గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల – చైతన్య పింగళి

‘తెలుగు – గోండి అనువాద కార్యశాల’ని ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూర్లో నవంబరు ఒకటో తేదీ నుండి మూడవ తేదీ వరకు నిర్వహించింది నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా. అనువాద కార్యశాల నిర్వహణలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారం కూడా ఉంది.

ఇంగ్లీషు, హింది నుండి ఎంపిక చేసిన పిల్లల కథలని తెలుగులోకి, గోండిలోకి అనువాదం చేయటం ఈ అనువాద కార్యశాల ఉద్దేశం. గోండి తెగ పిల్లలకి గోండి భాషలోనే కథలని చదివే అవకాశం మొదటిసారి కలగబోతోంది. కాబాట్టి, మొదటి తరం గోండి మహిళా రచయితలు ఈ వర్కషాప్‌ ద్వారానే పరిచయం కాబోతున్నారు కాబట్టి ` ఈ అనువాద కార్యశాల ప్రత్యేకమైనది, చారిత్రాత్మకమైనది.
హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ఈ సభని ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’ కమీషనర్‌ దివ్య దేవరాజన్‌ గారి సూచనతో ఊట్నూర్‌కి మార్చారు. ‘పులిని జూలో కాదు, జంగిల్‌లో చూడాలి అని సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం’ అని పత్తిపాక మోహన్‌ గారు ప్రారంభ సమావేశంలో అంటే, నవ్వేసాం. భాష అనేది ఎంత పెద్ద పులో ఆ మూడు రోజుల పాటు మాకు రోజుకు కొంచెం కొంచెంగా అర్థం అవుతూ వచ్చింది. సభ జరగాల్సిన ప్రదేశం మారగానే, దృక్పథం ఎంత మారుతుందో కూడా అనుభవంలోకి వచ్చింది.
పిల్లలు ఏ భాషలో చదువు నేర్చుకోవాలి అనే ప్రశ్న, చర్చ వచ్చినప్పుడల్లా తెలుగు వారికి రెండు భాషాలే మెదులుతాయి. ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవారికి ఇంగ్లీషు, పిల్లలకి తేలికగా విషయం అర్థం అవ్వాలి అనేవారికి తెలుగు. అటు తిప్పి ఇటు తిప్పి చర్చనంతా ‘తెలుగు మీడియం వెర్సస్‌ ఇంగ్లీషు మీడియం’కి కుదిస్తాం. ఈ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో తాడును అటూ ఇటూ గుంజే రచయితలం తెలుగు లిపిలో గోండి భాషను రాస్తున్న గోండి రచయితలని కలుసుకున్నాం.
అక్టోబరు 30వ తేదీ మధ్యాహ్నమే మేము ఉట్నూరు చేరుకున్నాం. కొమురం భీమ్‌ కాంప్లెక్స్‌లోనే మా కార్యశాల, బస కూడా. అది చాలా పెద్ద కాంప్లెక్స్‌. బి.ఇడి కాలేజి, స్పోర్ట్స్‌ కాలేజి, డిగ్రీ కాలేజి, హాస్టలు, ఐ.టి.ఐ కాలేజి అన్ని ఒకే కాంప్లెక్స్‌లో ఉన్నాయి. ఆ కాంప్లెక్స్‌ అంతా కలదిరిగాం. అక్కడంతా ఒకలాంటి సీరియస్‌ వాతావరణం కనిపించింది. బి.ఇడి కాలేజ్‌ ప్రిన్సిపల్‌, గోండి సాహిత్యాభివృద్థికి కృషి చేస్తున్న మెస్రం మనోహర్‌గారిని అడిగాము. ‘పిల్లలకి ఏమన్నా పరీక్షలా సర్‌?’ అని. ‘ఈ పిల్లలందరికీ ప్రతీ రోజూ పరీక్షే. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీలు కూడా నేర్చుకోవాలి మా గోండీలు. మా పిల్లల కష్టం, టైం అంతా ఐదు భాషలు నేర్చుకోటానికే అయిపోతోంది. మా భాషలోనే పరీక్షలుంటే కలెక్టర్లు, డాక్టర్లు అవ్వగల సత్తా ఉన్న వారు. ఇక్కడి దాకా రావటానికి ఎన్ని తిప్పలు పడతారో. అందుకే ఎక్కువ కష్టపడతారు’ అని చెప్పారు. తర్వాత రోజున జరిగిన కార్యశాల ఆవిష్కరణకి దాదాపు రెండు వందల మంది విద్యార్థులు వచ్చారు. ఎన్‌.బి.టి స్టాల్‌లో ఉన్న ప్రతీ పుస్తకాన్ని చూశారు. తిరగేశారు. విద్యార్థుల కోసం ఎన్‌.బి.టి ప్రత్యేకంగా తక్కువ ధరలకే పుస్తకాలు అమ్మారు. కొత్త పుస్తకాలు కొనుక్కుని, చిన్న నోట్స్‌, పెన్నులు పట్టుకుని సభలో కూర్చున్న అంత మంది విద్యార్థులని చూడటం ఒక వింత సంతోషాన్నిచ్చింది.
అనువాద కార్యశాలని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వరుణ్‌ రెడ్డిగారు ఈ వర్క్‌షాప్‌ని ఆరంభించారు. విక్రమ్‌గారు గోండీల రామాయణం, సామెతలు, ప్రత్యేక సంస్కృతి గురించి విక్రమ్‌గారు వివరించారు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు కీలకోపన్యాసం ఇచ్చారు. ఆయన అందరినీ ఒక ప్రశ్న అడిగారు. ‘గోండి జనాభా సంతాలి జనాభా కంటే ఎక్కువ. గోండి తెగ వారు సంతాలి తెగ వారికంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నారు. పైగా గోండి తెగ వారు వందల ఏళ్ల పాటు రాజ్యం ఏలారు. మరి, సంతాలి తెగ మహిళ రాష్ట్రపతి అయినప్పుడు, గోండి తెగ నుండి ఏ వ్యక్తీ ప్రముఖ స్థానాల్లో ఎందుకు లేరు?’. ఇది వాడ్రేవు వీరభద్రుడు గారు అడిగిన ప్రశ్న. మాకెవరికీ సమాధానం తెలీదు. వీరభద్రుడు గారే జవాబు చెప్పారు. ‘సంతాలి ప్రజలు లిపిని సృష్టించుకుని, తమ భాషలో రాయటం మొదలుపెట్టారు. గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. తమ సంస్కృతి, జానపదాలు, కథలు, కావ్యాలు, జీవితాలని అక్షరబద్ధం చేశారు. రామాయణం లాంటి కావ్యాలని అనువాదం చేసుకున్నారు. ఒకప్పుడు లిపి లేని సంతాలి భాషని భారత రాజ్యాంగం గుర్తించింది. 2004 నుండి సాహిత్య అకాడెమీ సంతాలి భాషలో రచనలకి అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టింది. యుజిసి వారు సంతాలి భాషలో పరీక్ష రాయటానికి అనుమతి ఇచ్చారు, సంతాలి భాష నుండి పెద్ద అధికారులు రాగలిగారు. తమ సమస్యలు, తమ ప్రత్యేకతలు, తమ ఉనికిని చాటారు. ఒక సంతాలి మహిళ ఈనాడు రాష్ట్రపతి అవ్వటం వెనక ఇంత కథ ఉంది. తెలుగు విషయమే తీసుకోండి. అది మధ్యద్రావిడ భాష. దానితో పాటు గోండి, కోయ, కొలామీ, పర్జీ, కొండ, కువి లాంటి గిరిజన భాషలు కూడా మధ్యద్రావిడ కుటుంబానికి చెందినవే. పదిహేనువందల సంవత్సరాల కిందట, ఈ భాషలన్నీ దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. కాని మొదట్లో శాసనభాషగా వాడుకలోకి వచ్చిన తెలుగును గత వెయ్యేళ్ళుగా తెలుగు కవులు, రచయితలు గొప్ప సాహిత్యభాషగా మార్చేసారు. సాహిత్య ప్రమాణాల దృష్ట్యా నేడు తెలుగు ప్రపచంలోని మొదటి పది లేదా ఇరవై భాషల్లో ఒకటిగా ఉందని చెప్పవచ్చు. కాని గిరిజన భాషలు మాత్రం పది పదిహేను శతాబ్దాల కింద ఎక్కడున్నాయో, ఇప్పటికీ అక్కడే ఉండిపోయాయి. ఇది మారినప్పుడే గోండిల సంస్కృతి , ఆత్మగౌరవం ప్రపంచం ముందుంటుంది. ఇప్పుడు పదిహేడు మందితో ప్రారంభం అయిన ఈ చిన్న వర్క్‌షాప్‌ అలాంటి ఒక గొప్ప సాహిత్య ప్రయాణానికి మొదటి అడుగు అన్నారు.
మేము ఒక చారిత్రక సన్నివేశానికి సాక్షులం అని అప్పుడు అర్థమైంది. ఆ ఫీలింగ్‌ వల్ల గోండి రచయితల కంటే మాకే ఎక్కువ ఉత్సాహం వచ్చేసింది. కథలు తెలుగు, గోండి అనే రెండు భాషలలోకి అనువాదం అవుతున్నాయి అనే మాట మర్చిపోయి, మేమంతా గోండి రచయితలు ఏం కథలు అనువాదాలు చేస్తున్నారో తెలుసుకోటానికి ఎక్కువ ఉత్సాహం చూపించాం. మెస్రం మనోహర్‌గారు, తొడ్‌సం దేవ్‌రావ్‌గారు, అర్క మాణిక్‌ రావుగారు, కుమ్రం లల్షవ్‌, కుమ్ర మోహన్‌, ఆత్రం సంగీత, ఇందిరలు తెలుగు నుండి గోండిలోకి అనువాదం చేస్తున్న రచయితలు. మాటా మంతి కార్యక్రమంలాంటిది మొదలుపెట్టాం. ఈ ‘మాటామంతి’లో మంతి అనే పదం గోండి భాషలోదే అని, ఇలా ఎన్నేసి గోండి పదాలు తెలుగులో కలిసిపోయాయో మాకు చెప్పారు గోండి రచయితలు. ఇక ముచ్చట్ల వల్ల పని జరిగేలా లేదని, గోండి రచయితల వర్క్‌ షాప్‌ ఒక గదిలో, తెలుగు రచయితల వర్క్‌ షాప్‌ ఒక గదిలో ఏర్పాటు చేశారు పత్తిపాక మోహన్‌ గారు. తెలుగు రచయితలం శ్రద్ధగా అనువాదాలు పూర్తి చేసి, భోజనాల వేళ కోసం, టీ బ్రేక్‌ కోసం ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళం. అన్నట్టు ‘ఆత్రం’ అనేది గోండిలలో ఒక గోత్రం పేరు. వారి దేవుళ్ళు, గోత్రాలు, పండగలు, తిండి, కథలు.. ఇలా ఎన్నిటి గురించో మాకు బ్రేక్‌ టైంలో కబుర్లు చెప్పేవారు.
తెలుగు అనువాదాలను ‘మంచిపుస్తకం’ సురేష్‌ కొసరాజుగారు పరిశీలించేవారు. అనువాదం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, వ్యాకరణం, ముఖ్యంగా పిల్లల కథలు అనువాదం చేస్తున్నప్పుడు పదాలు ఎటువంటివి వాడాలి? లాంటి విషయాల మీద సురేష్‌గారు అందర్నీ గైడ్‌ చేశారు. వసంతరావు దేశ్‌పాండే, తుమ్మూరి రామ్మోహన్‌ గారు, అమరవాది నీరజ, వి.ఆర్‌.కె శర్మగారు, నంద కిషోర్‌, నేను తెలుగులోకి కథలను అనువాదం చేశాము. గోండి భాషలోకి మెస్రం మనోహర్‌గారి గైడెన్స్‌లో అనువాదాలు చేశారు. వీళ్ళలో సంగీత, ఇందిర అనే ఇద్దరూ టీచర్లు. గోండిలోకి మొట్టమొదటిసారి బాలసాహిత్యం అనువాదం జరుగుతోంది. ‘అంగన్‌వాడీల్లో, స్కూళ్ళలో గోండిలే టీచర్లు. కాని వారికి కథలు చెప్పాలన్నా, జంతువులు, వస్తువుల పేర్లు నేర్పించాలన్నా… పరభాష అయిన తెలుగులోనే నేర్పించాల్సి వస్తోంది. స్కూల్లోకి అడుగుపెట్టిన పసిపిల్లలకి ఇదెంత షాకో మీరు ఊహించలేరు. చాలా ఒత్తిడి ఉంటుంది పిల్లల మీద. బొమ్మలు చూస్తూ, గోండిలో ఈ కథలు చదవుకోటం మాకెలాంటి వరమో మీకు అర్థం కాదు’ అన్నది సంగీత. అర్థం అవుతోందమ్మా అన్నాను. ‘లేదు. మీకు అర్థం కాదు. మీరు ఉట్నూరు కాదు, గోండు పల్లెలకి వచ్చి, ఇక్కడే ఉండి మా పిల్లల తిప్పలు చూడలేదు. అర్థం అవుతుంది అనుకుంటున్నారు, మీకు అర్థం కాదు’ అని చాలా ఉద్వేగంగా చెప్పింది. ఈ మాత్రం అర్థమవ్వటం కూడా హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు ` గోండి అనువాద కార్యశాల ఉట్నూరుకి మార్చటం వల్లే జరిగింది. అందుకు పత్తిపాక మోహన్‌గారికి, దివ్యగారికి థ్యాంక్స్‌ చెప్పుకున్నాను.
‘ఒక పెన్సిల్‌, పేపరు ఇస్తే, కథలు రాయగలవారు చాలా మంది ఉన్నారు. పెన్సిలు, పేపరు చాలు. వీళ్ళలో చాలా మంది అవి కూడా కొనుక్కోలేరు. అయినా కాని, మేము కవితలు, పాటలు రాస్తున్న వారు ఉన్నారు. ఉట్నూరు సాహిత్య వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఆ వేదిక తరపున వీరి రచనల్ని పుస్తకంగా తీసుకొస్తున్నాం’ అని ఒక్కొ పుస్తకం వెనుక కథని చెప్పారు ఆత్రం మనోహర్‌గారు.
రెండు భాషలని కలిపి పదిహేను మంది రచయితలం, రెండు భాషల్లోకి 40 దాకా పిల్ల్లల కథలను అనువాదం చేశాము. ఇందులో విఙ్ఞాన కథలున్నాయి, వినోద కథలున్నాయి, పొడుపు కథలున్నాయి. మూడేళ్ళ నుండి పదేళ్ళ వయసు పిల్లలందరూ చదవగలిగిన కథల పుస్తకాలు మంచి బొమ్మలతో రాబోతున్నాయి.
ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వరుణ్‌ రెడ్డిగారు ప్రొటోకాల్‌లో లేనప్పటికీ మూడో రోజు మధ్యాహ్నం మా కార్యశాలకి వచ్చారు. దాదాపు మూడు గంటలు మాతోపాటే గడిపారు. కొన్ని అనువాదాలను చదివారు. గోండీల సాహిత్యాన్ని అక్షరబద్దం చేయటానికి ఏమేం చర్యలు తీసుకోవచ్చో మాతో చర్చించారు. ‘ప్రతీ సంవత్సరం ఇక్కడ సాహిత్య సభలని నిర్వహించమని’ ఎన్‌.బి.టి రీజినల్‌ ఎడిటర్‌ పత్తిపాక మోహన్‌ గారిని కోరారు. ఆనందం కోసం, మనోవికాసం కోసం ఉండే కథలు, పాటల్లాంటి ప్రక్రియలని కూడా పరభాషలో వినటం, చదవటం అనేది ఎంత దుస్థితి! ఆ పరిస్థితి గోండి చిన్నారులకి ఇక ఉండదు అనే విశ్వాసం వచ్చింది మా అందరికి ఈ కార్యశాల ముగిసేసరికి.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.