భూమిక స్త్త్రీవాద పత్రికను మనం ఎందుకు చదవాలి అని నన్ను నేను నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపం ఇది. స్త్రీలు పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేస్తున్న కాలం ఇది.
ప్రముఖ కవి గురజాడ గారు ‘‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది’’ అని ఎంతో ఆశాభావంతో నమ్మకంతో ప్రకటించి ఇప్పటికి సుమారు 80 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఇంకా ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధులు, రోగుల సంరక్షణ స్త్రీల ప్రధాన బాధ్యతగానే ఉండడం ఈ సమాజం యొక్క దౌర్భాగ్యం. అత్యంత వేగంగా సాంకేతికంగా సమాజం మారిపోతోంది. సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇవన్నీ మన నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చొన్నాయి. వీటి ప్రభావంలో పడని మనుషులే లేరు. అయినా మారని విలువలు, మనస్తత్వాలు, వాటివల్ల వచ్చే వైరుధ్యాలతో, మానసిక వికారాలతో కూలిపోతున్న కుటుంబాలు, ఇళ్ళల్లోని హింస, నిర్బంధం తట్టుకోలేక బయటకు వచ్చే మహిళల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడిపోయినట్లు అనిపిస్తోంది. ఇంకోపక్క దేవుడు డైరెక్ట్‌గా వారి కల్లోకొచ్చి చెప్పినట్లే ఈ గురూజీలు, స్వామీజీలు, బాబాలు, అమ్మలు ఈ రోజు ఈ పూజ చేయాలి, ఈ రోజు ఈ వ్రతం చేయాలి, ఈ మంత్రం ఇన్ని గంటలకు ఇన్నిసార్లు పఠించాలి లేకుంటే ఆ ఇల్లు సర్వనాశనం అంటూ సామాజిక మాథ్యమాల్లో భయపెట్టడం, మన దేశ సంస్కృతి సాంప్రదాయం మొత్తం స్త్రీలలోని మార్పులవల్లే మట్టి గొట్టుకుపోతోంది అని టీవీల్లో, ఫేస్‌బుక్‌ల్లో ఊదరగొట్టేయడంతో సామాన్య మహిళలు గందరగోళానికి గురవుతున్నారు.
ఇంకోపక్క పిల్లలు ఏ మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఏ చెడుసావాసాలు పట్టి పనికిరాకుండా పోతారో అనే భయం, ఆడపిల్లలతో అదనంగా వారి రక్షణ గురించి, పరిపక్వత లేని ప్రేమ వ్యవహారాల గురించిన టెన్షన్. అందరికీ అన్ని వయసుల వారికీ టెన్షన్. అత్తాకోడళ్ళ ఆధిపత్య పోరాటాలు, తోడికోడళ్ళ అసూయ, వివాహేతర సంబంధాల నుండి భర్తను రక్షించుకోవడం, వీటికి సంబంధించి ఎత్తులకు పై ఎత్తులు, ఆస్తులు, అహంకారాలు, సెంటిమెంట్లు ప్రతిబింబిస్తూ వెల్లువెత్తుతున్న సీరియళ్ళు, వెబ్‌సిరీస్‌లు. వీటన్నింటి ప్రభావంతో చదువుకున్న స్త్రీలు కూడా మన హక్కుల గురించి ఏమేం చట్టాలున్నాయి, ఏమేం సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవచ్చు అనే కనీస జ్ఞానాన్ని పొందడానికి అందరూ భూమిక మ్యాగజైన్ చదవాలి.
స్త్రీలు, పురుషుల ఇద్దరూ సమాజం సృష్టించిన జెండర్ మూస పద్ధతుల్లో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ వాళ్ళ జీవనకాంక్షను, జీవనసారాన్ని కోల్పోతున్న పరిస్థితి. వాటినుండి ఎలా బయటపడాలో మార్గాలు వెతుక్కునేందుకు మనందరం భూమిక మ్యాగజైన్ చదవాలి.
హక్కులు నిరాకరించబడి సమాజం అంచులకు నెట్టివేయబడుతున్న ట్రాన్స్‌జెండర్స్ లాంటి సమూహాల ఆత్మఘోషను అర్థం చేసుకునేందుకు మనం భూమిక మ్యాగజైన్‌ను తప్పనిసరిగా చదవాలి.
ఆదివాసీలు, దళితులు, మైనారిటీల పట్ల మన రాజకీయ విధానాలు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయో తెలుసుకునేందుకు, మన ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కులు ఎలా కాలరాయబడుతున్నాయో తెలిపే భూమిక మ్యాగజైన్ మనలోని మానవత్వాన్ని పెంచుకునేందుకు చదవాలి. స్త్రీల దృక్పథంతో వచ్చే ఆధునిక కథలు, నవలలు, వ్యాసాలు ఎప్పటికప్పుడు మనకు అందిస్తున్నందుకు మనం భూమిక మ్యాగజైన్ చదవాలి. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లోని స్త్రీల పోరాటాలు, పితృస్వామ్యం నుండి వారి పెనుగులాటలు, వారి ఓటములు, విజయాలు మనముందుకు తెస్తూ తాజా సమాచారాన్ని మనకు చేరవేస్తున్నందుకు మనం భూమిక మ్యాగజైన్ చదివి తీరాలి. సమాజం కళ్ళు తెరిపించే ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది వివేకం, విచక్షణ నిజాయితీ కలిగిన వ్యక్తుల జీవితాచరణ వారు సమాజాన్ని మేల్కొలిపే అద్భుత పద్ధతి వారి చరిత్రల గురించి, రచనల గురించి మనకు తెలుపుతున్నందుకు మనం భూమిక మ్యాగజైన్ చదవాలి.
మన గుండెలోని ధైర్యాన్ని ఎగదోస్తూ మనుషుల్లోని మంచితనం పట్ల మనకున్న ఆశ చావకుండా, ఇన్ని వైరుధ్యాలు, అసమానతలు, హింసల మధ్య మన జీవితాల్ని కొత్త చిగుళ్ళు తొడుక్కునేలా, ఇతరులకు సహాయం చేసేలా తీర్చిదిద్దుతూ మనంతట మనమే మంచిగా మలచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది ‘భూమిక పత్రిక’. తెలుగు స్త్రీలందరికీ కావాల్సిన జ్ఞానాన్ని పుస్తకరూపంలో నెలనెలా మనకందిస్తూ వస్తున్న భూమిక మ్యాగజైన్ పదికాలాల పాటు మనం చదువుకుంటూనే ఉండాలి.
` శాంతిప్రియ ఆర్.