పేరు పెద్దరికం లేని పెద్దముత్తైదువను
నిండుగా పూదిచ్చిన పొత్తుల కుండను
ఊరంతా చెయిచాపే…
పండ్ల గంపను
నా బత్కుల లేని పచ్చదనం
నా కాళ్ళ పసుపై
కళకళలాడుతది
నా నవ్వుల్ల లేని కిలకిలలు
నా చేతిని నిండుకున్న
మట్టి గాజుల్ల గలగల మంటయి
నన్ను నిలువెల్లా కాల్చే
నా గుండె మంటలు ఎరుపెక్కి
నా నొసట రూపాయి కాసంత
కుంకుమై కూసుంటది
తినబోతే తిండి లేక
కట్టు బట్టలేక
ఉండబోతే అయిమన్న గూడు లేక
చెయ్యపోతే ఎవరు పని ఇయ్యక
ఏ ప్రభుత్వ పథకాలు వర్తించక
బతుకు భారమై
ఇంటింటికీ జోలెపట్టే బిక్షగత్తెను
ఊరుమ్మడి ఉంపుడుగత్తెను
మీ గుళ్ళో దేవుని పెద్ద పెండ్లాన్ని
మొగని మొఖమెరుగని
ముండబొడ్డిని
నేను జోగిన్ని కాను కాను
అంతకన్నా ముందు
మీ ఇంటి అడ్విల్లను