30 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కొనసాగాలని, కొనసాగుతుందని ఆశిస్తున్నాను.
భూమికను నేను మొదటిసారిగా మహిళా సమతలో పనిచేస్తున్నప్పుడు చదివాను. కానీ అప్పుడు పుస్తకం మొత్తం చదివేదాన్ని కాదు. అప్పుడు కథ, సంపాదకీయం, పిల్లల భూమిక మాత్రమే చదివిన గుర్తు. భూమికలో చేరిన తర్వాత పుస్తకం మొత్తం చదవడం అలవాటైంది. భూమిక పుస్తకమే కాక ఇతర పుస్తకాలు కూడా చదవటం అలవాటైంది.
భూమికలో వచ్చే అన్ని ఆర్టికల్స్ ఆలోచింపచేసేవిగా ఉంటాయి. సంపాదకీయంలో ప్రతి విషయం ప్రస్తుతం సమాజంలో జరిగే విషయాల గురించి రాసి అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. అలాగే కాలమ్స్‌లో వచ్చే కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు ఈ దృష్టితో కూడా ఆలోచించి ముందుకు సాగేలా, ఆలోచించేలా ఉంటాయి. నాకు బాగా నచ్చిన సింగిల్ ఉమెన్ గురించి రాసిన ఆర్టికల్ చాలా బాగా నచ్చింది. కథల్లో అబ్బూరి ఛాయాదేవి గారు రాసిన బోన్సాయ్ కథ చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు చదివానో ఈ కథని.
జీవితానుభవాలు, కథలు, వ్యాసాలు చదివినప్పుడు మన ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుందని నా నమ్మకం. మహిళల జీవితానుభవాల గురించి ప్రచురించి మహిళల ఆలోచనా విధానంలో మార్పు వచ్చేలా, ఆత్మవిశ్వాసం పెరిగేలా మరియు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ఉంటాయి. భూమిక పత్రికలో వచ్చే కథలు, కవితలు, వ్యాసాలు… అన్నీ ప్రతి ఒక్కటీ చాలా బాగుంటాయి. కొత్తగా రాసేవారిని కూడా భూమిక ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. దాంతో రాయాలన్న ఉత్సాహం పెరుగుతుంది.
పుస్తక సమీక్షలు, సినిమా సమీక్షలు కూడా ఎంతో అర్థవంతంగా, ఆలోచించే విధంగా ఉంటాయి.
భూమికకు ఆర్టికల్స్ పంపించే రచయిత్రులందరూ కూడా స్త్రీలకు సంబంధించినవిగా స్త్రీలు ఆలోచించి ముందుకు సాగేలా వ్రాయడం చాలా మంచి విషయం. మహిళలపై జరిగే హింసలను వ్యతిరేకిస్తూ వారికి అండగా భూమిక ఎప్పుడూ ఉంటుంది.
ఇంకా ఎన్నో సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలని, మహిళలలో చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.
` శ్రీలలిత