భూమికతో తమ ప్రయాణం గురించి భూమిక అభిమానులు, ఆత్మీయులు పంచుకున్న విలువైన అనుభవాల సమాహారం
భూమికతో ప్రయాణం
భూమికను మొదటిసారి ఎప్పుడు చూశాను అనుకుంటే ఎంతకీ గుర్తులేదు… బహుశా భూమికతో నాది అనాది స్నేహం కావచ్చు. తొలి అడుగులోనే భూమిక లక్ష్యాలు చదివి ఆ స్నేహం చిక్కనైంది. ఆ తర్వాత అన్వేషితో కలిసి భూమిక చేసిన కథా వర్క్‌షాప్‌లో
చాలామంది రచయితలను కలిసి ప్రేరణ పొందడంతో ఆ స్నేహం ప్రగాఢమైంది. ఆ వర్క్‌షాప్‌లోనే సత్యవతితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. అప్కోర్స్… ఇదంతా హృదయానికి సంబంధించింది. భూమిక అసలు సిసలు ప్రయాణం గురించి మాట్లాడుకోవలసి వస్తే అది అనంతం. ‘స్త్రీల మీద హింస లేని సమాజం మన హక్కు’ అంటూ ఒక సాహసోపేతమైన కలని కంటూ భూమిక ప్రారంభించిన ప్రయాణం ఆ కలని సాకారం చేసుకునే దిశగా నిరవధికంగా మూడు దశాబ్దాల పాటు కొనసాగడం అత్యంత అభినందనీయం.
ఒక పత్రిక, అందునా స్త్రీ వాద పత్రిక ఎన్నెన్నో అవరోధాలను అధిగమిస్తూ ముప్ఫై వసంతాల నవ యవ్వన జ్ఞానవతిగా, బోధకురాలిగా నిలదొక్కుకోవడం గర్వించదగ్గ విషయం. ఆ క్రమంలో స్త్రీలు తమ సృజనాత్మక ప్రతిభా పాటవాలను వెలికితెచ్చి అందరితోనూ పంచుకునే విధంగా విస్తృతంగా చోటు కల్పించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఇతర భాషలలోని స్త్రీల సాహిత్యాన్ని కూడా పరిచయం చేసింది భూమిక. ఎన్నో విశ్లేషణాత్మకమైన వ్యాసాలు, జీవన చిత్రాలు, కథలు, కవన భూమికా, స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు, ప్రేరణనిచ్చే బాలల సాహిత్యం, స్త్రీల మీద వివిధ రకాల దాడుల్ని ప్రశ్నించే, నిరసించే గొంతుకలు, స్త్రీ చైతన్య సినిమాల సమీక్షలూ… ఒకటా, రెండా… అనేక రకాలైన సామాజిక సందర్భాలను స్పృశిస్తూ భూమిక స్త్రీ పాఠకులనే కాక పురుష పాఠకులను కూడా చైతన్యపరిచిన తీరు ప్రశంసనీయం.
స్త్రీల పోరాటం పురుషుల మీద కాదనీ, పితృస్వామ్యాన్ని బలపరుస్తోన్న ఈ వ్యవస్థ మీదనేనని ఆ తేడా సూక్ష్మస్థాయిలోకి వెళ్ళి అర్థం చేయించింది భూమిక. సమాజం కొంత ముందుకు జరగడానికి స్త్రీల సమస్యలని పురుషులు అర్థం చేసుకుని కొంతమేర ఆమెకు సహకరించడానికి, తమ జీవితాలలో తమకు తెలీకుండానే అమలవుతోన్న అణచివేతల్ని గుర్తించి స్త్రీలు చైతన్యమవడానికి దోహదం చేసింది భూమిక. కేవలం గృహ హింస, అణచివేతలను గుర్తించడమే కాకుండా స్త్రీల దృష్టి కోణం నుండి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషణాత్మకంగా పరిశీలించి మన కళ్ళముందు ఆవిష్కరించింది.
సాహిత్య, కళా రంగాలలో ప్రముఖులైన, నిపుణులైన స్త్రీల ఇంటర్వ్యూలను సేకరించి ప్రచురించడం, అన్నింటికంటే ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం గురించి, స్త్రీలకు అంతగా అవగాహన లేని చట్టాల గురించి, వాటి పనితీరు వివరాలు, న్యాయస్థానాలలో అమలవుతోన్న వివక్ష… వీటన్నింటినీ స్త్రీలకు అర్థం చేయించడమే కాకుండా స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాలు, చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా పుస్తకాలను పంచడం భూమిక ప్రత్యేకత.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో స్త్రీల ఉద్యమాలకు సంబంధించి వివరాలను, నివేదికలను సేకరించి పోరాట స్ఫూర్తిని రగిలించడం… సాహసోపేతమైన కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అవసరమైన నమ్మకాన్ని, ధైర్యాన్ని అందించింది.
ఇదంతా ఒక ఎత్తయితే భూమిక సంపాదకీయాలు మరింత చెప్పుకోదగినవి. సమాజంతో అత్యంత దగ్గరి సంబంధాలు కలిగి
ఉంటేనే తప్ప ఇలా సమాజ సందర్భాలను, ఇత వైపరీత్యాలు, సంక్షోభాల గురించి తక్షణ స్పందన సాధ్యం కాదు. అవి నిజంగా చరిత్రను నమోదు చేసి నేవళంగా ఉంచిన వాడిపోని మల్లెలు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి స్త్రీల సమూహాలలోనే కాకుండా అట్టడుగు వర్గాలు, అంచులకు నెట్టబడిన వర్ణాల సమూహాలలోకి స్వయంగా వెళ్ళి వారి బతుకు చిత్రాలను మనకి అందించడమే కాకుండా అదే సమయంలో వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించడం విశేషం.
ముఖ్యంగా కరోనా వంటి పాన్డమిక్ సమయంలో భూమిక టీం చేసిన సేవ అంతా, ఇంతా కాదు. వలస కార్మికులకు అవసరమైన ఆహార పానీయాలను, షెల్టర్‌ను అందించడమే కాకుండా వారిని స్వస్థలాలకు చేర్పించే కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక అద్భుతం.
భూమిక హెల్ప్‌లైన్… భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వంటివి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలకి, విద్యార్థినులకి అందిస్తున్న సహకారం, చైతన్యం ఎంతైనా చెప్పుకోదగినవి. మొత్తంగా చూసినపుడు భూమికది ఒక టీం వర్క్.
మనందరికీ తెలుసు భూమిక ప్రయాణం, సత్యవతి ప్రయాణం వేరు వేరు కాదు. అయితే ఎప్పుడూ కూడా సత్యవతి నేనే హోల్ అండ్ సోల్ అని భావించలేదు. తనకు ఎదురైన వారందరినీ కలుపుకుని సామూహిక ప్రయాణం సాగించింది. స్త్రీలంతా ఒక ఐక్య సంఘటన అని ఆ రోజు నుండి ఈ రోజు వరకూ నమ్మింది.
జయహో సత్య భూమిక… ` ప్రతిమ