మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక, మహిళల సమస్యలను చర్చించే వేదిక, మహిళల మనోభావాలను ప్రతిబింబించే స్వచ్ఛమైన దర్పణం భూమిక. చలంగారు చెప్పినట్లు స్త్రీకి కూడా స్పందనలు, మనసు, మెదడు ఉన్నాయని, ఆలోచించగలదని, చర్చించగలదని,
పరిష్కరించగలదని, పోరాడగలదని, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించగలదని రాతల ద్వారానే కాదు, చేతల ద్వారా నిరూపించిన మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న తెలుగు పత్రిక భూమిక. పార్టీల అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న పత్రికలే కొన్ని సంవత్సరాలకు బోర్డు తిప్పేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తొడకొట్టి, మీసాలు మెలివేసిన మగవాళ్ళే పత్రికలను నిర్వహించలేక నానా అగచాట్లు పడుతున్న రోజులివి. ఎంతో కష్టపడి ప్రాణాలను సైతం పణంగా పెట్టి వార్తలను సేకరించి తీసుకురావాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాలలో జర్నలిస్టులకు ఎదురవుతుంది. అంత పోరాడి తెచ్చినా ఏదో ఒక ఒత్తిడికో, బెదిరింపునకో లొంగిపోయి నిజాల్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రచురించలేకపోతున్నాయి కొన్ని పత్రికలు. ఇందుకు భిన్నంగా కుల మత రాజకీయ పలుకుబడులకు అతీతంగా మహిళల సమస్యలను నిర్భయంగా, నిజాయితీగా ఉన్నదున్నట్లు ప్రచురిస్తున్న పత్రిక భూమిక. భూమికలో వచ్చే వ్యాసాలు, కథనాలు, ఇంటర్వ్యూలు, కవితలు అన్నీ కూడా ఎంతో విలువైనవే. దానికితోడు భూమిక హెల్ప్‌లైన్. ఈ పురుషాధిక్య సమాజంలో వీటి నిర్వహణ కత్తిమీద సాములాంటిది. దమ్ము, ధైర్యం, తెగువ, త్యాగం అన్నీ కలిపితే సత్యవతిగారు అనే టైగర్. లేడీ టైగర్ అనను ఎందుకంటే ఆమె బెదిరిపోయే లేడీ కాదు. మదపుటేనుగులతో పోరాడే టైగర్. ముప్ఫై సంవత్సరాలుగా దిగ్విజయంగా భూమికను నిర్వహిస్తూ, ఎందరో మహిళలకు సహాయం చేస్తూ, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ మహిళల చీకటి బ్రతుకుల్లో విజ్ఞానమనే వెలుగు పంచుతూ మహిళా చైతన్యానికి దీపికగా నిలిచిన భూమికకు, భూమిక టీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. భూమికతో నా ప్రయాణాన్ని, అక్కడ నాకు కలిసిన మిత్రులు అబ్బూరి ఛాయాదేవి, శాంతసుందరి లాంటి పెద్దలు, వాకపల్లి, తలకోన మొదలైన టూర్లను ఎప్పటికీ మర్చిపోలేను. భూమికలో నేను కూడా ఒక అక్షరమైనందుకు గర్వపడుతున్నాను. భూమిక మహిళా నేపథ్యానికి ఎప్పటికీ భూమికలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
` జి.విజయలక