అమెరికానా ` చిమమండా గోజీ అడిచే -సునీతా రత్నాకరమ్‌

అడిచేని కొత్తగా అలంకరించిన బిరుదునామం ‘‘ఓడేలువ్వా’’ (Odeluwa) అంటే ‘‘ప్రపంచం కోసం రాసేది’’ అన్న అర్థమట. అమెరికానా ఓ రకంగా నైజీరియా మూలాలు ఉన్నా దేశ సరిహద్దుల్ని దాటిన తన మొదటి నవల. ఆధునిక కాలంలో అన్ని సంస్కృతుల్ని తనలో

కలుపుకున్న ఈనాటి సలాడ్‌ బౌల్‌ అమెరికాలో నైజీరియన్ల, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన నల్లజాతి ప్రవాసులు, నల్ల జాతి అమెరికన్ల కథ స్థూలంగా ఈ పుస్తకం. చిత్రంగా ఆ దేశంలోనే కాదు ఇతర చోట్ల కూడా వీరంతా వేరువేరనీ, వారి పుట్టుపూర్వోత్తరాలూ, పెరిగిన పరిస్థితులూ, చదువు సంధ్యలూ, ఆలోచనలూ అన్నీ వేరుగా ఉండొచ్చనీ అనుకోరు. ఈ సహానుభూతి లేమిని చక్కగా చిత్రించే ప్రయత్నం చేసింది అడీచే అమెరికానా సాక్షిగా. తన రచనలనీ, ప్రస్థానాన్నీ దగ్గరగా చూసేవాళ్ళకి మొదటి పుస్తకం పర్పుల్‌ హైబిస్కస్‌కు గానూ కామన్‌వెల్త్‌ పురస్కారం లభించినప్పుడు చేసిన ప్రసంగం గుర్తుండే ఉంటుంది. ఆ ప్రసంగంలో తను కలోనియల్‌ పాస్ట్‌ గురించి చెబుతున్నప్పుడు తెల్ల రచయితలు ప్రదర్శించే వైట్‌ సుప్రిమసీని విమర్శించడానికి గానీ, ఆ రాతల్లో ఆఫ్రికన్ల లాస్‌ ఆఫ్‌ డిగ్నిటి గురించి మాట్లాడడానికి గానీ ఏ మాత్రం వెరవదు. ఆ ఖచ్చితత్వం ఇంకాస్త పదును తేరి కనిపిస్తుంది ఈ రచనలో. తన రాతల సహజాతమైన సూటిదనం, సున్నితమైన వ్యంగ్యం కొంత ఎక్కువగా కనపడే నవల ఇది.
పుస్తకం మొదలయ్యేది ఒక హెయిర్‌ డ్రెస్సింగ్‌ సెలూన్లో. తన జడలుగా అల్లబడిన జుట్టు నుంచి రిలాక్సర్లతో సాదాజుట్టుగా అమెరికన్లు అంగీకరించే జుట్టుకు మారి, అందులోని సమస్యలన్నీ ఎదుర్కొని, మళ్ళీ జడలకు వెనక్కు వెళ్ళడం కథ ఫ్రంట్‌ ఎండ్‌. దీనికి సమాంతరంగా నేపథ్యంలో చెప్పే తన జీవితం అసలైన కథ. ఈ కథ ఇఫెమేలు అన్న నైజీరియన్‌లో ఉన్నప్పటి నుంచీ, యువతిగా అమెరికాలో చదువుల కోసం అడుగుపెట్టి, రకరకాల సమస్యలని తెచ్చుకుని, దాన్ని వదులుకుని మళ్ళీ నైజీరియన్‌ జనజీవనంలో కలిసిపోవడంతో ముగుస్తుంది. ఆ జనజీవనంలో కలిసిపోయే తరుణంలో అమెరికాకు, నైజీరియాకు ఉన్న తేడాలను పోల్చుకుంటూ చికాకుపడుతూ, పని నాణ్యత, ప్రొఫెషనలిజం లేమి పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ, రవంతనో, గుప్పెడంతనో ఆక్సిస్ట్‌ను గుమ్మరిస్తూ ఉండే అమెరికన్‌ రిటర్న్‌ నైజీరియన్లని సాటి నైజీరియన్లు ముద్దుగా పిలిచే పేరు అమెరికానా. అదే ఈ పుస్తకం శీర్షిక. నిజానికి ఈ అమెరికా కల ఇఫెమేలుది కాదు, ఓబిన్జేది. వీరిద్దరూ లాగోస్‌లో టీనేజర్లుగా కలిసి చదువుకుంటున్నప్పుడు ప్రేమికులు అవుతారు. ఓబిన్జే తల్లి అదే యూనివర్శిటీలో ప్రొఫెసర్‌. ఆవిడ కల్పించే వాతావరణం, ప్రోత్సాహంతో ఇద్దరూ బాగా చదువుకుంటారు. మేలైన ఆలోచనా దృక్పథం అలవరచుకుంటారు. కాలం సాగేకొద్దీ వారి మధ్య ప్రేమ కూడా బలపడుతుంది, ఆకర్షణ స్థాయిని బట్టి.
ఇఫెమేలు పెద్ద లక్ష్యాలు ఉన్న మనిషి కాదు, చదువుకునే వయసు కాబట్టి చదువుతుంది. అంతకు మించి ఆశలు లేవు. అమెరికా వెళ్ళటం, అక్కడ స్థిరపడగలగడం ఓబిన్జే చిన్ననాటి నుంచి కంటూ ఆనాటికానాడు పెరుగుతున్న కల. అమెరికన్‌ జీవన విధానం తెలుసుకోవడం, దానికోసం అమెరికన్‌ రచయితల్ని అవపోసన పట్టటం, అక్కడి దినవారీ వ్యవహారాల్ని కూడా నిశితంగా పరిశీలించడం ఓబిన్జే నిత్యకృత్యం. అట్లాంటి ఓబిన్జే సహవాసంతో తను కూడా పై చదువులకి అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, సఫలీకృతమవుతుంది. నిరాశ అల్లా అంతగా ‘అమెరికా కల’లో జీవిస్తున్న ఓబిన్జేకి అమెరికన్‌ వీసా నిరాకరించబడుతుంది. అయినప్పటికీ తను మళ్ళీ ప్రయత్నించి తర్వాత వచ్చి చేరుకుంటానని చెప్పి ఇఫెమేలుని ప్రోత్సహిస్తాడు. ఇట్లా ఇఫెమేలు అమెరికా వాసం మొదలవుతుంది.
చదువు స్కాలర్‌షిప్‌తో బాగానే సాగుతున్నా వర్క్‌ పర్మిట్‌ సరిపోని కారణంగా అతి చిన్న ఉద్యోగాలు కూడా దొరక్క రోజులు గడపడం కష్టమవుతుంది. ఈ కష్టాల్లోంచి బయటపడడానికి చేసే అనేక ప్రయత్నాల్లో విసుగుచెంది పూర్తిగా తనమీద నమ్మకం కోల్పోయిన తరుణంలో అనాలోచితంగా చేసిన ఒకే ఒక్క పొరపాటు పని కారణంగా తనని తనే అసహ్యించుకునే స్థితికి చేరుతుంది. ఇదే కారణం వల్ల ఓబిన్జేకి తనంతట తాను దూరమవుతుంది అతను ఎన్ని రకాలుగా కాంటాక్ట్‌ చేసే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా. ఇది జరిగిన తర్వాత దొరికే చిరు ఉద్యోగం సాయంతో చిన్నగా తను కుదురుకుని, కథ రకరకాల పాత్రల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది. కొన్నాళ్ళలో ఇఫెమేలు కూడా అమెరికా వాసిగా స్థిరపడగలుగుతుంది. ఇంతవరకే అయితే అతి మామూలు ప్రేమ కథ. ఈ కథని అమెరికానాగా మార్చిన సంఘటనలూ, మనుషులూ, పరిశీలనలూ ఈ పుస్తకాన్ని డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేక పుస్తకంగా నిలబెట్టాయి. ఈ ప్రత్యేకతకు మూలం ఇఫెమేలు రాసే బ్లాగ్‌, అందులోని విషయాలూÑ వీటిమీదుగా తనకు జీవితం మీదా, రకరకాల దేశాల నుంచి వచ్చిన ఇమ్మిగ్రంట్ల బిగ్‌ అమెరికన్‌ డ్రీమ్‌ గురించీ పెరిగిన అవగాహనా. ఈ బ్లాగ్‌లో ఇఫెమేలు ఒక నైజీరియన్‌ ఇమిగ్రెంట్‌లా అమెరికాలో తన జీవనం గురించీ, అమెరికన్‌ నల్లవారి గురించి ఒక నాన్‌ అమెరికన్‌ బ్లాక్‌గా తన పరిశీలనలూ రాస్తుంటుంది. ఇట్లా రాసే క్రమంలో ఒక్కోసారి వాళ్ళపట్ల సహానుభూతి చెందగలుగుతుంది. ఒక్కోసారి తన ఆలోచన లోకానికి నచ్చచెప్పగలుగుతుంది. ఒక్కోసారి అంగీకారం కుదరక స్పర్థల్లోకీ దిగాల్సి వస్తుంది. ఏదేమైనా కొన్నాళ్ళకి డబ్బు సంపాదించడంతో పాటు చక్కని గుర్తింపు తెచ్చుకుని వివిధ కార్యక్రమాలకు ఆహ్వానింపబడే స్థాయికి చేరుతుంది. ఓబిన్జే ఎన్నోసార్లు అమెరికా వీసా ప్రయత్నంలో విఫలమై చివరకు కొన్నాళ్ళు ఇంగ్లాండ్‌ వెళ్ళి అక్కడ స్థిరపడగలిగిన అవకాశం కూడా చివరి క్షణంలో కోల్పోయి చివరికి నైజీరియాలోనే వ్యాపారిగా జీవితం మొదలుపెట్టి అక్కడే అత్యంత విజయవంతమైన స్థాయికి చేరుకొని, అమెరికాకి రెడ్‌ కార్పెట్‌ని సంపాదించుకుంటాడు. కానీ, నైజీరియాలోనే ఉండిపోతాడు భార్యాపిల్లలతో.
బ్లాగూ, జీవితమూ అన్నీ విజయవంతంగా నడుస్తున్నా ఒకానొక రోజున ఇఫెమేలు వెనక్కి నైజీరియాకు వెళ్ళే నిర్ణయం తీసుకోవడం, వచ్చి అక్కడ స్థిరపడే ప్రయత్నంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులతో కథ ముగింపుకి తెస్తుంది అడీచే. ముగింపు మాత్రం తనే చెప్పినట్లు రచయిత కలగజేసుకున్న ముగింపు, కానీ పెద్ద లోపం కాదు.
ఇక్కడివరకూ రాసినా అసలు ఇటువంటి ఒక పుస్తకం చదవడం వల్ల ఉపయోగం ఏమిటి అనవచ్చు. చిమమాండా అడీచే రాతల్లో నన్ను వ్యక్తిగతంగా ఆకర్షించే లక్షణం, మన దేశానికీ, నైజీరియాకీ ఉన్న సామ్యం. రెండూ భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా దానికి అనేక రెట్లు అధిక జనాభా ఉన్న దేశాలుÑ రెంటికీ కలోనియల్‌ గతం ఉంది. దాంతో అంది వచ్చిన చక్కటి ఇంగ్లీష్‌, ఆ ఇంగ్లీష్‌ భాష తెలిసి ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలూ ఉన్నాయి. రెండూ కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే గుర్తింపబడుతున్నాయి. రెండు దేశాలకూ ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉంది కానీ దానిపట్ల ఇప్పుడు పెద్ద గౌరవం మిగల్లేదు. రకరకాల విశ్వాసాలనీ, నమ్మకాలనీ ప్రశ్నించడం ఉంది. కొత్త తరాలు ఈ విషయాలు లోతుగా తెలుసుకునే, అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఇక్కడ కులమత ఆధిపత్యాలు ఉన్నట్లు అక్కడ వర్గాధిపత్యాలు ఉన్నాయి. బ్యూరోక్రసీ, రెడ్‌ టేపిజంతో మొదలై అందిపుచ్చుకుంటున్న గ్లోబలైజేషన్‌ దాకా అన్నీ ఒక్కలాంటి సమస్యలే, అవకాశాలే.
ఈనాడు రెండు దేశాలలోనూ, పాతని కూలగొట్టి కొత్తవి నిర్మాణం చేయడంలో ఆసక్తి ఉన్న దశలో ఉన్నాం. పుస్తకం చివరలో ఒక సందర్భంలో ఓబినే,్జ ఇఫెమేలుతో మాట్లాడుతూ ‘‘మన దేశంలో పాత కట్టడాలని అలాగే ఉంచి వాటిని రీస్టోర్‌ చేస్తే యూరోప్‌లో విలువ ఇచ్చినట్లుగా ఇవ్వరు, ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గించాలి, పేపర్‌, ప్లాస్టిక్‌ మితంగా వాడాలి, పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాలు తక్కువగా వాడాలి లాంటి సిద్ధాంతాలు పట్టించుకోరు. ఎందుకంటే మనది ఎదుగుతున్న దేశం. ఇవేవీ మనవాళ్ళు కొత్త తరాలు కూడా అనుభవించలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సౌకర్యాలను కొన్ని తరాల వాళ్ళు అనుభవించడం, వాటివల్ల రాగల దుష్ప్రభావాలు తెలుసుకోవడం, వాటిని వద్దనుకుని ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం ఆయా దేశాల్లో ఇప్పుడు జరుగుతోంది. సైద్ధాంతికంగా ఇది మనకూ వర్తించే విషయమే కానీ, ఇప్పుడిప్పుడే మనవాళ్ళు అవన్నీ కాదు అనుకోలేరు. అందుకే రీస్టోర్డ్‌ ఇళ్ళు, ప్రాకృతిక జీవన విధానం ఇప్పటికిప్పుడు నచ్చే విషయాలు కాదు, పెద్ద కార్లూ, పోష్‌ అపార్ట్‌మెంట్లూ నచ్చినట్లుగా’’ అంటాడు (ఈ మాటలు యథాతథ అనువాదం కాదు, సారాంశం మాత్రమే). అతి ముఖ్యమైన సామ్యం ఈ రోజుకీ ఉన్న బిగ్‌ అమెరికన్‌ డ్రీమ్‌. ఈ కారణాల వల్ల నన్ను కొంత ఎక్కువగా ఆకట్టుకున్నది ఈ పుస్తకం.
2020లో HBO వాళ్ళు పది ఎపిసోడ్ల సింగల్‌ సీజన్‌ సిరీస్‌గా ఈ పుస్తకానికి పచ్చ జెండా ఊపారుLupita Nyong’o ప్రధాన పాత్రధారి ఇఫెమేలుగా. కానీ కోవిడ్‌ తదుపరి డేట్లు సర్దుబాటు చెయ్యలేక Lupita ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రయత్నం ఆగిపోయింది. ఇది దృశ్య రూపంగా కూడా రావలసిన పుస్తకమే. ముందు ముందు వస్తుందేమో చూద్దాం.
అడిచే నవలలన్నీ పరిచయం చెయ్యాలన్న ఆలోచనతో రాసిన రాత మాత్రమే కానీ, పరిశోధనాత్మక వ్యాసం కాదని గమనించగలరు. మరో పుస్తకంతో త్వరలో కలుసుకుందాం.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.