‘‘కాళ్ళు కొంచెం దూరంగా జరపండి’ మృదువుగా చెప్పింది డాక్టర్ అనూషా రెడ్డి. ఆమె స్వరంలో మెత్తదనానికి కాస్త ధైర్యం వచ్చినా, భయంగానే కాళ్ళని ఎడంగా జరిపాను. పక్కన ఉన్న అసిస్టెంట్ సాయంతో ఏదో ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్రాసెస్ మొదలుపెట్టింది డాక్టర్. కళ్ళు
మూసుకుని ఈ గండం గట్టెక్కాలని రెండు చెతులూ బిగించి పట్టుకున్నాను. చిన్న చీమ కుట్టిన ఫీలింగ్ ఒక్క క్షణంపాటు కలిగింది. ఇంతలో డాక్టర్ అయిపోయింది, మీరు లెగవొచ్చు అంది. హమ్మయ్య, ఇంతేనా అనుకుంటూ సర్దుకుని లేచాను.
ఇదంతా పాప్ స్మియర్ టెస్ట్ కోసం నగరంలో పేరుమోసిన ఆస్పత్రికి వెళ్ళిన నా స్నేహితురాలి అనుభవం. మెత్తటి పరుపున్న బెడ్, అధునాతన సౌకర్యాలతో నిండి ఉన్న గది అది.
ఆమె ఈ టెస్ట్ చేయించుకోవడం మూడోసారట. అంతకుముందు చేయించుకున్నప్పుడు ఇంత ఆధునిక పరికరాలు లేకుండె అని చెప్పింది. ఇన్ని సదుపాయాలు ఉండీ, ఇంత వయసు వచ్చిన ఆమెనే ఒక స్టేజ్‌లో అంతలా భయపడిరది కదా! మరి అయిదేళ్ళ పిల్ల కాళ్ళు దూరంగా జరిపేసి, ఆమె ప్రమేయం లేకుండా, ఏం చేస్తున్నారో చెప్పకుండా ఎటువంటి శాస్త్రీయ అవగాహన లేకుండా చేతికి దొరికిన చాకుతోనో, బ్లేడుతోనో ఆమె జననాంగాలను కత్తిరించి, కుట్లు వేస్తుంటే ఆ చిన్నారి మానసిక, శారీరక బాధను వర్ణించతరమా? వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ హింసకు ఎవరు బాధ్యులు? ఏమిటా పరిస్థితులు? తెలుసుకుందాం.
వారిస్ దిరీ… పరిచయం ఆమె మాటల్లోనే!
నేను వారిస్ దిరీ! సోమాలియాలోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించాను. పదమూడేళ్ళ వయసులో నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా మా నాన్న ఒక వృద్ధుడితో పెళ్ళి జరపడానికి ప్రయత్నించినపుడు మా అమ్మ సాయంతో, ఎవరికీ చెప్పాపెట్టకుండా మొగదీషులో ఉన్న మా చిన్నమ్మ దగ్గరకు పారిపోయాను. ఎన్నో బాధలు, కష్టనష్టాలు చవిచూసిన నేను ఒక స్థాయికి చేరుకోవడానికి నానా తిప్పలూ పడ్డాను.
సోమాలియా నుండి మొగదీషు, అక్కడనుండి లండన్, తర్వాత చాలా పెద్ద ప్రయత్నం తర్వాత అటునుండి అమెరికా. ఇలా నా జీవితంలో ప్రతి మెట్టూ ఎంతో కష్టతరంగా, అడుగడుగునా భయంతోనే ఎక్కాను.
సోమాలియాలో సంచార జీవనం గడిపిన నేను అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రెవ్లాన్ కాస్మెటిక్ ఉత్పత్తుల కవర్ ఫోటోకి మోడల్‌ని. ఆయిల్ ఆఫ్ ఓలే మోడల్‌గా పనిచేసిన తొలి నల్ల జాతీయురాలిని కూడా నేనే. రాబర్ట్ పామర్, మెట్లోఫ్ వంటివారి కోసం అనేక మ్యూజిక్ వీడియోలు చేశాను. ఎల్లే, అల్యూర్, గ్లామర్, ఇటాలియన్ వోగ్, ఫ్రెంచ్ వోగ్ వంటి పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్లలో మోడల్‌గా, రిచర్డ్ అవెడాన్ వంటి ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేశాను.
స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా పోరాడటం కోసం 1997లో ఐక్యరాజ్య సమితి ఆఫ్రికా మహిళల హక్కుల కోసం నన్ను ప్రత్యేక రాయబారిగా నియమించింది. ప్రస్తుతం నా కుమారుడితో కలిసి వియన్నాలో నివసిస్తున్నాను. ఉన్నత స్థితికయితే చేరుకున్నాను. కానీ నా మనసుకు వేదన కలిగించేది, నాకు ఎప్పుడు జ్ఞప్తికి వచ్చినా గుండెను మెలిపెట్టినట్లు అనిపించే సంఘటన గురించి పోరాడాలని నిశ్చయించుకున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ వివరాలు మీతో పంచుకుంటాను.
స్త్రీ జననేంద్రియ వికృతీకరణ లేదా విచ్చిత్తి!
ఆఫ్రికాలోని 28 దేశాలలో ఈ అమానుషమైన చర్య జరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 130 మిలియన్ మంది బాలికలు, స్త్రీల మీద ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ శస్త్ర చికిత్స జరిగే విధానం అనాగరికంగా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. అవి నిర్వహించే స్త్రీలు ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేని గ్రామీణ మహిళలు, మంత్రసానులుగా చెప్పబడేవాళ్ళు. వారు మత్తుమందు ఉపయోగించరు. చేతికి అందిన రేజర్ బ్లేడ్లు, కత్తులు, కత్తెరలు, పగిలిన గాజులు, పదునైన రాళ్ళు, మరికొన్ని ప్రాంతాల్లో ఈ చర్యకు వారి దంతాలు కూడా
ఉపయోగిస్తారు. ఇలా చేయడంలోని ముఖ్య ఉద్దేశ్యం అమ్మాయి జీవితాంతం సెక్స్ ఆస్వాదించడాన్ని నిరోధించడం.పైగా ఇది తక్కువ నష్టం కలిగించే చర్యగా చెబుతారు.
లైంగిక సంపర్కాన్ని నిరోధించడానికి ఒక స్త్రీ క్లైటోరిస్, లాబియాను ఛేదించి యోని రెండు అంచులను కలిపి కుడతారు. ఇది 80 శాతం ఈశాన్య ఆఫ్రికన్ సంస్కృతిలో ఎన్నో దశాబ్దాలుగా ఒక సాంప్రదాయంగా వస్తోంది.
నాకు ఐదేళ్ళున్నప్పుడు ఇదే పద్ధతిలో విచ్ఛిత్తి చేశారు. దీని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే బాధితులు షాక్, ఇన్‌ఫెక్షన్, మచ్చ ఏర్పడటం, ధనుర్వాతం, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, సెప్టిసీమియా, హెపటైటిస్ బి మొదలయిన వాటి బారిన పడతారు. ఇక దీర్ఘకాలిక సమస్యలైన తరచూ వచ్చే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, వంధ్యత్వం, యోని చుట్టూ తిత్తులు, గడ్డలు, బహిష్టు నొప్పి, చెడు రక్తం అంతా పొత్తి కడుపులో చేరటం, డిప్రెషన్, చివరికి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది.
ప్రతి సంవత్సరం సుమారు రెండు మిలియన్ చిన్నారులకు నాకు జరిగినట్లుగా విచ్చిత్తి జరుగుతుందనే ఊహే నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆడపిల్లల సంఖ్య పెరగడానికి బదులుగా, స్త్రీ జననేంద్రియ విచ్చిత్తి పెరగడం అనే సూచిక మరో విషాదకరమయిన విషయం. యూరప్, అమెరికాకి వలస వచ్చిన ఆఫ్రికన్ చిన్నారులలో ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది.
ఫెడరల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనాల ప్రకారం 27,000 న్యూయార్క్ స్త్రీలు, చిన్నారులకు ఈ విచ్చిత్తి జరిగినట్లు అంచనా. ఈ కారణం చేత చాలా దేశాల్లో స్త్రీ జననేంద్రియ విచ్చిత్తిని నిషేధించారు. స్త్రీ జననేంద్రియ విచ్చిత్తిని తమ మత సాంప్రదాయంగా కొన్ని కుటుంబాలు భావిస్తున్నాయి.
ఆఫ్రికా నుండి అమెరికాకు వలస వచ్చిన చాలా కుటుంబాలు డబ్బులు ఆదా చేయడం కోసం జిప్సీ స్త్రీలను రప్పిస్తారు. ఒకేసారి సామూహికంగా విచ్చిత్తి చేస్తారు. ఇలా సాధ్యం కానప్పుడు ఆ కుటుంబాల యజమాని ఈ తతంగాన్నంతా తమ చేతుల్లోకి తీసుకుంటాడు.
పేగులు మెలిపెట్టే సంఘటన ఒకటి చెబుతాను. న్యూయార్క్ సిటీకి చెందిన ఒక చిన్నారి తండ్రి, చుట్టుపక్కల వాళ్ళకి ఆ పిల్ల అరుపులు వినపడకుండా స్టీరియో సౌండ్ బాగా పెంచి, పదునైన చాకుతో విచ్చిత్తి చేస్తాడు.
గెలిచి తీరాల్సిన యుద్ధం.
ఈ పోరాటంలో ప్రత్యేక రాయబారిగా నా వంతు కృషి చేయడానికి యునైటెడ్ నేషన్స్ చేసిన ప్రతిపాదనను సగర్వంగా ఒప్పుకున్నాను. యూఎన్ పాపులేషన్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నఫీస్ సాదిక్ వంటి మహిళతో కలిసి పనిచేయడం నాకు దక్కిన అరుదయిన గౌరవాలలో ఒకటి. 1994లో జనాభా మరియు అభివృద్ధిపై కైరోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో స్త్రీ జననేంద్రియ విచ్చిత్తికి వ్యతిరేకంగా పోరాటాన్ని చేపట్టిన తొలి మహిళగా నిలిచాను. నేను ఎదుగుతున్నకొద్దీ నా కుటుంబం, తోటి సంచారులతో పోలిస్తే నా ఆలోచనలు, ప్రవర్తన భిన్నంగా ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే సంస్థకు భవిష్యత్తులో రాయబారిగా పనిచేస్తానని కనీసం ఊహలో కూడా అనుకోలేదు. నా కథను చెప్పడానికి, యూఎన్‌కు మద్దతు ఇవ్వడానికి నేను త్వరలో మళ్ళీ ఆఫ్రికాకు వెళ్తాను. కానీ నేను ఆఫ్రికాకు వెళ్తే, మత ఛాందసులు నన్ను హత్య చేస్తారేమో అనే ఆందోళనను నా స్నేహితులు కొందరు వెలిబుచ్చారు.
నాకు తెలుసు నేను చేసే పని ఎంత ప్రమాదకరమో. పవిత్ర కార్యంగా భావిస్తూ నేరం చేస్తున్న ఛాందసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా! నాకో చిన్న పిల్లాడున్నాడనే స్పృహ అప్పుడప్పుడూ నన్ను భయపెడుతుంది. కానీ గట్టిగా నిలబడాలని మనసు చెబుతోంది. దేవుడు నన్ను భూమ్మీదకి ఒక ముఖ్య కార్యం చేయడానికి పంపించాడు. నేను ఏ రోజు పుట్టాలో, ఏ రోజు గిట్టాలో దేవుడు నా నుదుటన ఎప్పుడో రాసేశాడు. ఇక నేనేం మార్చడానికి లేదు. సుమారు నాలుగు వేల సంవత్సరాలుగా ఆఫ్రికా సంస్కృతి, సాంప్రదాయాలు మహిళ జీవితాన్ని ఛిద్రం చేశాయి. ముస్లిం దేశాలలో ఈ చర్య ఆమోదయోగ్యమయినదని, ఖురాన్ ఆచారమని చాలామంది నమ్ముతారు. కానీ ఖురాన్‌లో కానీ, బైబిల్‌లో కానీ ఎక్కడా స్త్రీ జననేంద్రియాలను కత్తిరించడం గురించి ప్రస్తావనే లేదు.
స్త్రీలకు సంబంధించిన లైంగిక విషయాలపై తమ ఆధిపత్య నిరూపణ, అజ్ఞానపు చేష్టలు, స్వార్థపూరితమయిన చర్యలు పురుషులు సృష్టించినవే. ఇది కేవలం వారి డిమాండే.
తమ కుమార్తెలకు భర్తలు ఉండరేమో అన్న భయంతో అనేకమంది తల్లులు కూడా ఈ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఎందుకంటే ఇలా చేయించుకోని స్త్రీ సమాజం దృష్టిలో అతిగా లైంగిక కోరికలు కలిగిన స్త్రీగానో, నీచపు గుణం కలిగిన వ్యక్తిగానో, వివాహానికి పనికిరాని స్త్రీగానో పరిగణించబడుతుంది. నేను పుట్టిన సంచార సంస్కృతిలో అవివాహిత మహిళలకు స్థానం లేదు. ఎలాగయితే పాశ్చాత్య సంస్కృతి కలిగిన కుటుంబం తమ పిల్లల్ని మంచి పాఠశాలకు పంపుతారో, అలా ఆఫ్రికన్ తల్లులు తమ పిల్లలకు విచ్ఛిత్తి చేయించడంలో ముందుంటారు.
ప్రతి ఏటా లక్షలాదిమంది ఆడపిల్లలు అంగవైకల్యం, విచ్చిత్తి జరగడానికి అజ్ఞానం, మూఢనమ్మకాలు తప్ప మరే కారణం లేదు.
అమ్మను కలిసిన సందర్భం:
ఇథియోపియాలో అమ్మను కలిసినప్పుడు కొన్నేళ్ళ క్రితం ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ఆమె ఛాతీలో తుపాకీ గుండు మోస్తున్నట్లు చెప్పింది. వెంటనే నా సోదరి సౌదీలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా, డాక్టర్లు ఆమె వయసు కారణంగా ఆపరేషన్ చేయడం ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారని తెలిసింది. కానీ నేను ఆమెను చూసినప్పుడు ఒంటెలా బలంగా అనిపించింది. ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న ఆమె ఎంతో స్థిరంగా, నిబ్బరంగా ఉంది. పైగా తనను ఎలా కాల్చారో హాస్యభరితంగా చెప్పింది. అయితే బుల్లెట్ ఇంకా ఉందా అన్న ప్రశ్నకు బదులుగా, ‘‘ఉన్నట్లుంది, అయినా నేను పెద్దగా పట్టించుకోను. బహుశా నేను దాన్ని కరిగించేశానేమో’’ అంది.
ఈ ఆదివాసీ యుద్ధాలు కూడా స్త్రీ జననాంగ విచ్చిత్తి వలె పురుషుల అహం, స్వార్థం, దురాక్రమణ వల్లనే సంభవిస్తాయి. ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ ఇదే వాస్తవం.
పురుషుల వృషణాలు కత్తిరించినట్లయితే నా దేశం స్వర్గతుల్యమవుతుంది. అప్పుడు పురుషులు శాంతంగా ఉంటూ, ప్రపంచం పట్ల సున్నితంగా ఉండేవారు. అసలు టెస్టోస్టిరాన్ లేకుంటే యుద్ధం, చంపుకోవడాలు, దొంగతనాలు, అత్యాచారాలు ఏమీ ఉండేవి కాదేమో అనిపిస్తుంది.
పురుషుల జననాంగాలు కత్తిరించి, రక్తం కారేలా చేసి ప్రాణ భయంతో పరిగెత్తిస్తే బహుశా వారికి తెలిసేదేమో, మహిళ పట్ల వారెలా ప్రవర్తించారో! మరే చిన్నారికీ ఈ దుస్థితి రాకూడదు.
నేను పడిన బాధ వర్ణనాతీతం. ఇప్పటికీ ఆ గాయం తాలూకు చేదు అనుభవాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి మానసికంగా, శారీరకంగా. ఈ బాధ మరే చిన్నారీ పడకూడదనే గట్టి సంకల్పంతో నా వంతు సాయం చేయడం కోసం ‘ఎడారి పుష్పం’ అనే ఎన్జీఓను స్థాపించాను. సంవత్సరానికి కనీసం వెయ్యిమంది చిన్నారులను స్త్రీ జననేంద్రియ విచ్చిత్తి నుండి కాపాడాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నాను. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం చిన్నారులకు విద్యావకాశాలు కల్పించడం, అలాగే వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమస్య గురించి అవగాహన కల్పించడం. అవసరమైనప్పుడు ఈ సంస్థ ఉద్యోగ కేంద్రంగా కూడా పనిచేస్తుంది.
ఆఫ్రికాలోని మహిళలను అణచివేత నుండి విముక్తి చేయడానికి, హింస నుండి వారిని రక్షించడానికి, స్త్రీ జననేంద్రియ విచ్ఛిత్తి నుండి శాశ్వతంగా బంధవిముక్తుల్ని చేయడానికి విద్య, ఆర్థిక స్వాతంత్య్రం మాత్రమే ఉత్తమమైన మార్గాలని నేను నమ్ముతున్నాను.