తన భూమికను నిక్కచ్చిగా నిభాయించుకుంటున్న ‘భూమిక’
స్త్రీవాద పత్రిక భూమిక అంటే… మట్టి జీవితాల్లో కటిక చీకట్లోనూ వెలుగుపూలు పూయించే ఒక చైతన్య దీపిక, ఎంతోమందికి తమను వ్యక్తపరచుకోడానికి ఒక వేదిక.
అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రిందట ప్రగతిశీల భావాలుగల కొద్దిమంది మహిళల సమిష్టి
కృషితో పురుడు పోసుకున్న స్త్రీవాద పత్రిక భూమిక అంచెలంచెలుగా ఎదిగి ఒక్కో మైలురాయిని దాటుకుంటూ కారణాంతరాల వల్ల అప్పటి వారంతా ఒక్కరొక్కరుగా తప్పుకున్నా దాదాపు రెండు దశాబ్దాలపైగా ఏ సంక్షోభంలోనూ తడబడకుండా నిలబడి ‘స్త్రీవాద పత్రిక భూమిక’గా కొనసాగుతోందంటే దాని వెనుక నిరంతర తపన, నిర్విరామ కృషి, మొక్కవోని దీక్ష, వెనకడుగువేయని ధీరత్వం, నిఖార్సైన స్త్రీవాదం ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయ పత్రికగా మూడు దశాబ్దాలపాటు నిలదొక్కుకోవడం సామాన్యం కాదు. అందులోనూ స్త్రీల హక్కుల సాధనకు అవసరమైన సమాచారాన్ని అందించడం, చైతన్యపరచడంతో పాటు బాధిత మహిళల తరపున నిలబడడం, సమాజంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించడం మాటలు కాదు. విషపూరిత రాజకీయ వాతావరణంలోనూ వ్యవస్థల్లో లోపాలను ఎత్తిచూపడంతో పాటు స్త్రీల పక్షాన నిర్మాణాత్మక సూచనలను చేయడం భూమిక ప్రత్యేకత. నాకైతే భూమిక ఒక విజ్ఞాన భాండాగారం.
చరిత్రలో మరుగున పడవేయబడ్డ భండారు అచ్చమాంబని తెలుగులో మొట్టమొదటి (వందేళ్ళకి ముందే) కథా రచయిత్రిగా సాహితీ లోకానికి పరిచయం చేయాలనుకోవడం కొండను ఢీకొట్టడం లాంటిదే. దానిని సాధ్యం చేయగలిగింది అమ్మూ (కొండవీటి సత్యవతి) మాత్రమే. అంతేకాక అచ్చమాంబ రాసిన ఖనా, సరసవాణి వంటి 34 మంది గొప్ప గొప్ప మహిళల జీవితాలని చరిత్ర చీకట్లో వెలుగురవ్వలుగా భూమిక ద్వారా తెలుగు పాఠకులకి అందించడం స్ఫూర్తిదాయకం. అలాగే సమకాలీన రచయిత్రుల జీవితగాథల్ని, వారి కథల్ని భూమిక ద్వారా కొన్ని వేలమందికి చేరవేయగలగడం అంటే వాటిని చదివేవారిని, వినేవారిని విద్యావంతుల్ని చేయడమే. ఇక కొత్త రచయిత్రుల్ని ప్రోత్సహించడం, కథా వర్క్‌షాప్‌లను నిర్వహించి గ్రామీణ, ఆదివాసీ మహిళల జన జీవన వాస్తవాలని పరిచయం చేయడం, అణచివేతకి గురై అత్యంత జఠిలమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న స్త్రీలతో మాట్లాడిరచడం, తద్వారా స్త్రీవాద దృక్పథాన్ని, దృక్కోణాన్ని మరింత గాఢతరం చేసుకోవాలని, అది వారి రచనల్లో ప్రతిబింబించాలని ఆశించింది. ఆ దృక్కోణంతో వారు సమాజ మార్పుకు అవసరమైన కథలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, రచనలు చేయడానికి, వాటిని ప్రచురించి సాహితీ ప్రపంచానికి అందించడం భూమిక తప్ప ప్రధాన స్రవంతి మీడియా కానీ, ఇతర తెలుగు పత్రికలు కానీ చేయగలవని, చేస్తారని నేను అనుకోను.
ఇటువంటి ప్రత్యామ్నాయ పత్రికలో పిల్లల కోసం ఒక పేజీ కేటాయించి చిన్న వయసు నుంచే వారు సృజనాత్మకంగా రాయడంతోపాటు, స్త్రీవాద దృక్పథాన్ని అలవరచుకునేందుకు ప్రోత్సహించడం ఒక విజయవంతమైన ప్రయోగం. కుల, మత, ప్రాంత, వర్గ, వయసు పరమైన వివక్ష, పక్షపాతం లేకుండా మూడు దశాబ్దాలపాటు ఒక ప్రత్యామ్నాయ పత్రికగా నిలబడి పాఠకుల, రచయితల అభిమానం చూరగొన్న పత్రికగా భూమిక పేరుపొందిందంటే విశేషమే. ఇది సునాయాసంగా జరిగిందైతే కాదు… ఎంతో సమయం, కష్టం, ఘర్షణలతో పాటు నిరంతర పోరాటమూ ఉంది.
ఇంతటి ఘనమైన పత్రికలో నేనూ కొంతకాలం రాయడానికి అవకాశం రావడం, సంపాదకవర్గంలో చోటు పొందగలగడం, పత్రికలో ప్రచురించే విషయాన్ని ఈ మధ్య వరకు నేను ఎడిట్ చేయడం నాకెంతో గర్వకారణం.
భూమికలో సమకాలీన అంశాలపై వ్యాసాలు, విమర్శలు, సంపాదకీయాలు, విజ్ఞానవంతంగా, విశ్లేషణాత్మకంగా, ఆలోచన రేకెత్తించేవిగా ఉంటాయి. ఈ విషయంలో ఈ మధ్య కొంచెం నిదానించినట్లు అనిపిస్తోంది. మళ్ళీ పుంజుకుని మరింత శక్తివంతంగా మారాల్సిన సమయం ఇది.
ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచంలో పాఠకులు తగ్గుతున్న, ఉన్న పాఠకులూ ఆన్‌లైన్ మీడియావైపు మొగ్గుచూపుతున్న సందర్భంలో ‘భూమిక’ రచనా పరమైన, ఆర్థిక పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇలానే ఎన్నో పత్రికలు కనుమరుగైపోయాయి. ఈ పరిస్థితి ‘భూమిక’కి ఎదురుకాకుండా ఉండాలంటే, స్త్రీవాద పత్రికగా భూమిక కొనసాగాలంటే మనందరం భుజం భుజం కలిపి అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇందుకోసం నేను సైతం (కలాన్ని గళంగా చేసుకుని) భూమికతో రెక్కనౌతాను… మరిన్ని దశాబ్దాలపాటు రాబోయే తరాలకి స్త్రీవాద సాహిత్య చుక్కానిగా భూమిక వెలుగొందాలని ఆశిస్తున్నాను.
` పి.ప్రశాంతి