భారతీయుల ఆరోగ్యం పట్ల వలసాంధ్రలోని మిగతా ఏ స్త్రీల పత్రికా చూపనంత శ్రద్ధ చూపించింది ‘వివేకవతి’. భారతీయులు శుచీ శుభ్రతా లేనివాళ్ళనీ, వాళ్లకు తమ శారీరకారోగ్యం గూర్చి ఏమీ తెలీదనీ, మంత్రతంత్రాల్లో నమ్మీ, నాటు వైద్యులను సంప్రదించీ, ప్రాణాలను
పోగొట్టుకుంటారని భావించింది. అందుకే వాళ్లకు ఈ విషయాల్లో శాస్త్రీయ జ్ఞానాన్నందించి వివేకవంతుల్ని చేయాలనుకుంది. జి.గిడ్డి రాసిన ‘శుచి’ అనే వ్యాసంలో ‘‘దైవభక్తి తప్ప మిగిలిన వానిలో శుభ్రత మిగుల గొప్పద’’ని (cleanliness is next only to Godliness) ప్రకటించి మానవాళికి దేహ శుభ్రతా, గృహ శుభ్రతా అత్యంత అవసరం అన్నారు. ‘‘దిగువ జాతుల’’ వారూ, పేదలూ రోజూ స్నానం చేయరనీ, కాబట్టి స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారితో తప్పనిసరిగా స్నానం చేయించాలనీ చెప్పారు. ‘‘గృహ శుభ్రత’’ స్త్రీల ‘‘ముఖ్య విధి’’ అని నొక్కి చెప్పి, కొందరు స్త్రీలు తమ యిండ్లను పరిశుభ్రంగా వుంచుకోరనీ, ‘‘ఇది స్త్రీలలోనుండు గొప్ప కొరతjైు యున్నద’’ని వేగిసపడ్డారు. ఇండ్ల చుట్టూ ‘‘మైల, కుళ్లు’’ మొదలైన చెడు పదార్థాలను వుంచకూడదనీ, దూరంగా పారబోయాలనీ, వాకిళ్లను ‘‘సదా తుడిపించుచు చెడువాసన’’ పోవడానికి వాటిమీద ‘‘కలయంపి తరచుగా’’ చల్లింపాలనీ, ఇంటి గోడల్ని వారానికోసారి తుడుస్తూ, ఆరు నెలలకోసారి సున్నం కొట్టించాలనీ, అలా చేస్తే ‘‘మిగుల ఆరోగ్యకరము’’ అనీ పరిశుభ్రతను బోధించారు (మార్చి 1918, పు.141).
పడకగదిని ఎలా పెట్టుకోవాలో ఒకరిలా సెలవిచ్చారు : ‘‘పడక గదిని శుభ్రముగా నుంచవలెను. మనకు పరిశుభ్రమయిన గాలి సమృద్ధిగా నుండవలెను. ఈ పడక గదులు సాధారణముగా చిన్నవి యగుటను పిల్లాద్రి యందులోనే శయనించుట చేతను నత్యవసరమగు సామానులు మాత్రమే నందుంచుకొనవలెను. లేని యెడల దోమలు విశేషముగా నట్టి సామానులలో జేరి నిద్రాభంగము చేయడమేకాక నితరత్రా స్వీకరించి తెచ్చిన రోగ బీజమును సహా మనయందంకురింపజేయును. పగలు ధరించిన దుస్తులు గాని, పాలు, ఫలహార వస్తువులు మొదలయినవి పడక గదులలో నుంచకూడదు. మనము నిద్రించుతరి వాయువు వుష్ణించి విష మిళితమగును … మూసిన గదులలో పండుకొనువారు లేచుసరికి తలనొప్పి, తలత్రిప్పు గలిగియుందురు. గనుక ప్రతి పడక గదికి సాధ్యమైనంత యెత్తుగా నధమము రెండు కిటికీలయిన యుండుట మంచిది … సువాయువు లోనికి చొరనియ్యుటకు గాను గది తలుపు అడుగున సూక్ష్మ రంధ్రములయినా నుంచవలెను … పగటి వేళలయందు మంచి గాలి, వెలుతురు వచ్చుటకుగాను తలుపులు, కిటికీలు తెరచి యుంచవలెను. రాత్రి బరున్న పక్కబట్టలు, కట్టిన పుట్టములు పగలు యెండలో యెండవలెను’’ (ఈ.లాజరస్, ‘గృహ విషయములు’, ఫిబ్రవరి 1910, పు. 149 ` 151). ఇలా రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ‘ఇలా వుండాలి, ఇలా వుండకూడదు’ అని దీర్ఘంగా బోధించేది ‘వివేకవతి’. సాధ్యాసాధ్యాల గూర్చి పట్టించుకునేది కాదు! దేవుడు చూసుకుంటాడ్లే అనుకుందేమో!!
భారతీయులకు తమ శరీరాల గూర్చీ, వాటికి కలిగే జబ్బుల గూర్చీ కనీస అవగాహన లేదని ప్రగాఢంగా నమ్మింది ‘వివేకవతి’. అందుకే శరీరంలోని వివిధ అవయవాలు, అవి పనిచేసే విధానం గురించి ‘‘శాస్త్రీయంగా’’ బోధించడానికి ‘ప్రకృతి పాఠములు’ అనే కాలమ్ నిర్వహించింది. ఆకర్షణీయమైన పటాలతో శరీర నిర్మాణం, వివిధ అవయవాల పొందికా, అవి పనిచేసే తీరూ మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా, తేలికైన మాటలతో వివరించేది. మూర్ఖ భారతీయులకు వైద్యానికి సంబంధించి శాస్త్రీయమైన అవగాహన కల్పించడానికి ‘వైద్య విషయములు’ అనే కాలమ్ నడిపింది. ఈ కాలమ్‌ని మదనపల్లెలో నివసించిన డాక్టర్ హార్ట్ చాలా కాలం అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు (‘ప్రకటన’, అక్టోబర్ 1912, పు.4). వివిధ రోగాలూ, వాటి కారకాలూ, రోగాలు రాకుండా వుండేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలూ, వచ్చాక పక్కాగా పాటించాల్సిన నియమాలూ మొదలైనవన్నీ చాలా చక్కగా సులభంగా అర్థమయ్యేలా వివరించేవారు. ముఖ్యంగా స్త్రీల, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవం మొదలైన విషయాలెన్నో హృదయానికి హత్తుకొనేలా వివరించేవారు. 1912 అక్టోబరు సంచికలో ‘కలరా’ బారిన పడకుండా వుండాలంటే ఏం చేయాలో 5 అంశాల ద్వారా తెలిపారు. అయినా ఒకవేళ కలరా సోకితే డాక్టర్‌కి చూపించడానికి ముందే ఏమేం (ప్రథమ) ‘‘చికిత్సలు’’ చేయాలో 6 అంశాల ద్వారా వివరించారు (‘వైద్య విషయములు’, పు.5). ఒక సంచికలో ‘‘ఘోషా’’ పద్ధతి వల్ల స్త్రీలకు క్షయ రోగమే కాక, ప్రసవంలో కష్టాలూ, యింకా అనేకమైన యితర రోగాలూ కలుగుతాయనీ, కాబట్టి హిందూ, ముస్లిం స్త్రీలందరూ ఘోషాను విడనాడాలనీ గట్టిగా సలహా యిచ్చారు (‘వైద్య విషయములు: రోగము`ఘోషా పద్ధతి’, మార్చి 1915, పు.171).
హిందూ స్త్రీలలో చాలా మంది తమ పూర్వ కర్మలకొద్దీ రోగాలొస్తాయనీ, యింకొంత మంది ఇంట్లో ఎవరైనా జబ్బుపడ్తే అది ఇంటికి దయ్యం పట్టడం వల్లనేనని భావిస్తారనీ, కానీ రోగాలు కర్మవల్ల గానీ, ‘‘దేవత కోపము’’ వల్ల గానీ రావనీ, శుభ్రమైన గాలీ, తగినంత వెలుతురూ, పరిశుభ్రమైన పరిసరాలూ లేకపోవడం రోగ కారకాలనీ ఒక వ్యాసంలో తెలిపారు. ‘‘భర్తగాని, బిడ్డగాని చాల అపాయకరమగు’’ పరిస్థితుల్లో వున్నప్పుడు భార్య లేదా తల్లి ‘‘విశేషముగా దు:ఖించెదర’’నీ, కానీ దాని వల్ల లాభం లేదనీ, రోగ నివారణకు చేయాల్సిన పనులు చేయకుండా ‘‘ఏడ్చుట వలన ఏమి కాగలదు?’’ అని ప్రశ్నించారు. ‘‘దేని వలన ఆయా జబ్బులు వచ్చుచున్నవో వాటిని జాగ్రత్తగా పరికించి, వాటిని తొలగించుటకై ప్రయత్నించవలెను’’ అని సలహా యిచ్చారు. జబ్బుపడ్డ వారిని ఎలా సంరక్షించాలో విశదపరచారు (‘వైద్య విషయములు: రోగుల సంరక్షణ’, మే 1915, పు. 231`233).
1913 ఫిబ్రవరి సంచికలో ‘శిశు మరణములకు గల కొన్ని కారణములు’ అనే వ్యాసం ప్రచురించారు. అందులో భారతదేశంలో పుట్టిన ప్రతి ముగ్గురు శిశువుల్లోనూ ఒకరు సంవత్సరంలోపే చనిపోతున్నారనీ, కానీ ఇంగ్లండ్‌లో ఎనిమిది మందిలో ఒకరే చనిపోతున్నారనీ, ఈ రెండు దేశాల మధ్య శిశు మరణాల విషయంలో యింత పెద్ద తేడా వుండడానికి కారణం భారతీయ స్త్రీలకు పిల్లల పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లను సరిగా పెంచే పద్ధతులకు సంబంధించి శాస్త్రీయమైన జ్ఞానం లేకపోవడమేనని నిర్ద్వంద్వంగా ప్రకటించారు (‘వైద్య విషయములు’, పు. 151`152). 1912 నవంబరు సంచికలో పసి పిల్లల్ని పెంచే విధానాన్ని వివరిస్తూ 12 అంశాలనిచ్చారు. వాటిలో కొన్ని: ‘‘1. పిల్ల యేడ్చినంత మాత్రమున దాని కాహారము పెట్టవద్దు. ఆకలి చేత యేడ్చినదో లేదో మొదట రూఢగాి తెలిసికొనుము. 2. వేళ తప్పించి పిల్లకు భోజనము పెట్టకుము. 4. రబ్బరు పీకను పిల్లచేత చప్పరించనియ్యవద్దు. 5. వట్టి పాలబుడ్డిని పిల్లను చప్పరించనీయవద్దు. 6. పిల్లకు పాత పాలనివ్వక తాజా పాలిచ్చుచుండవలెను. 10. పిల్లకు నిద్ర వచ్చునట్లు నల్లమందు గాని మరియే మత్తు వస్తువును గాని ఎన్నడైన నివ్వవద్దు. 11. పిల్లను ఎక్కువగా ఎత్తుకొనవద్దు. 12. ఇంట్లోనే పిల్లనెప్పుడు నుంచవద్దు. మంచి యెండయు, గాలియు నుండు చోటికి పిల్లను ప్రతి దినము తీసుకొని వెళ్లవలెను. పిల్ల ఆరోగ్యముగా నున్న యెడల దానికందువల్ల మేలు కలుగును’’ (‘వైద్య విషయములు: శిశుపోషణ’, పు. 54). ఇంకో సంచికలో శిశువులకు పాలుపట్టే విధానాన్ని వివరించారు. పుట్టిన తర్వాత ఎంత యివ్వాలి, తర్వాత రోజులు పోయేకొద్దీ ఎంతివ్వాలి, పెరిగే శిశువు వయసును బట్టి రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలి, ఎంత సేపు పాలివ్వాలి మొదలైన విషయాలు తెలియబరిచారు. పిల్లలకు ‘‘క్రమమైన వేళల్లో’’ మాత్రమే పాలివ్వాలనీ, యేడ్చినప్పుడల్లా పాలు పట్టడం ‘‘హానికరమైనద’’నీ, తల్లి పాలే శ్రేష్ఠమైనవనీ, కాబట్టి ప్రతి తల్లీ తనే పాలియ్యాలనీ సలహా యిచ్చారు. ఒక వేళ పిల్ల తల్లి అనారోగ్యంగా ఉన్నా, చనిపోయి ఉన్నా ‘‘మంచి పాల దాదిని’’ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ పాల దాది ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఆమె పూర్ణారోగ్యవంతురాలుగానూ, బలంగానూ ఉండాలి. కానీ ‘‘మిక్కిలి బలిసినది’’ కాకూడదు! ఆమెకు క్షయ గానీ, చిట్ల ఫిరంగి గానీ, లేదా యితర అంటు వ్యాధులు గానీ వుండకూడదు. ఆమె 20`30 సంవత్సరాల మధ్య వయసుతో తాను పాలివ్వబోవు పిల్ల వయస్సే ఉన్న పిల్ల గలదై వుండాలి. ఆమెకు శాంతగుణముండాలి. కోపగుణముంటే ‘‘ఆమె పాల వల్ల బిడ్డకు శూలనొప్పి, గ్రహణి, ఈడ్పు రోగము యింక అంతకంటే గొప్ప వ్యాధులును’’ కలుగుతాయని జాగ్రత్తలు చెప్పారు (‘వైద్య విషయములు: శిశుపోషణ’, ఆగస్టు 1913, పు.325`326).
ప్రథమ చికిత్సకు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్నీ ‘వైద్య విషయములు’ కాలమ్ ద్వారా అందించారు. ‘‘ఒక మనుష్యునికి (అకస్మాత్తుగా) గట్టి దెబ్బలు తగిలిన యెడల నేమి చేయుదువు? వాని బాధనుపశమింపఁజేయు మార్గమును తెలిసికొన గోరుచున్నావా? కొన్ని పద్ధతులు తెలిసికొనుము’’ అని, గాయమై రక్తం కారుతుంటే బేండేజ్ ఎలా కట్టాలో, ఎముకలు విరిగితే ఏం చేయాలో, మంటల్లో పడి ఒళ్ళు కాలిపోతే ఏమేం చేయాలో తెలిపారు. దెబ్బ తగలడం వల్ల ‘‘నదురుపాటునకు’’ గురైతే (దిమ్మ తిరిగితే) వేడి కాఫీ గానీ, పాలు గానీ, వేడిగా వున్న యింకేదైనా గానీ యివ్వండి గాని ‘‘విస్కీ గానీ, నల్లమందు గానీ మరియే మత్తు పదార్థము గాని యివ్వవద్దు’’ అన్నారు. స్మృతి తప్పి పడిపోయినా, మూర్ఛొచ్చి పడిపోయినా ఏం చేయాలో చెప్పారు. ఎండ దెబ్బ (వడ దెబ్బ), అలపులకు (అలసట) ఏం చేయాలో సూచిస్తూ ‘‘ఎండ దెబ్బకు, తల మీదను పొత్తికడుపు మీఁదను మంచుగడ్డ నుంచుముÑ అలపున కదురుపాటు చికిత్సయే’’ అన్నారు. ‘‘గాయములను చేతులతో ముట్టుకొనరాదు’’ అని ప్రత్యేకంగా సూచించారు (జూన్ 1912, పు. 266).
ఈ విధంగా భారతీయుల ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్న ‘వివేకవతి’, అనారోగ్య కారకాలైన మద్యపానానికీ, ధూమపానానికీ వ్యతిరేకంగా పెద్ద యుద్ధం ప్రకటించింది. వలసాంధ్రలో వెలువడ్డ మరే స్త్రీల పత్రికా ఈ పని చేయలేక పోయింది. ప్రతి వ్యాసంలోనూ మద్య, ధూమపానాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, నైతిక నష్టాల్ని హృదయాల్ని కదిలించే విధంగా వర్ణించేది. భారతదేశంలోనూ, ప్రపంచంలోని యితర దేశాల్లోనూ మద్యపానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంఘాలను గురించీ, ప్రభుత్వాల చర్యలను గురించీ తెలియజేసేది. మద్యం ‘‘కెరోసిన్ నూనెవలె వత్తి లేకుండా మండే వస్తువు’’ అనీ (‘మండే వస్తువు’ను పెద్ద అక్షరాల్లో బోల్డ్ లెటర్స్‌లో యిచ్చారు), అది కడుపులోకెళ్లి జీర్ణాశయాన్ని కాల్చేస్తుందనీ తెలిపారు. మద్యం ‘‘చురుకు పుట్టించు’’ననేది కేవలం పిచ్చి భ్రమేననీ, అది ‘‘లోపల పడిన వెంటనే’’ శరీరాన్ని ముందుకన్నా ‘‘బలహీనమును మందమును’’ కలిగిస్తుందని వాస్తవం చెప్పారు. మొత్తం ‘‘ఇంద్రియ శక్తులను చంపివేసి, నరములను దుర్బలముగా జేసి, మనుష్య దేహమునకు ఆధారముగానున్న ప్రాణ వాయువుల పనిని’’ మందగింపజేస్తుందని గట్టిగా హెచ్చరించారు. మద్యంలో బీరు, వైన్లు, షెరీ, చాంపైను, జిన్ను, బ్రాందీ, విస్కీ, రమ్ము మొదలైన రకాలు ఉన్నాయని తెలిపి వాటిలో ఎంత శాతం మద్యం ఉంటుందో తెలిపారు. ఇవన్నీ ‘‘మనుష్య కల్పితములైన’’ పానీయాలనీ, శరీర పోషణకవేమీ ఉపయోగపడవనీ తెల్పుతూ ఏనుగులు గొప్ప బరువుల్ని మోస్తాయనీ, ఒంటెలు చాలా దూరం ప్రయాణం చేస్తాయనీ, పిట్టలు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతాయనీ, కానీ అవేవీ సారా తాగకుండానే తమ పనులు చేయగల్గుతున్నాయనీ, సారా తాగి మీరు పెద్దగా పొడిచేదేముండదనీ మొఖం మీద మొత్తారు. మనిషి శరీరానికి బలమిచ్చే పాలు వగైరా మంచి పానీయాల్ని ‘‘కరుణాలుడైన భగవంతుడు’’ అనుగ్రహిస్తే వాటిని వదలి విషతుల్యమైన మదిరా పారాయణం చేయడం ఎంతో ‘‘పిచ్చితనమును బుద్ధిహీనతయును కాదా?’’ అని ఘాటు దిగేలా ప్రశ్నించారు. మదిరా పారాయణం పాపమని చెప్పి ‘‘సారా, కల్లు, బ్రాందీ’’ మొదలైన వాటిని స్వయంగా వదలడమే కాకుండా మిత్రులనూ, గ్రామవాసులనూ వాటికి దూరంగా వుంచేందుకు కృషి చేయమన్నారు. ‘‘ముట్టకుడి, రుచి చూడకుడి, పట్టుకొనకుడి’’ అని నినదించారు (‘మద్యపాన విసర్జన’, నవంబరు 1909, పు.38`40).
ఒక వ్యాసంలో పూర్వం భారతదేశంలో సురాపాన రహిత స్వర్ణయుగం ఉండేదన్నారు! పూర్వకాలం నుంచీ హిందువులు చాలా మంచి నడవడిక కలవారై ఉండి, పెడమార్గం పట్టగలిగే అవకాశమున్న ‘‘విద్యాధికులూ’’, గొప్ప కుటుంబాలకు చెందిన వారు కూడా ‘‘నీతి, నడవడిక’’ల్లో అందరికీ మార్గదర్శులుగా వుండినారని చెప్పారు. కానీ పోగాలం దాపురించి ‘‘యీ కాలమున’’ కొందరు బీడీలూ, సిగరెట్లూ, చుట్టలూ కాలుస్తూ చిన్న పిల్లలు కూడా ‘‘నిర్భయముగ’’ లంకా దహనం చేసేలా ప్రోత్సహిస్తున్నారని వాపోయారు. ఈ ధూమారాధన వల్ల గొప్ప పరీక్షల్లో నెగ్గి దేశానికీ, వంశానికీ కీర్తి తేగలిగి ‘‘దేశోద్ధారకుల’’వ్వాల్సిన చిన్నవాళ్లు కూడా ‘‘అకాల మృత్యువాత’’ పడుతున్నారని బాధపడ్డారు. మద్యపాన ‘‘దుర్వాడుక’’ వల్ల చాలా మంది భూములూ, ఇండ్లూ అమ్మి ‘‘లక్షాధికారులు భిక్షాధికారులు’’గా మారుతున్న చేదు వాస్తవాన్ని తెలిపారు. పై వ్యాసకర్త ప్రకారం ‘‘పూర్వము మాల మాదిగలు మొదలగు అనాగరికులు మాత్రము దేహ శ్రమ నివారార్థమని సాయంకాలమున కల్లు, సారాయము’’ తాగే వాళ్లు. సారా రుచి మరగడం వల్లే శ్రీకృష్ణ పరమాత్ముడి వంశం వారైన యాదవులు యదు కుల వినాశనానికి కారణమైనారు. పురాణాల్లో మంచి వాళ్లు సురా పారాయణం చేయలేదట! కేవలం ‘‘రాక్షసులు, భూత, ప్రేత, పిశాచాలు’’ మాత్రమే సారా తాగి గంతులు వేసేవారట!! కాబట్టి మీరు వాళ్లలా సారా తాగొద్దన్నారు. గొంతులో విస్కీ ప్రవహించడం, నోట్లోంచి మేఘాలు సృష్టించడం నాగరికతకు మొదటి మెట్టని భావిస్తున్నారనీ, ధనికులైనవారు ‘‘మధుపాన మత్తులై’’ స్వర్గంలో విహరిస్తున్నట్లు భావిస్తున్నారనీ, కింద పడగలరనీ హెచ్చరించారు. హిందువులు బ్రిటిష్ వారి నుండి (‘‘అన్య దేశీయులు’’) యిలాంటి ‘‘విపరీతపు వాడుకలు’’ కాకుండా, ‘‘వారికి గల దేశాభిమానము, ధర్మ కార్యములయందలి దీక్ష, ధైర్య సాహసంబులు’’ మొదలైన మంచి గుణాలు నేర్చుకొని కీర్తివంతులైతే మేలుగా వుంటుందని సలహా యిచ్చారు (‘దుర్వాడుకలు’, ఫిబ్రవరి 1920, పు. 110`112).
‘మద్యపాన నిషేధము’ అనే వ్యాసంలో ‘పొత్తికడుపులో ప్రవేశించినపుడు మద్యసారమేమగును?’ అనే ఉపశీర్షికన ప్రశ్న వేసి కడుపులోకెళ్లిన మహారాజశ్రీ మద్యంగారు ఏయే అరాచక కార్యాలు వెలగబెడతారో వివరించారు. కడుపులోని ‘‘జీర్ణద్రవము’’ మద్యాన్ని జీర్ణం చేసుకోవడం కష్టమవుతుందనీ, అది ‘‘ఎలుక రంపమును’’ కొరకడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుందన్నారు. ఇద్దరు తాగుబోతులకు కొట్లాట జరిగి ఒకడికి గాయమైందనీ, ఆ గాయానికి అగ్గిపుల్ల (‘‘నిప్పుపుల్ల’’) ముట్టిస్తే దాంట్లోంచి ‘‘చిన్న నీలిరంగు మంట’’ పుట్టిందనీ తెలిపారు. (అయినా, ఇదేం బాగా లేదండీ. గాయమైతే మందు పూయాలి గానీ, ‘ఆ మందు’ ఎలా పని చేస్తోందో తెలుసుకోవడానికి అగ్గిపుల్ల గీస్తారా!) (డిసెంబరు 1915, పు.84`85). మద్యం మెదడుపై కల్గించే దుష్ప్రభావాల్ని వివరించిన వ్యాసంలో ‘‘మెదడు దేహమందు ఒక తంతి ఆఫీసువలె’’ (పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్) పని చేస్తుందనీ, మద్య ప్రభావం వల్ల ఆ ‘‘ఆఫీసు’’ సరిగా పనిచేయక పోవడంతో తాగుబోతులు తూలుతుంటారనీ తెలిపారు (‘మద్యసారము. నెం.9 : మెదడు’, సెప్టెంబరు 1910, పు.362). 1913 ఆగస్టు సంచికలో అం. తవిటన్నగారు ‘మద్యపాన నిషేధము’ అనే ఉధృతంగా ప్రవహించిన వ్యాసాన్ని రాశారు. ‘‘కెరొసిన్ నూనె వలె వత్తి లేకుండా మండే’’ మద్యపానం వల్ల కలిగే అనేక రకాలైన కష్టాల్నీ నష్టాల్నీ వివరించి దేహానికీ, దేశానికీ, దారా పుత్రులకూ, ‘‘శత్రువు’’ అయిన మద్యాసురుడికి ‘‘దూరముగ’’ వుండమని హెచ్చరించారు. తన వ్యాసానికి బలం చేకూర్చే విధంగా ‘‘శ్రీయుత గైనేడి వేంకటస్వామి నాయుడుగారు’’ రాసిన సురా వ్యతిరేక పద్యాల్ని ఉటంకించారు. ఇంతదాకా వచనం చూశాం కదా! ఇప్పుడు మద్యం వద్దన్న పద్యాన్ని చదువుదాం.
‘‘సీ. మేడలు మిద్దెలు మెరుగైన చావుండ్లు జమ్మీలు జాగీరు లమ్మవలయు
బరువైన గుఱ్ఱముల్బండి యెద్దులు లక్క పల్లకీ వేలంబు బాడవలయు
గంచాలు ముంతలు మంచాలు కుర్చీలు పెట్టియల్ సంతలో బెట్టవలయు
గట్టుకోకలు పట్టుపుట్టముల్ జలతారు దట్టీలు తాకట్టు బెట్టవలయు.
తే. బిదప బిడ్డల నోటను బెడ్డగొట్టి
యవల బెండ్లాము మెడపుస్తె నమ్మవలయు
మధురసం బభ్యసించిన మనుజ పశువు
మాన దగునోయి తగదోయి మద్యపాయి.’’
మేడలూ, మిద్దెలూ, గుఱ్ఱబ్బండ్లూ, పల్లకీలూ వున్న లక్ష్మీపుత్రులే కాదు, దినమంతా కష్టపడి పని చేసినందువల్ల కలిగే ఆయాసాన్ని తీర్చుకోవడానికి ఆ రోజు కష్టపడి సంపాదించుకున్న కూలీని కల్లంగడికి తగలేసే ఇనుప గజ్జెల తల్లి బిడ్డలకు కూడా ఆ పని ఎంత మాత్రం మంచిది కాదని గట్టిగా హెచ్చరించారు తవిటన్నగారు. కల్లు తాగే బదులు చల్లగాలిలో కూర్చునో, కాసేపు పడుకునో, ‘‘భగవంతుడు సృష్టించిన నిర్మలమైన’’ నీళ్ళు త్రాగో సేదదీరితే యెంతో హాయిగా వుంటుంది కదా అని అనునయించారు. మద్యోన్మత్తులను ‘‘నరాధము’’లని ఈసడిరచి, మనోబలం వుంటే మద్యం ఖైదు నుంచి తప్పకుండా ‘‘విడుదల’’ కావచ్చని నొక్కి చెప్పి, ‘‘త్రాగుడు శతృవు’’కు చాలా చాలా దూరంగా వుండమని భారతీయుల్ని ఘాటుగా హెచ్చరించారు తవిటన్నగారు (పు. 342`344).
ఇప్పుడు కొన్ని అంకెలు. డి. దావీదుగారు (లక్నో) ‘మద్యపాన మహాత్మ్యము’ అనే చిన్న వ్యాసం రాశారు. దాని ప్రకారం, 1908`09 సం॥లో సారాయిపై వసూలైన ఎక్సైస్ రెవిన్యూ (జుఞషఱంవ Rవఙవఅబవ) విలువ అక్షరాలా 660 లక్షల రూపాయలు. మొత్తం సారా వెలలో ఒకే ఒక్క శాతమైన ఎక్సైజ్ డ్యూటీ వెలే 660 లక్షల రూపాయలుంటే యిక మొత్తం సారా ధర ఎంతుంటుందో ఊహించుకోండన్నారు. ‘‘పల్లెటూరి బీదలు’’ ఎక్కువగా సారాయిని వాడతారనీ, వాళ్లీవిధంగా లక్షలకొద్దీ డబ్బు సారాయికి తగలేస్తే వాళ్ల స్థితిగతులెట్లా వుంటాయో సులభంగా వూహించుకోవచ్చన్నారు. విద్యావంతులైన యువకులు చాలా మంది త్రాగుబోతులౌతున్నారనీ, నీతి ప్రవర్తన కలిగి యితరులకు మార్గదర్శకులవ్వాల్సిన క్రైస్తవుల్లో సైతం ఈ జబ్బు ప్రబలుతోందనీ బాధపడ్డ దావీదుగారు మద్యపాన దుష్ఫలితాల్ని ఒక పద్యం రూపంలో ప్రకటించారు.
‘‘తే. దిక్కుమాలిన త్రాగుడు వెక్కసముగ
క్షామరోగాదులను మించి జయము గాంచి
మనుజ సంతతి ప్రాణముల్ గొనుచు ధరను
బ్రబలుచున్నది యనుమాట వాస్తవమ్ము.’’
కాబట్టి ‘‘వాస్తవమైన’’ పై మాటల్ని ‘‘విశ్వసించి’’ పాఠకులందరూ దేశ క్షేమం కోసం పాటుపడాలని కోరారు దావీదుగారు (జూలై 1912, పు.313).
మద్యపాన దుష్ఫలితాల్ని అనేక రచనల ద్వారా వివరించిన ‘వివేకవతి’, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మద్యపాన వ్యతిరేక ఉద్యమాలను గురించి కూడా తెలియజేసేది. 1911 జూలై సంచికలో రష్యాలో జరుగుతున్న మద్య నిషేధ వుద్యమం గూర్చి తెలిపింది. 1911వ సంవత్సరం ప్రారంభంలో మొట్టమొదటి సారిగా రష్యాలో ‘‘మద్యపాన నిషేధక మహాసభ’’ జరిగిందనీ, అందులో 400 మంది డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ, 80 మంది ‘‘వార్తా పత్రికాధిపతులూ’’ పాల్గొని ‘‘త్రాగుబోతుతనమునకు విఱుగుడు మద్యపాన నిషేధమే’’ అని తీర్మానించారనీ, ‘‘సంపూర్ణమైనట్టియు ప్రసిద్ధమైనట్టియు’’ బహిరంగ ప్రదర్శన చేశారనీ, అలాంటి ప్రదర్శన ప్రపంచంలోని మరే యితర దేశంలోనూ జరగలేదనీ తెలిపారు. మద్యం వల్ల రష్యాకు సంవత్సరానికి 5 కోట్ల పౌనుల రాబడి వస్తుండడం వల్ల ప్రభుత్వం మద్య నిషేధానికి వ్యతిరేకంగా వుందని చెప్పారు. రష్యాలోని ‘మద్యపాన నిషేధ సంఘము’లో 70,000 మంది సభ్యులున్నారనీ, ఆ సంఘం కృషి వల్ల ప్రజల్లో మార్పు కలిగి రష్యా వారి ‘‘దుస్థితికి మద్యపానమే ప్రధాన కారణమని’’ వారు భావిస్తున్నారనీ వివరించారు. ప్రభుత్వం కూడా కొంతవరకు స్పందించి ప్రతి సారా దుకాణం మీదా రాజ చిహ్నమైన గరుడ పక్షి పటాన్ని తీసేసి, దాని స్థానంలో మానవ పుఱ్ఱెను వుంచాలని డ్యూమా ఆజ్ఞలు జారీ చేసిందనీ, అలాగే ప్రతి సారా బుడ్డీ మీదా అందులో వున్న మద్యం శాతమూ, దాని దుష్ప్రభావమూ తెలుపుతూ లేబుల్ తగిలించే విషయం పరిశీలిస్తోందనీ తెలిపారు (‘మద్యపాన విసర్జన విషయములు ` లోకములో కలుగుచున్న యభివృద్ధి, నెం.4’, పు.317). (మన దేశంలో కూడా ప్రతి మద్యం షాపుపై పుఱ్ఱెలు వేలాడగడితే బాగుంటుందేమో! పుఱ్ఱెలు వద్దనుకుంటే ఒక అస్థిపంజరాన్ని పెట్టొచ్చు!!)
వలస భారతదేశంలో కూడా మద్యపాన వ్యతిరేక సంఘాలు ముమ్మరంగా పనిచేశాయి. ఆ వార్తల్ని విశేషంగా ప్రచురించేది ‘వివేకవతి’. సైన్యంలో తాగుడు ఒక ఫేషను – అప్పుడూ, ఇప్పుడూ. (యుద్ధమొస్తే రక్తం తాగాలిగాÑ దాని కోసం ట్రైనింగ్ ఏమో!) మద్య నిషేధ సంఘం (‘‘మద్యపాన విసర్జన సంఘము’’) కృషి ఫలితంగా బ్రిటిష్ సైన్యంలో దాదాపు సగం మంది మద్యం వద్దన్నారట. ‘‘ఇండియాలోని శ్రేష్ఠులలో’’ కూడా ‘‘కొందరు’’ మద్యపానాన్ని వదిలేశారు. బ్రిటిష్ పాలిత భారతదేశంలోనే కాకుండా స్వదేశీ సంస్థానాల్లో కూడా మద్యానికి వ్యతిరేకంగా పని జరిగింది. బరోడా సంస్థానాధీశుడు తన సంస్థానంలోని ఏదైనా ప్రదేశంలో నూటికి 60 మంది ప్రజలు వద్దంటే సారా దుకాణం తెరవకూడదని ఆజ్ఞాపించారు (ఏప్రిల్ 1912, పు. 216). (ఇప్పుడైతే ఒక్కడు కావాలంటే రెండు బెల్టు షాపులు తెరిచి, తాగినాక పెండ్లాన్ని బాదడానికి బుడ్డీకో బెల్టు, బై బుడ్డీ గెట్ ఎ బెల్ట్ స్కీమ్ కింద, యిచ్చేస్తారు!). చాలా మంది స్వదేశీ సంస్థానాధీశులు మద్యపాన నిషేధోద్యమానికి గట్టి మద్దతు తెలిపారు. ఉదయపూర్ సంస్థానాధీశుడు ‘‘ఆంగ్లో ఇండియన్ మద్యపాన విసర్జన సంఘము’’నకు గొప్ప ఆర్థిక సహాయం చేశారు. ఇంకో స్వదేశీ సంస్థానాధీశుడు (సంస్థానం పేరివ్వలేదు) 18 సంవత్సరాల లోపు వారు ‘‘మత్తు పదార్థాలు’’ సేవించరాదని ఆజ్ఞాపించారు (‘మద్యపాన విసర్జన విషయములు’, ఏప్రిల్ 1912, పు. 216).
‘వివేకవతి’ మద్యాసురులకే కాకుండా ధూమాసురులకు కూడా బద్ధ వ్యతిరేకి. 1910`1911 సంవత్సరాల మధ్య ‘‘బ్రిటిష్ ఇండియాలోనికి’’ 35 లక్షల రూపాయల విలువ గల 10,25,000 పౌండ్ల సిగరెట్లు దిగుమతి అయ్యాయని తెలిపి, సిగరెట్ల వల్ల యువకులకు అమితమైన హాని కల్గుతోందనీ, జాగ్రత్త పడకపోతే (చైనాలో) నల్లమందు చేసిన ఘోరాల్నే భారతదేశంలో సిగరెట్లూ చేయగలవని హెచ్చరించింది (‘సిగరెట్లు’, డిసెంబరు 1915, పు.85). ‘చుట్టలు, సిగరెట్లు, బీడీలు త్రాగుట వలన గలుగు చెడుగులు’ అనే వ్యాసంలో ధూమపానం వల్ల కలిగే 21 దుష్ఫలితాల్ని లిస్ట్ చేసి ధూమపానానికి దూరంగా ఉండమని ప్రబోధించే రెండు పద్యాల్ని ప్రచురించారు.
‘‘కం॥ పొగచుట్టలు బీడీలును
సిగరెట్లును ద్రాగబోకు చెడిపోవును నీ
సొగసైన రొమ్ము భాగము
నగుబాట్లగు జిన్ననాడె నమ్ము సుపుత్రా.
గీ॥ పెదవులను మాడ్చు గుండెల బిగువు నడఁచుఁ
బరుల కతిహేయ మొదవించుఁ బలముఁ దొలచుఁ
నుబ్బసంబును బుట్టించు నుసురులఁ గొను
గాన చుట్టలఁ ద్రాగఁగఁ బూనకయ్య.’’ (మార్చి 1921, పు.134`135).
1910`1911 మధ్య భారతదేశానికి దిగుమతైన సిగరెట్ల విలువ 35 లక్షల రూపాయలని తెలిపారు డి. దావీదుగారు. అమెరికాలో ధన బలంతో మదించిన కొంతమంది కరెన్సీ నోట్లను కాల్చి, వాటితో తమ చుట్టల్ని ముట్టించుకుంటారనీ, అదేవిధంగా భారతీయులు ఒకే ఒక్క సంవత్సరంలో 35 లక్షల రూపాయల్ని సిగరెట్లతో ‘‘కాల్చి బుగ్గి’’ చేశారనీ నిష్ఠూరంగా చెప్పారు (‘మద్యపాన మహాత్మ్యము’, జూలై 1912, పు.313). మొత్తం మీద దున్నపోతులుగా పుట్టినా ఫర్వాలేదు గాని బీడీకాడికి పోవద్దని భారతీయుల్ని గట్టిగా హెచ్చరించిన వివేకవంతురాలు ‘వివేకవతి’. ‘వివేకవతి’ క్రైస్తవాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసింది. ‘దైవభక్తి విషయములు’ అని ప్రత్యేకంగా నిర్వహించిన కాలమ్ ద్వారానే కాకుండా క్రీస్తు మతాన్ని ప్రచారం చేసే అనేక ఇతర రచనల్ని ప్రచురించడం ద్వారా క్రైస్తవాన్ని అసలు సిసలైన ధర్మంగానూ, జీసస్‌ను నిజమైన దేవుడిగానూ ప్రచారం చేసింది. సామర్లకోట నుండి పోతుల సాలమన్ గారు (సాల్మన్) రాసిన ‘పరిశుద్ధ గ్రంథము’ అనే చిన్న వ్యాసంలో ‘‘ప్రపంచమందుండు గ్రంథములలోనికెల్ల బైబిలను వేద గ్రంథము మిక్కిలి పూజితమైన’’దని పవిత్ర బైబిల్ గొప్పదనాన్ని తెలియజేశారు. ఆయన ప్రకారం, బైబిల్‌లోని ‘‘చరిత్రాంశములు సత్యమైనవి’’. ‘‘ఈ గ్రంథము ప్రయాణికునికి మార్గమును జూపు పటము వంటిదియును, నావికునికి కంపసు వంటిదియును, యుద్ధ భటునకు కత్తి వంటిదియునై యున్నది’’. అంతేకాక, అది దు:ఖంలో వున్న వారికి ఓదార్పునిచ్చి, ఆకలితో అలమటించే వారికి ఆహారంలానూ, చీకట్లోవున్న వారికి వెలుగునిచ్చేదిగానూ, దోవ తప్పిన వారికి దోవ చూపించేదిగానూ, రోగులకు వైద్యునిలానూ, అలసిపోయిన వారికి సౌఖ్యాన్నిచ్చే మెత్తని పరుపులాగానూ, పేదవాళ్లకు స్నేహితునిలానూ, ధనికులకు నీతిమార్గంలో నడిపించేదిగానూ పనిచేస్తుంది. కాబట్టి ‘‘జ్ఞానము పొందుటకది చదువుము. రక్షణ కొరకు నమ్మికయుంచుము … ప్రార్థన పూర్వకముగా దానిని చదివి యందలి సారాంశమును గ్రహింపుము’’ అని బైబిల్ గొప్పదనాన్ని తెలుసుకొండని సలహా యిచ్చారు (జూన్ 1921, పు.213`214).
మార్కాపురం నుండి లూసి అమ్మాళ్ గారు రాసిన ‘నిజమైన దేవుడెవరు?’ అనే వ్యాసంలో హిందువుల విగ్రహారాధనను తీవ్రంగా ఖండిరచారు. హిందువులు దేవుడిగా భావించి పూజించే విగ్రహం ఊపిరి లేనిదనీ, కిందపడ్తే బద్దలై తునకలై పోతుందనీ, పొయ్యిలో వేస్తే కాలి మసై పోతుందనీ తెలిపి, ఏదైనా కష్టమొస్తే సామాన్యులైన మనుషులే తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారనీ, కానీ కిందగానీ, పొయ్యిలోగానీ పడ్డ విగ్రహంలోని దేవుడు తనను తాను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాడనీ ప్రశ్నించారు. విగ్రహారాధన చేసేవారు ‘‘పిల్లలవలే ఆట్లాడువారుయని చెప్పవచ్చు’’నని తేల్చిపడేశారు. ‘‘మనుష్యులు చేసిన విగ్రహములలో పరిశుద్ధమైన సృష్టికర్త వచ్చి వాసము’’ చేయడనీ, ‘‘మనము ఒకే దేవుని ఆరాధించవలె’’ననీ, ‘‘అనేక దేవుళ్లను నమ్మిన యెడల వారిలో సత్యదేవుడు యెవరని తెలుసుకొనుట కష్టము’’ అంటూ జీసస్ ఒక్కరే నిజమైన దేవుడన్నారు (నవంబరు 1915, పు.57`59).
‘ఈస్టర్ సాధకము: ‘‘ప్రపంచము క్రీస్తు కొరకు’’ అనే నాటికలో దీనత్వంతో నిండిన ఆఫ్రికా, చైనా, జపాన్, దక్షిణ అమెరికా దేశాలు పాత్రలుగా ప్రవేశించి సువార్తను వ్యాపింపజేయడం ద్వారా తమను చీకటి నుండి బయట పడేయమని కోరుకుంటాయి. ఇండియాతో యిలా చెప్పించారు: ‘‘నేను ఇండియా దేశములోని విధవలు, బాల విధవల యొద్ద నుండి వచ్చుచున్నాను. రక్షణ స్త్రీల కొరకునై యున్నదనియు, మా శ్రమలును శోధనలును తీరిన తర్వాత దేవుడు మా కొరకు మోక్షమందు సుందర గృహమును సిద్ధపరచెననియు సువార్తను మీరు మాకు పంపువరకు మా గతి ఘోరముగా నుండెను. మీ సోదరీమణులలో చాల మంది మాకు క్రీస్తును గూర్చి చెప్పి మేము పవిత్రముగా జీవింప బోధించినందుకు కృతజ్ఞులమై యున్నాము. మాలో బాల్య వివాహములు లేకుండ మా ప్రజలు చట్టము చేయునట్లును యేసు ప్రేమను గూర్చిన సువార్త మరి మరి శీఘ్రముగా వ్యాపించునట్లును మీరు ప్రార్థింపవలెనని కోరుచున్నాను …’’ ప్రార్థనలన్నీ అయ్యాక నాటిక చివరిలో ఎల్సి (ప్రధానపాత్రÑ‘యిచ్చే’పాత్ర) ‘‘మీ అవసరములు నాకిప్పుడు పూర్ణముగా తెలిసినవి. మనయభిమానములొక్కటే గనుక ఇకమీదట సమస్త ప్రపంచము మన ప్రభువైన యేసుక్రీస్తును తెలిసికొనునట్లు మనమందరము కలసి పనిచేతుము’ అంటుంది (మార్చి 1918, పు. 126`137).
క్రైస్తవ విద్యార్థికీ, హిందూ విద్యార్థికీ మధ్య జరిగిన సంభాషణ రూపంలో చేసిన ఒక రచనలో క్రైస్తవుడు హిందువుతో ‘‘హిందువులు జీవము లేని రాళ్లకు, కర్రలకు ముస్తాబు చేసి, మీ శబ్దము (ప్రార్థన) అవి వినలేనివైనను, వాటిని పూజించి యిండ్లకు వెళ్లుదురు. ఇది నిజమా? అబద్ధమా?’’ అని నిలదీస్తాడు. ఇలాంటి ‘‘అసహ్య కార్యములు’’ చేస్తే మనల్ని పుట్టించిన అసలు సిసలు దేవుడు ‘‘ఓర్చడు’’ అంటాడు. ‘‘అట్టి దేవుడు నరులమైన మనకు ఏమైన ఉపకారములు చేస్తున్నాడా?’’ అని అడిగిన హిందువుతో, క్రైస్తవుడు ‘‘నరులమైన మనమందరము చెడిపోతుండగా దేవుడు కనికరించి తన ఒకే కుమారుని ఈ లోకమునకు పంపినాడు. ఆయన వచ్చి మనకు రావలసిన శిక్ష తప్పించుటకు తాను బలిjైు చనిపోయి, తిరిగి లేచి పరలోకమునకు వెళ్లి, తన్ను నమ్మి పాపము విడిచి తనకు లోబడిన వారందరిని రక్షిస్తానని చెప్పినాడుÑ చెప్పుచున్నాడు’’ అని వివరిస్తాడు. ‘‘ఇది గొప్ప సంగతేనండి … దీనికి రుజువు ఏమైనా వున్నదా?’’ అని కుతూహలంలో ప్రశ్నించిన హిందువుతో ‘‘కావసినంత సాక్ష్యమున్నది … అది ఒక దివ్యమైన పరిశుద్ధ గ్రంథమునచ్చుపడి వున్నది’’ అని సమాధానమిచ్చిన క్రైస్తవుడు జీసస్ పుట్టుకను గురించి తెలియజేస్తాడు. క్రైస్తవుడి మాటలు విన్న హిందువు తను కూడా ‘‘ఆ రక్షకుని సేవించుటకు ఆశపడుచున్నా’’నీ, అయితే చిన్నప్పట్నుంచీ ‘‘విగ్రహారాధన మొదలగు అనేక పాపకార్యములు’’ చేసి వుండటాన జీసస్ తనను అంగీకరిస్తారో లేరో అని అనుమానంగా వుందంటాడు. దానికి సమాధానంగా క్రైస్తవుడు ‘‘మేమున్ను పూర్వము మీవలెనే అనేక పాపములకు లోబడిన వారము. అయితే యిప్పుడు మేము సైతాను స్థాపించిన ఆచారములను విడ్చి యీ రక్షకుని నమ్ముకుని ఆయనను సేవించుచున్నాము. ఎటువంటి (కరుడుగట్టిన) పాపిjైునా తనను ఆశ్రయించు వాని రక్షించెదనని ఆ ప్రభువే చెప్పుచున్నాడు’’ అని కన్విన్స్ చేస్తాడు. ‘‘ఎట్టివారైనను తమ పాపములను గూర్చి దు:ఖపడి, వాటిని విడిచి, ఆయన పాదమునాశ్రయించితే (కరుణామయుడైన) ఆ ప్రభువు మన పాపములు క్షమించి తన సన్నిధికి చేర్చుకుంటాడు. గనుక తమరు త్వరగా ఆయనను ఆశ్రయించండి’’ అని తొందర పెడతాడు. ఇలా తొందరపెడ్తే ఎలాగండీ, పూర్వం నుండీ వస్తున్న ఆచారాల్నీ, బంధువుల్నీ అంత త్వరగా ఎలా విడవగలనండీ అని సంకోచిస్తున్న హిందువుతో ‘‘ఆలస్యం, అమృతం విషం’’ అని భయపెడ్తాడు. అమృతం వైపు మొగ్గిన హిందువు రక్షణ పొందుతాడు (అదపాక పోలయ్య, ‘దైవభక్తి విషయములు: క్రిస్మస్ దినమున క్రైస్తవాలయములో హిందూ క్రైస్తవ విద్యార్థులకు గలిగిన సంభాషణ’, డిసెంబరు 1913, పు.88`92).