ప్రేమ, మహానగరంలో ఉండడానికొక సొంత తావు… -ఆకాంక్ష / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపుతో భవిష్యత్తులో కలిసి జీవించడం కోసం పోరాడుతున్న గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఒక యువతి, ఒక ట్రాన్స్‌ మ్యాన్‌ తమ ప్రేమ కథను ఇలా పంచుకున్నారు.
జబ్‌ ప్యార్‌ కియా తో డర్నా క్యా…
ప్యార్‌ కియా కోయీ చోరీ నహీ..
ఘట్‌ ఘట్‌ కర్‌ యూఁమర్నా క్యా…

ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి… ప్రేమ నేరం కాదే… ఇలా ఊపిరాడక ఎందుకు చనిపోవాలి…
60న నాటి క్లాసిక్‌ సినిమా మొఘల్‌`ఎ`ఆజమ్‌లోని ఈ పాటను కొంతసేపటి నుండి కూని రాగం తీస్తోంది విధి. ఆమె సెంట్రల్‌ ముంబైలో కొత్తగా అద్దెకు తీసుకున్న గదిలో ఉంది. పాట పాడటం ఆపి, ‘‘మేం కూడా ఏ నేరం చేయలేదు. మరి మేమెందుకు భయపడి బ్రతకాలి?’’ అని ఆమె ప్రశ్నించింది.
అది ఆమె మాట వరసకు వేసిన ప్రశ్న కాదు, ఎంతో ఇబ్బంది పెట్టే ప్రశ్న. చంపేస్తారేమోనన్న ఆమె భయం నిజమైనదే. తన కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగి, తను ప్రేమించిన వ్యక్తి, పాఠశాలలో ఆమె తోటి విద్యార్థిని ఆరుషితో పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆమె ఆ భయంతోనే బ్రతుకుతోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వారి బంధానికి చట్టబద్ధత వచ్చే మార్గం మాత్రం సుదీర్ఘమైనది, దుర్భరమైనది, కఠినమైన సవాళ్ళతో నిండి ఉంది. వారి కుటుంబాలు వారి సంబంధాన్ని ఆమోదించవని భయపడుతున్నారు. అలాగే, సమాజంలో స్త్రీగా గుర్తించబడిన ఆరుషి, తన లైంగిక గుర్తింపు కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా వారు అర్థం చేసుకోరని తెలుసు. ఆరుషి తనను తాను ఒక ట్రాన్స్‌ మ్యాన్‌గా గుర్తించుకున్నాడు. ఆరుష్‌ అనే పేరును ఎంచుకున్నాడు.
మహానగరానికి వచ్చి, తమ కుటుంబాల నుంచి విముక్తి పొందామని వారు భావించారు. విధి కుటుంబం ఠానే జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తుంది. ఇది పొరుగున ఉన్న పాలఘర్‌ జిల్లాలోని ఆరుష్‌ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విధి (22) మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన తరగతి (ఓబిసి)గా జాబితా చేసిన అగ్రి సముదాయానికి చెందినది. ఆరుష్‌ (23) కున్భీ సముదాయానికి చెందినవాడు. అంటే ఓబిసి అయినప్పటికీ, సామాజికంగా వారి గ్రామాల్లో ఉన్న కఠినమైన కులాల శ్రేణిలో అగ్రి కంటే కున్భీ ‘నిమ్న’ వర్గం కిందికి వస్తుంది. ఇద్దరూ తమ ఇళ్ళను వదిలి ముంబైకు వచ్చి ఒక సంవత్సరమయింది. తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం వారిద్దరికీ లేదు. తన కుటుంబం గురించి ఆరుష్‌ అంతగా ఏమీ పంచుకోలేదు కానీ ‘‘నేను ఒక కచ్చా ఇంట్లో (పూరి గుడిసె) నివసించేవాడిని. ఆ విషయమై నేనెప్పుడూ సిగ్గుపడేవాడిని. దాని గురించి నేను అయి (తల్లి)తో చాలాసార్లు గొడవపడ్డాను కూడా’’ అని మాత్రం చెప్పాడు.
ఆరుష్‌ తల్లి కోడిగుడ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.6,000 సంపాదిస్తారు. ‘‘బాబా (తండ్రి) గురించి అడగవద్దు. వడ్రంగి, వ్యవసాయ కూలీ లాంటి ఏ పనైనా చేస్తాడు. అతను సంపాదించిన డబ్బును తాగడానికి ఖర్చు చేసి, ఇంటికి వచ్చి ఆయిని, మమ్మల్ని కొట్టేవాడు’’ అని ఆరుష్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అనారోగ్యం పాలవడంతో, అతని తండ్రి పని మానేసి, భార్య సంపాదనతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఈ సమయంలోనే పాఠశాలకు సెలవు కావడంతో ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, మెడికల్‌ స్టోర్‌లో పని చేయడం మొదలుపెట్టాడు ఆరుష్‌.
… … …
2014లో 8వ తరగతి చదవడానికి కొత్త పాఠశాలకు మారినప్పుడు విధిని మొదటిసారి కలిశాడు ఆరుష్‌. ఆ మాధ్యమిక పాఠశాలకు వెళ్ళడానికి అతనికి ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ‘‘మా ఊరిలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఏడవ తరగతి వరకే ఉంది. ఆపై చదవడానికి మేం బయటకు వెళ్ళవలసి వచ్చింది.’’ కొత్త బడిలో చేరిన మొదటి సంవత్సరంలో వారు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. ‘‘మేము అగ్రి ప్రజలతో మమేకం కాలేకపోయాం. వారికి వేరే గ్రూప్‌ ఉండేది. విధి దానిలో సభ్యురాలు’’ అని ఆరుష్‌ తెలిపాడు. 9వ తరగతి చదువుతున్నప్పుడు వారి స్నేహం వికసించింది. ఆరుష్‌ విధిని ఇష్టపడటం మొదలయింది.
ఒకరోజు అందరూ ఆడుకుంటున్న సమయంలో, తన మనసులో భావాలను విధికి చెప్పాడు ఆరుష్‌. తను ఆమెను ఇష్టపడుతున్నానని తడబడుతూ చెప్పాడు. అప్పుడామెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయోమయంలో పడిరది. ‘‘గతంలో ఒక అమ్మాయితో తనకున్న సంబంధం గురించి కూడా ఆరుష్‌ నాతో చెప్పాడు. అది తప్పు కాదు కానీ వాళ్ళు (ఇద్దరు అమ్మాయిలు) కలిసి ఉండటం వింతగా అనిపించింది నాకు’’ అని విధి వివరించింది.
‘‘మొదట నేను కుదరదని చెప్పాను. కానీ, చాలాకాలం తర్వాత, చివరికి నేను తనని అంగీకరించాను. నాకూ ఇష్టమేనని ఎందుకు చెప్పానో తెలియదు. అదలా జరిగిపోయింది. నేను అతన్ని ఇష్టపడ్డాను. తప్పు`ఒప్పు లాంటి వాటి గురించి నా మనసు ఆలోచించలేదు. మా క్లాసులో ఎవ్వరికీ మా గురించి తెలియదు’’ అని ఆమె తేలికగా నిట్టూర్చింది. ‘‘ప్రపంచమంతా మమ్మల్ని ఇద్దరు అమ్మాయిలుగా, మంచి స్నేహితులుగా మాత్రమే చూసింది’’ అంటూ ఆరుష్‌ మాట కలిపాడు. అయితే, వారి స్నేహం గురించి, కుల భేదం గురించి వాళ్ళ బంధువులు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ‘‘ఒకప్పుడు, అగ్రి సముదాయానికి చెందినవాళ్ళు మమ్మల్ని (కున్భీ వర్గాన్ని) పనివాళ్ళుగా చూసేవారు. తక్కువ కులంగా పరిగణించేవారు. ఇది చాలాకాలం క్రితం జరిగింది. కానీ ఇప్పటికీ కొంతమంది ఆలోచనల్లో ఇదే భావన ఉంది’’ ఆరుష్‌ వివరించాడు. కొన్ని సంవత్సరాల క్రితం, తమ గ్రామానికి చెందిన ఒక హెటిరో సెక్సువల్‌ (భిన్న లింగ సంపర్కులు) జంట పారిపోయినప్పుడు జరిగిన భయానక సంఘటనను అతను గుర్తు చేసుకున్నాడు. వారిద్దరూ ఒకరు కున్భీ, ఇంకొకరు అగ్రి సముదాయాలకు చెందినవారు. వారి కుటుంబాలు వారిని వెంబడిరచి మరీ కొట్టారు. మొదట్లో ఆరుష్‌ తల్లికి వారి స్నేహం ఇబ్బందిగా కనిపించలేదు. ఇద్దరు అమ్మాయిలు సన్నిహితంగా ఉంటున్నారని మాత్రమే ఆమె భావించారు. కానీ ఆరుష్‌ తరచుగా విధి ఇంటికి వెళ్ళటం ఆమెను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా ఆంక్షలు విధించారు.
విధి తండ్రి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకును సరఫరా చేసేవారు. విధి పదమూడో ఏట, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి తన తండ్రి, సవతి తల్లి, నలుగురు తోబుట్టువులతో (అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు, ఒక (సవతి) తమ్ముడు) కలిసి నివసించేది. సవతి తల్లికి ఆరుష్‌ అంటే ఇష్టం లేకపోవడంతో అతనితో తరచూ గొడవపడేది. ప్రస్తుతం ముప్ఫైల వయసులో ఉన్న విధి అన్నయ్య అప్పుడప్పుడు తండ్రితో కలిసి పనిచేస్తూ, కుటుంబ సభ్యుల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించేవాడు. అక్కాచెల్లెళ్ళను కొట్టడంతో పాటు దుర్భాషలాడేవాడు. కానీ అతనే కొన్నిసార్లు విధిని ఆరుష్‌ ఇంటి దగ్గర దించేవాడు. ‘‘మా అన్నయ్య ఆరుష్‌ను ఇష్టపడుతున్నానని అప్పుడప్పుడూ చెబుతుండేవాడు. అది చాలా చిరాగ్గా అనిపించేది. కానీ ఏం చేయాలో మాకు తెలిసేది కాదు’’ విధి గుర్తు చేసుకుంది. ‘‘ఆరుష్‌ మాత్రం మౌనంగా ఉండేవాడు. మా అన్నయ్య ప్రేమ ప్రతిపాదనలను పట్టించుకునేవాడు కాదు, కనీసం అలా అయినా మేము కలుసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో.’’
కానీ చివరికి, విధి, ఆరుష్‌ ఇంటికి వెళ్ళడాన్ని ఆమె అన్నయ్య కూడా వ్యతిరేకించేవాడు. ‘‘ఆరుష్‌ తనకు సానుకూలంగా స్పందించలేదన్న కారణమో లేదా మా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం వల్లనో, అతనికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు’’ అంది విధి. ఆరుష్‌ తరచూ ఇంటికి వస్తున్నాడు, రోజూ అన్నిసార్లు ఎందుకు ఫోన్‌ చేసి మెసేజ్‌లు పంపేవాడని విధి అక్క కూడా ఆమెను అడిగేది. ఇదే సమయంలో ఆరుష్‌ తన లైంగిక ప్రాధాన్యం గురించి వ్యక్తపరచడం మొదలుపెట్టాడు. మగ శరీరంతో బతకాలని కోరుకోసాగాడు. విధితో మాత్రమే తన ఆలోచనలను పంచుకోగలిగాడు. ‘‘అప్పట్లో ‘ట్రాన్స్‌ మ్యాన్‌’ అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మగ శరీరంలో ఉండాలని చాలా ఆరాటపడ్డాను’’ అన్నాడు ఆరుష్‌.
అతను ట్రాక్‌ ప్యాంట్‌, కార్గో ప్యాంట్‌, టీ షర్టుల లాంటి బట్టలు ధరించడానికి ఇష్టపడ్డాడు. ఒక మగాడిలా బట్టలు వేసుకోవాలనే అతని బహిరంగ ప్రయత్నాలు అతని తల్లిని ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆమె ఆ బట్టలను దాచిపెట్టడానికో, చింపడానికో ప్రయత్నించారు. ఆరుష్‌ మగ వేషంలో ఉన్నప్పుడు ఆమె అతడిని తిట్టేవారు, కొట్టేవారు కూడా. అతనికి అమ్మాయిల బట్టలు తెచ్చేవారు. ‘‘నాకు సల్వార్‌ కమీజ్‌ వేసుకోవడం ఇష్టంలేదు’’ అని ఆరుష్‌ చెప్పాడు. ఆరుష్‌ అమ్మాయిల బట్టలు ధరించే ఏకైక ప్రదేశం పాఠశాల మాత్రమే (యూనిఫాం). కానీ అది తనని ‘ఉక్కిరిబిక్కిరి చేసేదని’ అతను ఒప్పుకున్నాడు.
పదవ తరగతిలో ఆరుష్‌కు బహిష్టులు రావడం మొదలయ్యాక అతని తల్లికి కొంత ఉపశమనం లభించింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. సుమారు ఒక సంవత్సరం తర్వాత, ఆరుష్‌ నెలసరి క్రమం తప్పుతూ వచ్చి చివరికి ఆగిపోయింది. దాంతో తనని వైద్యుల దగ్గరికి, బాబాల దగ్గరికి తీసుకువెళ్ళారు ఆవిడ. ఒక్కొక్కరు రకరకాల మాత్రలు, కషాయాలు ఇచ్చారు. కానీ ఎలాంటి మార్పూ రాలేదు.
ఇరుగుపొరుగు వారు, ఉపాధ్యాయులు, బడిలో తోటి విద్యార్థులు అతడ్ని ఆటపట్టించసాగారు. ‘‘అమ్మాయిలా ఉండు… నీ పరిమితుల్లో నువ్వుండు అనేవారు. నాకు పెళ్ళి వయసు వచ్చిందనే స్పృహను నాలో కలిగించేవారు’’.తాను వేరుగా ఉన్నాడన్న భావం కలగడంతో ఆరుష్‌ తనను తాను అనుమానించుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడూతనపై తాను విసుగు చెందేవాడు. ‘‘నేనేదో తప్పు చేసినట్లు నాకు అనిపించేది’’ అని అతను వివరించాడు.
11వ తరగతిలో ఉండగా ఆరుష్‌కు మొబైల్‌ ఫోన్‌ వచ్చింది. లింగ నిర్ధారణ శస్త్ర చికిత్స ద్వారా ఒక అమ్మాయి అబ్బాయిలా ఎలా మారవచ్చన్న విషయంపై ఆన్‌లైన్‌లో గంటలకొద్దీ పరిశోధించాడు ఆరుష్‌. విధికి మొదట్లో ఈ విషయంపై సంకోచాలుండేవి. ‘‘అతను ఎలా ఉంటాడో నాకు అలాగే నచ్చాడు. మొదటినుండి దాని గురించి నిజాయితీగా ఉన్నాడు. శారీరకంగా మారాలని కోరుకున్నంత మాత్రాన అతని స్వభావం మారదు కదా’’ అంది ఆమె.
… … …
విధి 12వ తరగతి తర్వాత 2019లో చదువు మానేసింది. పోలీసు అధికారి కావాలని అనుకున్న ఆరుష్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సిద్ధం కావడానికి పాలఘర్‌లోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. అతను మహిళా అభ్యర్థిగా, ఆరుషిగా దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అయితే, 2020లో దేశవ్యాప్తంగా కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినపుడు సదరు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. దాంతో, కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.
లాక్‌డౌన్‌ కారణంగా ఆరుష్‌, విధిలకు కాలం కఠినంగా మారింది. విధి ఇంట్లో ఆమె పెళ్ళి గురించిన చర్చలు మొదలయ్యాయి. అయితే, ఆరుష్‌తో కలిసి బతకాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు ఆమెకు తెలుసు. అందుకు ఇంటినుండి పారిపోవడం ఒక్కటే దారని ఆమెకు అనిపించింది. గతంలో తనతో వచ్చేయమని ఆరుష్‌ కోరినప్పుడు ఆమె అంగీకరించలేదు. ‘‘నాకు చాలా భయంగా అనిపించింది. అలా అన్నీ వదిలేసి వెళ్ళిపోవడమనేది ఏమంత సులభం కాదు’’ అంది విధి.
లాక్‌డౌన్‌ తర్వాత, ఆగస్టు 2020లో ఔషధాల తయారీ యూనిట్‌లో పనిచేస్తూ నెలకు రూ.5,000 సంపాదించసాగాడు ఆరుష్‌. ‘‘నేను ఎలా జీవించాలనుకుంటున్నానో ఎవరికీ అర్థం కావటం లేదు. అది నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పారిపోవడమే ఏకైక మార్గమని నాకు తెలుసు’’ అని ఆరుష్‌ చెప్పాడు. విధికీ, తనకూ ఆశ్రయం పొందేందుకు గృహి హింస బాధితుల కోసం పనిచేస్తున్న గ్రూప్‌లను, ప్రభుత్వేతర సంస్థలను (ఎన్జీఓలను) సంప్రదించడం ప్రారంభించాడు.
పరువు ప్రతిష్టలకు భంగం, వేధింపులు లాంటి కారణాల వల్ల చాలామంది ట్రాన్స్‌ జెండర్స్‌ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని వాళ్ళు తమ ఇళ్ళను విడిచిపెట్టి సురక్షితమైన ప్రాంతాలను వెతుక్కుంటూ ఉంటారు. 2021లో, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, పశ్చిమ బెంగాల్‌లోని ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై చేసిన ఒక అధ్యయనంలో, ‘వారి లింగ వ్యక్తీకరణను దాచిపెట్టమని కుటుంబాలు వత్తిడి చేస్తా’యని తెలిసింది. అలాగే వారి కుటుంబం, స్నేహితులు, సమాజం వారి పట్ల చూపించే వివక్షాపూరిత ప్రవర్తన కారణంగా, దాదాపు సగం మంది వారి కుటుంబాలను విడిచిపెట్టారు.
ఆరుష్‌`విధిలకు ముంబై నగరం అందుబాటులో ఉందనిపించింది. పైగా, ఆరుష్‌ సర్జరీ కూడా చేయించుకోవచ్చు. అందుకే, మార్చి 2021లో ఆస్పత్రికి వెళ్ళే నెపంతో ఒకరోజు మధ్యాహ్నం తన ఇంటినుండి బయలుదేరింది విధి. పనికి వెళ్తున్నానని చెప్పి ఆరుష్‌ కూడా బయలుదేరాడు. ఇద్దరూ బస్సు ఎక్కేందుకు ఒక ప్రదేశంలో కలుసుకున్నారు. ఆరుష్‌ తన సంపాదనలో ఆదా చేసిన రూ.15,000 నగదును తీసుకొచ్చాడు. తన తల్లికి ఉన్న ఒక్కగానొక్క బంగారు గొలుసు, చెవి పోగులు కూడా పట్టుకొచ్చాడు. ఆ బంగారాన్ని అమ్మి ఇంకో రూ.13,000 జమ చేశాడు. ‘‘నాకు అవి అమ్మడం ఇష్టంలేదు. కానీ నేను చాలా ఆందోళనలో పడ్డాను. చేతిలో డబ్బులు ఉంచుకోవలసిన పరిస్థితి అది. మేమింక ఇంటికి తిరిగి రాలేం కనుక నేను ఎటువంటి రిస్క్‌ తీసుకోదలచుకోలేదు’’ అని అతను వివరించాడు.
ముంబైలో ఒక ఎన్జీఓకు చెందిన వాలంటీర్లు మహిళల కోసం ఊర్జా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక ఆశ్రయానికి ఆ జంటను తీసుకెళ్ళారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం కూడా అందించారు. ‘‘వాళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన చట్టపరమైన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఎల్‌జిబిటిక్యూఐఎం వంటి కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో వారి కుటుంబాల నుంచి వారికి తీవ్రమైన హాని ఉండే అవకాశం ఉన్నచోట, వారి భద్రత కోసం మేం స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తాం’’ అని మానవ హక్కుల కార్యకర్త, ఊర్జా ట్రస్ట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అంకితా కోహిర్కర్‌ తెలిపారు.
అయితే, ఈ చర్య బెడిసికొట్టింది. పోలీస్‌స్టేషన్‌లో అధికారులు వారిని విచారించడం మొదలుపెట్టారు. ‘‘ఇలాంటి సంబంధం కలకాలం ఉండదని, ఊరికి తిరిగి వెళ్ళమని వాళ్ళు మాకు నచ్చచెప్పడానికి చూశారు. అది తప్పని కూడా వారించారు’’ అని ఆరుష్‌ వివరించాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో కలత చెంది ఉన్న ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారమిచ్చారు. అప్పటికే ఆరుష్‌ తల్లి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఆరుష్‌ తప్పిపోయినట్లుగా ఫిర్యాదును దాఖలు చేశారు. విధి కుటుంబ సభ్యులు ఆరుష్‌ ఇంటిమీదకు వెళ్ళి బెదిరించారు. వీరిద్దరూ ఎక్కడున్నారో తెలియగానే ఇరు కుటుంబాల వారు ఆ రోజే ముంబై చేరుకున్నారు. ‘‘నన్ను ఇంటికి రమ్మని అన్నయ్య ప్రశాంతంగా అడిగాడు. నేను ఇంతకు ముందెన్నడూ అతన్ని అలా చూడలేదు. అక్కడ పోలీసులు ఉండటమే అందుకు కారణం’’ అని విధి తెలిపింది.
ఆరుష్‌ తల్లి కూడా వారిని ఇంటికి తిరిగి వచ్చెయ్యమని బతిమలాడారు. ‘‘అమ్మాయిలు ఉండేందుకు ఆ చోటు సరైనది కాదని చెప్పి, మమ్మల్ని తమతో తీసుకెళ్ళమని పోలీసులు ఆయితో అన్నారు’’ అని గుర్తుచేసుకున్నాడు ఆరుష్‌. అదృష్టవశాత్తూ, ఊర్జా కార్యకర్తలు జోక్యం చేసుకుని, వారి తల్లిదండ్రులు వారిని బలవలంతంగా తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారు. తన తల్లి బంగారం అమ్మగా వచ్చిన డబ్బును కూడా తిరిగిచ్చేశాడు ఆరుష్‌. ‘‘నేను దాన్ని ఉంచుకోవడం మంచిది కాదనిపించింది’’ అని చెప్పాడు అతను.
ఈలోపు గ్రామంలో, ఆరుష్‌ లైంగిక వ్యాపారం చేస్తున్నాడని, విధిని బలవంతంగా తనతో తీసుకువెళ్ళాడని విధి కుటుంబం ఆరోపించింది. ఇందుకుగాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె అన్న, బంధువులు ఆరుష్‌ కుటుంబాన్ని బెదిరించసాగారు. ‘‘సమస్యను పరిష్కరించే నెపంతో, అతను (విధి అన్నయ్య) నా సోదరుడిని ఒంటరిగా కలవమని అడిగాడు. కానీ వాళ్ళు ఏదైనా చేస్తారన్న భయంతో తను వెళ్ళలేదు’’ అని ఆరుష్‌ తెలిపాడు.
… … …
సెంట్రల్‌ ముంబైలోని ఆశ్రయంలో నివసిస్తున్నప్పటికీ ఆరుష్‌`విధిలకు తాము సురక్షితంగా ఉన్నట్లు అనిపించడం లేదు. ‘‘మేము ఎవరినీ నమ్మలేం. ఊరి నుంచి ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరికి తెలుసు?’’ ఆరుష్‌ ప్రశ్నించాడు. దీంతో రూ.10,000 డిపాజిట్‌ చెల్లించి, ఒక గదిని అద్దెకు తీసుకున్నారు వాళ్ళు. ఆ గదికి నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తున్నారు. ‘‘ఇంటి ఓనర్‌కి మా సంబంధం గురించి తెలియదు. మేము దాన్ని తప్పనిసరిగా దాచి పెట్టాల్సిందే. మేమీ గదిని ఖాళీ చేయకూడదని అనుకుంటున్నాం’’ అని అతను చెప్పాడు.
ఆరుష్‌ ఇప్పుడు లింగ స్థిరీకరణ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. అంటే శస్త్ర చికిత్స చేయించుకొని, మందులు వాడాల్సి
ఉంటుంది. సదరు ప్రక్రియ గురించీ, వైద్యుల గురించీ, అందుకయ్యే ఖర్చుల గురించీ తగిన సమాచారం కోసం అతను గూగుల్‌, వాట్సాప్‌ గ్రూప్‌లను ఆశ్రయించాడు.
ఒకసారి, ముంబైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాడు అతను. అయితే, మళ్ళీ దానికి తిరికి వెళ్ళలేదు. ‘‘నాకు సహాయం చేయడానికి బదులుగా, శస్త్రచికిత్స వద్దని డాక్టర్‌ నాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అతను నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. నా తల్లిదండ్రుల ఆమోదం పొందడానికి వాళ్ళని పిలవమని కూడా అడిగాడు. నాకు చాలా కోపమొచ్చింది. అతను నన్ను మరింత ఇబ్బందికి గురిచేశాడు’’ అని ఆరుష్‌ తెలిపాడు.
ఆరుష్‌ ప్రస్తుతం ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కౌన్సిలింగ్‌ తీసుకున్న తర్వాత, అతను జెండర్‌ డిస్ఫోరియాతో… ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చిన లైంగికతకూ, ఆ తర్వాత వచ్చిన లైంగిక గుర్తింపుకూ మధ్య అసమతుల్యత వలన కలిగే బాధ, అసౌకర్యాలతో బాధపడుతున్నాడు. వైద్యులు ఆరుష్‌కు హార్మోన్‌ థెరపీ ఆమోదించారు. ఇదిలా ఉంటే, లింగ పరివర్తన (జెండర్‌ ట్రాన్సిషనింగ్‌) ప్రక్రియ సుదీర్ఘమైనది. ఖర్చుతో కూడుకున్నది.
ప్రతి 21 రోజులకొకసారి తీసుకునే టెస్టోస్టెరాన్‌ ఇంజెక్షన్ల కిట్‌ ఒక్కొక్కటి రూ.420Ñ ఇంజక్షన్‌ ఇవ్వడానికి డాక్టర్‌ ఛార్జీలు రూ.35. ప్రతి 15 రోజులకు నోటిద్వారా తీసుకునే మాత్రల కోసం మరో రూ.200 ఖర్చవుతోంది. అలాగే, హార్మోన్ల చికిత్స వల్ల వచ్చే దుష్ప్రభావాలను తెలుసుకోవడానికి ప్రతి 2`3 నెలలకు ఆరుష్‌ రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ఖర్చు సుమారు రూ.5,000 ఉంటుంది. అదనంగా కౌన్సిలర్‌ ఛార్జీలు రూ.1,500, డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు ప్రతి సందర్శనకు రూ.800`రూ.1,000 అవుతుంది.
అతను తీసుకుంటున్న చికిత్స మెరుగైన ఫలితాలను చూపిస్తోంది. ‘‘నాలో నేను ఎన్నో మార్పులను చూస్తున్నాను. ఇప్పుడు నా గొంతు బరువుగా వినిపిస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆరుష్‌ సంబరపడ్డాడు. ‘‘ఒక్కోసారి నేను చికాకు పడతానుÑ నిగ్రహం కోల్పోతాను’’ అని మందుల దుష్ప్రభావాన్ని వివరించాడు.
విధి తనతో ఇంత దూరం వచ్చినందుకు పశ్చాత్తాపపడుతుందేమోననీ లేదా తనను ఇష్టపడడం మానేస్తుందేమోననీ ఆరుష్‌ భయపడుతున్నాడు. ‘‘ఆమె పెద్ద (ఉన్నత కుల) కుటుంబం నుండి వచ్చింది. కానీ ఆమె నన్నెప్పుడూ తక్కువగా చూడలేదు. ఆమె కూడా మా కోసమే పనిచేస్తోంది’’. ఆరుష్‌ ప్రవర్తనలోని మార్పులను గమనించిన విధి, ‘‘మా మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి కానీ సమస్యలను గురించి చర్చించుకునేందుకు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఇది నన్ను కూడా ప్రభావితం చేస్తోంది కానీ నేను అతని వెన్నంటే ఉంటాను’’ అంటోంది. కంప్యూటర్‌ లేదా నర్సింగ్‌లో వృత్తి విద్యా కోర్సును చేపట్టాలనే తన ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టిందామె. బదులుగా చిన్నా చితకా పనులు చేస్తూ, ఇంటిని నడపడంలో ఆరుష్‌కి సహాయపడుతోంది. ఒక దక్షిణ భారత రెస్టారెంట్‌లో గిన్నెలు తోమి, నెలకు రూ.10,000 సంపాదిస్తోంది. (2022 డిసెంబర్‌ చివర్లో ఈ ఉద్యోగం పోయింది). ఈ ఆదాయంలో కొంత భాగం ఆరుష్‌ చికిత్సకు వెళ్తోంది. ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, నెలనెలా వచ్చే రూ.11,000 లలో పొదుపు చేస్తుంటాడు ఆరుష్‌. అతని సహచరులు అతన్ని మగవాడిగా గుర్తిస్తారు. తన ఛాతీ కనబడకుండా ఉండడం కోసం అతనొక బైండర్‌ ధరిస్తాడుÑ అది నొప్పెడుతూ ఉంటుంది. ‘‘మేమిద్దరం ఇప్పుడు ఒకరితో ఒకరం తక్కువ సమయం గడుపుతున్నాం. ఎందుకంటే, తొందరగా పనిలోకి బయలుదేరాలి కదా. పని నుండి అలసిపోయి వస్తుంటాం. ఒక్కోసారి వాదించుకుంటాం కూడా’’ అంది విధి. సెప్టెంబర్‌`డిసెంబర్‌ 2022 మధ్య తన చికిత్స కోసం ఆరుష్‌ దాదాపు రూ.25,000 ఖర్చు చేశాడు. హార్మోన్‌ థెరపీ తర్వాత, అతను లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స కోసం (సెక్స్‌ రీఅసైన్‌మెంట్‌ శస్త్ర చికిత్స లేదా ఎస్‌ఆర్‌ఎస్‌ అని కూడా అంటారు) వెళ్దామనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఛాతీనీ, జననేంద్రియాలనూ పునర్నిర్మాణం చేస్తారు. అందుకతను రూ.5`8 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, వారిద్దరి ప్రస్తుత ఆదాయం నుండి ఇంత మొత్తం పొదుపు చేయడం కష్టం కనుక దీన్ని చేయించుకునే స్థోమత అతనికి లేదు.
శస్త్రచికిత్స పూర్తయ్యేంతవరకు తన కుటుంబానికి తన చికిత్స గురించి తెలియకూడదని ఆరుష్‌ కోరిక. తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నాడని తెలుసుకున్నప్పుడు, తల్లితో ఫోన్‌లో ఎంత పెద్ద వాదనయ్యిందో అతను గుర్తు చేసుకున్నాడు. ‘‘ముంబైలో జనాలు నాలో తప్పుడు ఆలోచనలు కలిగేలా చేస్తున్నారని ఆమె భావించింది’’ అని చెప్పాడు ఆరుష్‌. అతన్ని మాయచేసి వారి గ్రామ సమీపంలో ఉన్న ఒక ప్రదేశానికి వచ్చేలా చేసి, అతన్ని ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారామె. ‘‘ఆ వ్యక్తి నన్ను కొట్టడం ప్రారంభించాడు. నా తలపై కొడుతూ ‘నువ్వు అమ్మాయివి, అబ్బాయివి కాద’ని పదేపదే చెప్పాడు’’. అయితే, భయాందోళనకు గురైన ఆరుష్‌ అక్కడినుండి ఎలాగోలా పారిపోయాడు.
‘‘ప్రభుత్వ వైద్యుడు మంచివాడయ్యుంటే నేను ఇంత ఖర్చుచేసి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని ఆరుష్‌ అన్నాడు. ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 ప్రకారం, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స, హార్మోన్ల చికిత్స కోసం, వీటన్నిటికి ముందూ, తర్వాతా అవసరమయ్యే కౌన్సిలింగ్‌తో సహా వైద్య సంరక్షణ సౌకర్యాన్ని మొత్తం ప్రభుత్వమే అందించాలి. ఖర్చులను ఆరోగ్య భీమా పథకం ద్వారా కవర్‌ చేయాలని కూడా ఆ చట్టం పేర్కొంది. సదరు చట్టం అతనికి చికిత్సను, శస్త్రచికిత్సను నిరాకరించకుండా అతని హక్కులను కూడా రక్షిస్తుంది. ఆ చట్టం అమల్లోకి వచ్చాక, 2022లో కేంద్ర సామాజిక న్యాయం మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. 2020లో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల కోసం ఒక జాతీయ పోర్టల్‌ ద్వారా, ఎలాంటి కార్యాలయాన్ని సందర్శించకుండానే ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తి తన గుర్తింపు ధృవీకరణనూ, గుర్తింపు పత్రాన్నీ కూడా పొందవచ్చు.
అనేక పథకాలపై అవగాహన లేని ఆరుష్‌ ఎలాగైతేనేం గుర్తింపు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ‘‘దరఖాస్తును స్వీకరించిన 30 రోజులలోపు జిల్లా అధికారులు ట్రాన్స్‌జెండర్‌ ధృవీకరణ పత్రాలను, ఐడి కార్డులను జారీ చేయడం తప్పనిసరి’’ అని ఆ పోర్టల్‌లో పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకూ ఏదీ అతని చేతికి రాలేదు. జనవరి 2, 2023 నాటికి, మహారాష్ట్రలో సదరు పత్రాల కోసం 2,080 దరఖాస్తులు వచ్చాయిÑ వాటిలో 452 పెండిరగ్‌లో ఉన్నాయి.
తనకు సరైన గుర్తింపు ధృవీకరణ పత్రం లేకపోతే, తన బి.ఎ. ఆరుషి పేరుతో జారీ అవుతుందని, దానివల్ల ముందు ముందు సంక్లిష్టమైన పత్రాల పని ఎదురుపడుతుందని ఆరుష్‌ ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికీ అతను పోలీసు శాఖలో పని చేయాలని ఆశిస్తున్నాడు, అది కూడా ఒక పురుషుడిగా, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స తర్వాత. బీహార్‌ రాష్ట్ర పోలీసు శాఖలో తొలి ట్రాన్స్‌ మ్యాన్‌ నియామకం కానున్నారనే వార్త అతనిలో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ‘‘ఈ వార్త చదివాక చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపల ఆశాజనకంగా ఉన్నాను’’ అని తన శస్త్ర చికిత్సల కోసం పనిచేస్తూ, డబ్బు పొదుపు చేస్తున్న ఆరుష్‌ చెప్పాడు.
ప్రతి ఒక్కరినీ అంగీకరించడాన్ని ప్రజలకు నేర్పించాలని ఆరుష్‌ కోరుకుంటున్నాడు. అలా జరిగితే తమ ఇంటిని, గ్రామాన్ని వదిలి ఇలా దాక్కోవలసిన అవసరం వారికి వచ్చేది కాదు. ‘‘నేను చాలా ఏడ్చాను. బతకాలని అనుకోలేదు. మేమెందుకు భయపడుతూ జీవించాలి? ఏదో ఒక రోజున మా పేర్లు దాచుకోకుండా మా కథను చెప్పాలనుకుంటున్నాం’’ అన్నాడు ఆరుష్‌.
‘‘మొఘల్‌`ఎ`ఆజమ్‌ ముగింపు విషాదకరమైనది. మాది అలా ఉండదు’’ విధి నవ్వుతూ అంది.
విధి, ఆరుష్‌ల గోప్యతను కాపాడేందుకు వారి పేర్లు మార్చబడ్డాయి.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/en/articles/love-and-a-place-of-ones-own-in-a-metropolis/ పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (ruralindiaonline.org) జనవరి 4, 2022 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.