భూమిక పత్రికా సంపాదకులకు నమస్కారం. పత్రిక తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరాఘాటంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
నేను అంటే ఎవరు? అని ప్రశ్నించుకునే క్రమంలో తలెత్తిన ఎన్నో అంతరంగపు అనుమానాలకు, సందేహాలకు, ఆలోచనలకు, చక్కని సమాధానాలను, ఎంతో మనోధైర్యాన్ని అందిస్తూ సమాజంలో ధీటుగా నిలబడగలిగేలా భూమిక పత్రిక తన పాత్ర పోషిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సమాజంలోని మూఢనమ్మకాలను, ఆచారాలను, సంప్రదాయాలను ఇంకా ఇంకా పాటిస్తూ అవమానాలకు తలొగ్గి బ్రతికే జీవకోటిలో చైతన్యాన్ని నింపింది. ఏ నమ్మకం, ఆచారం, సంప్రదాయం అయినా అనుకూలతను బట్టి కానీ తప్పనిసరి అని వ్యవహరించడం అవి ఇతరులపై రుద్దడం ఎంతటి అమానుషమో కూడా ఎలుగెత్తి చాటింది. ఆడవాళ్ళపై హింసలను, అత్యాచారాలను నిరసించడమే కాక వాళ్ళకు అండగా నిలబడి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి జీవితంలో ముందుకు నడిచేలా ధైర్యాన్నిస్తుంది.
తమ తమ జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజయాలు సాధించిన మహిళలను ఆదర్శంగా చూపిస్తూ పాఠకులలో ప్రేరణ కల్పిస్తుంది. నాలాంటి పాఠకులలో సైతం సృజనాత్మకతకు బీజం వేసి వారి రచనా కౌశలానికి అవకాశాలు అందిస్తూ ఎందరో కొత్త రచయితలకు, కవులకు స్థానం కల్పించింది. పాఠశాల విద్యార్థుల స్థాయి నుండి గొప్ప గొప్ప రచయితల వరకు వారి విశిష్టమైన సాహితీ సృజనకు వేదికగా నిలిచింది. మహిళా మణులు ఏ రంగంలో దూసుకెళ్ళినా వారి మహిమాన్విత గుణాలను, వారి జీవిత పాఠాలను సేకరించి పత్రికలో ప్రచురించి పాఠకుల హృదయాలలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి అవకాశాలు అందీ అందక చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నప్పటికీ ఎక్కడో ఒక మూల సమాజంలోకి చొచ్చుకు పోవాలంటే కొంచెం తక్కువేమో అనే భావన కలిగి ఉండే మాలాంటి వారిలో స్ఫూర్తిని అందించి, గొప్ప గొప్ప రచయితల ప్రచురణలు ప్రచురించే భూమిక పత్రిక మేమంటే ఏంటో మాకు తెలిసేలా, అర్థమయ్యేలా సమస్త పాఠక లోకం గ్రహించేలా మంచి ప్రోత్సాహాన్ని అందించిన భూమిక పత్రికకు హృదయాంతరాళం నుండి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎన్నో కథలు, కవితలు, ఇంటర్వ్యూలు, సమీక్షలు, వ్యాసాలు, లేఖలు, అంతరంగాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియలకు నిలయమై మాలాంటి నూతన రచయితలకు, పాఠకులకు అవకాశాలు కల్పిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, ఇంకా… ఇంకా… ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
` ఎ.శ్రీలత