భూమిక ‘బహుజని’గా మారాలి
ముప్పయ్యేండ్లు పూర్తి చేసుకున్న భూమిక స్త్రీవాద పత్రిక్కి, పత్రిక కోసం పనిచేసిన మిత్రులకు, భూమిక పత్రికను నిర్విరామంగా నడుపుతున్న ఎడిటర్ కొండవీటి సత్యవతికి శుభాభివందనలు. కొండవీటి సత్యవతి భూమిక సత్యవతిగా పాపులర్ అయిందంటే ఆ పత్రికను
తన భుజాల మీదేసుకుని ఆగకుండా, ఆపకుండా ఎంత కృషి చేసిందో అర్థమౌతుంది.
భూమిక ఆధిపత్య కుల స్త్రీవాద కార్యక్రమాలకు, చర్చలకు, సభలకు, దృక్పథాలకు వేదికైనప్పటికీ కొన్ని మినహాయింపులతో ఇతర భావజాల అస్తిత్వాలకు చోటు కల్పించింది. అట్లా ‘మా అక్క ముక్కు పుల్ల గీన్నే పొయింది’ కాలమ్ రాయడానికి ప్రోత్సహించిన ఎడిటర్ సత్యవతికి బిగ్ హగ్స్. అట్లా ప్రోత్సహించి చోటు కల్పించడం వల్ల నేను బహుజన, బహుజనేతర మహిళల మీద, ఇంకా సామాజిక సమస్యల మీద కాలమ్ రాయడానికి అవకాశమేర్పడిరది.
వ్యాపార పత్రికలైనా, ఉద్యమ పత్రికలైనా ముందునుంచి ఆధిపత్య కులాలు నడిపించేవిగనే ఉన్నయి. అట్లా భూమిక కూడా ఆధిపత్య కుల మహిళలు నడిపించేదిగానే ఉంది. అభ్యుదయ, ఆధునిక, విప్లవ, ఫెమినిస్టు ప్రగతిశీల వాదాలన్నీ కులాన్ని, దాని వెనకున్న మతాన్ని ధ్వంసం చేసేవిగా లేవు.. ఆధిపత్య కులాలకు ప్రయోజనాత్మకంగా ఉన్న, వారికి అంగీకారంగా ఉన్న భావజాలాలే అన్ని రకాల పత్రికలు నడుస్తున్నయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా సమస్యల్ని ఫెమినిస్టులు అర్థం చేసుకున్న దృష్టి కోణాల పరిధుల్లోంచి పరిమితుల్లోనే భూమిక ముప్ఫయ్యేండ్లు పూర్తిచేసుకున్నది. అణగారిన శ్రమ కులాల మహిళల జీవితాలు, వైవిధ్యాలు, వైరుధ్యాలు, చరిత్రలు, అనుభవాలు వాటిని చుట్టున్న అగాధాలు ఇంకా వెలుగులోకి రాలేకున్నయి. బహుజన కులాల దృష్టికోణాలతో విస్తృంగా బహుజన కులాల మహిళా పత్రికలు రావాల్సిన అవసరముంది.
గత ముప్పయ్యేండ్లల్ల వచ్చిన సామాజిక ఉద్యమ భావజాలాలకు, సంఘటనలకు భూమిక అడపాదడపా మాదిగ దండోర, కారంచేడు, చుండూరు, ఆదివాసీ, ట్రాన్స్‌జెండర్, పర్యావరణం, వెనకబడిన ప్రాంతాల (తెలంగాణ) ఉద్యమాలకు సంఫీుభావం ప్రకటించినప్పటికీ భూమిక ఆధిపత్య కులాల స్త్రీవాద భావజాల స్వభావంలో గుణాత్మక మార్పేమీ చోటు చేసుకోలేదు. ఆధిపత్య జెండర్ భావజాల, కార్యక్రమాల చట్రంలోనే ఇంకా కొనసాగుతున్నది.
సామాజిక నియంత్రణ, రాజకీయ నియంత్రణ, ఆర్థిక నియంత్రణ, జెండర్ నియంత్రణను సవర్ణ పితృస్వామ్యం వ్యవస్థీకృతంగా నిర్ణయిస్తున్నదని బహుజన మహిళా వాదం చెబుతున్నది. ‘ఈ ఆధిపత్యాలన్నింటిలో’ సవర్ణ మాతృస్వామ్యానికి భాగస్వామ్యం ఉంది, యాజమాన్యం ఉంది అనే బహుజన మహిళా వాదాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, మౌనం వహించడం, చర్చకు పెట్టకపోవడం, పూర్వపక్షం చేయడం, న్యూనతకు గురిచేయడం ఇవన్నీ ఆధిపత్య అణచివేతలే. ఈ వైఖరి పాలక కులాల మహిళలకు లాభిస్తుందే తప్ప మెజారిటీ బహుజన మహిళలకు ప్రమాదమే కదా!
సమాజంలో ఉత్పత్తి శక్తులైన బహుజన మహిళా ఆర్థిక, సామాజిక, రాజకీయాలు ఉత్పత్తికి బైట ఉన్న ఆధిపత్య జెండర్ రాజకీయాలు వేరనీ ఇట్లా ఉన్న భిన్నత్వాలని బహుజన జెండర్ దృష్టికోణాల నుంచి చరిత్రలను, సామాజికాల్ని, సాహిత్యాలకు సంబంధించిన అంశాల్ని అధ్యయనం చేయాలనే ప్రతిపాదనలతో ‘మట్టిపూలు’గా ఏర్పడిన బహుజన రచయిత్రుల వైపు భూమిక నిలబడలేకపోయింది. ఆధిపత్య స్త్రీ కోణం నుంచి బహుజన కులాల రచయిత్రులు రచనలు చేస్తే వచ్చిన ప్రోత్సాహకాలు బహుజన జెండర్ అస్తిత్వంతో రాసే రచనలకు ప్రోత్సాహాలు ఎక్కడ పొడసూపవు.
భూమికలో కాలమ్ రాయమని ప్రోత్సహించిన ఎడిటర్ కొన్నాళ్ళ తర్వాత ‘ఇక చాలు ఆపేయమని’ చెప్పడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల రచనలకు భూమికలో ఒక కంటిన్యూ ప్రాతినిధ్యం కోల్పోయినట్లయింది.
ముప్పయ్యేండ్ల నాటి భూమిక సంపాదకవర్గం (బహుజన మహిళల్లేరు) సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని స్త్రీవాద సిద్ధాంతంతో అవగాహన కలిగించే రచనలు తీసుకురావాలనే దృక్పథ భావజాలం ఇప్పటికీ యధాతథంగానే ఉన్న స్థితి నుంచి భూమిక బైటికి రావాలి. అణగారిన కులాల జాతుల మత వర్గాల చైతన్యాల్ని ప్రధాన స్రవంతిగా ప్రతిబింబించే దిశగా తనకు తాను మార్పు చేసుకోవాలి. నిర్వహణా యాజమాన్యాల్లోను, భావజాల దృక్పథాల్లోను, కార్యక్రమ నిర్వహణలోను బహుజన మహిళా నాయకత్వాలు ఉండాలి. భూమిక ఇలాంటి మార్పులను స్వాగతించాలి. ఇట్లా భూమిక పునర్నిర్మాణం కావాలి.
` జూపాక సుభద్ర
షషష