వీళ్ళిద్దరూ…
మా వెలుగుపూల తోటలో
వికసిస్తున్న చిట్టి మొగ్గలు…!
ఒక్క తల్లి నెత్తురు పంచుకొని
ఒక్కసారే కళ్ళు తెరిచిన
కవల కూనలు…!
ఎక్సెక్స్ క్రోమోజోముల సంయోగ
ఫలితం ఒకరైతే…
ఎక్స్‌వైల ఐక్యం ఇంకొకరు…!!!
అంతే… తప్ప ఇంకే భేదమూ
ఎరుగని సీతాకోక చిలుకలు
రంగూ రూపూ ఎత్తూ బరువూ
సర్వసమానమే…!
అయితే…
మన బుద్ధుల్లోనే ఎగుడు దిగుడు
బూజు రాజుకుంటోంది
కేర్‌మన్న క్షణాల నుంచీ
ఆ పసిదానిపట్ల అదో రకం చిన్నచూపు
తెలియని విముఖత
ఆస్పత్రినుంచే మొదలైన
ఈ నిశ్శబ్ద హింస
అంతరించేదాకా కొనసాగుతూనే…
సాగుతూనే ఉంటుంది…!
తప్పదన్నట్లు పోత పాల పెంపకం
లాలిపాటలూ జోలపుచ్చుడూ
గోరుముద్దల గారాబమూ
వాడి తర్వాత మిగిలితేనే
ఆ పిల్ల మొహానికి…!
ఇంటిన్రాజులకూ
వాడో దైవాంశ సంభూతుడు
వైతరణీ దాటించే వారసుడు
వాడో స్వర్ణ కిరీటంతో పుట్టిన
కారణజన్ముడు
వాళ్ళ పుచ్చు బుర్రల్లో మొలుచుకొచ్చిన
పక్షపాతం వల్లే…
ఒకరికి రాజయోగాలు
ఇంకొకరికి ఇంటిపనీ పెంటపనీ
ఎంగిలి కంచాలూ… విడిచిన బట్టలూ
తీరితేనే బడైనా ఇంకేదైనా…
చీది పారేసిన నాటి గంజిలీగే
ధగ ధగలతో వెలిగిపోతోందిప్పుడు
తన ప్రతిభా పాటవాలతో
యావత్ పాఠశాలకీ
కీర్తి చంద్రికలను తెచ్చిపెట్టింది
అక్షరం ముక్క
ఒంటపట్టని వాడిప్పుడో ఆవారా…!
మట్టి ముద్దలకు వివిధ వర్ణాలని
అద్దేది మనమే…!
తరాలనుంచీ వేళ్ళూనిన
నిశ్శబ్ద హింస కొనసాగడమేనా…!?
ఆమె తలరాత
అంతేనంటుంది సమాజమింకా…!!
ఉలి దెబ్బలు తిన్న ఈ సహజశిల
తనకు తాను చెక్కుకుంటుంది
ఓ అపురూప శిల్పంగా…!!