విమర్శనాత్మక చైతన్యానికి స్త్రీవాద అధ్యయనాలు కీలకం! -బెల్‌ హుక్స్‌

(గత సంచిక తరువాయి…)
అనువాదం: ఎ.సునీత
స్త్రీ వాద అధ్యయనాలు, స్త్రీ వాద సాహిత్యం అభివృద్ధి చెందే ముందు స్త్రీ వాదం గురించి అందరూ చిన్న చిన్న బృందాలలో నేర్చుకున్నారు. ఆయా స్త్రీలు సెక్సిజం విశ్లేషణ, పితృస్వామ్యాన్ని ఎదుర్కొనే ఎత్తుగడలు, అలాగే స్త్రీ పురుషులు కొత్తరకమైన సాంఘిక ప్రవర్తన ఏర్పరచుకోవడం అన్నీ కలగలిపి స్త్రీ వాద సిద్ధాంతాన్ని తయారుచేశారు. మనం జీవితంలో చేసే ప్రతిదానికీ సిద్ధాంతంలో మూలాలుంటాయి. మన ప్రతి ఆలోచన, ప్రతి చర్య వెనక ఉండే కారణాలను మనం తర్కబద్ధంగా వివరించలేకపోయినా అంతర్లీనంగా మన ఆలోచన, మన ఆచరణలని వ్యవస్థ రూపుదిద్దుతూనే ఉంటుంది.

స్త్రీ వాద సిద్ధాంతం మొదటి దశలో సెక్సిస్టు ఆలోచనా విధానం ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కొని మార్చాలి అన్న విషయం స్త్రీలు, పురుషులకి చెప్పటం దాని లక్ష్యంగా ఉండేది. ఆ రోజుల్లో మమ్మల్ని తల్లి తండ్రులు, సమాజం సెక్సిస్టు ఆలోచనా రీతుల్ని ఒప్పుకునేటట్లు తీర్చిదిద్దేవాళ్ళు. మాకు మా ఆలోచనల మూలాల్ని అర్థం చేసుకునే సమయం లేకపోయింది. స్త్రీ వాద సిద్ధాంతం, ఆచరణ మమ్మల్ని అలా ఆలోచించుకునేందుకు పురికొల్పింది. మొదట్లో ప్రత్యక్షంగా నోటి మాట ద్వారా, నెమ్మదిగా న్యూస్‌ లెటర్ల ద్వారా లేక కరపత్రాల ద్వారా స్త్రీ వాద సిద్ధాంతం ఒకరి నుండి ఒకరికి తెలిసేది. ఆ క్రమంలో స్త్రీలే రాసి, ముద్రించి, మార్కెటింగ్‌తో సహా అన్ని స్థాయిల్లో పుస్తక ఉత్పత్తిని నియంత్రించే స్త్రీ వాద ప్రచురణ సంస్థలు అభివృద్ది అవ్వటం స్త్రీ వాద ఆలోచనా వ్యాప్తికి తోడ్పడిరది. నేను 1970లో రాసిన ‘నేను స్త్రీని కాదా’ అన్న పుస్తకాన్ని 1981లో ప్రచురించిన సౌత్‌ ఎండ్‌ ప్రెస్‌ ఒక చిన్న సోషల్‌ కలెక్టివ్‌. దానిలో సగం మంది స్త్రీ వాదులు. సభ్యులందరూ సెక్సిజాన్ని వ్యతిరేకించేవాళ్ళే.
సమకాలీన స్త్రీ వాదం అత్యంత విజయవంతంగా చేసిందేమిటంటే కావాల్సినంత స్త్రీ వాద సాహిత్యాన్ని ఉత్పత్తి చేసి, స్త్రీల చరిత్రని వెలికి తియ్యాలనే డిమాండును విస్తృతంగా వ్యాప్తి చెయ్యటం. సాహిత్య రచనల్లో కావచ్చు, ఎకడమిక్‌ రంగంలో కావచ్చు, అన్ని చోట్లా జెండర్‌ వివక్ష కారణంగా స్త్రీలు చేసిన రచనలని పక్కన పెట్టెయ్యటం, లేదా వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవటం జరుగుతూ వచ్చింది. పాఠ్యాంశాల్లో ఈ పక్షపాతాన్ని స్త్రీ వాద ఉద్యమం బహిర్గతం చేసిన తర్వాత ఇటువంటి మరిచిపోయిన, పక్కన పడేసిన స్త్రీల రచనలు, పనినంతా వెలికి తియ్యటం జరిగింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో స్త్రీ వాద అధ్యయనాలని నెలకొల్పటంతో స్త్రీ కేంద్రిత పరిశోధన వ్యవస్థీకృతమైంది. నల్ల జాతి అధ్యయనాల లాగే, స్త్రీ వాద అధ్యయనాలు కూడా జెండర్‌, స్త్రీల గురించి పక్షపాతం లేకుండా తెలుసుకోవటానికి కేంద్రాలయ్యాయి.
చాలామంది అపోహ పడినట్లు, స్త్రీ వాద అధ్యయనాల ప్రొఫెసర్లు తరగతి గదుల్లో మగవాళ్ళు రాసిన రచనలని చింపి పోగులు పెట్టరు. స్త్రీలు చేసే రచనలు, పని కూడా అంతే ఆసక్తికరంగా
ఉంటుందని, కొన్నిసార్లు పురుషుల పని, రచనల కన్నా బాగుంటుందని ఎత్తి చూపిస్తూ ఇప్పటివరకు ఆయా శాస్త్ర రంగాల్లో ప్రబలిపోయిన సెక్సిస్టు ఆలోచనా రీతులని బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తారు. పురుషులు చేసిన గొప్ప సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు కళాత్మకతని అంచనా వేసే పద్ధతుల్లోనే పక్షపాత ధోరణులున్నాయని చూపిస్తారు. పురుషులు చేసిన పని, రచనలకి ప్రాధాన్యం ఇవ్వని లేదా అసందర్భమని పక్కన పెట్టేసిన స్త్రీల అధ్యయన కోర్సులని నేనిప్పటి వరకూ చూడలేదు, తీసుకోలేదు. అట్లాంటి కోర్సుల గురించి నేను వినలేదు కూడా. మగవాళ్ళతో నిండిపోయిన గొప్ప పరిశోధకులు, సాహిత్య రచనల సిద్ధాంత సంహితాలని (కేనన్‌) స్త్రీ వాద విమర్శకులు జెండర్‌ పక్షపాతముందని విమర్శించటం మాత్రమే నాకు తెలుసు. ఇటువంటి విమర్శ చెయ్యటం వల్లే స్త్రీలు చేసిన పని, రచనలని వెలికి తీసి, వాటికి కూడా మేధో రంగంలో స్థానం ఏర్పరచటానికి, స్త్రీల గురించి స్త్రీలు కొత్త పరిశోధనలు చేయడానికి అవకాశం ర్పడిరది.
స్త్రీ వాద ఉద్యమం మేధో రంగం, పరిశోధనా రంగం, విద్యా రంగాల్లో అడుగుపెట్టిన తర్వాత వేగం పుంజుకుంది. దేశంలో ప్రతి చోటా యువతీ యువకులకు స్త్రీ వాద ఆలోచన, సిద్ధాంతాల గురించి తెలుసుకుని తమ పరిశోధనల్లో వాడుకోవటానికి అవకాశం ఏర్పడిరది. నేను గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ విద్యార్థినిగా ఉన్నప్పుడు స్త్రీ వాద ఆలోచన గురించి తెలుసుకోవటంతో అప్పటికి పెద్దగా ఎవరూ చదవని నల్లజాతి రచయిత్రి టోనీ మారిసన్‌ గురించి నేను రాయగలిగాను. నల్ల జాతి స్త్రీల రచనల గురించి, రచయిత్రుల గురించి స్త్రీ వాద ఉద్యమం రాక ముందు చాలా తక్కువ పరిశోధన జరిగింది. ఆలిస్‌ వాకర్‌ కొంత పేరు ప్రతిష్టలు పొందిన తర్వాత జోరా నెయిల్‌ హుర్స్టన్‌ రచనలని వెలుగులోకి తీసుకురావటానికి పనిచేశారు. దీంతో త్వరలోనే హుర్స్టన్‌ అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నల్ల జాతి స్త్రీల రచయితలలో ఒకరిగా పరిణమించారు. పాఠ్యాంశాలలో, బోధనా రీతుల్లో జెండర్‌ పక్షపాతాన్ని అంతం చెయ్యాలన్న స్త్రీ వాద విప్లవం గతంలోనూ, ఇప్పుడూ కూడా స్త్రీలు చేసిన మేధో పరమయిన, ఇతర పనిని గుర్తించాలి, గౌరవించాలనే స్పృహని కలిగించింది.
స్త్రీల అధ్యయనాలని వ్యవస్థీకృతం చెయ్యటంతో స్త్రీ వాదం గురించి అందరికీ తెలియటం మొదలయింది. ఈ అధ్యయన కేంద్రాలు జెండర్‌ గురించి సమాజమిచ్చిన ఆలోచనలని మార్చుకోవడానికి అనేక మందిని సాధికారికంగా ఒక దగ్గరికి తెచ్చాయి. ఈ తరగతులకు వచ్చిన విద్యార్థులు స్త్రీ వాద ఆలోచన గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు. ఈ తరగతి గదుల్లోనే మాకు రాజకీయ మేలుకొలుపు జరిగింది. నేను నా ఇంట్లో పితృస్వామ్య ఆధిపత్యాన్ని ధిక్కరించి స్త్రీ వాదాన్ని వెతుకుతున్నాను. అయితే కేవలం అణచివేతకి, దోపిడీకి గురయినంత మాత్రాన, దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన ఆ వ్యవస్థ ఎందుకుందో, దాన్ని ఎలా మార్చాలో అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కాలేజీలో చేరే ముందే నేను స్త్రీ వాదిగా మారిపోయాను కానీ తరగతి గదిలో మాత్రమే నేను స్త్రీ వాద ఆలోచన, సిద్ధాంతాన్ని నేర్చుకున్నాను. అక్కడే నాకు విమర్శనాత్మకంగా ఆలోచించి, నల్ల జాతి స్త్రీల అనుభవాన్ని గురించి రాయటానికి ప్రోత్సాహం లభించింది.
1970లలో స్త్రీ వాద ఆలోచన, సిద్ధాంత సృష్టి స్త్రీలంతా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకుంటూ, భావాలను చర్చించుకుంటూ, పరీక్షించుకుంటూ, తిరగి మార్చుకుంటూ ఉన్న క్రమంలో జరిగిందే. నల్ల జాతి స్త్రీలు, ఇతర రంగు స్త్రీలు జాత్యాహంకార భావనలు కూడా స్త్రీ వాద ఆలోచనలను ప్రభావితం చేశాయని, తెల్లజాతి స్త్రీల అనుభవాన్ని మాత్రమే స్త్రీల అనుభవం అనటం తప్పని ఎత్తి చూపించినప్పుడు మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ, క్రమేణా స్త్రీ వాద సిద్ధాంతం మారింది. లోతైయిన పునరాలోచన చెయ్యకుండానే చాలా మంది తెల్లజాతి స్త్రీలు తమ పక్షపాత ధోరణులని గుర్తించటానికి ఒప్పుకున్నారు. అయితే అది కూడా ఆహ్వానించదగ్గ పెద్ద మార్పే. 1980ల చివరికొచ్చేటప్పటికి వర్గ పరమైన, జాతి పరమైన విభేదాల గురించి మాట్లాడని స్త్రీ వాద రచనలు చాలా అరుదయిపోయాయి. స్త్రీ వాద సంఫీుభావ స్ఫూర్తికి, ఉద్యమానికి నిబద్ధులయిన అనేక మంది స్త్రీ వాద మేధావులు స్త్రీల జీవిత వాస్తవాలను ప్రతిబింబించే సిద్ధాంత రచనలు చేయటానికి పూనుకున్నారు.
స్త్రీ వాద ఆలోచనకు విద్యారంగమిచ్చిన సాధికారత చాలా ముఖ్యమైనదే కానీ దాని వల్ల కొత్త సమస్యలొచ్చాయి. ఆచరణ, సిద్ధాంతంలో నుండి వచ్చిన స్త్రీ వాద ఆలోచన కంటే అమూర్తమయిన భాషా సిద్ధాంతం నుండి వచ్చిన స్త్రీ వాద సిద్ధాంతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దానికో కొత్త పరిభాష తయారయింది. అది మేధావుల కోసం మేధావులు తయారు చేసుకున్న పరిభాష, రాసుకున్న సిద్ధాంతం. స్త్రీ వాద సిద్థాంత కర్తల్లో పెద్ద భాగం ఒక కులీన బృందగా తయారై చాలా కొద్దిమందికి మాత్రమే అర్థమయ్యే సిద్ధాంతాన్ని పనిగట్టుకొని రాసుకోవటం మొదలయింది.
మేధో రంగంలో లేని స్త్రీలు, పురుషులని స్త్రీ వాద సిద్ధాంతానికి పాఠకులుగా పరిగణించబడటం తగ్గిపోయింది. స్త్రీ వాద
ఉద్యమానికి, స్త్రీ వాద ఆలోచనకి లంకె తెగిపోయింది. అకడమిక్‌ రాజకీయాలు, పదవీ కాంక్ష స్త్రీ వాద రాజకీయాల కంటే ప్రధానమైపోయాయి. విశ్వవిద్యాలయాల ఘెట్టోలో స్త్రీవాద సిద్ధాంతం బందీ అయిపోయింది. విస్తృత ప్రపంచంతో దాని లంకె తెగిపోయింది. ఎంత అద్భుతమయిన సిద్ధాంతం అక్కడ ఉత్పన్నమయినా అది విస్తృత ప్రజానీకానికి చేరటం తక్కువయిపోయింది. స్త్రీ వాద సిద్ధాంతం అకడమిక్‌గా మారిపోయిన ఫలితంగా అది రాజకీయ స్ఫూర్తిని పోగొట్టుకుని స్త్రీ వాద ఉద్యమాన్నే నీరుగారుస్తోంది. రాడికల్‌ స్ఫూర్తిని కోల్పోయిన స్త్రీల అధ్యయనాలు, జెండర్‌ మీద దృష్టి తప్పిస్తే, యూనివర్శిటీల్లో జరిగే ఇతర సామాజిక శాస్త్ర అధ్యయనాల్లాగే తయారయ్యాయి.
ప్రజానీకానికి, ఆయా వ్యక్తులకి స్త్రీ వాద సిద్ధాంతం, రాజకీయాలు అర్థమవడానికి ఉపయోగపడే రచనలు వివిధ రూపాల్లో, శైలుల్లో రాయాల్సి ఉంటుంది. యువ సంస్కృతికి అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఇటువంటి రచనలు అకడమిక్‌ చట్రాల్లో పనిచేసేవాళ్ళు ఎవరూ చెయ్యట్లేదు. ఇప్పటికే సంప్రదాయ వాదుల దాడులకు గురవుతున్న స్త్రీ అధ్యయన కేంద్రాలని వాటి ఖర్మకి వాటిని వదిలెయ్యకుండా వాటిని మార్చి కమ్యూనిటీల అవసరాలకి అనుగుణంగా రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. విస్తృత ప్రజానీకానికి అవసరమయిన స్త్రీ వాద ఉద్యమం రూపొందించటానికి (మత సంస్థలలో పనిచేసే వాళ్ళు చేసినట్లు) ఇంటింటికీ వెళ్ళి స్త్రీ వాదమంటే ఏమిటో వివరించగలిగితే ఎంత బాగుంటుంది?
సమకాలీన స్త్రీ వాద ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు పిల్లల పుస్తకాల్లో సెక్సిజంని విమర్శించటం జరిగింది. ‘విముక్తులయిన పిల్లల కోసం’ పుస్తకాలు రాయటం జరిగింది. మనం కొంచెం జాగ్రత్త వహించటం మానెయ్యగానే మళ్ళీ అక్కడికి సెక్సిజం తిరిగి వచ్చేసింది. విమర్శనాత్మక చైతన్యం పెంపొందించటం కోసం అవసరమయిన స్త్రీ వాద విద్య పెరగాలంటే దానికి పిల్లల సాహిత్యాన్ని మార్చటం అత్యంత కీలకం. పిల్లల ఆట స్థలాల్లో అత్యంత సంకుచితమయిన జెండర్‌ విభజనలు సర్వ సాధారణం. సార్వజనిక విద్యా రంగం (పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌) మన స్త్రీ వాద కార్యకర్తలకి పక్షపాతం లేని బోధనా, పాఠ్యాంశాలు రూపొందించటానికి అత్యంత అనువయిన స్థలం.
భవిష్యత్తులో వచ్చే స్త్రీ వాద ఉద్యమం స్త్రీ వాద విద్యని అందరి జీవితాలకి కీలకమయిన అంశంగా పరిగణించాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది స్త్రీలు కొంత మేరకు డబ్బు సంపాదించారు. మరి కొంత మంది తమంతట తాము గానో, స్త్రీ వాదమంటే సానుభూతి ఉన్న డబ్బున్న మగవాళ్ళ దగ్గరి నుండి తీసుకోవటం ద్వారా సంపద కూడగట్టుకున్నారు. కానీ అబ్బాయిలు, అమ్మాయిలు, స్త్రీలు, పురుషుల కోసం స్త్రీ వాద సూత్రాలతో పనిచేసే విద్యాసంస్థలని మనం ఇప్పటికీ స్థాపించలేకపోయాం. దీనివల్ల ఇప్పటికీ ప్రజానీకానికి మీడియా ద్వారానే స్త్రీ వాదం అంటే ఏమిటో తెలుస్తోంది. అలా తెలిసేదంతా ప్రతికూలమైనదే.
స్త్రీ వాద ఆలోచన, సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యేలా బోధించాలంటే అకడమిక్‌ భాష పనికి రాదు. దాన్ని దాటి ముందుకు పోవాలి. అసలు పుస్తకాలనే దాటి ముందుకు పోవాలి. మన ప్రజానీకంలో అనేక మందికి చదవటం రాదు. వినే పుస్తకాలు (ఆడియో పుస్తకాలు), పాటలు, రేడియో, టెలివిజన్‌ అన్నీ కూడా స్త్రీ వాద జ్ఞానాన్ని పంచే సాధనాలు కావాలి. మనకి ఒక స్త్రీ వాద టెలివిజన్‌ నెట్‌వర్క్‌ కావాలి, స్త్రీల కోసం పనిచేఏ నెట్‌వర్క్‌ కాదు. అటువంటిది స్థాపించగలిగితే ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ వాద ఆలోచనని వ్యాపింప చేయవచ్చు. అలా చేయలేకపోతే ఉన్న నెట్‌వర్క్‌లలో సమయాన్ని కొనుక్కోవాలి. మిస్‌ మ్యాగజైన్‌ ఎన్నో ఏళ్ళు ఫెమినిజం అంటే ఏ ఆసక్తి లేని మగవాళ్ళ చేతుల్లో ఉండిరది కానీ ఇప్పుడు ఫెమినిస్టు సూత్రాలకు కట్టుబడి ఉన్న స్త్రీల చేతుల్లోకి వచ్చింది. ఇది అందరూ అనుసరించాల్సిన మార్గం.
సామాన్య ప్రజలందరికీ పనికొచ్చే ప్రజా స్త్రీ వాద ఉద్యమాన్ని నిర్మించలేకపోతే మన సిద్ధాంతం, ఆచరణ ఎప్పుడూ ప్రధాన స్రవంతి మీడియా ప్రసారం చేసే ప్రతికూల సమాచార దాడులతో నీరసించి పోతూ ఉంటుంది. స్త్రీ వాద సిద్ధాంతం మన జీవితాలపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపించిందో ఇప్పటి పౌరులకు తెలియాలి. స్త్రీ వాదం మన సమాజానికి, మన సమూహాలకు చేసిన మంచినంతా ఆధిపత్య సంస్కృతి వినియోగించుకుని స్త్రీ వాదాన్ని మాత్రం చెడ్డదిగా చూపిస్తుంది. చాలా మందికి స్త్రీ వాదం వారి జీవితాలని ఎంత బాగు చేసిందో తెలియదు. స్త్రీ వాద ఆలోచన, ఆచరణ స్త్రీ వాద ఉద్యమాన్ని కొనసాగించటానికి అత్యవసరం. అవి అందరికీ చెందుతాయి.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.