రుథిర తటాకంలో ఈదులాడే చిన్ని గుండె
ఆవేదనాగ్ని జ్వాలల్ని శ్వాసించింది…
రెప్పలల్లార్చే లయవిన్యాస తరగతిలోనే
బాహ్యలోకంలో నింగిని తాకే అవినీతి కొండల్ని
బుల్లికళ్ళు తీవ్రంగా చూశాయి…
అక్కడ కొనసాగే అక్రమ అసమ కూడికలను
దుష్టాత్మల విషపూరిత బంధాలని తేల్చేశాయి
అమ్మ కడుపులో ఉమ్మనీటిలో ఈదులాడే చిన్ని కాళ్ళు
జనారణ్యంలో పెల్లుబికే అన్యాయపు సుడిగుండాల సునామీలను
ఎదురీదేందుకు మేం సిద్ధం అంటున్నాయి
అమ్మ గర్భంలో రూపుదిద్దుకొంటున్న బుల్లివేళ్ళు
ఆగమ రణరంగానికి
అక్షరాయుధాలను శృతి
చేస్తున్నామంటున్నాయి
నేలను మింగి… నింగిని సైతం ఆక్రమించుకొంటున్న
గాడాంధకారాన్ని ఛేదించేందుకు చిచ్చుబుడ్లు… తారాజువ్వలు
పొగరాజుకుంటున్నాయి
పేదల రక్తంతో దాహం తీర్చుకునే తోడేళ్ళు చేసే కొంగ జపాలు
ఆ చిట్టి బుర్రలకు ఎలా అర్థమయ్యాయో గానీ
మాటలను తేనెలోముంచే
నికృష్ట అవినీతి వ్యవస్థపై
బలహీనుల పక్షాన న్యాయతీర్పు ప్రకటించే
బుడిబుడి నడకల న్యాయమూర్తులు ఇప్పుడు కొత్త సిలబసు
సిద్ధం చేస్తున్నారు
…మహోన్నత మానవతా గీతాన్ని… గర్భం దాల్చిన
అమ్మ గర్భం… అవుతుంది…
ఓ శిక్షణా శిబిరం…!!
ఇప్పుడు తెల్లమెదళ్ళన్నీ… నల్లబూజు దులుపుకొంటున్నాయి…