’’
ఢల్లీి వెళ్ళిన మూడోరోజు నెహ్రుని కలవగలిగింది.
పదిహేను నిమిషాలే సమయం అన్నారు. విజ్ఞాపన పత్రంలోని విషయాన్ని, పది నిమిషాల్లో తను చెప్పదల్చుకుంది అంతా చెప్పేలా తయారు చేసుకుంది. దుర్గాబాయి శారద గురించి చెప్పటం వల్ల గానీ, ఆయన వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం వల్ల గానీ నెహ్రు ఆమెను చాలా గౌరవంగా ఆహ్వానించాడు. ‘‘మీ నాన్నగారిని గురించి చాలా విన్నాను’’ అన్నారు.
శారద మాట్లాడే తీరు, ఆమె ఆత్మ విశ్వాసం, తనను నిలదీసి అడిగిన పద్ధతీ నెహ్రు చిరునవ్వుతో గమనించటం శారద కూడా గమనించింది. ‘‘డాక్టర్‌! మీరు చెప్పినదంతా నిజమే. కానీ మీ పార్టీ ‘కంటికి కన్ను కంటికి పన్ను’ విధానం అనుసరించాలని నిర్ణయించుకున్నదని విన్నాను. అలాంటి పరిస్థితులలో నేను మీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏం చెప్పీ ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని ఒకటి అర్థిస్తున్నాను. మీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను పోరాట విరమణ చేస్తున్నట్లు ఒక్క ప్రకటన ఇచ్చేలా చేయండి. మీరడిగినవన్నీ నేను చేస్తాను.’’
‘‘మీరు ఈ నిషేధాలు, నిర్బంధాలూ ఆపేస్తున్నారని ప్రకటించండి. ప్రకటించటం కాదు, నిషేధం ఎత్తి వేయండి. పోరాట విరమణ జరుగుతుంది. మాలో కూడా చాలామంది పోరాట విరమణ కోరుతున్నాము.’’ నెహ్రు నవ్వారు.
‘‘అది నాకు తెలుసు. కానీ ముందు మీరు ప్రకటించకుండా ప్రభుత్వం దిగిరాదు. ప్రభుత్వాధినేతగా నేనా పని చెయ్యలేను.’’ ‘‘అర్థం చేసుకోగలను’’ నవ్వింది శారద.
‘‘మీ ధైర్యాన్ని, నిజాయితీని, నవ్వగలిగే స్వభావాన్ని మెచ్చుకోగలను గానీ, మీరడిగింది చేయలేను. కానీ డాక్టర్‌, స్వతంత్ర భారత నిర్మాణానికి మీలాంటి వాళ్ళు కావాలి. మీ ప్రాణాలు చాలా విలువైనవి. దేశానికి కావాలవి. జాగ్రత్త.’’
తనకిచ్చిన సమయం అయిపోయిందని శారద లేవబోయింది.
నెహ్రు ఆపి ‘‘ఆరోగ్య విషయాల్లో ప్రభుత్వ పాలసీల తయారీలో మీరు సహాయం చేయాలి’’ అన్నాడు. శారద స్త్రీల ఆరోగ్యం, శిశు మరణాల గురించి పది నిమిషాలు మాట్లాడి ‘‘మీరు ఒక్క పది పనులు ప్రభుత్వం నుంచి నిజాయితీగా చేస్తే మంచి మార్పు వస్తుంది’’ అంది.
‘‘ప్లీజ్‌ అవి నాకు రాసి పంపండి. ఆరోగ్య శాఖ మంత్రికీ పంపండి’’ అన్నాడు.
అరగంట తర్వాత శారద బైటికి వచ్చింది. దుర్గకు కృతజ్ఞతలు చెప్పి బైట పడిరది.
ఆరోగ్య విషయాల గురించి నెహ్రు ఆసక్తి గురించి దుర్గకి చెబితే ‘‘నే చెప్పలేదా? నువ్వు ఆరోగ్యం మీద కేంద్రీకరించి పని చెయ్యాలి’’ అంది దుర్గ.
వచ్చిన పని అయినట్లూ కాదు, కానట్లూ కాదు. ఇది చెబితే పార్టీ ఏమంటుందో. పార్టీ అంగీకారం లేకుండా, అనుమతి తీసుకోకుండా నెహ్రుని కలవటం మామూలు విషయం కాదు. కానీ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న నాయకత్వం నంచి అనుమతి అంట ేఅది ఇప్పట్లో జరగదు. ఆ లోపల ఏం జరుగుతుందో, ఎవరి ప్రాణాలు పోతాయో అనుకుంది.
ఢల్లీిలో వచ్చిన పని అనుకున్నట్లు కాకపోయినా అయిపోయింది. విశాలాక్షి రెండేళ్ళనుంచీ ఢల్లీిలోనే ఉంటోందని శారదకు తెలుసు. వెళ్ళి ఒకసారి చూద్దామా అని మనసు పీకింది. చిన్ననాటి స్నేహాలు చిత్రమైనవి. వాళ్ళెలా ఉన్నా వాళ్ళను వాళ్ళలాగే ఆమోదించి ప్రేమించగలగటం ఆ స్నేహంలోని విచిత్రం, అందం. దుర్గని అడిగితే విశాలాక్షి అడ్రస్‌ సంపాదించింది.
ముందుగా ఫోన్‌ చేసి వెళ్తే మంచిదనీ, లేకపోతే ఒకోసారి ఆఫీసర్లు మంత్రులతో, మీటింగులతో చాలా ఆలస్యంగా ఇళ్ళకొస్తారనీ దుర్గ చెబితే శారదకు నవ్వొచ్చింది, సంతోషమూ కలిగింది. విశాలాక్షి తన చిన్ననాటి స్నేహితురాలు, తను అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్ళే స్థాయికి ఎదిగింది అని నవ్వుకుంది. అసలు అపాయింట్‌మెంట్‌ ఇస్తుందో ఇవ్వదో అని మరికాస్త నవ్వుకుంది.
శారద ఫోన్‌ చేస్తే విశాలాక్షి ఒక పట్టాన దొరకలేదు. దొరికిన తర్వాత మాత్రం ఉబ్బితబ్బిబ్బయింది. సాయంత్రం తనే వచ్చి కారులో ఇంటికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరగా వస్తాననీ చెప్పింది.
ఆ పగలు శారద బంధువులను చూసే పని పెట్టుకుంది. శారద వచ్చిందని తెలిసిన ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రముఖులు ఫోన్లు చేసి తమ ఇళ్ళకు ఆహ్వానించారు. ఇంత హడావుడిలో శారద మనసు మాత్రం విశాలాక్షి కోసమే కొట్టుకుంటోంది. సాయంత్రం ఆరు గంటలకు విశాలాక్షి కారు వచ్చింది. విశాలాక్షి కారులోనే ఉండి డ్రైవర్‌ను పంపింది శారదను తీసుకు రమ్మని. శారదను కారులోకి లాక్కుంది విశాలాక్షి.
‘‘ఎన్నేళ్ళయింది శారదా నిన్ను చూసి’’
‘‘పదేళ్ళనుకుంటా. ఎలా ఉన్నావోయ్‌?’’ విశాలాక్షి అందంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉందని తెలుస్తూనే ఉన్నా అడిగింది.
‘‘నాకేం. దివ్యంగా ఉన్నా. ఢల్లీి జీవితం నాకు బాగా నచ్చింది. మన పనేమో, మనమేమో. పట్టించుకునే వారుండరు. అత్తమామలు ఇక్కడికి రారు కాబట్టి ఇంటికి నేనే రాణి. మా ఆయనకంటే నాకే పెద్ద హోదా తెలుసా. పోయిన నెలలోనే పెరిగింది. పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుతున్నారు. ఎక్కడో తెలుసా? డూన్‌ స్కూల్లో… ఊహించగలవా? విశాలాక్షి పిల్లలు డూన్‌ స్కూల్లో. చాలా బాగా చదువుతున్నారు. అన్నపూర్ణ ఎలా ఉంది? మీరు వేరు వేరు పార్టీలు కదా… స్నేహం ఉందా? పోయిందా?’’ శారద సమాధానాల కోసం ఆగకుండా విశాలాక్షి మాట్లాడుకుంటూ పోతోంది.
శారదకు చాలా సంతోషమనిపించింది. విశాలాక్షి ఇల్లు పెద్దది. చాలా బాగా అమర్చుకుంది. నౌకర్లు ఆమెకేది కావాలో తెలిసినట్టు చెప్పకముందే అన్ని పనులూ చేస్తున్నారు.
పిల్లల ఫోటోలు చూపించింది.
పెద్దవాడికి ఈ సంవత్సరంలో అయిపోతుంది. ఇంగ్లండ్‌ పంపిద్దామా అనుకుంటున్నాను. వాడికీ నాలాగే ఎకనమిక్స్‌ అంటే ఇష్టం. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సీటొస్తే అదృష్టవంతుడు. ఇదుగో నా కూతురు మధులత. దీనికి చదువు అంటే తలనొప్పి. బొమ్మలు గీస్తుంది, వయొలిన్‌ వాయిస్తుంది, నాటకాలు రాస్తుంది, వేస్తుంది. సూల్లో అందరిలో మధు పేరు మారుమోగిపోతుంది కానీ మార్కులు మాత్రం బొటాబొటిగా వస్తాయి. దాన్నేం చెయ్యాలో నాకు తెలియటం లేదు.’’
‘‘ఆ పిల్లకిస్టమైన కళలో పండితురాలవుతుందిలే. స్వేచ్ఛగా వదిలెయ్‌’’
‘‘ఏమో… నాకా కళలు, గిళలు వద్దనిస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అక్కడా మంచి భవిష్యత్తు కనపడుతోంది. మీ అమ్మాయి ఏం చేస్తోంది?’’
‘‘బడికి వెళ్ళనని మారాం చేస్తుంటుంది. మా అమ్మ గారాబంతో మరీ అల్లరిదైపోతోంది.’’
‘‘మీ అమ్మెలా ఉందే? నాకు చూడాలని ఉంది? చిన్నప్పటినుంచీ ఎంత బాగా పలకరించి ఏవేవో తినటానికి పెట్టి ఎంత ప్రేమగా ఉండేవారో.’’
‘‘మా అమ్మ బాగుంది. వయసు పెరుగుతోందిగా. పూర్వంలా తిరిగి పని చెయ్యలేక పోతున్నానని బాధపడుతుంటుంది. నేను ఈ మధ్య మీ అమ్మను చూశాను విశాలా’’
విశాలాక్షి ముఖం ఒక్కసారి ఉదాసీనమై పోయింది.
‘‘ఒక్కసారి వెళ్ళి అమ్మను చూడరాదా? లేదా ఆమెను పిలిపించి నీ హోదా, వైభవం చూపరాదా?’’
‘‘ఆమె కూడా సిరిసంపదలతో తులతూగుతోందిగా. ఈ రోజుల్లో సినిమా తారలకున్న పేరు ముందు మాలాంటి ఆఫీసర్ల హోదా ఎంత? నేవెళ్ళి చూడకపోతే ఆమెకు లోటేమీ లేదులే…’’
‘‘చాలా లోటు. నీ కోసం ఆమె మనసులో ఎంత బెంగ గూడుకట్టుకొని ఉందో తెలుసా? నా మాటవిని ఒక్కసారి వెళ్ళి చూడు…’’ ‘‘వెళ్తే వెళ్తాలే. చాలా ఆస్తి సంపాదించిందిగా మా అమ్మ కూడా. అంతా ఆ పెంపుడు కూతురికేనా? కన్నకూతురికేమైనా ఇస్తుందటనా?’’ శారద ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
‘‘ఆమె డబ్బు నువ్వు తీసుకుంటావా?’’
‘‘ఎందుకు తీసుకోను? ఆమె రక్తం నాలోంచి తీసెయ్యగలనా? ఆమె డబ్బు మాత్రం ఎందుకు ఒదులుకోవాలి.’’ శారదకు మనసంతా చేదైంది. ఇన్నాళ్ళూ విశాలాక్షి ఆత్మగౌరవం అనే భ్రమలో, తన కులవృత్తికి దూరంగా వెళ్ళాలనే కోరికతో తల్లికి దూరమైందనీ, ఆమె ప్రిన్సిపల్స్‌ ఆమెకున్నాయనీ అనుకుంది. డబ్బు ముందు ఏ ప్రిన్సిపల్స్‌ పనిచెయ్యవని విశాలాక్షి చెబుతోంది.
అమ్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటానికి పనికిరాని రక్తం అమ్మ ఆస్తి పొందడానికి లాజిక్‌లా పనికొచ్చింది.
‘‘మీ అమ్మ తన ఆస్తి నీకివ్వదు’’
‘‘ఆ సినిమా తారకే ధారపోస్తుందా?’’
‘‘లేదు. ఎవరికీ ధారపోయటం లేదు. సగం బెంగుళూరు నాగరత్నమ్మకి ఇస్తోంది. సగం ఆంధ్ర మహిళా సభకు ఇస్తోంది.’’
విశాలాక్షి ముఖంలో రంగులు మారాయి.
‘‘తనిష్టం వచ్చినట్టు చేసుకోనియ్‌ శారదా. ఇంక మా అమ్మ గురించి మాట్లాడకు. ఒదిలెయ్‌. నేను తల్లీదండ్రీ లేని అనాధను. అలాగని గుండె రాయి చేసుకున్నాను. మళ్ళీ దాన్ని రేపకు.’’
పమిట చెంగుతో ముఖం దాచుకుని ఏడ్చేసింది విశాల.
అమ్మ కోసమా? డబ్బు కోసమా? అర్థం అయ్యి కానట్లుంది శారదకు. మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం తేలిక కాదు. విశాల అచ్చంగా డబ్బు కోసమే ఏడవటం లేదేమో. డబ్బు ఒక లింకు అనుకుందేమో. అది కూడా తెగిందని ఏడుస్తోందేమో. తల్లిని ప్రేమించకుండా ఉండటం కష్టం. విశాల మనసు ఎంత కష్టపెట్టుకుని తల్లికి దూరమయిందో. కులం, కుల వృత్తులు మొత్తం మానవ సంబంధాలన్నింటినీ ఏదో ఒక రకంగా శాసిస్తున్నాయి. తానీ బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల ఇలా ఉంది. అందులోనూ రామారావు వంటి తండ్రికి పుట్టడం వల్ల తన జీవితం ఇలా సాగింది. లేకపోతే ధనలక్ష్మి, తన చిన్ననాటి నేస్తం, బాల్య వివాహం బలి తీసుకున్న స్నేహితురాలు. అలా తనూ చచ్చిపోయేదేమో, చచ్చిపోకపోయినా పదిహేనేళ్ళకు తల్లయి ఈపాటికి మనవలతో, మనవరాళ్ళతో మడి గట్టుకుని వంటింట్లో మగ్గేదేమో. తన తండ్రి తననా దురదృష్ట జీవితం నుంచి తప్పించాడు. విశాల… పాపం తనంత తాను కష్టపడవలసి వచ్చింది. కులాన్ని కాదనుకుంది. తల్లిని కాదకుకుంది. కావలసింది సాధించుకుంది. విశాల అనుభవించిన వేదన ఎంతో తను కొలవటం అసాధ్యం, అనవసరం. విశాల లేచి లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి మళ్ళీ మాటల్లో పడిరది.
శారదకు భోజనం ఏర్పాట్లు కూడా ఆర్భాటంగానే చేయించింది. విశాల భర్తను పెళ్ళిలో తప్ప శారద చూడలేదు. అతను శారదకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత శారదను దుర్గ ఇంట్లో దించి వెళ్ళింది విశాల. శారద వచ్చేసరికి దుర్గ పడుకోలేదు. పెద్ద పెద్ద పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ, నోట్సు రాసుకుంటూ ఉంది.
‘‘ఎలా ఉంది మీ స్నేహితురాలు’’ ఏ మాత్రం అలసట లేకుండా ప్రశ్నించింది.
‘‘మా విశాల బాగుంది. దాని జీవితాన్నీ, నా జీవితాన్నీ పోల్చి చూసుకుంటే నాకు కొత్త విషయాలెన్నో తోస్తున్నాయి. నేను, నువ్వు, విశాల ముగ్గురం ఆధునిక స్త్రీలమే… కానీ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ముగ్గురం మూడు విధాలుగా సంప్రదాయాలను ధిక్కరించాం. విశాల పెళ్ళి కోసం తల్లినీ, కులాన్నీ కాదనుకుంది. నేను కులాన్ని ధిక్కరించిన కారణం వేరు. విశాల దృష్టిలో నాది పెళ్ళి కాదు. నువ్వు దేశం కోసం భర్తకు వేరే పెళ్ళి చేశావు. ముగ్గురం చదువుకున్నాం. నేను కింది వర్గం ప్రజలతో బాగా కలిసిపోయా. నువ్వింకో విధంగా స్త్రీలకు అంకితమవుతున్నావు. విశాల ప్రజల గురించి ఎంత ఆలోచిస్తోందో తెలియదు. అన్నపూర్ణ మరో విధంగా ఆధునికతలోకి వచ్చింది. అసలు అధునికత అంటే ఏమిటి? సంప్రదాయాన్ని కాదనటమే ఆధునికతా? ఎవరి ఆధునికత వారిదేనా? దాని ఫలితమేంటి? ప్రయోజనమేంటి? సంప్రదాయం ధిక్కరించటం అంటే ఒక్కొక్కరికీ ఒక్కో పద్ధతే కదా. వీటన్నిటికీ కులమేనా మూలం.
ఆధునికత కోసం జరిగిన సంస్కరణల మూలాలన్నీ కులాన్ని బట్టే అక్కడే ఉన్నాయనిపిస్తోంది. అసలు మన దేశంలో ఇవన్నీ బ్రిటిష్‌ పాలన వల్ల జరగవలసిన రీతిలో జరగటం లేదనిపిస్తోంది దుర్గా. మనం ఆధునికత అనుకుంటున్న దానిలో ఎంత సంప్రదాయం కలగలసి ఉందో ఆలోచిస్తే మతిపోతోంది. రెండిరటిలోనూ సమస్యలున్నాయి. రెండిరటిలోనూ విలువల పతనం ఉంది, ఉత్థానం ఉంది. స్త్రీల సమస్యలకు ఏదీ పరిష్కారం కాదనిపిస్తోంది. ముఖ్యంగా కులాలుగా విడిపోయి ఉన్న స్త్రీలకు… ఈ రెండిరటినీ ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబెట్టకుండా, సింపుల్‌గా చూడకుండా ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలేమో. మార్పు ముఖ్యం. మార్పు వస్తోంది. మనం అనుకున్నట్లు కాకపోవచ్చు. స్త్రీలు మార్పు తేవాలి. మార్పుకి గురయ్యే వారిగా మాత్రమే మిగిలిపోకూడదు. ఇది చాలా పెద్ద విషయం. మన జీవితాన్ని కఠిన పరీక్షలకు గురిచేసే విషయం…’’ శారద అలిసిపోయినట్లు ఆగిపోయింది.
‘‘నేస్తురాలి ఇంటికెళ్ళి విందు భోజనం చేసి వస్తానుకుంటే ఇలా తలనిండా ప్రశ్నలు నింపుకొచ్చావా? ఈ ప్రశ్నలే శారదా మన ఆధునికతకు గుర్తు. మనమున్న స్థితినుంచి మనల్ని మార్చేది ఈ ప్రశ్నలే. స్త్రీలుగా మనం ఈ మార్పు వల్ల ఏమైపోతున్నాం, మనకేం జరుగుతోంది అనేది గమనించుకోకపోతే నిరంతరమైన మార్పులో ఆనవాళ్ళు లేకుండా కొట్టుకుపోతాం. మనం ఎందుకు బయల్దేరామో కూడా అంతుబట్టని అయోమయంలో కూరుకుపోతాం. కులం చాలా ముఖ్యం మన దేశంలో. రాజ్యాంగంలో దాని గరించి అంబేద్కర్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళెందరో. స్త్రీ, పురుషులు సమానమంటే ముఖం చిట్లించేవారు కూడా ఉన్నారు మా సభలో. ఇక కులాలు, హరిజనులు అంటే వాళ్ళకి ఒంటికి కారం రాసుకున్నట్టే. వాళ్ళందరినీ ఒక దారికి మళ్ళించటానికి అంబేద్కర్‌ ఎంత శ్రమ పడుతున్నారో. ఆయనకు ఉడతా సాయం మాలాంటి వాళ్ళం. నెహ్రు కల మన రాజ్యాంగం గొప్పగా ఉండాలని. అది అంబేద్కర్‌ వల్లే ఔతుందని ఆయన విశ్వాసం’’
ఆ ఇద్దరి మాటల మధ్య ఎప్పుడు తెల్లవారిందో వాళ్ళకు తెలియదు. ఈ ప్రయాణ విషయాన్ని నాయకులకు ఎలా చేరవేయాలా అని ఆలోచిస్తూ శారద బెజవాడ వచ్చింది. బెజవాడ రాగానే తాను నెహ్రుని కలిసిన విషయం ఒక ఉత్తరంలో రాసి, ‘‘కంటికి కన్ను పంటికి పన్ను’’ నినాదానికి, ఆ కార్యక్రమానికి తనకు అభ్యంతరాలున్నాయనే విషయాన్ని మరో ఉత్తరంలో రాసి అగ్రనాయకులకు అందేలా వాటిని పంపింది. కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి వ్యతిరేకంగా మహిళా సంఘం చేయాల్సిన ప్రదర్శనకు సంబంధించిన పనులు శారద కోసం ఎదురు చూస్తున్నాయి.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.