1995 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అధ్యాపకురాలిగా వచ్చాను. ఆ తర్వాత ఒకటి, రెండు సంవత్సరాలకనుకుంటా, తెలుగు తెలియని నా కొలీగ్ ఒకాయన తనకు భూమిక స్త్రీవాద పత్రిక వచ్చిందని, కానీ తాను తెలుగు చదవలేనని పత్రికను నాకు ఇచ్చారు. భూమికతో అలా
మొదలైంది నా పరిచయం. చదవడంతో మొదలైన ఆ పరిచయం రాయడం దాకా వెళ్ళింది. మొదట ఒక చిన్న కవిత, తరువాత వ్యాసాలు, అనువాదాలు, ఒక యాత్ర కథనం, ఒక కాలమ్ ఇలా సాగిపోయింది. భూమిక పత్రికను చదవడం, భూమిక పత్రిక కోసం రాయడం ఒక ఎత్తయితే, భూమికతో కలిసి పనిచేసే వ్యక్తులతో పరిచయం మరో ఎత్తు. రచయిత్రులతో, ఉద్యమకారులతో సంభాషణలు, సమావేశాలు ఒక గొప్ప అనుభవం. స్త్రీవాద రచనలకు, సంభాషణలకు భూమిక ఒక చక్కటి వేదిక.
2002`2005 మధ్య నా కాలమ్ ‘‘కిటికీ’’ భూమికలో వచ్చింది. ప్రధాన స్రవంతి రాజకీయాలను, ఉద్యమాలను, సాహిత్యాన్ని విమర్శిస్తూ వచ్చిన స్త్రీల రచనలను పరిచయం చేయడం ఆ కాలమ్ ముఖ్య ఉద్దేశం. ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రులు, ఆస్ట్రేలియా, కెనడా దేశాల ఆదివాసీ రచయిత్రులు, ఆఫ్రికన్ దేశాల రచయిత్రుల రచనలను ఆ కాలమ్ ద్వారా పరిచయం చేశాను. ధిక్కార స్వరాలను కోర్సుల్లోకి, తరగతి గదిలోకి తీసుకువెళ్ళే నా ప్రయత్నానికి కొనసాగింపే ఈ కాలమ్. విమర్శనాత్మక వ్యాసాలను, కొత్త ఆలోచనా ధోరణులను భూమిక ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని అప్పుడే మరింత బాగా అర్థమయింది.
పాఠకులను ప్రభావితం చేసిన భూమిక రచనలను గురించే చెప్పాలంటే అది ఒక పెద్ద జాబితానే అవుతుంది. అలాంటి రచనలను మరెన్నో భూమిక పరిచయం చేస్తూనే ఉంటుందని, మారుతున్న సందర్భాలను, ఆలోచనలను మరింత ప్రభావం చేస్తుందని, సంభాషణలకు మరిన్ని వేదికలను కల్పిస్తుందని అనుకుంటున్నాను. భూమిక ఇలాంటి ముప్ఫై సంవత్సరాల సందర్భాలను ఇంకెన్నో జరుపుకోవాలి.
` డాక్టర్. కె.సునీతారాణి
షషష