అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయాయా అన్పిస్తోంది భూమిక గురించి ఆలోచిస్తోంటే. దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి
లేదు. పత్రికను ఈ స్థాయికి తీసుకురావడానికి సత్యవతిగారు ఎంతో శ్రమించారు. ఈ పదం చిన్నదే వారి శ్రమకు.
అసలు స్త్రీవాదం గురించి రాయడానికీ మాట్లాడడానికీ సంకోచించే రోజుల్లో పత్రికలలో వారికో పేజీ ఉండాలనే, ఉండి తీరాలనే ఆలోచనను బలంగా సమర్థించాల్సిన పరిస్థితిని భూమిక తీసుకు వచ్చింది.
మనకు తెలియని ఎన్నో అమానవీయ సంఘటనలూ, జీవితాలూ, దుర్భర వేదనలూ అనుభవించిన స్త్రీల గురించి ధైర్యంగా ప్రచురించి వారి పోరాట గాథలను పత్రిక ద్వారా మనందరికీ తెలియజేయడం ఇప్పటివరకూ జరుగుతూనే ఉంది.
అంతేకాకుండా రచయిత్రులందరితో కల్సి మారుమూల ప్రాంతాల పర్యటనలు చేస్తూ, ఆయా ప్రాంతాల వారికున్న సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తూ, వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఇవి మీ హక్కులు, ఇవి మీకు రావాల్సిన జీవిత సౌకర్యాలు’’ అంటూ వాళ్ళకు తెలియజేయడం కోసం పర్యటన వివరాలను ప్రచురించడం ద్వారా మాలాంటి వాళ్ళం ఎంతో తెలుసుకోగలిగాం.
ఈ మధ్య కాలంలో పిల్లలకు సంబంధించిన బాల సాహిత్యాన్ని వారితోటే రాయించడం, అన్ని భాషల్లో పిల్లలకు సంబంధించిన కథలూ, వ్యాసాలూ, కవితలు భూమికలో ప్రచురించడం వల్ల బాల సాహిత్యకారులు తమ రచనల ద్వారా అప్పుడే సమస్యలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
2007 నుంచి భూమికతో నా అనుబంధం కొనసాగుతోంది. కథల పోటీలో ‘అమ్మా బయలెల్లినాదో’ కథకు పి.సి.రెడ్డి (సినీ డైరెక్టర్) గారి చేతుల మీదుగా రెండవ బహుమతిని తీసుకోవడం ఆనందాన్నిచ్చింది. అప్పటినుండి భూమికకు ‘లైఫ్’ పంపుతూనే ఉన్నారు. కవిత్వ పరంగా, కథల పరంగా ఏది పంపినా పరిశీలించి వేసుకోవడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆపదలో ఉన్న, సమస్యల్లో ఉన్న స్త్రీలకు ‘భూమిక హెల్ప్‌లైన్’ ద్వారా 24 గంటలూ అందుబాటులో ఉండడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం.
‘భరోసా సెంటర్, సఖి సెంటర్, వయో వృద్ధుల హెల్ప్‌లైన్’ లాంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ ఎందరో స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపుతున్న భూమిక సంపాదకురాలు సత్యవతి గారికి ధన్యవాదాలు. అలాగే వారి సహ సంపాదకుల బృందాలకు కూడా అభినందనలు.
` తమ్మెర రాధిక, తొర్రూరు