భూమికతో నడక
ముప్ఫై ఏళ్ళ భూమిక ప్రస్థానంలో మొదటినుంచీ కొనసాగిన స్నేహం నాది. అంతవరకూ వస్తున్న స్త్రీల పత్రికల ఒరవడిని మార్చి వంటలు, కుట్లు, అల్లికలు కాకుండా
విస్తృతమైన మరో ప్రపంచం ఉంది అని తెలియజేసిన పత్రిక భూమిక. అన్ని వర్గాల స్త్రీల జీవితాల్లోకి ఒక వెలుగు కిరణంలా దూసుకువచ్చిన పత్రిక భూమిక.
ఒక రచయితగా భూమికకు రచనల్ని పంపడమే కాదు విస్తృతమైన ప్రయాణాల్లో పాలుపంచుకున్న అనుభవం నాది. ప్రఖ్యాత మహిళా రచయితల్తో కలిసి చేసిన ప్రయాణాలు గొప్ప ఆనంద దాయకాలు. ఆ విహార యాత్రలు వినోద యాత్రలు కావు, జీవ వైరుధ్యాల్ని పరిచయం చేసిన గొప్ప విజ్ఞాన యాత్రలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని, అక్కడి జీవితాల్ని చూడడం, అవగాహన పెంపొందించుకోవడం రచయిత్రుల కథా రచనకి, వ్యాస రచనకి ఎంతో ఉపయోగపడిన
సందర్భాలు అవి. గోదావరి మీద ప్రయాణం చేసినప్పుడు పాలకొల్లులో లేసు కార్మికుల్ని చూడడం ఒక ఎత్తైతే, పేరంటాలపల్లిలో గిరిజనులు వెదురుతో తయారుచేసిన రకరకాల కళాకృతుల్ని, వారి ఇళ్ళను, జీవన విధానాల్ని చూడడం మరో ఎత్తు. సముద్ర తీర ప్రయాణాల్లో మత్స్యకారుల జీవితాల్ని చూడడం ఓ పక్క` దట్టమైన అడవుల్లో జలపాతాల్ని, కొండకోనల్ని, అక్కడి జీవజాలాన్ని చూడడం మరోపక్క. గలగలపారే సెలయేరుల తుళ్ళింతలొక పక్క, స్త్రీల జీవితాల విపత్తుల సందర్శనలు మరో పక్క. ఆ ప్రయాణాలు ఏ కారణంతో ఎందుకు ఆగిపోయినా రచయిత్రులకు గొప్ప వెలితిని కలిగించాయి.
భూమిక ముఖచిత్రాలు రచయిత్రుల విజయాలు, అవార్డు ఫంక్షన్‌ల ఫోటోలతో, ఎన్నెన్నో సంఘటనల సమాహారాలతో ఒక ప్రత్యేకమైన ఒరవడిని పాటిస్తున్నాయి. భూమిక కొన్నాళ్ళు అందంగా పేరు ముద్రించిన ప్లాస్టిక్ కవర్లతో వచ్చింది. నేనైతే కొత్తగా కొనుక్కున్న పుస్తకాల్ని, ఆ కవర్లలో పెట్టేదాన్ని. కథలు, కవితలతో పాటు భూమిక ప్రచురించే వ్యాసాలు, వర్తమాన సమస్యల్ని తెలియజేసే కరదీపికలుగా ఉంటాయి. ప్రత్యేకమైన కాలమ్స్, జీవితానుభవాలు శీర్షికతో ఎందరెందరో సమరయోధులైన స్త్రీలతో ఇంటర్వ్యూలుÑ అన్నింటినీ మించి కె.సత్యవతి రాసే ఎడిటోరియల్స్ పత్రిక ప్రత్యేకమైన స్థాయిలో నిలబడేలా చేస్తున్నాయి. ఎందరో బాధిత మహిళల్ని ఆదుకునే భూమిక హెల్ప్‌లైన్ ప్రత్యేకంగా చెప్పదగినది. కొత్త విషయాల్ని కనుక్కోవడంలో భూమిక ఎప్పుడూ ముందు ఉంటుంది. తెలుగులో మొదటి కథ భండారు అచ్చమాంబది అని ప్రకటించింది. కథల పోటీలు పెట్టి ఎందరో కొత్త రచయిత్రుల్ని ప్రోత్సహిస్తోంది. భూమికకు వచ్చే ఉత్తరాలు ఎంతో బావుంటాయి. సత్యవతి స్వయంగా గొప్ప స్నేహశీలి. ఆ స్నేహం వల్లనే తను ఏమి చెయ్యాలనుకుని ప్రకటించినా రచయిత్రులు ముందుకు వస్తారు. అబ్బూరి ఛాయాదేవి, శాంతసుందరి, పుట్ల హేమలత వంటివారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన సందర్భాల్ని, ప్రత్యేక సంచికలు వేసి భూమిక ఎలా పంచుకుందో మనందరికీ తెలుసు.
భూమిక సంపాదకీయవర్గం, అడ్వయిజరీ కమిటీల పేర్లు చూస్తేనే భూమిక వెనుక ఎందరు కార్యదక్షులుగా ఉన్నారో తెలుస్తుంది. నేను దూరంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉండిపోవడం వల్ల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పాలుపంచుకోలేక పోయాను. ముప్ఫై సంవత్సరాల భూమిక ప్రయాణం సమాజంలోని రుగ్మతల్ని ఎండగడుతూ నిరాటంకంగా మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
` కె.వరలక్ష్మి