భూమికకు అభినందనలు. ఒక స్త్రీవాద పత్రిక 30 సంవత్సరాలుగా స్త్రీల గురించిన రచనలతో దాదాపు నిరంతరాయంగా రావటం ఎంతో సంతోషించాల్సిన సందర్భం. ఈ ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కలిగి ఉంటాయి. అన్నింటిని దాటుకుని నడుస్తూ ఉండటం గొప్ప విషయం.
స్త్రీలకు సంబంధించిన ఏ విషయమైనా సరైన అవగాహనతో స్పందించటం భూమిక మొదటినుంచీ చేస్తున్నది. స్త్రీల విజయాలను ఆనందంగా సెలబ్రేట్ చేయడం, స్త్రీల వేదనల పట్ల ఆర్తిగా స్పందించటం, స్రీలపై హింసను నిర్మొహమాటంగా రాజీ లేకుండా ఖండిరచటం, స్త్రీ పురుష సమానత్వమనే ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటం, స్త్రీల చరిత్ర గురించిన ఆసక్తిని పెంచే రచనలకు చోటు ఇవ్వటం, స్త్రీల శారీరక, మానసిక వికాసాలకు దోహదపడే రచనలకే ప్రాముఖ్యత ఇవ్వడం… ఈ పనులన్నీ భూమిక పత్రిక నిర్వహించింది. అంతేకాదు, దళిత, మైనారిటీ, ట్రాన్స్‌జెండర్ జీవితాల గురించిన చైతన్యాన్ని కలిగించింది.
రాజకీయంగా సరైన మార్గంలో నడిచే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని నిబద్ధతతో పాటించింది. ఇకముందు భూమికకు కావలసిందేమిటి? మరింత చైతన్యాన్ని అందించే సృజనాత్మక రచనలు. రచయితలు, పాఠకులు భూమికకు రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళనూ వేయి కళ్ళతో వెతికి పట్టుకుని భూమికకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత సంపాదకులది. పూర్తిగా భూమికకు అంకితమై, భూమిక తప్ప మరొక ఆలోచనా, పనీ లేని వర్కింగ్ ఎడిటర్స్ కావాలని నాకు అనిపిస్తోంది. అది వారి జీవితం కావాలి. అపుడు భూమిక మరింత విస్తృత చైతన్య సృజనాత్మక వేదిక కాగలుతుంది. ఇది డబ్బు మీదికంటే పత్రిక పట్ల కమిట్‌మెంట్ వల్లనే సాధ్యపడుతుందని కూడా అనిపిస్తుంది.
` ఓల్గా