అద్దం అంటే ‘నిజం’ అంట!!
ఎందుకో…
ఈ ‘అద్దం’ అబద్ధం ఆడుతుంది.
నిత్యం
నన్ను నన్నుగా చూపించాల్సిన
‘అద్దం’
మోసం చేస్తుంది.
ఈ ‘అద్దం’ ముందు నిలబడితే…
తరతరాలుగా…
వీస్తున్న
సాంప్రదాయ గాలుల్లో
ఎండుటాకుల చప్పుళ్ళు
వినలేక
లోలోపలి గాయాల సలపరింత
కలవర పెడుతుంది.
ఈ గాయాల పగుళ్ళు
ఇప్పటికి కావు మరి!!
నా ముందు తరం
నాకిచ్చింది
నా తరువాతి తరం కూడా
ఈ గాయాల్ని
మోయాల్సి వస్తుందన్న దిగులు
ష్… ష్…
చప్పుడు చేయకండి
అడుగులేస్తుంటే
హంసలా ఉండాలంట
హంసల్ని
అరువు తెచ్చుకోవాలి/ మంటుంది
పైరగాలిలా
పకపకా నవ్వేవు
నీ నవ్వు శబ్దం వినపడకూడదిక్కడ,
నోటినిండా
గుడ్డలు కుక్కేసుకోమంటుంది.
ఓ వంటింటి మహారాణి!!
నీ వారి కోసం
గానుగెద్దుల్లా
నీవు చేసే పనుల్లో
నీ ఇష్టాన్ని
కడిగేసుకోవాలి
ఓ ఆడ బిడ్డా!!
నీ చుట్టూ ఉన్న
వారి అవసరాల్లో
నీవో
కరిగే కొవ్వొత్తిలా ఉండాలి
అంటూ
వెన్ను విరుస్తుంది.
వివేకం హెచ్చరిస్తుంటే
ఇవన్నీ మరిచి
ఎప్పుడైనా
నీకు నచ్చింది ఏంటో
నువ్వు ఎలా ఉండాలో
నీ ‘ఇంటి’ అద్దాన్ని అడిగేవు
‘‘అది పకపకా నవ్వుద్ది’’
ఎందుకంటావా!!
తర తరాలుగా
బానిసత్వపు
ముద్రలేస్తోంది
ఇక్కడే
అడుగు
బైట పెడ్తున్నావా..!!
ఆక్షేపణల అద్దంలో
అత్యాచారాల సంస్కృతి ఎదురవుతుంది
అక్కడ
పురుష స్వామ్యం
కామ దాహానికి
ప్రేరణ
నీ బట్టలంటుంది
నీ దేహం నీది కాదు
ప్రకృతి కాంతవి నువ్వు
అంటూ
వెలగగక్కిన మేడిపండు చూపుల్లో వాడు గంగిరెద్దుల ఆట ఆడుతాడు
అవునూ…
ఇప్పుడు
ఆరు గజాల చీర కట్టుకొని
అడుగు బయట పెడుతున్నావా!
భుజాల నిండుగా
కొంగు కప్పుకొని తిరిగావో
నాసిరకం వాసనొస్తున్నావంటాడు
స్లీవ్‌లెస్ వేసుకుంటివో
ఎదబిగుతుల్లో
కొలతల కోలాటం వేస్తాడు
ఒంటిపొర పైటలో
చీర కుచ్చిళ్ళు
బొడ్డు కిందకి వేస్తివో
పురివిప్పిన నెమలి వంటాడు.
పంజాబీ డ్రెస్ వేసుకుంటివో…
బెహన్జీ టైపంటూ…
కార్పొరేట్ కల్చర్
తెలియదంటాడు
సౌకర్యం అంటూ జీన్స్ కట్టి షర్టు వేశావో
‘మగ’ వేషం కట్టావంటాడు
చీరలో… సెక్సీగా ఉన్నావంటాడొకడు
వేసుకున్న టీ షర్టుల మీద కొటేషన్లు చూసి రారమ్మని
పిలిచావంటాడొకడు
ఎదపైన చున్నీలు కట్టమంటాడొకడు
అరువు తెచ్చుకున్న సంస్కృతి మనకొద్దు అంటూ
లెక్చర్ ఇస్తాడిరకొకడు…
నన్ను నన్నుగా
చూపని ఈ అద్దం
‘అబద్దం’ చెప్పిందని
భయపడేది, భంగపడేది లేదు.
మాంసం ముద్దలుగా చూస్తూ వయసు తారతమ్యం లేకుండా
చంటి బిడ్డ నుండి,
పండు ముసలి పైనా
ఆగని
అత్యాచారాల సంస్కృతి
అంతరించేలా…
ఈ ఆక్షేపణల ‘అద్దాన్ని’ నిరసన క్షిపణులతో బద్దలు కొడదాం రండి.