స్పందన – శిలాలోలిత

‘భూమిక’ నా ఇష్టసఖి
‘భూమిక’ నా ఇష్టసఖి, ప్రియబాంధవి. సహచరి. ఎన్నెన్నో విజయాలను సాధించుకున్న ‘ధీర’. నాలో భాగమైంది. శ్వాస అయింది. జీవన దిక్సూచి అయింది. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు బలాన్నిచ్చింది. భవితనిచ్చింది. ముఖ్యంగా ‘సత్య’ స్నేహం ఊహించని అనేక

మలుపులు తిప్పింది. వందల సంఖ్యలో ప్రియ మిత్రులను ఎందరినో దరిచేర్చింది.
ఒక పత్రిక, ఒక అక్షరాల సమూహం. ఒక జ్ఞాన చక్షువు. స్త్రీల జీవితాలకు అండగా నిలబడిన ‘భూమిక’ కేవలం ఒక పత్రిక మాత్రమే కాదు. వెన్నంటి నిలిచింది. స్త్రీలను సమీకృతం చేయడంలో సఫలీకృతురాలయింది.
‘భూమిక’ అనగానే ఒక గౌరవాన్ని, నమ్మకాన్నీ, భరోసాను సాధించుకోగలిగింది. స్త్రీవాద ఉద్యమం అప్పుడప్పుడే పరిచయమవుతున్న నాకు, భూమిక కనుచూపయింది. సవాలక్ష దారుల గుండా నడుస్తున్న నాకు ‘భూమిక’ అయింది. ఏ దారో నిర్ణయించగలిగింది. వేసిన దారి వెంబడి వెళ్ళడం సులువు. దారినిండా ఉన్న పల్లేరుకాయలు, ఈతముళ్ళు, గాజు ముక్కలు ఉన్నా, ఎలా మార్గాన్ని సుగమం చేసుకోవచ్చో నేర్పింది.
‘భూమిక’`ఈ భూమ్మీద నిలబడడానికి ప్రధాన కారణం కొండవీటి సత్యవతే. మనుషుల్ని ఎంతగా ప్రేమించవచ్చో, బాధితులకు ఎలా సత్వర సాయం చేయవచ్చో, స్నేహంలో ఎందర్ని కలుపుకోవచ్చో, ప్రత్యక్షంగా మనకు చూపించిన ‘ధీర’ ఆమె.
ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ. గవర్నమెంట్‌ ఉద్యోగినిగానే ఆగిపోక, తనకు భూమిక ముఖ్యం అనుకొని, రాజీనామా చేసి పత్రికకే అంకితమైంది. పత్రిక నడపడంలో ఎన్నో చిక్కుముళ్ళు ఎదురైనా, ఆర్థిక సమస్యలు ఎన్నొచ్చినా ఎదుర్కొంది. ఈ నెల పత్రిక వస్తుందా రాదా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. తోటి రచయిత్రులనేకులు తమ బాధ్యతగా భావించారు. ఆ కాలానికి, స్త్రీల చైతన్యానికి దోహదపడే రచనలు ఎన్నో రాశారు. దారి దీపాలయ్యారు. ఒక సంఘటన గుర్తొస్తోంది. ‘భారతి’ గారి నిబద్దతకు నిదర్శనమది. ఆమె ఐసియులోకి వెళ్తూ వెళ్తూ భూమికకు రాసిన ఆర్టికల్‌ని చేతిలో పెట్టారు. అంత నిబద్థత ఆమెకు. మళ్ళీ తిరిగి రాలేదామె. కానీ చివరివరకూ ఆమె ఆలోచనల్లో భూమికే భాగమైంది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అబ్బూరి ఛాయాదేవి గారి లాంటి వ్యక్తులతో స్నేహం అందరికీ అపురూపమే. శాంతసుందరి గారు, ఓల్గా, పి.సత్యవతి, ప్రతిమ, జూపాక సుభద్ర, సునీతారాణి, సుజాతా పట్వారి, పి.వరలక్ష్మి, కె.గీత, సజయ, ఘంటసాల నిర్మల, కొండేపూటి నిర్మల, గోగు శ్యామల, అమృతలత, పసుపులేటి గీత, బి.పద్మావతి, పాటిబండ్ల రజని, మందరపు హైమవతి, చంద్రలత, చల్లపల్లి స్వరూపరాణి, వారణాసి నాగలక్ష్మి, శీలా సుభద్రాదేవి, ఇంద్రగంటి జానకీదేవి, సి.సుజాత, సుజాత వంటి ఎందరో. (కోవిడ్‌ నాకిచ్చిన గిఫ్ట్‌` మతిమరుపు. అందువల్ల కొందరి పేర్లింకా గుర్తుకు రావడం లేదు. అర్థం చేసుకోండి)
వీళ్ళందరితో ఏర్పడిన అనుబంధం విలువైంది. సత్యవతి ఇంకొక అద్భుతమైన పనిచేసింది. తాను టూర్లను చేయించిన విధానం, స్త్రీలకు ఓ వారం రోజులపాటు స్వేచ్ఛగా, స్నేహితులతో తిరిగితే ఉండే ఆనందం, స్నేహాలు దగ్గరవడం ఇవన్నీ ప్రాక్టికల్‌గా విజయవంత మయ్యాయి. మనందరం ఒకటి అనే ఐక్యతాభావనను తీసుకొచ్చాయి. ప్లానింగ్‌ నిర్వహణలో పి.గీత తోడ్పాడుతో చాలా బాగా నిర్వహించింది.
అప్పటికే స్త్రీల కవిత్వం మీద ఎం.ఫిల్‌Ñ పి.హెచ్‌.డి.లు చేసిన నేను, స్త్రీల రచనలే చేయాలన్న సంకల్పాన్ని కలిగించింది, సాహిత్యపరంగానే కాక, సామాజికంగా స్త్రీల సమస్యల మీద ఫోకస్‌ చేసింది భూమికే. మన మిత్రులు ఇంకా వాటినన్నింటినీ వివరంగా రాస్తారు. ‘భూమిక హెల్ప్‌లైన్‌’ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రుల మన్ననల వరకు వెళ్ళింది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో ఎందరికో సత్వర న్యాయం చేయగలిగింది. మీరు ‘భూమిక’కు చెందినవాళ్ళు అని చూడగానే గౌరవాన్ని పొందే స్థితిని సంపాదించుకుంది. మొబైల్‌ లైబ్రరీ మొదలుపెట్టింది. అప్పట్లో నాకో కల ఉండేది. ‘భూమిక’ ఆఫీసులోనే చిన్న బుక్‌షాప్‌ పెట్టి, కేవలం స్త్రీల రచనలు మాత్రం పెట్టాలని. ఎందుకంటే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని దేశ విదేశాల్లోంచి ఫోన్లు వస్తుండేవి. వాళ్ళందరికీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇక్కడ తప్పక దొరుకుతాయి అనే సౌలభ్యాన్ని కలిగించాలని. కొన్నాళ్ళు నడిపాం కూడా. కానీ సమయం సరిపోక కొనసాగలేదు.
‘భూమిక’ మనది అనే భావవ్యాప్తి మాత్రం బాగా ఉండేది. కొన్నాళ్ళపాటు వర్కింగ్‌ ఎడిటర్‌గా ఉండడం నాకెంతో తృప్తినిచ్చే విషయం. అడ్వయిజరీ బోర్డ్‌ మెంబర్‌నిప్పుడు. ఫ్రూప్‌లు చూడటానికి, ఉద్యోగంలో, కుటుంబంలో సమయం లేకపోయినా, అర్థరాత్రి వరకూ కూర్కొని దిద్దేదాన్ని. డైనింగ్‌ టేబుల్‌ మీదే దిద్దుతూ ఉండేదాన్ని. నా పని నేను చేస్తున్నానన్పించేది.
ఈ క్రమంలోనే ‘చంచల్‌గుడా’ జైల్లోని స్త్రీలకు ‘భూమిక’ తరపున వెళ్ళి కొన్ని క్లాసులు తీసుకున్నప్పుడు, వాళ్ళ జీవితాల్ని విని, మనిషిని కాలేకపోయాను. అంత బరువు ఈ గుండె మోయలేననిపించింది. ఏ రంగంలో పని మొదలుపెట్టినా విజయాన్నే సాధించుకొస్తోంది భూమిక.
బాధితుల్ని రెస్క్యూ చేసి, రక్షణ కల్పించి హోమ్‌లో చేర్పించేవరకూ భూమిక నిలబడిన సందర్భాలెన్నో. ఒక వెలుగు చార, జ్ఞానదీపం, స్త్రీల దుఃఖ నివారణకు తోడుగా నిల్చింది. షీ టీమ్స్‌కి కౌన్సిలింగ్‌ సహకారం వంటి ఎన్నింటినో నిర్వహిస్తోంది. భూమికలో భాగస్వామిగా నేనూ ఉండడం నాకెంతో ఆనందాన్ని, తృప్తినీ కలిగించే విషయం.
అప్పట్లో అందరం ఇంచుమించుగా ‘భూమిక’ చందాదారుల కోసం ప్రయత్నించేవాళ్ళం. హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ రశీదు బుక్‌లుండేవి. సజయ అయితే ఎంతమందిని చేర్చిందో చెప్పలేం. అలా చాలామందికి రీచ్‌ అయింది భూమిక. ఇప్పుడు పుస్తకాల షాప్‌ల్లో నెలనెలా అందేట్లుగా ఉంటే బాగుండేదనిపించినా అప్పట్లో అది సాధ్యపడలేదు. ఏదో ఒక పద్ధతిలోనైనా ఎంత ఎక్కువ మందిని ‘భూమిక’ చేరగలిగితే అంతగా స్త్రీలల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోగలరు. ఖచ్చితమైన నియమాలతో, విలువైన వ్యాసాలు, ఇంటర్వ్యూలు, కథలు, సీరియల్స్‌, కవిత్వం, బాలసాహిత్యం, ఉద్యమాల విషయాలు ఇలా ఒకటేమిటి ఎన్నింటిని తననుంచి నేర్చుకోవచ్చో ‘భూమిక’ చెబుతూనే వస్తోంది. 30 ఏళ్ళల్లో స్థిరంగా, ఇప్పటికీ సరికొత్తగా నిలబడడమే ‘భూమిక’ సాధించిన విజయం. స్త్రీలలో ఐక్యతను, పోరాట పటిమను, జ్ఞానతృష్ణను కలిగించిన ‘భూమిక’ సదా స్మరణీయం.
` శిలాలోలిత

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.