`అనువాదం: అపర్ణ తోట
బాబా సాహెబ్ స్థాపించిన ‘ప్రబుద్ధ’ భారత మ్యాగజైన్‌లో క్వీర్ పాలిటిక్స్ మరియు అంబేద్కరిజం గురించి రాయమని కొన్ని సంవత్సరాల క్రితం నా దళిత ట్రాన్స్ స్నేహితులలో ఒకరు నన్ను అడిగారు కానీ అది ప్రచురించబడలేదు.
బహుజన ట్రాన్స్‌ఉమెన్ సెక్స్‌వర్కర్ అయిన నా ఉనికి, ప్రధాన స్రవంతి దళిత రాజకీయ డయాస్ఫోరాతో కలసిపోనీకుండా నిరోధిస్తోందని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ ఇటీవలే ‘నిర్మాణ్’ సౌజన్యంతో 70 మందికి పైగా ట్రాన్స్ వ్యక్తులు జీవనోపాధి నైపుణ్యాల శిక్షణ పూర్తి చేసిన సందర్భంలో, జ్ఞాపకార్దంగా అందుకున్న ఈ ట్రోఫీని చూస్తుంటే ఇన్నాళ్ళూ వెలుగు చూడని ఈ కథనం జ్ఞాపకం వచ్చి మీ అందరితో పంచుకోవడానికి ఇదే సరైన సందర్భం అనిపించింది.
భారతదేశంలో అంబేద్కరైట్ క్వీర్ పాలిటిక్స్
సత్రంగీ సలాం: 1904 నుండి ‘జై భీవ్‌ు’ అనే పదం దళిత రాజకీయాలలో ఎలా పలకరింపు నినాదంగా మారిందో మనందరికీ తెలుసు. అలాగే ‘సత్రంగీ సలాం’ కూడా క్వీర్ గ్రీటింగ్‌గా ఉద్భవించింది.
షబ్నవ్‌ు హష్మీ దీదీ ‘అన్హాద్’ తరఫున నిర్వహించిన జాతీయ జెండర్ హక్కుల పౌరసమావేశంలో, భారతదేశంలో క్వీర్
ఉద్యమంతో పరస్పర సంబంధం ఉన్న దళిత, మైనారిటీ జెండర్ రాజకీయాల మధ్య ఉన్న సంఫీుభావాల గురించి చేసిన ప్రసంగంలో నేను ఈ నినాదాన్ని లేవనెత్తాను. అక్కడ ఆనీ రాజా, కవితా కృష్ణన్ మరియు సైదా హమీద్‌లతో ప్యానెల్‌లో నేనూ ఉన్నాను.
అదే సంవత్సరం ‘ధర్తి ఆబా’ జన నాయకుడు బిర్సా ముండా 143వ జయంతి సందర్భంగా ‘బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ – – CUG’ మొదటి వ్యవస్థాపక దినం సందర్భంగా ‘విజిల్ బ్లోర్ గ్రూప్’ ద్వారా LGBTQAI ‘సత్రంగి సలావ్‌ు’ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించారు. వివిధ అట్టడుగు, మైనారిటీ ప్రజల ఉద్యమాలలో భాగమైన క్వీర్ కమ్యూనిటీలలో సత్రంగి సలావ్‌ు అనేది తరచుగా వాడే పలకరింపు`నినాదంగా మారింది. ఈ నినాదం క్వీర్ వ్యక్తులకు అంబేద్కరిస్టులుగా గుర్తింపు తీసుకురావడంతో పాటు వివిధ ఉద్యమాలలో స్వచ్ఛంద కార్యకర్తలుగా కూడా వారి ఉనికికి ఒక నిర్దిష్ట గుర్తింపును తెచ్చింది.
మన దేశాన్ని పితృస్వామ్యం, కుల, మత వ్యవస్థలు నియంత్రిస్తుంటాయి. ఇటువంటి నియంత్రణల మధ్య ప్రధాన స్రవంతిలో తమ లైంగికతను బయట పెట్టుకోలేని విభిన్న లైంగికత లేదా లింగ భేదం ఉన్న వ్యక్తులు ఇలా పలకరించుకోవడం ఒక సాహసోపేతమైన అడుగు.
జై భీం మరియు సత్రంగీ సలావ్‌ుల కలయిక రాజకీయ పద్ధతిలో అర్ధంచేసుకోలేకపోతే, భారతదేశంలోని దళిత మరియు క్వీర్ రాజకీయాలకు చరమగీతం పాడవలసిందే.
అంతేగాక ‘జై భీం’ మరియు ‘సత్రంగీ సలావ్‌ు’ నినాదాల కలయిక వలన లైంగిక మరియు లింగ వైవిధ్యాన్ని దాటి కార్యాచరణ దిశగా ఏమి సాధించగలమో ఇటీవల చేసిన ‘ప్రైడ్ మార్చ్ ఆఫ్ ఇండియా’ తెలియజేసింది.
క్వీర్ పాలిటిక్స్‌లోకి అంబేద్కరిజం: అంబేద్కరిజం అంటే కుల, వర్గ మరియు జెండర్ వర్ణపటం (స్పెక్ట్రమ్)లో అణగారిన వర్గాల మానవ హక్కులను స్థాపించడం అని నా భావన. బాబా సాహెబ్ ఎల్‌జిబిటిక్యూఐ వ్యక్తులపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పనంత మాత్రాన క్వీర్ రాజకీయాల్లో అంబేద్కరిజాన్ని సామాజిక న్యాయ సూత్రంగా అన్వయించుకోకుండా ఉండలేము. పితృస్వామ్య మరియు బ్రాహ్మణీయ భావజాలాల వలన రాజ్యాంగ హక్కుల ఫలాలకు దూరంగా నెట్టివేయబడిన ప్రతి ఒక్క అట్టడుగు వర్గాల సమిష్టి పోరాటాలతో ఆయన బోధించిన తత్త్వం సరిసమానంగా పనిచేస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంబేద్కరిజం మానవ హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడుపుతుంది. మరి LGBTQI హక్కులు కూడా మానవ హక్కులే.
చారిత్రాత్మకంగా అణచివేయబడిన కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతలు మరియు సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా, విరామం లేకుండా అంబేద్కరిజం పోరాడుతున్నా, లైంగికత మరియు జెండర్ వైవిధ్యాలలో ఉండే లొంగుబాటు వలన IPC 377/హైదరాబాద్ యునక్స్ ఆక్ట్ మరియు మనుస్మృతిపై నోరు విప్పలేదు.
అంబేద్కరిజం అనేది వెనుకబడిన కులాల మీద మాత్రమే కాకుండా జెండర్ ఆధారిత విభజనని అంగీకరించని మరియు భిన్నమైన లైంగికత గల వ్యక్తులపై కూడా హిందువులు విధించిన పురాతన జాతివాదం, కులం, అంటరానితనం, బానిసత్వం మరియు అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా చేసిన విప్లవ తిరుగుబాటు. భారతదేశంలో క్వీర్ విప్లవం ఆత్మగౌరవం, మర్యాద, వ్యక్తిగత విలువల కోసం అన్వేషిస్తోంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో గ్రేస్ భాను మరియు దిశా షేక్ వంటి దళిత ట్రాన్స్ యాక్టివిస్ట్‌ల ప్రాతినిధ్యం, ఆధిపత్య కులం, వర్గానికి వ్యతిరేకంగా మాత్రమే కాక సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చేరిక లేకుండా చేసిన లింగ సోపానక్రమాలకు (Gender hierarchy) కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది.
దళిత, మైనారిటీ మరియు క్వీర్ రాజకీయాల కలయిక: అంబేద్కరిజం ప్రజాస్వామ్య ఆధునిక సూత్రాలపై భారతీయ సమాజాన్ని సంస్కరించడం, పునర్నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుందని మీ అందరికీ తెలుసు. దీనివలన రాజ్యాంగ హక్కులను సమాజంలోని అన్ని తరగతుల వారు సమానంగా, స్వతంత్రంగా అనుభవిస్తారు. 2014లో భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక NALSA Vs UOI తీర్పు ద్వారా ట్రాన్స్‌జెండర్ సంఘం తరపున అదే వాస్తవాన్ని పునరుద్ఘాటించింది. కానీ రాజ్యాంగ హక్కులు అందక ట్రాన్స్‌కమ్యూనిటీ సామాజికంగా మరియు ఆర్థికంగా సమాజంలో అంచులలోకి నెట్టివేయబడిరదని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. ట్రాన్స్‌జెండర్లను సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన సమాజంగా గుర్తించాలని కోర్టు చెప్పింది. ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే సమాజంలో మతతత్వానికి వ్యతిరేకంగా నిలబడిరది. సహనం లేని ఫాసిజం క్వీర్ కమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని, కార్మికవర్గ LGBTQI ప్రజల మధ్య విభజన రాజకీయాలకు దారితీస్తుందని చాలా సందర్భాలలో గమనించవచ్చు. క్వీర్ ఉద్యమం ఫాసిజం, నిరంకుశత్వం, నియంతృత్వం మరియు రాజ్యాధికారాన్ని కూడా వ్యతిరేకించింది, ఎందుకంటే ఇవి లింగ వైవిధ్యం లేదా విభిన్న లైంగిక ధోరణిని నేరంగా పరిగణించాయి. కాబట్టి దళిత, మైనారిటీ మరియు క్వీర్ రాజకీయాల కలయిక మనకు చాలా అవసరం. ఇది దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్య సమతుల్య రాజ్యాన్ని అందించగలదు. అంబేద్కరిజం ద్వారా భారతదేశం సమ్మిళిత సామాజిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది అణగారిన వర్గాల సమగ్ర అభివృద్ధికి నిశ్చయాత్మక చర్య. అలా కలుపుకుపోవడం వలన అట్టడుగున ఉన్నLGBTQI ప్రజల పోరాటాలను కూడా ఇముడ్చుకుంటూ విభిన్నతను కూడా భిన్నంగా చాటగలదు.
అంబేద్కరిజం – క్వీర్ కమ్యూనిటీ పురోగతి: సమాజంలో అణిచివేయబడ్డ అన్ని వర్గాల అభివృద్ధి కొరకు నిశ్చయాత్మక చర్యలను పాటించడం ద్వారా అణగారిన వర్గాల పరిపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కరిజం నమ్ముతుంది. బాబా సాహెబ్ అంటారు ` ‘‘నేను ఒక సంఘం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతిని బట్టి కొలుస్తాను’’, ‘‘మహిళల తోడు లేకుండా ఐక్యత అనేది అర్థరహితం.’’ ‘‘చదువుకున్న స్త్రీలు లేకుండా విద్య ఫలించదు, స్త్రీలు చేతులు కలపని పోరాటాలు అసంపూర్తిగా ఉంటాయి.’’ ఇవన్నీ జెండర్ నిర్మాణంలోని సోపానక్రమాలను మరియు కుల ఆధాకిత పితృస్వామ్య వ్యవస్థలన్నింటా అట్టడుగున ఉన్న జెండర్ ప్రభావిత ప్రజలు సాధికారత సాధించవలసిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. మహిళలు తమ జెండర్ మరియు జెండర్ పాత్రల ఆధారంగా ఎలా అయితే అణచివేయబడుతున్నారో అదే విధంగా క్వీర్ ప్రజలు కూడా తరచూ జెండర్ గుర్తింపులోని విభిన్నత వలన లేదా లైంగిక ధోరణి వలన అణచివేతను ఎదుర్కొంటున్నారు. దీని వలన వారు విద్య, ఉపాధి వ్యవస్థల నుండి దూరంగా ఉంచబడ్డారు. క్వీర్ ప్రజలకు ఎటువంటి జెండర్ పాత్రలు కేటాయించబడకపోవడం వలన వారు స్వయంగా బధాయి (భిక్షాటన) లేదా సెక్స్ వర్క్‌ని వృత్తిగా స్వీకరించవలసి వచ్చింది. కానీ ట్రాన్స్ జెండర్ సముదాయాల సమాజం మనుగడకు సమీపంలోనే నేరం, హింస కూడా ఉంటాయి. దీని వలన ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని నేరస్థులుగా పరిగణిస్తున్నారు. బ్రాహ్మణీయ ప్రగతిశీల వ్యవస్థలో అట్టడుగు వర్గాలు కూడా ఎలా అదేవిధంగా చూడబడుతున్నారో, నేరారోపణలను ఎలా ఎదుర్కొంటున్నారో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.
కాబట్టి ఇక వీటన్నిటినీ ‘వదిలేయాల్సిన’ సమయం ఆసన్నమైంది. కులాన్ని ‘వదిలేయండి’. లింగ సోపానక్రమాలను వదిలేయండి. జెండర్ మరియు లైంగిక ధోరణి ఆధారిత అంటరానితనాన్ని వదిలేయండి. కులం, వర్గం, లింగం, జెండర్, లైంగిక ధోరణితో సంబంధం లేకుండా మనిషికి మనిషి సమానంగా అందుబాటులో ఉండడం కోసమే బాబా సాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించారు. దళిత మరియు మహిళా ఉద్యమాల్లో, దళిత మహిళలు జెండర్ బైనరీ మరియు మూసధోరణుల బ్రాహ్మణీయ నిర్ణయాధికార శ్రేణిని నాశనం చేయడానికి చురుకుగా ప్రయత్నించారు. అదే విధంగా దళిత ఉద్యమ నినాదం నెమ్మదిగా భారతీయ క్వీర్ ఉద్యమం మూలాల్లోకి ఇంకిపోతోంది.
అదే జై భీవ్‌ు! జై సావిత్రీ బాయి! జై ఫాతిమా!