ఒక సామాజిక రుగ్మత గురించి కత్తి రaళిపించే సంపాదకీయం, అత్యంత మార్మికత, ప్రభావాత్మకత గల ఏదో ఒక పుస్తకం గురించిన సమీక్ష, ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తి ‘జీవితానుభవాలు’ శీర్షిక, ఓల్గా, శాంతిప్రబోధ, సుభద్రల విలువైన ఫీచర్స్,
ట్రాన్స్‌జెండర్‌ల ఊహకందని సమస్యల చిత్రణ, ‘బహిష్టు’ వంటి వాటిపై చర్చ, సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, ప్రేమ పేరుతో వంచన… వీటన్నింటిపై అవగాహనని పెంచే వ్యాసాలు, కథలు, కవితలు… అన్నింటినీ మించి ‘భూమిక హెల్ప్‌లైన్’ నిర్వహణ, పిల్లలు, స్త్రీల కోసం పనిచేసే సంస్థల ఫోన్ నంబర్లు ఇవ్వడం, ఎక్కడో ఏ మారుమూలో స్త్రీలపై ఆంక్షలు, ఆచారాల పేరిట జరుగుతున్న దోపిడీని వెలుగులోకి తేవడం… భూమికకి మాత్రమే సొంతమనేది నిర్వివాదాంశం.
రేకెత్తించిన ఆలోచనకి ఆచరణా రూపమివ్వడానికి, ప్రాంతీయంగా ఎక్కడికక్కడ ఉపకార్యాలయాల్ని నెలకొల్పి, తదనుగుణంగా కార్యక్రమాల్ని రూపొందించుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందని సూచన. హెచ్చు మందికి భాగస్వామ్యం ఉండడం దాన్ని కేంద్రీయంగా అనుసంధానించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని ఆశ.
` ఎస్.కాశింబి