వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

ఎం. అగస్టిన్‌ నరసింహులయ్య (పుంగనూరు, చిత్తూరు జిల్లా) ఒక హిందువుకీ, క్రైస్తువుడికీ మధ్య సంభాషణ రూపంలో చేసిన రచనలో ‘‘హిందూ మత సిద్ధాంతములన్నియు బుటకములని’’ కొట్టి పడేశారు. క్రైస్తవాన్ని గూర్చి అడిగిన హిందువుకు మానవుల పాప

పరిహారార్థం బలైన జీసస్‌ గొప్పదనం గూర్చి తెలియజేసిన క్రైస్తవుడు ‘‘మానవ కోటి యావత్తు నశించి పోకుండుటకై యొక మహానుభావుడు చనిపోవలెననియు ‘ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వాప్రాయచ్ఛత్‌’ అనియు వేదముల యందు వ్రాయబడిన ప్రకారము ప్రజాపతి (సృష్టికర్త) యగు నాయనే తన జనుల రక్షణార్థమై బలియగుట యత్యావశ్యకము’’ అంటాడు. ఇది విన్న హిందువు ‘‘మా పెద్దలు’’ పాప పరిహారార్థం యాగాలూ, హోమాలూ, బలులూ, దాన ధర్మాలూ, తీర్థయాత్రలూ, దేవతారాధనలూ, స్నాన, సంధ్య, జపతపాది కార్యక్రమాలూ పూర్వం చేశారనీ, ప్రస్తుతం చేస్తున్నారనీ తెలిపి, వాటి ద్వారా మోక్షం లభించదా అని ప్రశ్నిస్తాడు. వాటి ద్వారా మోక్షం ససేమిరా లభించదనీ, అసలు ‘‘అట్టి కార్యములను జేయవలెనని దేవుడు మనకాజ్ఞాపించి యుండలేదు’’ అని జవాబిస్తాడు క్రైస్తవుడు. పోనీలెండి, వాటి ద్వారా మోక్షప్రాప్తి కలగకపోతే కనీసం ‘‘త్రిమూర్తులు మొదలగు దేవతల’’ మూలంగానైనా హిందువులు కడతేరి మోక్షం పొందలేరా అని ప్రశ్నిస్తాడు హిందువు. దానికి క్రైస్తవుడు త్రిమూర్తులు కూడా మోక్షం కలిగించలేరనీ, ఎందుకంటే ‘‘మనవలెనే వారు కూడా పాప సంభవులై, యనేక కష్ట కడగండ్ల ననుభవించినట్టుగ మీ పురాణముల యందగుపడుచున్నది. అందుకు దగినట్లుగ వేమన గారు సయితము ‘కాళ్ళముందరి యేరు కడ యీదనేరక ముగ్గురు ఈతగాండ్లు మునిగిపోయిరని’ బహు స్పష్టముగ తెలియజెప్పియున్నారు’’ అంటాడు. హిందువుల పాప పరిహారార్థమై త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చేసిందేమీ లేదనీ, తమని కొలిచే వారికి ముక్తి ప్రసాదిస్తామని కూడా వాళ్ళు చెప్పలేదనీ, ‘‘అట్లుండగ వారిని నమ్మి మీరు కడతేరునదెట్లు?’’ అని ప్రశ్నిస్తాడు. క్రైస్తవుడు చెప్పిన మాటల్ని బట్టి హిందువులు చెబుతున్నదంతా ‘‘బూటకముగా’’ కన్పిస్తున్నాయని అన్న హిందువుతో ‘‘బూటకములు గాక మరేమిటి?’’ అనీ, హిందూ మతాచారాల ద్వారా మోక్షం లభించేటట్లైతే హిందువులు ‘‘తమ స్వమతమును విడిచి ప్రతి యేట వేనవేలుగ క్రైస్తవ మతము’’ లోకి ఎందుకు వస్తున్నారో ఆలోచించమని ప్రశ్నిస్తాడు క్రైస్తవుడు. ‘‘మతోద్ధారకుడును ముక్తి దాతనగు శ్రీ యేసునాథ స్వామి యొక్క కృపవలన’’ రక్షించబడతామన్న ‘‘దృఢమైన’’ నమ్మకం వల్లనే వాళ్ళు మతం మారుతున్నారంటాడు. ఇవన్నీ విన్న హిందువుకు క్రైస్తవుడు ‘‘చెప్పినదంతయు న్యాయమును, సత్యమునై యున్నద’’ని అన్పించి, మరి నన్నేంచేయమంటారో చెప్పమంటాడు. దారి తప్పిన ఒక గొఱ్ఱె సరైన మార్గంలోకి వస్తున్నందుకు సంతోషించిన క్రైస్తవుడిలా చెబుతాడు: ‘‘హిందూ మత సిద్ధాంతములన్నియు బూటకములని మీరు స్వయముగా నొప్పుకొంటిరి. ఇకను మీకు చెప్పవలసిన మూలసూత్ర మొక్కటియెÑ అదెద్దియనిన, మీరు మనస్సు తిప్పుకొని పాపుల రక్షణార్థమై ఈ లోకమునకవతరించిన శ్రీ యేసునాథ స్వామి పేరట దీక్షబొంది, ఆయన చిత్తమునకనుగుణ్యముగ బ్రవర్తించితిరట్టయిన మీరిహపర సౌఖ్యములను బొంది సుఖించెదరు.’’ ఎంతో ఓపికగా తనకు ‘‘రక్షణ మార్గము’’ చూపినందుకు క్రైస్తవుడికి పరిపరివిధాలా ధన్యవాదాలర్పిస్తాడు హిందువు (‘దైవభక్తి విషయములు: క్రీస్తుస్వామి యొక్క పునరుత్థానము’, ఏప్రిల్‌ 1920, పు. 161-164).
చిన్నా చితాకా మనుషులే కాదు, గట్టి బుఱ్ఱలున్న గొప్పగొప్ప వాళ్ళంతా ఏ విధంగా యేసు ఎదుట సాగిలపడ్డారో ఈ విధంగా తెలిపింది ‘వివేకవతి’: ‘‘జ్ఞానులు తూర్పు నుంచి వచ్చి శిశువైన క్రీస్తు యెదుట సాగిలపడి బంగారు, బోళము, సాంబ్రాణి నర్పించిరి. అలాగుననే క్రీస్తు జన్మించిన 1912 సంవత్సరముల నుంచి క్రీస్తును బీదలు మాత్రమే గాక ధనవంతులును, విద్వాంసులును ఆరాధించుచున్నారు. గణిత శాస్త్రజ్ఞుడైన న్యూటన్‌, వృక్ష శాస్త్రజ్ఞుడైన డేనా, భూగర్భ శాస్త్రజ్ఞుడైన డాసన్‌, రాజ్యతంత్ర నిపుణుడైన గ్లాడ్‌స్టన్‌, కవీశ్వరుడైన టెన్నిసన్‌, జ్యోతిశ్శాస్త్రవేత్తjైున హెర్షెల్‌ మొదలగు వారందరు రాజైన యేసు యెదుట సాగిలపడుటకు సంతోషించిరి. మొత్తము పైని జగత్‌ ప్రసిద్ధులైన వారందరు యేసు క్రీస్తును వెంబడిరచిన వారైయున్నారు’’ (‘ఆరాధన’, డిసెంబర్‌ 1912, పు. 68). ‘అంత గొప్పవాళ్లైన ప్రాశ్చాత్యులే యేసు ప్రభువు ముందు సాగిల పడినప్పుడు మూర్ఖులైన భారతీయులెందుకు పడలేరూ’ అనేది ‘వివేకవతి’ నమ్మకం.
1910 మార్చి సంచికలో స్త్రీలను సంబోధిస్తూ, ‘‘ఓ నారి రత్నములారా! యేసు సంబంధులు సత్యమందు అతుకబడిన వారనియు సాతాను సంబంధులు అబద్ధమున అతుకబడిన వారనియు బాగా తెలిసినది గదా? ‘దేవుని కుమారుని అంగీకరించు వాడెవడో వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడెవడో వాడు జీవములేని వాడు’ (1 యోహాను 5:12). అనగా యేసునాథుని నంగీకరించువాడు సత్యమందు నిలిచినవాడు, గనుక మోక్షార్హుడనియు, ఆయనను అంగీకరించనివాడు సత్యమందు నిలువక అబద్ధమునకు జనకుడై సాతానుని నంగీకరించినవాడగును. అట్టివాడు నరకార్హుడనియు తెలియబడుచున్నది’’ అన్నారు. దీనికి సాక్ష్యం హిందువుల ‘తైతిరియా అరణ్యకములో’ కూడా వుందంటూ ఆ శ్లోకాన్ని ఉటంకించి దాని మీద దీర్ఘ వ్యాఖ్యానం చేశారు (‘సత్యము’, మార్చి 1910, పు.161`163). యేసే సత్యముÑ యేసే మోక్షముÑ యేసు తప్ప మరో స్వర్గ ద్వారం లేదు. ఈ విధంగా ‘వివేకవతి’ సత్యదేవుడి గూర్చిన వివేకాన్నీ కల్గించి సత్యానికి అతుక్కుపోండనీ, అసత్యాన్ని వదులుకోండనీ పదేపదే బోధించింది.
బ్రిటిష్‌ పాలనను ఆకాశానికెత్తేసి ప్రశంసించిన ‘వివేకవతి’, అది శాశ్వతంగా కొనసాగాలని బలంగా కోరుకుంది. తదనుగుణంగానే బ్రిటిష్‌ పాలన వల్ల భారతీయులకు కలిగిన రకరకాల ప్రయోజనాల్ని ఏకరువు పెట్టిన అనేక రచనలు పత్రికలో ప్రచురితమయ్యాయి. 1912 డిసెంబరు సంచికలో ప్రచురించిన ‘నేషనల్‌ ఆన్‌ధెమ్‌’ (‘చీa్‌ఱశీఅaశ్రీ Aఅ్‌ష్ట్రవఎ’) చూద్దాం. (దీన్ని ఇంగ్లిషులోనూ, లిప్యంతరీకరించి తెలుగులోనూ యిచ్చారుÑ పైన తెలుగులో ఒక వాక్యం, దాని కిందనే ఇంగ్లిషు వాక్యంÑ ఇంగ్లిషు యిస్తున్నాను):
»»God save our gracious King / Long live our noble King / God save our King /Send him Victorious / Happy and glorious / Long to reign over us / God save our King / Thy Choicest gifts in store / On him be pleased to pour / Long may he reign / May he defend our laws / And ever give us cause / To sing with heart and voice / God save our King.µµ (|ŸÚ. 69)
యుప్పులూరి నాగరత్నమ్మ బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల పసిఫిక్‌ మహాసముద్రమంత ప్రేమ కనబరచారు. ఆమె ప్రకారం బ్రిటిష్‌ పాలన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, పరీక్షిత్తు మొదలైన వారి పాలనకన్నా ఎన్నోరెట్లు భేషైనది. బ్రిటిష్‌ పాలన వల్ల భారతీయులకు ఎన్ని గొప్ప ‘‘లాభములు’’ చేకూరాయో ఆమె మాటల్లోనే – కొంత విస్తారంగా – తెలుసుకుందాం: ‘‘ఈ భరత ఖండమునేలిన మన భారతీయుల పురాణగ్రస్త గాథలును, పిదప తురుష్కులాదిగాఁగల వారి ప్రభుత్వముల చరిత్రలును వినియుంటిమి. కానీ యాయా రాజపుంగవులు వ్యవహరించిన కాలమందీ యాంగ్లేయ ప్రభుత్వమందువలె జనులే యారాటమును లేకుండా (కష్టాల్లేకుండా) స్వస్థత గలిగినట్లు (నిర్భయంగా వున్నట్లు) వినియుండలేదుÑ ఇట్టి న్యాయ పరిపాలనమును గానరాదు. తురుష్కుల కాలములో ప్రజలకుఁగలిగిన బాధలు దేశ చరిత్రలతో పనిలేకయే మన ముదుసళులు కథల రీతిని జెప్పినపుడెల్ల భీతావహమగుచుండును. భగవదవతారములని చెప్పఁబడుచున్న శ్రీరాముఁడు, శ్రీకృష్ణుఁడు, ధర్మవర్తనులని పేర్కొనఁబడుచున్న యుధిష్ఠరుఁడు, పరిక్షిత్తు మొదలుగాఁగల రాజవరుల పాలనములోఁగూడ దేశమింత నెమ్మది గాంచినట్లు (నిమ్మళంగా వున్నట్లు) గాన్పింపదు … ఈ యాంగ్లేయ ప్రభుత్వము వారు గోదావరి, కృష్ణ మొదలగు నెన్నియో నదులకానకట్టలు కట్టి నావికా యానమునకును, పంట భూములకును నుపయుక్తమగునటుల కాల్వలు త్రవ్వించుటచే చవుటి భూములు పంట భూములైనవిÑ త్రాగుటకు మధురమైన యుదకము లభించుచున్నది. సంచి సొమ్ము వెచ్చించినను పంపఁజాలని లేఖలొక క్రొత్త డబ్బుతో నందుచున్నవి. శీఘ్ర కాలములో తెలియవలసిన వర్తమానములాఱణాలతో తెలియుచున్నవి. ఎట్టి దూర దేశ యాత్రలైనను సులభముగా చేయుటకవకాశము గలిగి యున్నది. బలహీనుడైనను న్యాయపక్షముగా నుండినచో రాజాధిరాజులను గెల్వఁజాలిన వాఁడగుచున్నాడు. పామరులు పండితులైరి, రోగులు నిరోగులైరి, పల్లెలు పట్టణములైనవి. దేశమంతటను నవనాగరికత హెచ్చినది. సేతువులను, కాల్వలను, ఆవిరి యంత్రములను, తపాలాను, తంత్రి వార్తలను, పొగయోడలను, ధూమ శకటములను, కోర్టులను, పాఠశాలలను, వైద్యశాలలను, పారిశుద్ధ్య సంఘములను, సమాజములను, శాసన నిర్మాణ సభలను ` ఇట్టి ప్రజా సౌఖ్యదాయక కార్యములను పూర్వమే రాజులు చేసిరి? (ఎవ్వరూ చేయలేదు). ఇక్కాలమున మన పాలకులు పులియును మేకయును నొక తటాకోదకమునే త్రాగునంతటి ధైర్య సాహసములను, స్వాతంత్య్రమును, జాతి భేదము లేక యెల్లరకును నిచ్చియున్నారు – అనగా వర్ణ వివక్షతతో నవశ్యము లేక వారి వారి గౌరవములను, స్వాతంత్య్రములను కాపాడుచున్నారు …. మరియు హిందువులలో ముఖ్యముగా స్త్రీల దుస్థ్సితికి జాలినొంది వారి స్వాతంత్య్రములను కాపాడఁదలంచి తదుపయుక్తమగు స్త్రీ విద్యను ప్రోత్సాహపఱుప, బాలికా పాఠశాలల నుంచి, వితంతు దుర్మరణమగు సహగమనమును, నిర్బంధ వైధవ్యమును మాన్పందగు చట్టముల నేర్పాటు చేసి మేలొందుఁడని చెప్పియున్నారు … (ఆంగ్లేయులు) ప్రజల వలన సుంకములు తీసుకొనుట లేదా యనియు నిందుపకారమేమున్నదనియు కొందఱు శంకింపవచ్చును. వారు మన వలనఁగైకొను సుంకములకు పరిమాణమున్నది గాని (పరిమితి) యందుకు ప్రతిఫలముగా వారు మనకు కలుగఁజేయు లాభములకు పరిమితియే లేదు. వారు సేయు పనులు సేతుబంధనములాదిగా నెవ్వి పరికించినను దేవ నిర్మితములా యనియును, వీనికి వెచ్చించిన ధనమునకు మితియుండునా యనియును మనకే శంక పొడముచుండును. కాన నీ (ఆంగ్లేయ) ప్రభువులు ప్రజా క్షేమమునే ముఖ్యముగా కోరువారుగాని ప్రజలను పీడిరచి ధనాగారము నిండిరచుకొనువారు కారు. … సర్వేశ్వరుఁడా రాజదంపతులను వారి పుత్ర పుత్రికా రత్నంబులను, బంధుమిత్ర వర్గమును నాంగ్లేయ ప్రభుత్వమును చిరాయువొసఁగి రక్షించుఁగాత! …’’ (‘ఆంగ్లేయ పరిపాలనము వలని లాభములు’, మే 1912, పు.234`237).
మిసెస్‌ సామినేని ఆదినారాయణరావు విక్టోరియా మహారాణిని ఘనంగా కీర్తించారు. ‘‘కీర్తిశేషురాలును శ్రీ రాజరాజేశ్వరియు మహారాజ్ఞియునైన విక్టోరియా చక్రవర్తిగారి రాజ్య కాలమందు మనకు జరిగిన క్షేమకరమైన కార్యములను చెప్పుటకు నాకు శక్యము కాదు … వీరు స్త్రీల కొరకనేకమైన సదుపాయములేర్పఱచి యున్నారుÑ స్త్రీలెంత వఱకు చదివినను, చదువుటకు స్వాతంత్య్రమిచ్చి యున్నారుÑ స్త్రీలకు కొంతమట్టుకు కొన్ని యుద్యోగములు కూడ నియమించి యున్నారు. శ్రీ విక్టోరియా రాణిగారు రాజ్యభారము వహింపక మునుపు మన భారతదేశ మెట్టి దురవస్థలో నుండెనో మనమే యూహించు కొనవచ్చును. (పరాయివారైన) నవాబులేలెడు కాలమందుఁగాని మన హిందూ రాజులేలెడు కాలమందుఁగాని మనకిట్టి సుఖప్రదాయకమైన యేర్పాటులు జరిగియుండలేదు. శ్రీ విక్టోరియా రాణిగారు మనకిచ్చిన స్వాతంత్య్రము పూర్వపు రాజులు మన పెద్దలకిచ్చి యుండలేదు. వీరు తమ రాజ్య కాలమునందనేకమైన వైద్యశాలలు కట్టించిరిÑ అనేకమైన పాఠశాలలు కట్టించిరిÑ వానిలో స్త్రీల కొఱకు వేఱే కొన్ని నియమించి యున్నారుÑ బీదల జీవనార్థమై మంచి యేర్పాట్లు చేసి యున్నారు. శ్రీ విక్టోరియా చక్రవర్తిని గారు తమ రాజ్య కాలమంతయు ప్రజల యొక్క క్షేమమునే కోరుచు తమ రాజ్యములో నుండు ప్రజలకే లోపమును రాకుండునట్లు ప్రయత్నించెడి వారు.’’ అంతేకాదు ‘‘పతివ్రతా ధర్మమునందు (కూడా) వారితో సరిపోలిన వారు లేరు’’ అని ఆంగ్ల ప్రభుత్వం పట్ల అంతులేని ఆరాధనా భావాన్ని వ్యక్తపరిచారు మిసెస్‌ ఆదినారాయణరావు గారు (‘రాజభక్తి’, మార్చి 1912, పు.168`169).
మాదిరాజు జానకరామయ్య గారి దృష్టిలో బ్రిటిష్‌ ప్రభుత్వం భూలోకదైవం. బ్రిటిష్‌ పాలనను గురించి ఆయనేమన్నారో కొంచెం చూద్దాం: ‘‘విక్టోరియా మహారాణి పరిపాలింప వచ్చినది మొదలు ఇప్పటి వరకును దేశము నెమ్మదిలోను, సౌఖ్యములోను, దినదినాభివృద్ధి నొందుచున్నది. అసౌఖ్యము కలనైనను కనుపించుట లేదు! అన్యాయమడుగంటినది! … నరబలులు పెద్ద నిద్రను బోవుచున్నవి! సకల మతములును సమ్మతములైనవి! వేయేల! పూర్వపు హిందూదేశ మీదేశము గాదు! పూర్వపు భరతఖండమీ భరతఖండము గాదు! ఏ చక్రవర్తుల పరిపాలనలో నింతటి సౌఖ్యముగ నున్నారము! ఏ ప్రభువుల ఏలుబడిలో మన మతములు సమ్మతములైనవి! ఏ రాజుల కాలములో స్త్రీలు నాగరికతనుబొంది సుఖపడుచున్నారు! … సహగమనమును పూర్తిగా మాన్పించి స్త్రీలను రక్షించిన భూదైవతము ఆంగ్లేయ ప్రభుత్వముగాక మరెద్ది! … పసి పాపలను తమ చేతులార తలిదండ్రులు బలి యిచ్చుచుండు దురాచారమును తప్పించి పసి పిల్లలను రక్షించి పాలించుచున్న ఈ యింగ్లీషు ప్రభుత్వమువారి ఋణమును మనమెన్నడైనను దీర్చుకొందుమా! … స్త్రీలకును వేరు పాఠశాలలుంపించియు, వేరు వైద్యశాలలు స్థాపించియు స్త్రీలనే ఉపాధ్యాయినులుగను, వైద్యులుగను ఏర్పరచి సుఖపెట్టుచున్న ఈ బ్రిటిషు పరిపాలన యొక్క కృతజ్ఞతను మరువశక్యమగునా?… ఈ ప్రభుత్వములో మతాంతరులయిన శిక్షలుగాని, (ముసల్మాను పాలనా కాలంలో జరిగినట్టు) మతాంతరులు కావలెనన్న బలవంతముగాని లేదు! … ఈ రీతిగ న్యాయ పరిపాలన నొనర్చుచు దుర్మార్గులను బంధించి సన్మార్గులను గౌరవింపుచుండు ఈ బ్రిటిషు పాలనను వర్ణింపనేరి తరము! ఆంగ్ల ప్రభువులకు ఐదు మహా ఖండములలోను పరిపాలనా ప్రదేశములు గలవు. వీరి రాజ్య ప్రదేశమున సూర్యుడస్తమింపడు’’. (ఆ సూర్యుడు ఎప్పటికీ అస్తమించకుండా చూడాల్సిన బాధ్యత మన మీద వుందిÑ లేకపోతే కృతఘ్నులమవుతాము) (‘ఆంగ్లేయ పరిపాలనా లాభములు’, డిసెంబరు 1913, పు. 69`71). తాళ్లపూడి వేంకటస్వామి నాయుడుగారి ప్రకారం బ్రిటిష్‌ పూర్వపు భారతదేశం ఒక జైలుÑ బ్రిటిష్‌ పాలనతో భారతీయులు జైలు నుండి విడుదలై సుఖసంతోషాలననుభవిస్తున్నారు. ఆంగ్ల పాలన వల్ల భారతీయులకు కలిగిన రకరకాలైన లాభాల్ని ఊపిరి సలపనివ్వని వేగంతో వివరించిన నాయుడుగారు ‘‘ఇంకను మన బ్రిటిషు రాజ్యము బాలచంద్రుని పగిది వృద్ధి పొందుననుటకు సందియము లేదు’’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించి తన ప్రగాఢ విశ్వసనీయతను ప్రదర్శించారు (‘బ్రిటిషు వారి పరిపాలనా మేలులు’, డిసెంబరు 1915, పు.68`69). ఈ విధంగా ‘వివేకవతి’ చాలా మందికి బ్రిటిష్‌ పాలన గూర్చి వివేకోదయ పాఠాలు గట్టిగా బోధించేది.
బ్రిటిష్‌ పాలనను పొగడడం కేవలం ‘వివేకవతి’కి మాత్రమే ప్రత్యేకమైన విషయమా? కాదు. 1920కి ముందు వెలువడిన ‘హిందూసుందరి’ మొదలైన స్త్రీల పత్రికలు కూడా బ్రిటిష్‌ పాలనను వేనోళ్ళ కొనియాడిన రచనలను ప్రచురించాయి. 1920కి ముందే కాకుండా, తర్వాత కూడా చాలా మంది స్త్రీలు బ్రిటిష్‌ పాలన పట్ల అనుకూలాభిప్రాయాన్నే కలిగి వుండినారు. ‘హిందూసుందరి’ తొలి సంపాదకురాలైన మొసలిగంటి రమాబాయమ్మ వితంతువులకు బలవంతంగా శిరోముండనం చేయకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం చట్టం చేయాలని కోరుతూ స్త్రీల సంతకాలతో ఒక సుదీర్ఘమైన ‘‘మహజరు’’ను పంపారు. వితంతులపై హిందూ సమాజం చేసే అఘాయిత్యాలను హృదయ విదారకంగా వర్ణించిన రమాబాయమ్మ ఆ అఘాయిత్యాల నుండి స్త్రీలను రక్షించిన బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల తన అవ్యాజానురాగాన్ని ఈ విధంగా ప్రకటించారు: ‘‘మహాఘనత వహించిన బ్రిటిషు ప్రభుత్వమువారు సహగమనమునాపకుండిన అనుదినము పాలు త్రాగు పిల్లలు, ప్రాకెడువారు, తప్పటడుగులిడు పిల్ల లెన్ని వేలమందిని శవములపై కట్టి కాలెడు మంటలో పడద్రోసి రాక్షస కృత్యమొనర్చియుందురో చూచుట తటస్థము గాకపోవునా? … అట్టి దుష్కుృత్యములన్నియు సర్వధర్మ స్వరూపులగు మహాఘనత వహించిన దొరతనము వారు శాసన రూపమున రూపుమాపుట తటస్థింపకుండినచో ఈ దేశమునందీ కాలమున కిట్టి జ్ఞాపనముంపుకొనుటకు స్త్రీలు మిగిలియుండుట దుస్తరమై యుండెడిది’’ అని తాను బ్రతికి బట్టకట్ట కలిగానంటే అది బ్రిటిష్‌ ప్రభుత్వ చలవే అన్నారు (‘వితంతు శిరోముండనమును గూర్చిన మహజరు’, హిందూసుందరి, జూలై 1904, పు.152).
కందూకురి వీరేశలింగంలాంటి గొప్ప పురుష సంఘ సంస్కర్తలు కూడా బ్రిటిష్‌ ప్రభుత్వం వలన భారతీయులకు చాలా మేలు జరిగిందన్నారు. ఆయన మాటల్లో: ‘‘మన దేశాభివృద్ధినుద్దేశించి పరమ దయాపరుఁడైన యీశ్వరుజడు ప్రసాదించిన యీ యింగ్లీషు ప్రభుత్వ మహిమను బట్టి కాని, కాకపోయిన యెడల మనమీ దినమున నిట్లు సభకూడి యందఱమైకమత్యముతో రాజ్యాంగ విషయములను గూర్చి నిర్భయముగాజ బ్రసంగింపజ గలుగుదుమా? మన దేశమునందింగ్లీషు ప్రభుత్వము నెలవుకొనక ముందు నిరంకుశాధికారము గల కొందఱు దుష్ట ప్రభువులు జరిగించిన దౌర్జన్యములను దలచుకొన్న దేహమిప్పుడును గంపమొందుచున్నది. ఆ కాలములో ధనమునకుజ గాని, మానప్రాణములకుఁ గాని రక్షణ లేదు. … పురాణములయందు వర్ణింపఁబడిన చిరకాల జీవులవంటి వారెవ్వరైన నుండి యీ భరత ఖండము యెక్క వెనుకటి స్థితిని ప్రస్తుత స్థితిని గూడ జూడఁ గలిగిన పక్షమున అప్పటి భరత ఖండమునకును మన యిప్పటి భరత ఖండమునకును నరకమునకును స్వర్గమునకును ఉన్నంత వ్యత్యాసమున్నదని చెప్పకపోరు. … యింగ్లీషు వారి సత్పరిపాలనము వలన మనమిప్పుడనుభవింపఁగలిగిన సుఖసాధనములననేకములను మన పూర్వులు స్వప్నావస్థయందును వినియు కనియు నుండరు. కాశీలోని వారి క్షేమ సమాచారమును తంత్రీముఖమున నూఱులకొలజది క్రోసుల దూరములోనున్న యిచ్చటివారు నిమిషములోజ దెలిసికోజ గలుగుదురని నూఱు సంవత్సరముల క్రిందట నెవ్వరూహింపఁగలరు? … ఇప్పుడిరచుమించుగా ధనప్రాణమానములకు సంపూర్ణ రక్షణము కలిగి యున్నదిÑ న్యాయము కోటీశ్వరుజడు మొదలుకొని కూటి పేద వఱకును సమానమయి యున్నది. … హూణ భాష రూపమయిన సంజీవనీ విద్యగాక మఱి యేది? ఈ భాష యమృత వర్షము … ఇంగ్లీషు విద్య యొక్కయు నింగ్లీషు ప్రభుత్వము యొక్కయు ఘనతను కీర్తిని ఘోషించుటకయి యింతకంటె వేఱేమి కావలెను? … ఈవఱకు మన దేశమునకు సంప్రాప్తములయిన ప్రభుత్వములలో నెల్ల నీ యింగ్లీషు దొరతనము సర్వోత్కృష్ఠమయినదని భూషించుట చేత దీనియందే విధమయిన లోపములును లేవని నేను చెప్పఁదలఁచినవాఁడను గాను. ప్రపంచంలోని దేదియు సంపూర్ణముగా నిర్దుష్టమయి యుండదు. … ఇట్టి యనర్థకము మన దేశమున కెప్పుడును పుట్టకుండ స్థిరముగా నింగ్లీషువారే మన దేశము నేలుచుండునట్లుగాఁ జేయవలయునని మనము నిరంతరమును భక్తవాంఛిత ప్రదాతయయిన జగదీశ్వరుని ప్రార్థించుచుండవలయును. …’’.
ఈ విధంగా బ్రిటిష్‌ పాలనను చాలామందే పొగిడారు. అయితే ‘వివేకవతి’ దారి వేరు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా శాశ్వతంగా కొనసాగాలని గట్టిగా కోరుకొన్న ‘వివేకవతి’కి భారతీయులు స్వాతంత్య్రం కోసం గొంతు విప్పడం అస్సలు నచ్చలేదు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడేవారు న్యాయపరులైన బ్రిటిష్‌వాళ్ళు చేస్తున్న మంచి పనులు చూసి సంతోషించకుండా జాతీయవాదం, గీతీయవాదం అని అరుస్తూ బ్రిటిష్‌వాళ్ళ చేతుల్లో నుండి అధికారాన్ని ‘‘బలవంతం’’గా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారనీ, తను యిలాంటి అన్యాయమైన పనుల్ని సహించననీ గట్టిగా చెప్పింది! ‘వివేకవతి’ మాటల్లోనే: ‘‘ప్రస్తుత కాలమందు మన దేశములో గొప్ప మార్పులు కలుగుచున్నవి. మనము విదేశీయుల వల్ల క్రొత్త మార్గములను నేర్చుకొనుచు మనకిదివరకుండు (చెడు) యభిప్రాయములు కొన్ని విడిచిపెట్టి క్రొత్తవాటి ననుసరించుచున్నాము. స్వదేశాభిమానమొకటి యీ కొద్ది సంవత్సరములలోగా ప్రసిద్ధికెక్కెను. యోగ్యమైన స్వదేశాభిమానము గౌరవము గలదే. అయితే కొందరు స్వపాలన కోరి దేవుని ఆశీర్వాదమువల్ల ప్రస్తుత కాలములో మనమనుభవించుచున్న యీ న్యాయ స్థితిలోకి మన దేశమును తెచ్చిన (బ్రిటిష్‌) వారి చేతిలో నుండి దానిని (పాలనను) బలవంతముగా నపహరింప ప్రయత్నము చేయుదురు. వివేకవతి యే మాత్రమును బలవంతమునకు సమ్మతింపదు. …’’. బ్రిటిష్‌ వాళ్ళేమో భారతీయ రాజుల గడ్డాలు పట్టుకొనీ, బుజ్జగించీ, బతిమాలీ, బామాలీ, మీకు నాగరికత నేర్పించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడుÑ మీరు కాసేపు తప్పుకొని మాకు సింహాసనమివ్వండన్నారు! స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న భారతీయులేమో అజ్ఞానంతోనూ, అన్యాయంగానూ బ్రిటిష్‌ వాళ్ల దగ్గర్నుంచి రాజ్యాన్ని బలవంతంగా లాక్కొంటున్నారు!!
‘వివేకవతి’ రకరకాల కాలమ్స్‌ నిర్వహించేదని ముందే తెలుసుకుని వున్నాం కదా! వాటిలో ఒకటి ‘ఉత్తర ప్రత్యుత్తరముల శాఖ’. వివిధ రకాలైన ప్రశ్నలు అడిగి జవాబులు ఇవ్వమని పాఠకుల్ని కోరేది. 1912 మార్చి సంచికలో ఈ కింది ఆరు ప్రశ్నలు అడిగారు.
‘‘1. స్త్రీలు చదివి యుద్యోగము చేయఁబోయెదరా? వారికి చదువెందుకు? చదువుకొన్న స్త్రీలు చెడిపోవుదురు – అని కొందరు మన యాజడువారికి విద్యకూడదందురు. ఇందుకు మీ సమాధానమేమి?
2. మీ కింగ్లీషు విద్య కావలయునా? మీరు పురుషుల వలె నుద్యోగము చేయబోరే. ఆ విద్య వలన ప్రయోజనమేమి?
3. మీ కొఱకు ప్రచురింపజబడు వార్తాపత్రికలేవైనా మీరు చదువుచున్నారా? అవి యేవి? ఎప్పుడెచ్చట ప్రచురింపబడుచున్నవి? చందా యెంత?
4. ముద్దియ తనకు వివాహము కాజగానే యెచ్చట నుండవలెను? పతి యింటనా? పిత యింటనా?
5. రజస్వలా వివాహము చేయుట మంచిదని సంఘ సంస్కర్తలు వాక్రుచ్చెదరు. మీయభిప్రాయమేమి? ఈ విషయమున మనుస్మృతి యేమి ఘోషించుచున్నది? బ్రాహ్మణులలో నట్టి వివాహములెవరైనను చేసి యున్నారా? వారెవరు? ఎందుండువారు?
6. స్వయంవర వివాహమనజగానేమి? మీకది యిష్టమా?’’ (పు.189)
ఈ ప్రశ్నలు స్త్రీలనుద్దేశించి వేసినా, స్త్రీలెవరూ సమాధానాలు రాసినట్లు లేరు (స్త్రీలు స్పందించనందుకు సంపాదకులు బాధపడ్డారు కూడా). కానీ ఇద్దరు మగవారు మాత్రం జవాబులు పంపారు. బ. రామచంద్రరావు అనే అతను చదువును ఉద్యోగంతో ముడి పెట్టకూడదనీ, అది జ్ఞాన సంపాదనకనీ, పురుషులు కూడా అందుకే చదువుకోవాలన్నారు. జ్ఞానమందరికీ అవసరం కాబట్టి ‘‘ప్రతి పురుషుడును, ప్రతి స్త్రీయును’’ చదువుకోవాలనేది తన అభిప్రాయమన్నారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు చదువుకోవాల్సిన అవసరం వుందనీ, చదువుకున్న ఆడవాళ్లు ‘‘తమ భర్తల కనేక విషయాల్లో తోడ్పడుటయేగాక, గృహకృత్యములనెట్లు నెఱవేర్చుకోవలెనో యెఱింగి, పిల్లలను పెంచు విధమునందు మిక్కిలి జ్ఞానపరలై, పతియే దైవమను న్యాయమును బాగుగ తెలిసికొనిన వారై, బీదతనముచే మిక్కిలి పీడిరపజబడుచున్న వారైనప్పటికిని తమ భర్తలను సౌఖ్యపెట్టుచు తాము సౌఖ్యపడు’’తారని చెప్పి కుటుంబ జీవిత సౌఖ్యానికి స్త్రీల చదువు మరీ ముఖ్యమన్నారు. చదువుకుంటే స్త్రీలు చెడిపోతారన్న దుష్టాలోచనను ఖండిరచిన రామచంద్రరావు చదువులేని స్త్రీలు భర్తలకు పెట్టే కష్టాల్ని ఏకరువు పెట్టారు. ‘‘విద్యాగంధము లేక తమ భర్తలను నగలకొఱకనేక విధముల బాధపెట్టుచు, పతివ్రతా శిరోమణులవలె నటించి యిరుగు పొరుగుల సంచరించుచు, కొన్ని సమయములయందు భర్తల చావునకు కారకురాండ్రైన మూర్ఖస్త్రీల నెంతమందిని చూచుచున్నారము! ఎందఱను గూర్చి చదువుచున్నారము’’ అని వగిచారు (‘ఉత్తర ప్రత్యుత్తరముల శాఖ’, మే 1912, పు.244).
మదనపల్లి నుండి సి. విశ్వనాథరావు అనే అతను కూడా ‘వివేకవతి’ అడిగిన పై ప్రశ్నలకు జవాబు రాశారు. అయితే యితను ఆరు ప్రశ్నలకూ జవాబిచ్చారు. ఈయన కూడా ఆడవాళ్లక్కానీ, మగవాళ్లక్కానీ విద్య ప్రాథమికంగా ‘‘జ్ఞాన సంపాదన’’ కోసం అన్నారు. అయితే ఒకడుగు ముందుకు వేసి, పొట్ట పోసుకోవడానికి యిద్దరూ ఉద్యోగాలు కూడా చేయొచ్చన్నారు. ‘‘మనమిచ్చు విద్య’’ సరైంది కాకపోతే స్త్రీలే కాదు పురుషులు కూడా చెడిపోతారని ఖరాఖండీగా చెప్పారు. కాబట్టి ఆడవాళ్లకూ, మగవాళ్లకూ ఎవరికి తగిన విద్య వాళ్లకివ్వాలన్నారు. మనకుపయోగపడే జ్ఞానం ఇంగ్లిషులో వుండడం వల్ల స్త్రీలు తప్పకుండా ఇంగ్లిషు నేర్చుకోవాలన్నారు. స్త్రీల కోసం వెలువడుతున్న ‘సావిత్రి’, ‘హిందూసుందరి’ మొదలైన పత్రికల్ని చదువుతున్న స్త్రీలున్నారని తెల్పిన విశ్వనాథరావు ఆ పత్రికలు ‘‘నారీమణుల కొఱకే గాని పురుషుల కొఱకు గాదు’’ అన్నారు. (అంటే పురుషులు ఆ పత్రికలు చదవకూడదనా! స్త్రీల పత్రికలు స్త్రీలే చదవాలా? ఈ మగకావర భావజాలం యిప్పటికీ వుంది. స్త్రీల పత్రికల్ని, బాగా చైతన్యవంతులమనుకొనే మగానుభావులు కూడా పెద్దగా చదవరు. ఇది షేఖ్‌ మహబూబ్‌ బాషా అనే అతని పరిశోధనలో బైటపడిన సిగ్గుపడాల్సిన అంశం). పెళ్లయ్యాక భార్య (‘‘సువాసిని’’) భర్త యింట్లోనే వుండాలి గానీ తండ్రి యింట్లో వుండగూడదు (ఆమెకు తనకంటూ ఓ ఇల్లు అప్పుడూ ఇప్పుడూ లేదు కాబట్టి అక్కడో ఇక్కడో పడుండాల్సిందే). ఎందుకంటే ‘‘వస్తువు’’ను వెంబడిరచే ‘‘నీడ’’ వలె భార్య భర్తననుసరించి ‘‘సుఖ దు:ఖములను పంచుకొనుచుండవలెను’’. (కందుకూరి వీరేశలింగం గారు కూడా రాజ్యలక్ష్మమ్మ గారు తన ‘‘ఛాయ’’లా వుండేవారని రాశారు తన ‘స్వీయ చరిత్రము’లో).
అతిబాల్య వివాహాల్ని వ్యతిరేకించిన విశ్వనాథరావుగారు 13, 14 సం॥ల వయస్సున బాలికలకు వారి ‘‘యనుమతి మీఁద’’ పెళ్లి చేయడం మంచిదన్నారు. ఒకవేళ ‘‘బాలిక జ్ఞానవంతురాలైనచో’’ యింకా ఆలస్యంగానైనా చేయొచ్చన్నారు. ‘‘స్వయంవర’’ వివాహాల (ప్రేమ పెళ్లిళ్లు) దగ్గరికొచ్చేసరికి తిరకాసెట్టారు విశ్వనాథరావు. స్వయంవరమంటే భర్తను స్వయంగాఎంపిక చేసుకోవడమనీ, ‘‘స్త్రీ కామాతురjైు మంచి చెడ్డలు తెలిసికొనజజాలక యెవనినైనను’’ పెళ్లాడ్డానికి యిష్టపడుతుందనీ, అలా కాకుండా ‘‘తల్లిదండ్రుల యాలోచనజ గైకొనినచో’’ వాళ్లు మంచి వరున్ని చూపిస్తారనీ, అప్పుడు యిష్టమైన వాన్ని పెళ్లాడొచ్చనీ చెబుతూ, అమ్మాయే స్వయంగా ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకోవడాన్ని ససేమిరా కాదన్నారు (‘‘స్వయంవరమున కియ్యకొనను’’). పర్‌ఫెక్టు మిసోజినీ! (‘ఉత్తర ప్రత్యుత్తరముల శాఖ : మార్చి నెలలోని ప్రశ్నలకు జవాబులు’, జూలై 1912, పు.309). ‘ఉత్తర ప్రత్యుత్తరముల శాఖ’ ద్వారా తన పాఠకులతో ప్రగాఢ సంబంధాన్నేర్పరుచుకుంది ‘వివేకవతి’. రకరకాల ఆలోచనలున్న పాఠకులు ఈ కాలమ్‌లో మనకు కనిపిస్తారు. పత్రికల్లో అచ్చైన వివిధ రచయితల రచనల్లాగే పాఠకుల జవాబులు కూడా ముఖ్యమైన అధ్యాయనాంశం. నూరు పూలు వికసిస్తూ, వేయి ఆలోచనలు సంఘర్షిస్తూ పత్రికల జ్ఞానందాన్ని పెంచుతాయవి.
‘ఆయాచోట్ల జరిగిన సంగతులు’ (‘చీవషం aఅస చీశ్‌ీవం’) అనే కాలమ్‌ ద్వారా వివిధ రకాలైన ఆసక్తిగొలిపే సమాచారాన్నందించేది ‘వివేకవతి’. 1913 డిసెంబరు సంచికలో ఈ కాలమ్‌ కింద ఒక ఘోరమైన విషయాన్ని ‘చాకలి బాలికను చంపుట’ అనే శీర్షికన ఈవిధంగా ఇచ్చింది : ‘‘గుంటూరు జిల్లా కాకుమాను అను గ్రామములో సెప్టెంబరు నెల 16 తేదీన 14 సం॥ ప్రాయముగల చాకలి పిల్ల అన్నము అడుగుకొనుటకు గ్రామములోని యిండ్లకు వచ్చెను. అంతనామె నొక కమ్మవారి యింటికి వెళ్లగా ఆ యింటి యజమాని ఓసీ? నీకెంతమంది పెనిమిట్లు యున్నారని అడగగా ఆమె ‘‘నీ భార్యకు ఎంతమంది పెనిమిట్లు’’యున్నారని అడిగెను. ఈ పిల్ల ఈ మాట అన్న కోపముచే (ఆ కమ్మకుల దురహంకారి) సాయంకాలము అన్నము పెట్టెదము రమ్మనిరి. ఆ పిల్ల రాత్రి 8 గంటలకు వచ్చెను. ఆ పిల్లను రానిచ్చి వీధి తలుపు వేసి ఈ పిల్ల(ను) అరవనీయకుండానే దేహము నిండా వాతలు పెట్టి వూరి బైట జొన్న చేలో పడవేసిరి. పిల్లా బాధకు ఓర్చుకొనలేక ఏడ్చుచున్నప్పుడు కొందరు శబ్దము విని లాంతరులతో పిల్లయొద్దకు వెళ్లి తీసుకొని వచ్చి ఆ చాకల పిల్లను పోలీస్‌వారి స్వాధీనమునకు అప్పచెప్పిరి. పోలీస్‌వారు ఈమె యొద్ద స్టేటుమెంటు పుచ్చుకొని ఆ యింటి కమ్మ మగవారినందరినీ అరెస్టు చేసిరి. ఈ పిల్ల తెల్లవారి ఉదయము 7 గంటలకు ప్రాణము విడిచెను’’ (పు. 96). (ఆంగ్ల ప్రభుత్వ పాలన కదా, తప్పకుండా గట్టి శిక్షే పడి వుంటుంది, కుల దురహంకార హంతకులకు).
1913 సెప్టెంబరు సంచికలోని ‘ఆయాచోట్ల జరిగిన సంగతులు’లో మరింత ఘోరమైన విషయాన్ని తెలిపారు. ‘‘వివేకముగల యీ కాలములో’’ కూడా అలహాబాద్‌కు సమీపంలో నివసిస్తుండిన ఒక బ్రాహ్మణ స్త్రీ సతీ సహగమనానికి బలైందని తెలపడానికి ‘‘విచారముగా’’ వుందన్నారు. ‘‘తన భర్త కాష్ఠముపై నెక్కవలసినదని యామెకు బోధించి లోబరచిన యామె బంధువులలో ఐదుగురు పురుషులకు రెండు లేక మూడేండ్ల కఠిన వరకపు శిక్ష విధించబడె’’నని తెలియజేశారు (‘సహగమనము’, పు.382). (ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలు చేస్తే మరీ పట్టించుకోకుండా వుండడానికి అదేమన్నా మన ఘనమైన స్వతంత్య్ర భారత ప్రభుత్వమా?)
1913 మే సంచికలో ప్రత్యేక ఆంధ్రోద్యమానికి సంబంధించిన సమావేశాన్ని గూర్చి తెలిపారు. ‘‘తెలుగు భాషను మాట్లాడు జిల్లాలన్నియు జేర్చి యొక ప్రత్యేక రాజధానిగా నేర్పాటు చేయబడవలెనని’’ తీర్మానం చేశారని చెప్పారు (‘కన్ఫరెన్సు సమాజము’, పు. 254). అదే సంచికలో ‘గుంటూరు తురక బాలికా పాఠశాల’ సంవత్సరోత్సవ సభ గూర్చి తెలిపారు. ‘‘గుంటూరులోని చిన్న బజారునందున్న తురక బాలిక పాఠశాల విద్యార్థులకు సంవత్సరాంతపు బహుమతులియ్య’’ బడినాయనీ, ఆ ‘‘తురక’’ బాలికలు చేసిన ‘‘తమాషాలను, డ్రిల్లులను, డ్రిల్లు పాటలను, సంభాషణలను వినుటకు’’ దాదాపు 200 మంది ‘‘గోషా స్త్రీలు’’ హజరయ్యారనీ, ఆ పాఠశాలకు ‘‘మేనేజరుగా మిగుల శక్తితో పని చేయుచున్న తామస్‌ (మిస్‌. థామస్‌) మిశమ్మ’’ గారు పిల్లలకు పండ్లూ, బొమ్మలూ, రవికలూ, బట్టలూ మొదలయినవి పంచారనీ తెలిపారు (‘గుంటూరు తురక బాలికా పాఠశాల’, పు. 254). 1912 అక్టోబరు సంచికలో ధూమపానం అలవాటువల్ల చనిపోయిన ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి గూర్చి తెలియజేశారు (‘చుట్ట త్రాగుట వల్ల కలుగు హాని’, పు. 32). అదే సంచికలో 1912 ఆగష్టు 10న టర్కీలో (‘‘తుర్కీ దేశము’’) సంభవించిన భారీ భూకంపం గూర్చి తెలిపారు. 3000 మంది చనిపోయారనీ, 6000 మందికి గాయాలైనాయనీ, చాలా మంది ‘‘నిలువ నీడ లేకను భోజనము లేకను త్రాగు నీళ్ళు లేకను’’ బాధపడుతున్నారనీ, వాళ్ళ ‘‘బాధ నివారణార్థము’’ జర్మన్‌ చక్రవర్తి 10,000 మార్క్‌లను సహాయము చేశారనీ వివరించారు (‘భూకంపము’, పు. 32). 1913 ఏప్రిల్‌ సంచికలో అహ్మద్‌నగర్‌లో ‘‘వరసగా మూడేండ్ల నుండి’’ నెలకొన్న భయంకర కఱువును గూర్చి తెలిపి అక్కడి ప్రజలనూ, పశువులనూ రక్షించడానికి సహాయం కోరారు (‘అహమద్‌ నగరములో కఱవు’, పు. 223). ఈ విధంగా ‘వివేకవతి’ సాధారణంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేయబడిన స్త్రీలకు రకరకాలైన వార్తల్ని చేరవేసి ప్రపంచంలోకి తొంగి చూడడానికి చక్కటి కిటికీలా పని చేసింది (ఔఱఅసశీష ఱఅ్‌శీ ్‌ష్ట్రవ షశీతీశ్రీస). కడపలోని ఒక కోడి పెట్టిన గుడ్డులో రెండు పచ్చ సొనలుండినాయి లాంటి వింతైన వార్తల్నీ స్త్రీల దగ్గరికి మోసుకెళ్ళేది ‘వివేకవతి’ (‘చిత్రమైన గుడ్డు’, డిసెంబర్‌ 1913, పు. 96).
స్త్రీల పత్రిక కాబట్టి స్త్రీలకు అత్యంత అవసరమని భావించిన వంటావార్పుల గురించీ, రకరకాల వంటకాల గూర్చీ తెలిపేది. ఎన్నో రకాలైన నోరూరించే వంటకాలూ, వాటిని తయారు చేసే విధానం మొదలైనవి వివరించేది ‘వివేకవతి’. ప్రియ పాఠకుల్ని వుద్దేశించి ‘‘మీలో ఎవరికైనా మంచి పిండి వంటలు గాని, ఊరుగాయలు గాని, పచ్చళ్ళుగాని, అరిశలు మొదలగునవి గాని చేయుట రాదా? వచ్చియుండిన యెడల మన గృహ విషయముల శీర్షికలో ప్రచురించ వ్రాసియంపెదరా? వాటిని మీ పేర ప్రచురింతుము’’ అని చెప్పి మీ వంటల నైపుణ్యాన్ని అందరితో పంచుకోండన్నారు (ఆగష్టు 1915, పు. 323). ‘వివేకవతి’లో రకరకాల వంటలు ఘుమఘుమలాడాయి. అయితే మాంసాహారానికి సంబంధించిన సువాసనలేవీ లేవు. ఆహారం విషయంలో ‘వివేకవతి’ ప్యూర్‌ వెజిటేరియన్‌!
ఇలా రకరకాల సమాచారంతో, వైవిధ్యభరితమైన, జ్ఞానదాయకమైన కాలమ్స్‌తో అలరారడం వల్లనే బందరులోని నోబుల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ అయిన డబ్లు. సి. పెన్‌, యం.ఏ., గారు ‘వివేకవతి’ని ‘‘శ్రేష్ఠమైన పత్రిక’’ అని కొనియాడారు. ఒక ‘‘డాక్టరు గారి భార్య’’ వివేకవతి ‘‘మిగుల జనసమ్మత’’మైందనీ, అందుకే దాన్ని గూర్చి ఎంతో మంది ‘‘ఉద్యోగస్థులు’’ తన భర్తతో మాట్లాడుతుంటారనీ తెలిపారు. ‘‘ఒక మిషెనరీగారి భార్య’’ వాళ్ళ టీచర్లకోసం నెలనెలా 39 ప్రతులు తెప్పించుకుంటున్నామని సంతోషంగా చెప్పారు (‘వివేకవతీ ప్రశంస’, డిసెంబరు 1912, పు. వెనుక అట్ట). ‘వివేకవతి’ని ప్రగాఢంగా ప్రేమించినందువల్లనే ఒక పాఠకుడు/రాలు, ఒక మూర్ఖుడెవడో ‘వివేకవతి’ని ‘అవివేకవతియా’ అని హేళన చేస్తే అవును, అవివేకులకు అలాగే అన్పిస్తుందని ఘాటుగా వాయించారు. ఇలా సుమారు పాతిక సంవత్సరాల పాటు ‘వివేకవతి’ ప్రస్థానం జనరంజకంగా సాగింది.
సంహారము: 20వ శతాబ్ది ప్రథమ దశకంలో ప్రారంభమై చాలా కాలంపాటు కొనసాగిన స్త్రీల పత్రికల్లో ‘హిందూసుందరి’ తర్వాత ప్రముఖంగా పేర్కొనదగింది ‘వివేకవతి’. క్రైస్తవ స్త్రీల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ‘వివేకవతి’, హిందూ స్త్రీల అభివృద్ధిని బలంగా కోరుకుని, వారి అభ్యున్నతి కోసం బృహత్తరంగా పనిచేసింది. బాల్య వివాహాల వల్ల బాలికలకు కలిగే రకరకాల నష్టాల్ని గుండెల్ని కలచివేసే విధంగా వివరించింది. బాల వితంతువుల హృదయ విదారక పరిస్థితిని వర్ణించి పునర్వివాహం ద్వారా వారు నిర్బంధ వైధవ్యపు ఖైదు నుంచి బయటపడాలని పిలుపునిచ్చింది. బాలికలు మాతృ భాషే కాకుండా ఇంగ్లిషూ చదువుకోవాలంది. పెద్దపెద్ద పరీక్షల్లో నెగ్గండని ప్రోత్సహించింది. ఇల్లాలి చదువు ఆమె యింటికీ, సమాజానికీ, దేశానికే కాకుండా, వ్యక్తిగతంగా తన జీవితానికి కూడా వెలుగునిస్తుందని తెలిపింది. భారతీయులు మౌలికంగా మూర్ఖులూ, అనాగరికులూ కావటం వల్ల వాళ్ళకు నాగరికత నేర్పడం నాగరికులైన క్రైస్తవుల ప్రధాన కర్తవ్యమంది. మూర్ఖ భారతీయులు అంత సులభంగా మారేవారు కారనీ, అయినా సరే ఎలాగైనా చేసి, వాళ్ళను చేరి, వాళ్ళ మనసుల్ని రంజింపజేయాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా శుచీ, శుభ్రతలకు సంబంధించిన పాఠాల్నీ, శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన పాఠాల్నీ, శాస్త్రీయమైన వైద్య విజ్ఞానాన్నీ అందించింది. శారీరకారోగ్యంతో పాటు మానసికారోగ్యం కూడా ముఖ్యమైందని చెప్పిన ‘వివేకవతి’, మానసిక రోగమైన కులవివక్షకు సంబంధించి పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం! ‘‘నాగపూరులో జరిగిన ఆల్‌ ఇండియా కాన్‌ఫరెన్‌స్‌ సభలో, ఆ సభ ప్రసిడెంటుగారు కులమును నశింపజేయవలయునని నుడివిరి’’ (‘కులము’: ‘జaర్‌వ’, మార్చి 1921, పు. 135) మొదలైన వార్తలూ, మనం ముందే చూసిన కులదురహంకారుల చేతుల్లో చాకలి బాలిక దారుణంగా హత్య చెయ్యబడ్డంలాంటి వార్తలూ తప్ప ‘వివేకవతి’లో కులానికి సంబంధించిన ‘చర్చ’లేదు (నేను ‘వివేకవతి’ సంచికలన్నీ చదవలేకపోయాను. కాబట్టి కులం పట్ల తన దృక్పథం ఇదీ అని ఖండితంగా ప్రస్తుతానికి చెప్పలేనుÑ నిరాధారమైన స్టేట్‌మెంట్స్‌ యివ్వడం చరిత్ర రచనా పద్ధతికే కాకుండా, మౌలిక నైతికతకే విరుద్ధం). ఆహారం విషయంలో మాత్రం ‘వివేకవతి’ పరిశుద్ధ శాకాహారి. ‘వివేకవతి’ దృష్టిలో క్రైస్తవమొక్కటే మోక్షమార్గంÑ జీసస్‌ ఒక్కరే నిజమైన దేవుడు. అందుకే హిందువులకు పాప పరిహారార్థం రక్షణ నిప్పించాలని ఎన్నో విధాల ప్రయత్నించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం వల్ల భారతీయులకు అనేక రకాల ప్రయోజనాలు ఒనగూడాయని విస్తృతంగా ప్రచారం చేసిన ‘వివేకవతి’, భారత దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం పదిలంగా కొనసాగాలని మనసారా కోరుకుంది. అందుకే భారత స్వాతంత్య్రోద్యమాన్ని హర్షించలేకపోయింది. పరలోక రాజైన జీసస్‌ రక్షణ యిప్పిస్తే భారతీయులు సహజంగానే యిహలోక రాజైన బ్రిటిష్‌ ప్రభువుకు అత్యంత విశ్వాసపాత్రులుగా మారతారని భావించింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! ఈ విధంగా వలస భారతదేశంలో క్రైస్తవ మిషనరీ స్త్రీలు కొమ్ముకాసిన రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి నిలువెత్తు నిదర్శనం ‘వివేకవతి’. ‘మేటర్నల్‌ ఇంపీరియరిజమ్‌’ (ఃవీa్‌వతీఅaశ్రీ Iఎజూవతీఱaశ్రీఱంఎః) కు మచ్చుతునక.
అంకితం: కమలా ఆంటీకీ (లక్నో), ఎలిజబెత్‌ ఆంటీకీ (హైదరాబాద్‌): ఒక కరుణామయి నా కొడుకును బ్రతికించమని ఉపవాసాలుండి జీసస్‌ను ప్రార్థించేదిÑ బ్రతికి నడక కోల్పోయిన వాడికి తెలుగు నేర్పించి పుస్తకాల ద్వారా ప్రపంచంతో నడవడం నేర్పించింది యింకో కరుణామయి. అమ్మలు కాని అమ్మలు. ఎన్నడూ ఏమీ ఆశించని వాళ్ళ నిస్వార్థ కరుణముందు మోకరిల్లుతూ. అలాగే లక్నో ూ.G.ూ.G.I సుధా పీటర్‌ సిస్టర్‌కూÑ చెప్పాపెట్టకుండా జీసస్‌ను చేరుకున్న పి. డేవిడ్‌ ఎడ్విన్‌ అన్నకూ.
కృతజ్ఞతలు: ‘‘నువ్వు భాష మెరుగుపరుచుకోవాలి బాషా’’ అని గట్టిగా చెప్పడమే కాకుండా, ఈ వ్యాసంలో కొంత భాగం చదివి సూచనలిచ్చిన మిత్రుడు జి. శ్రీనివాస్‌ (I.A.ూ.)కూÑ అడిగిన వెంటనే హోలీ బైబిల్‌ తెచ్చిచ్చిన మిత్రుడు డా॥ ఆకుమర్తి నాగేశ్వరరావుకూÑ సిస్టర్‌ పావనికీ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.